మేమింతే..! | Unsuccessful lightning tasks in prakasam | Sakshi
Sakshi News home page

మేమింతే..!

Published Fri, Apr 21 2017 11:49 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

Unsuccessful lightning tasks in prakasam

► కదలని కాంట్రాక్టర్లు
► ముందుకు సాగని వెలిగొండ పనులు
► కాంట్రాక్టర్లకు సెవెన్‌ డేస్‌ నోటీసులు
► అయినా మారని తీరు
► హెడ్‌ రెగ్యులేటర్, టన్నెల్‌ పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగింత
► వచ్చే ఏడాదికి ఫేజ్‌–1 పనులు పూర్తి కావడం ప్రశ్నార్థకమే...


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంట్రాక్టర్ల తీరు మారకపోవడంతో వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. పనులు నత్తనడకన సాగుతుండటంతో అధికారులు హెచ్చరికగా కాంట్రాక్టర్లకు సెవెన్‌ డేస్‌ నోటీసులు జారీ చేశారు. నోటీసులిచ్చి 15 రోజులు దాటుతున్నా.. వారి తీరు మారలేదు. పనుల్లో పురోగతి లేదు. దీంతో కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ పనులతో పాటు టన్నెల్‌–1, 2 పనులలో కొంత భాగాన్ని కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.

ఈ మేరకు పనులకు సంబంధించి అంచనాలను రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే దాదాపు రూ.120 కోట్ల అంచనాలతో రూపకల్పన చేసి కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ పనులకు మరో వారంలో టెండర్లు పిలవనున్నారు. తొలుత రెండు హెడ్‌ రెగ్యులేటర్‌లో మొదటి హెడ్‌ రెగ్యులేటర్‌ పూర్తి చేసేందుకే ప్రాధాన్యతనిస్తున్నారు. అనుకున్న రీతిలో కొత్త కాంట్రాక్టర్‌ పనులు వేగవంతం చేస్తే ఆరు నెలల్లో ఒక హెడ్‌ రెగ్యులేటర్‌ పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో టన్నెల్‌–1, 2 పనులను హెడ్‌ రెగ్యులేటర్‌ వైపు నుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అంచనాలను సిద్ధం చేస్తున్నారు. ఈ పనులను సైతం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. 2018 మార్చి నాటికి ఫేజ్‌–1 పనుల్లో భాగంగా టన్నెల్‌–1, హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ముందుకు సాగని టన్నెల్‌ పనులు..
టన్నెల్‌–1 18.820 కి.మీ. ఉంది. రూ.624.6 కోట్లతో ఒప్పందం మేరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.484.44 కోట్లు వెచ్చించి 13.927 కి.మీ. పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇక టన్నెల్‌–2కు సంబంధించి 18.838 కి.మీ. ఉండగా రూ.735.21 కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.464.8 కోట్లు ఖర్చు చేసి 10.425 కి.మీ. మేర మాత్రమే పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేస్తున్నట్లు పలుమార్లు ప్రకటించింది.

తొలుత 2016 నాటికే నీళ్లిస్తామన్నారు. ఆ తర్వాత మాట మార్చి 2017కు అన్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై ప్రాజెక్టు అంచనాలను రూ.2,330 కోట్లకు పెంచుకోవడం తప్ప పనుల కోసం వెచ్చించిన నిధులు నామమాత్రమే. తాజా బడ్జెట్‌లో కేవలం వెలిగొండకు రూ.200 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే వెలిగొండపై బాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుస్తోంది.

ఆ తర్వాత ముఖ్యమంత్రి 2018 నాటికి వెలిగొండ ద్వారా నీరిస్తామంటూ మరోమారు ప్రకటించారు. దీంతో ఇటీవల అధికారులపై ఒత్తిడి పెరిగింది. వారు ఎంత చెప్పిన కాంట్రాక్టర్లు వినే పరిస్థితి లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలే వెలిగొండ కాంట్రాక్టర్ల అవతారమెత్తడంతో వారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. దీంతో ఇటీవల వారికి సెవెన్‌ డేస్‌ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం చేసిన పనులకే బిల్లులు చెల్లించటం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

నెలవారీ ఖర్చుల బిల్లులు తప్ప పెండింగ్‌లో ఉన్న రూ.60 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులివ్వకుండా పనులు చేయమంటే ఎలా చేస్తారన్నది కాంట్రాక్టర్ల వాదన. బిల్లులివ్వలేదంటూ ఇటీవల పలు దఫాలుగా పనులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్న కాంట్రాక్టర్లను కాదని వెలిగొండ పనులు వేరొక కాంట్రాక్టర్‌కు అప్పగించడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారులు ఉన్న కాంట్రాక్టర్లతోనే పనులు వేగవంతం చేయిస్తారా.. లేక మిగిలిన పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగిస్తారా.. అన్నది రాబోయే కాలంలో గానీ తెలియదు.

మూడు జిల్లాల రైతుల ఎదురుచూపులు..
ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలకు వెలిగొండ ప్రాణాధారం. ప్రకాశం జిల్లాలో 3.36,100 ఎకరాలు, నెల్లూరు జిల్లా పరిధిలో 84 వేల ఎకరాలు, కడప జిల్లా పరిధిలో 27,200 ఎకరాలు ప్రాజెక్టు ద్వారా సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం మూడు జిల్లాల ప్రజానీకం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధి బారి నుంచి వేలాది  ప్రజలను కాపాడాలంటే వెలిగొండే శరణ్యం. అయినా సరే బాబు సర్కారు మాటలతో సరిపెట్టడం మినహా ప్రాజెక్ట్‌ను చిత్తశుద్ధితో పూర్తిచేసే ప్రయత్నం చేయడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement