
ప్రేమతో నాగరికత నేర్పారు..
ఇంటి గుట్టు బయట పడనిచ్చేవారు కాదు
కుటుంబాలను ఉమ్మడిగా నిలబెట్టారు
వయోభారంతో ‘పెద్దలు’ మూగబోతున్నారు
ఆధునిక పోకడలతో ఈతరం కొందరిలో ప్రేమ, ఆప్యాయత దూరం
విలువలు నేర్పాలంటున్న సామాజికవేత్తలు
తరం వెళ్లిపోతోంది. పాలనురగకు తీసిపోని ధవళవర్ణపు(తెలుపు) వస్త్రధారణ, హుందాతనానికి గుర్తుగా నిలిచే తాత మీసం, ఆత్మగౌరవాన్ని కళ్లకు కట్టే బామ్మ బొట్టు, శ్రమైక జీవనం, ప్రేమతో పలకరించి, మన కలలను నిజం చేసిన పెద్దల తరం, కష్టాల సుడిగుండాలు చుట్టిముట్టినా తొణకని గంభీర స్వరం మూగబోతోంది. ధర్మనిష్ఠ పాటిస్తూ కుటుంబాలకు నాగరికత నేర్పిన నాటి తరం.. ఇక తీపి గుర్తుగా మిగిలిపోతోంది. తాత, అమ్మమ్మ, నానమ్మ ఇలా.. కాలక్రమేణా ఒకనాటి పెద్దలందరూ వయోభారంతో కనుమరుగవుతున్నారు.
హుజూరాబాద్: పూటగడవని రోజుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు న్నా.. పస్తులుంటున్నా ఇంటి గుట్టు బయట పడనిచ్చేవారు కాదు. చిరిగిన దుస్తులు ధరించిన నాటి ఇంటి పెద్ద తన సంతానానికి ఆ లోటు రాకుండా చూసేవారు. పచ్చడి మెతుకులే పరమాన్నంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తాము పడే బాధలు పక్కింటివారితో కూడా చర్చించేవారు కాదు. రోజువారీ పనికి సమయంతో పనేంటనే భావన వారికి ఉండేది.
ఉమ్మడి కుటుంబాలే..
అప్పట్లో అత్యధికంగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఒక్కో ఇంట్లో పగలూ రాత్రి కలిసి 20 కిలోల వరకు ఆహార ధాన్యాలు వండివార్చే వారంటే అతిశయోక్తి కాదు. ఒక కుటుంబంలో 10 నుంచి 20 మంది వరకు ఉన్నా భేషజాలు ఉండేవి కావు. నీతి, నియమాలే కట్టుబాట్లుగా కుటుంబ పెద్ద చెప్పించే వేదంగా ఉండేది. పిల్లలకు పెళ్లి చేయాలంటే ఉమ్మడిగానే నిర్ణయం తీసుకునేవారు. ఏ ఒక్క బంధువునీ మర్చిపోకుండా తరచూ ఇంటికి ఆహ్వానించి, వారం రోజుల వరకు వెళ్లనిచ్చేవారు కాదు.
ఇప్పుడేం జరుగుతోంది?
నేటితరంలో కొంతమంది ఆధునిక పోకడలతో ముందుకెళ్తున్నారు. అనాలోచిత నిర్ణయాలు, అహం, ఇతరులను తక్కువగా చూసే ధోరణి చాలామందిలో కనిపిస్తున్నాయి. చిన్న కుటుంబాలుగా విడిపోతూ, గొడవ పడుతూ గౌరవించుకోవడం లేదు. కుటుంబసభ్యులందరూ కలవడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టపడటం లేదు. కడుపున పుట్టిన బిడ్డలు కొందరు చేరదీయకపోవడంతో పెద్దలు అనాథాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్న దుస్థితి కనిపిస్తోంది. జీవితాంతం కష్టపడినవారు వృద్ధాప్యంలో పలకరింపుకైనా నోచుకోక మౌనంగా రోదిస్తున్నారు.
విడిగా ఉండేందుకే ప్రాధాన్యం
ఉమ్మడి కుటుంబంలో ఉండేందుకు కొంతమంది ఇష్టపడటం లేదు. ఫలితంగా వారిపై పెద్దల నియంత్రణ ఉండటం లేదు. ఎక్కడో ఉన్న సినీనటులు ఈరోజు ఏంచేశారో చెప్పగలుగుతున్నారు. ఇంట్లోవారు ఎప్పుడు ఏంచేస్తున్నారో చెప్పలేని పరిస్థితి. మాట్లాడుతున్న తీరుతో రక్త సంబంధీకులకు దూరమవుతున్నారు. ఇతరులతో పోల్చుకుంటూ రాబడికి మించి ఖర్చు చేస్తున్నారు. యువత వ్యసనాలకు బాని సవుతోంది. 30 ఏళ్లొచ్చినా పెళ్లి మాట ఎత్తడం లేదు.
వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో శ్రద్ధాంజలి
తీరికలేని జీవితంలో.. ఒక వ్యక్తి మరణిస్తే వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మెస్సేజ్ పెట్టి, వదిలేస్తున్నారు. చనిపోయినవారిని చూసేందుకు సైతం వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి.
నైతిక విలువలు నేర్పాలి
ప్రభుత్వం నూతన విద్యావిధానంలో నైతిక విలువలు, మానవ విలువలను పాఠ్యాంశంగా చేర్చాలి. పాఠశాల స్థాయిలోనే సంస్కృతి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతపై పిల్లలకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఉమ్మడి కుటుంబ ప్రాముఖ్యతపై ప్రతీ ఇంట్లో కుటుంబసభ్యులందరూ చర్చించుకో వాలి. పర్యావరణ విధ్వంసం వల్ల వచ్చే ఉపద్రవా ల కన్నా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమైతే కలిగే అనర్థాలపై ప్రభుత్వం, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు ప్రచారం చేయాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.
వ్యవసాయం.. గంజి, మెతుకులు
వ్యవసాయానికి యంత్రాలు లేని నాటి కాలంలో తెల్లవారకముందే సాగు పనుల్లో నిమగ్నమై, దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరేవారు. పగలంతా పడిన కష్టాన్ని మరిచి, మిణుకుమిణుకుమంటూ వెలిగే నూనె దీపాల వెలుగులో ఇంటిల్లిపాది కూర్చొని, కాచిన గంజిలో మె తుకులు కలిపి తినేవారు. ఇంటి నిర్మాణం చేపట్టాలంటే మట్టి, కలపను ఎడ్లబండ్లపై తీసుకువచ్చేవారు. జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా భూమి, ఇల్లు మాత్రం అమ్మకానికి పెట్టేవారు కాదు. తల్లిదండ్రులు, పంటలు, పశుసంపదను ప్రేమగా చూసుకునేవారు.
ఆ రోజులే మంచిగుండే..
నాటి రోజులు మంచిగుండే. పండుగచ్చిందంటే కుటుంబ సభ్యులందరం కలిసి అప్పాలు చేసుకునేటోళ్లం. ఫోన్లు లేకున్నా ఆనందంగా ఉండేటోళ్లం. చుట్టాలు వస్తే సంబురం. మంచి, చెడు మాట్లాడుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మనుషుల మధ్య ప్రేమ లేదు.
– కేతిరి రాజయ్య, దమ్మక్కపేట, హుజూరాబాద్
ఇప్పటోళ్లను చూస్తే భయమైతంది
నాటి రోజుల్లో సంస్కృతి సంప్రదాయాలు, పెద్దల మాటకు కట్టుబడి బతికినం. ఇప్పటోళ్లను చూస్తే భయమైతంది. చిన్న విషయానికే కోపానికి వస్తున్నరు. పెద్దలంటే గౌరవం లేదు. చిన్నప్పటి నుంచే పిల్లలను సక్రమంగా పెంచాలి.
– మూగల సంజీవరెడ్డి, ఆదర్శ రైతు, ధర్మరాజుపల్లి, హుజూరాబాద్
ప్రేమ, క్రమశిక్షణ ఉండాలి
ఒక కుటుంబంలోని పెద్దలందరూ ప్రేమ, క్రమశిక్షణతో ఉండాలి. గొడవ పడటం, గౌరవ మర్యాదలు పాటించకపోవడం వంటివి చేయొద్దు. ఇవి పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. – ఎల్.వర్షి, ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుడు, హుజూరాబాద్
Comments
Please login to add a commentAdd a comment