values
-
తాత్వికత: ఎంతో చిన్నది జీవితం
ఓ గురువు అటవీ ప్రాంతంలోని మారుమూల ఉన్న చిన్నచిన్న గ్రామాలకు వెళ్ళి సత్సంగం చేయాలని బయలుదేరాడు. ఆయనతోపాటు శిష్యబృందం కూడా బయలుదేరింది. కొండలు, గుట్టలు, సెలయేర్లు దాటి వెళ్తూ ఉన్నారు. దారిలో ఓ శిష్యుడు, గురువుని ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా?’’ అని అడిగాడు. ‘‘మానవ శరీరం దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం. మరలా రమ్మంటే రాదు. అందుకని దాని విలువ తెలుసుకుని క్షణం క్షణం ఆనందంగా జీవించాలి!’’ అన్నాడు.‘‘అదెలా?’’ అని అడిగాడు శిష్యుడు.ఇంతలో దూరంగా కొందరు మహిళలు పొయ్యిపైన నీళ్ళు కాగిస్తూ కనిపించారు గురువుకి. శిష్యుడిని అక్కడే కొద్దిసేపు ఆగమని చె΄్పాడు. ఆ కట్టెలు కాలే వాసన పీల్చి కాలుతున్నదేదో చెప్పమన్నాడు.వాసన పీల్చిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ‘తను గమనించింది వాస్తవమా కాదా’ అని ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాడు. తను చూస్తున్నది ముమ్మాటికీ నిజమేనని అర్థమయ్యింది.‘‘అక్కడ కాలుతున్నది చందనం కట్టెలు. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు. ఎంతో విలువైన చందనం కొయ్యలను వంటచెరుకుగా వాడటమేమిటి?’’ అని మనసులో అనుకున్నాడు.‘భర్తలకు తెలియకుండా వారు పొరపాటుగా అలా చేస్తున్నారేమోనని’ అనుమానమేసింది. జాగ్రత్తగా గమనించిన అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. అది ఏమిటంటే ఆ మహిళలకు కొద్ది దూరంలోనే వారి భర్తలు చందనం కొయ్యలను కత్తితో నరికి పొయ్యిలో పెట్టడానికి అనువుగా కట్టెలు చీల్చుతున్నారు.అదే విషయాన్ని శిష్యుడు బాధగా ‘బంగారంలాంటి చందనాన్ని మంటపాలు చేయడం’ గురించి గురువుకు చెప్పాడు. దానికి గురువు నవ్వి ‘‘చందనం కొయ్యల విలువ, వాటి ప్రత్యేకత వారికి తెలియదు. అందుకే వాటిని పొయ్యిలోపెట్టి తగులబెట్టేస్తున్నారు. వారి కళ్ళకు అవి మామూలు కట్టెల్లాగే అగుపిస్తున్నాయి. నీకు వాటి విలువ తెలుసు కాబట్టే ఆశ్చర్యపోతున్నావు. వారు చేస్తున్నది తప్పని చెబుతున్నావు. వారికి వాటి విలువ తెలిసేంత వరకు వారు చేస్తున్నది సరైనదేనని అనుకుంటారు. మనిషి కూడా అంతే. జీవితం విలువ తెలుసుకోక లేనిపోని పట్టింపులు, అహం, అసూయాద్వేషాలు, కోపం, ప్రతీకారం, ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం... ఇలాంటి వాటితో ఎంతోకాలం వృథా చేస్తున్నాడు. జీవితం విలువైనదన్న ఎరుక ఉంటే చాలు, ఆనందం మన వెంటే ఉంటుంది’’ అని వివరించాడు.జీవితం చాలా చిన్నదనీ, ప్రతిక్షణం ప్రకృతి ప్రసాదమని, అది తెలుసుకోక΄ోతే అసలైన ఆనందాన్ని కోల్పోతామని గ్రహించిన శిష్యబృందం ముందుకు నడిచింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
మానవ తాత్వికతకు దర్పణం
బాలగోపాల్ 2009 అక్టోబర్ 8న మరణించి ఇప్పటికి పదిహేనేళ్లు గడుస్తున్నా ఆయన ప్రాసంగికత కాలగమనాన్ని తట్టుకొని స్థిరంగా నిలబడే ఉన్నది. మనిషి ఉనికి, తాత్విక అర్థం, స్థూలంగా మానవ జీవితపు అంతరార్థం ఆయన వివరించినంత లోతుగా తెలుగునాట మరొకరు విశదీ కరించలేదన్నది అతిశయోక్తి కాదు. అంతరాలు నిండిన, అసమానతలతో కూడుకున్న సమాజం మనుషులకు వైకల్యంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని మాత్రమే అందించగలదనీ... సమానత్వ ప్రాతిపదికన, మనుషులను మనుషులుగా చూడగలిగే మానవీయ దృక్కోణాన్ని సంకల్పపూర్వకంగా అలవర్చుకోవా ల్సిందనీ బాలగోపాల్ నొక్కి వక్కాణించాడు. వైయక్తిక సంకల్పమే కాదు, సామాజిక ఆచరణ కూడా అంతే అవసరం అన్నాడు. ఈ సమానత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని, మానవ ఆచరణను... సామాజిక నీతి నియమాలు, నిబంధనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా తన రచనల ద్వారా వివరించాడు. ఒక్క మానవ తాత్వికతను మాత్రమే కాదు, దాని సామాజిక చలన సూత్రాలను, సామాజిక ఉద్యమాలలో దాని మూలాలను విశ్లేషించి విడదీయరాని సంబంధాన్ని నెలకొల్పిన ఉద్యమకారుడు కూడా ఆయనే. తన జీవితాన్ని ఈ సామాజిక తాత్విక దృక్పథానికి ఒక తిరుగులేని ప్రయోగశాలగా మార్చిన అరుదైన వ్యక్తి. సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అస మానతలు భిన్న పాయలుగా మన జీవితంలో పెన వేసుకు పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అసమానతలను రూపు మాపటానికి చైతన్యపూరితంగా మనం చేయవలసిన కృషిని తను జీవించి ఉన్నంతకాలం మనకు తన జీవిత ఆచరణ ద్వారా మార్గదర్శనం చేశాడు. 2024 ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో సైతం ఆయన వాదనలను ఉటంకించటం దీనికి ఒకానొక ఉదాహరణ మాత్రమే. దళితులలో దళితులు అన్న పదం వాడగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. వివక్ష ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్న తన సూక్ష్మ పరిశీలన ద్వారా దానిని పసి గట్టి ఆ వివక్ష తాత్విక మూలాల్ని సమాజానికి విశద పరిచిన వ్యక్తి బాలగోపాల్. వివక్ష అసలు అర్థం అసమానతేననీ, అది అసమానతను అనుభవిస్తున్న వర్గాల్లో సైతం ఆచరణలో ఉండగలదనీ, అక్కడ కూడా మనం సమానత్వ ప్రాతిపదికనే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందనీ ఎలుగెత్తినవాడు ఆయన.పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దారుణ మారణకాండను చూసినప్పుడు ఇంత అమానవీయమైన హింసకాండకు కారణాలను ఆయన మనకు ఒక కొత్త కోణంలో, మానవీయ కోణంలో ఆవిష్కరించేవాడు అని మనం గుర్తు తెచ్చుకోకుండా ఉండలేము. తొలి రోజుల్లో వర్గ సిద్ధాంతపు ఆలోచనా ధోరణికి కొంత ప్రభావితమైనా మానవత్వపు విస్తృత పరిధి ఒక సిద్ధాంత చట్రంలో ఇమిడేది కాదనీ, మానవత్వానికి నిర్వచనం మానవత్వంతో మాత్రమే ఇవ్వగలమనీ తన కార్యాచరణ ద్వారా గ్రహించిన ఆయన చివరికంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మాన వతను మానవీయ దృక్కోణంలోనే విస్తరించాడు. ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు, దానికి తిరుగుబాటుగా వచ్చే ప్రతిహింస సైతం మానవ త్వానికి జవాబు దారీగా ఉండాలనీ, అలా కాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అను కరణ మాత్రమే కాగలవనీ వివరించాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు... సామాజిక ధోరణులలో, సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు ఉండగలవనీ... ప్రజా జీవితంలో సైతం అసమానతలతో కూడిన సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన అధిప త్యాలు ఉండగలవనీ వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయటం హక్కుల ఉద్యమపు బాధ్యత అని తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసిన వ్యక్తి బాలగోపాల్. ఆయన ఈరోజు లేకపోవచ్చు కానీ ఆయన తాత్విక దృక్పథం ఆయన రచనల ద్వారా అందుబాటులోనే ఉన్నది. తెలుగు సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలకు ఆయన రచనలలో పరిష్కారాలు లభించ గలవు. అధికారాన్ని సందేహించనివారు హక్కుల కార్యకర్తలు కాజాలరు అన్న మాట ఆయనలోని నిండైన మానవత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మానవీయ సమాజం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం కృషి చేయడమే ఆయన జీవితాచరణ ద్వారా నిర్దేశించిన ఏకైక కర్తవ్యం.– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక (నేడు హైదరాబాద్‌లో బాలగోపాల్ 15వ సంస్మరణ సదస్సు) -
నిరాధార వార్తలు.. జర్నలిజం విలువలకు వ్యతిరేకం: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: నిరాధార వార్తలను ప్రచురించడం ప్రసారం చేయడం జర్నలిస్టు విలువలకు వ్యతిరేకమని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆన్ లైన్ అవగాహన సదస్సులో జర్నలిజం డిప్లమో విద్యార్థులను, వర్కింగ్ జర్నలిస్టుల్ని ఉద్దేశించి "వార్తా రచన-నిజ నిర్ధారణ " అంశం పై సీనియర్ జర్నలిస్టు, యూనిసెఫ్ మీడియా అవార్డు గ్రహీత ఉడుముల సుధాకర రెడ్డి ప్రసంగానికి ముందు ఆన్ లైన్ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు పాఠశాలలో గొడుగులతో విద్యార్థుల ఫోటోలు, వీడియోలు తీసి, వర్షానికి తడిసి పోతున్నట్లు వార్తా కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పాఠశాలను అధికారులు సందర్శించి దానిని "ఫేక్ న్యూస్" గా నిర్ధారించి చట్ట పరమైన చర్యలకు ఉపక్రమించారన్నారు. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? ఒక పక్క ప్రభుత్వం పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి దశలవారీగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోన్న సంగతి తెల్సినా, ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఇలా కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు వ్యవహరించడం రాష్ట్రం లో సర్వ సాధారణమైపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు, నైపుణ్యం పెంచడం మీడియా అకాడమీ బాధ్యత అని, అందుకే "వార్తా రాచన - నిజ నిర్ధారణ ", అంశం పై సీనియర్ జర్నలిస్టు, యూనిసెఫ్ మీడియా అవార్డు గ్రహీత ఉడుముల సుధాకర రెడ్డి ప్రసంగం ఏర్పాటు చేశామని ఆయన తమ అధ్యక్షుని తొలి పలుకుల్లో పేర్కొన్నారు. -
పిల్లలంటే.చదువులు, మార్కులు, ర్యాంకులు..ఇంతేనా!
పిల్లలంటే కేవలం చదువులు, మార్కులు, ర్యాంకులు ఇంతేనా అంతకుమించి తెలుసుకోవాల్సింది ఏమి లేదా!. ఎప్పుడైనా గమనించారా! పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం. వారికి చదువులు, మార్కుల కంటే ప్రధానంగా తెలుసుకోవల్సినవేంటో గమనించారో. అసలు చదువు, మార్కులు ఇలాంటివేమి లేకుండానే మన పెద్దలు ఎంతో చాకచక్యంగా సమర్ధవంతంగా జీవించడమే గాక సమాజంలో నెగ్గుకొచ్చారు. అయినా మనం వాటిని గమనించకుండా పిల్లలను ఓ యంత్రాల్లా ఇలానే బతకాలంటూ.. నిర్దేశించేస్తున్నాం. వారు నేర్చుకోవాల్సి అతి ముఖ్యమైన, విలువైన జీవిత పాఠాలను నేర్పించలేకపోతున్నాం అవే వాళ్ల చివరి ఫోటోలు.. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మన హైదరాబాద్‌లో జులై 08, 2014న ఒక దారుణమైన సంఘటన జరిగింది. మీలో ఎవరికైనా గుర్తుందా? . తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు.. అక్కడ సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు.. అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు. సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు.. వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ డ్యామ్ గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు.. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను అలర్ట్ చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. (వాళ్ళ చివరి ఫోటోలు అవే). అంతంతా చదువులు చదివిన పిల్లలేనా.. అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్లి పోయింది.. ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది.. రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు.. అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.. ఇక్కడ మనం గమనించవలసింది, విజ్ఞాన్ ఇజనీరింగ్ కాలేజ్ లాంటి టాప్ కాలేజ్‌లో చదివిన వీళ్లకు, ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం.. వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం.. "చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..చూస్తే ఇంత పెద్ద చదువులు చదవిన పిల్లలేనా అనే సందేహం రావడం లేదా!. ఇక్కడ ఎందరు పిల్లలకు ఈత వచ్చు? ఈత అని మాత్రమే కాదు.. ఉన్నట్లుండి మీ ఇంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? అంతెందుకు ఎవరైనా పెద్దలకు సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చి..ఊపిరి ఆడకపోతే తక్షణమే ఎలా స్పందించాలో తెలుసా?..లేదా చెయ్యి తెగి.. రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? చెప్పగలరా. కనీసం అలాంటి సమయాల్లో ముందుగా చేయాల్సిన ప్రథమ చికిత్స ..ఎలా చేయాలో తెలుసా? . ముఖ్యంగా పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా!. కేవలం చదువు..చదువు.. చదువు, మార్కులు, ర్యాంకులు, ఇజనీరింగ్, మెడిసిన్ సీట్లు, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు.. ఇవే చెబుతున్నాం. ఆ చదువులు కూడా వాళ్లని షాపింగ్‌మాల్స్‌లో బ్రాండెడ్ డ్రెసెస్ వేసుకోవడం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు తినమని మాత్రమే చెబుతోంది. కామన్సెన్స్ నేర్పిస్తున్నామా.. ఆ చదువు సమస్య వస్తే ఎలా ఎదుర్కొని నిలబడాలో చెప్పడం లేదు. అసలు ప్రకృతి అందాలు చూడటమే కాదు. అది కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందో చూపించాలి. అలాగే రాజ్యాంగంలోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి.. ఎదుటి వాడు దాడి చేస్తే రక్షించుకోవడం నేర్పించాలి.. సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్పూర్తిగా మెలగడం అలవాటు చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి మంచి , చెడు గురించి అవగాహన వస్తుంది.. అన్నింటికంటే ముందు "common sense" (ఇంగిత జ్ఞానము) అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం... దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే, ఇదుగో.. ఫలితాలు.. ఇలాగే ఉంటాయి..... గమనించండి.... ఆలోచించండి.... ఈ దిశగా కూడా ప్రయత్నం చేయండి.. కొంతమందికి అయినా అవగాహన కల్పించి మన విద్యార్థుల విలువైన జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. (చదవండి: పాఠం కోసం ఫారిన్ వెళదాం చలోచలో!) -
పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా(67) శనివారం కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన.. కొంత కాలంగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గతవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వినోద్ దువా మృతి చెందారని ఆయన కూతురు మల్లికా దువా సోషల్ మీడియాలో తెలిపారు. వినోద్ దువా.. ప్రముఖ హింది జర్నలిస్ట్. ఆయన.. దూరదర్శన్, ఎన్డీటీవి తదితర ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పనిచేశారు. ఆయన 42 సంవత్సరాలు జర్నలిజం రంగానికి సేవలందించారు. ఆయన జర్నలిజం విలువలు పాటించి, తనదైన మార్క్ చూయించారు. జర్నలిజంలో ఆయన చేసిన కృషికి గాను 1996లో రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఆయనే కావడం విశేషం. అదే విధంగా.. 2008లో కేంద్ర ప్రభుత్వం వినోద్ దువాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2017లో ముంబై ప్రెస్ క్లబ్ నుంచి రెడ్ ఇంక్ అవార్డును... మహరాష్ట్ర మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా అందుకున్నారు. దూరదర్శన్‌లో ‘పరాక్’ అనే కరెంట్ అఫైర్స్ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. అదే విధంగా ఎన్డీటీవిలో ‘ఖబర్దార్ ఇండియా’, ‘వినోద్ దువా లైవ్’ కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా పనిచేశారు. కాగా, వినోద్ దువా అంతిమ సంస్కారాలు ఆదివారం ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
విలువలతోనే సాఫల్యం
మానవుడికి లభించిన వరాల్లో మంచినడవడిక గొప్పవరం. మంచినడవడితోనే దైవసన్నిధికి చేరుకోవడం సాధ్యం. పరులకు సాయం చేయకపోవడం, వాగ్దానం చేసి భంగపరచడం, దేవుని పేరుతో మోసాలకు పాల్పడడం ఘోరమైన పాపాలు. ఇలాంటి వాళ్ళకు దైవశిక్ష తప్పదు. మంచినడవడితో కూడిన జీవితమే ఇహపరలోకాల్లో మానవుణ్ణి సాఫల్య శిఖరాలకు చేరుస్తుంది. ముహమ్మద్ ప్రవక్త(సం)ప్రవచనం ప్రకారం, మూడురకాల వ్యక్తులవైపు ప్రళయం రోజున దైవం కన్నెత్తి కూడా చూడడు. వారి పాపాలను క్షమించి వారిని పరిశుధ్ధపరచడు.పైగా వారిని తీవ్రంగా శిక్షిస్తాడు. వారిలో ఒకరకం మనిషి, అవసరానికి మించి ప్రయాణ సామగ్రి ఉన్నా, తోటి ప్రయాణీకులకు వాటిని ఇచ్చి ఆదుకోనివాడు. రెండోరకం వ్యక్తి, ప్రాపంచిక లాభాలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాధినేతకు అనుకూలంగా ప్రమాణాలు చేసేవాడు. మూడోరకం మనిషి, తన వ్యాపారవస్తువులను అమ్ముకోడానికి, దైవంపైప్రమాణాలు చేసేవాడు. తరువాత ప్రవక్తమహనీయులు, ఖురాన్ లోని వాక్యం పఠించారూ. ‘కొందరు తమ వాగ్దానాలను,దేవుని విషయంలో చేసిన ప్రమాణాలను అతి స్వల్పమూల్యానికి అమ్ముకుంటారు. ఇలాంటి వారికి పరలోకంలో ఎలాంటి ప్రతిఫలం లభించదు.దైవం వారితో మాట్లాడడు. ప్రళయదినాన వారివైపు కన్నెత్తికూడాచూడడు.వారిని పరిశుధ్ధపరిచే ప్రసక్తి అంతకన్నాలేదు. పైగా వారికి నరకంలో అత్యంత వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.’ఈ ప్రవచనంలో ప్రవక్త మహనీయులు మూడురకాల మనస్తత్వాలను ప్రస్తావించారు. ఒకటి: అవసరానికి మించి ఉన్నప్పటికీ, అవరార్ధులైన తోటివారికి ఇవ్వకపోవడం, వారిని ఆదుకోకపోవడం మానవత్వం అనిపించుకోదని, ఇలాంటి అమానవీయ చర్యలను దైవం హర్షించడని, ఇలాంటి నేరానికి పాల్పడినందుకు తీవ్రంగా శిక్షిస్తాడని చెప్పారు. నిజానికి ఇది ప్రయాణ సందర్భానికే పరిమితమైన హితవుకాదు. నిత్యజీవితంలో అడుగడుగునా ఆచరించవలసిన అమృత ప్రవచనమిది. ఎంతోమంది అవసరార్ధులు, అభాగ్యులు నిత్యజీవితంలో మనకు తారసపడుతుంటారు. అలాంటి వారికి చేతనైన సహాయం చేయడం మానవత్వం. స్థోమత ఉన్నా పక్కవారిని గురించి పట్టించుకోకపోవడం అమానవీయం, అనైతికం. నేరం. అందుకే ప్రవక్తమహనీయులు, ‘నువ్వు తిని, నీ పక్కవాడు పస్తులుంటే నీలో విశ్వాసంగాని, మానవత్వం గాని లేదని తీవ్రంగా హెచ్చరించారు. మరోరకం మనిషి, స్వార్థం కోసం, స్వలాభంకోసం అధికారంలో ఉన్నవారికి వత్తాసు పలుకుతూ తన పబ్బం గడుపుకుంటాడు. తన పప్పులు ఉడుకుతున్నంత వరకూ, తనమాట సాగుతున్నంత వరకూ వారి చర్యలకు మద్దతు పలుకుతూ, సమర్థిస్తూ ఉంటాడు. ఇక లాభం లేదనుకున్నప్పుడు ప్లేటు పిరాయిస్తాడు. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలను ఈనాడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి కుటిల, స్వార్ధపర, అవినీతి పరులకు కూడా వినాశం తప్పదు. మూడోరకం మనిషి, తన సరుకును అమ్ముకోడానికి దైవంపై ప్రమాణాలు చేసి ప్రజలను నమ్మిస్తాడు. నాసిరకం సరుకును నాణ్యమైన సరుకని, ఇదిగో ఇంతకు కొన్నాను, ఇంతకు అమ్ముతున్నాను. అంతా పారదర్శకం. అని ప్రమాణం చేసి మోసం చేసి తన వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకుంటాడు. సర్వశక్తిమంతుడైన దేవునిపై ప్రమాణం చేసిన కారణంగా ప్రజలు అతని మాయమాటలు ఇట్టే నమ్మేస్తారు. దీనివల్ల అతనికి తాత్కాలి క లాభాలు సమకూరినా, నిజమేమిటో ప్రజలకు కొద్దికాలంలోనే తెలిసిపోతుంది. ఇలాంటి వంచకులు, మోసకారులైన వ్యాపారులకు ఇహలోకంలో, పరలోకంలో కూడా వినాశనం తప్పదు. అందుకని ప్రాపంచిక జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ పాపభీతితో జీవితం గడపడం వివేకవంతుల లక్షణం. అలాంటివారే స్వర్గసౌఖ్యాలకు అర్హులు కాగలుగుతారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దటీజ్ వైఎస్ జగన్!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టడంలో రాజీ పడబోనని రాజన్న తనయుడు మరోసారి నిరూపించారు. కుళ్లు రాజకీయాలు చేయబోమని ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడతామన్న మాటను అక్షరాల పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు మడమ తిప్పని పోరాటం చేస్తానని జనం సాక్షిగా ఇచ్చిన మాటకు అనుక్షణం కట్టుబాటు చాటుతున్నారు. ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామమే దీనికి తిరుగులేని రుజువు. (రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరమన్నారు) వైఎస్సార్ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి మంగళవారం వైఎస్ జగన్‌ను కలిశారు. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని వైఎస్ జగన్‌ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఆయనకు వైఎస్ జగన్ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ సూచనతో పదవులకు రాజీనామా చేసేందుకు మల్లికార్జున రెడ్డి అంగీకరించారు. అధికార పదవులు వదులుకున్న తర్వాతే వైఎస్సార్ సీపీలో చేరతానని ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రజాస్వామ్య విలువలు కలిగిన నాయకుడని ప్రశంసించారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఇదే స్ఫూర్తిని వైఎస్ జగన్ చాటారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డిని రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకున్నారు. వేరొక పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చే నాయకులు ఆయా పార్టీల కారణంగా వచ్చిన పదవులను వదులుకోవాల్సిందేనంటూ స్పష్టం చేయడం ద్వారా రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేశారు వైఎస్ జగన్. మాటకు కట్టుబడి విలువలు పాటిస్తున్న జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు. అభిమానులు ‘దటీజ్ వైఎస్ జగన్’ అంటూ పొంగిపోతున్నారు. -
విలువలతో కూడిన జీవితమే సాఫల్యానికి సోపానం
జీవితం విజయ పథంలో ముందుకు సాగాలంటే మానవులు కొన్ని విలువలు పాటించాలి. మంచీ చెడుల పట్ల విచక్షణ కనబరచాలి. నిజానికి ప్రతి ఒక్కరిలో ప్రాథమికంగా ఈ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. కావలసిందల్లా వాటిని వెలికితీసి నిత్యజీవితంలో ఆచరణలో పెట్టగలగడమే. అంటే జీవితంలోని అన్ని రంగాల్లో విలువలు పాటించగలగాలి. ఉద్యోగ రంగమైనా, వ్యాపారరంగమైనా, విద్యారంగమైనా, సామాజిక రంగమైనా, సాంస్కృతిక రంగమైనా, ఆర్ధిక రంగమైనా, ఆధ్యాత్మిక రంగమైనా, రాజకీయ రంగమైనా ప్రతి విషయంలో వీటిని ఆచరించాలి. సాధ్యమైనంతవరకు, శక్తివంచన లేకుండా విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితిలోనూ ఇతరుల్ని తక్కువగా భావించకూడదు. మనతో ఏకీభవించని వారిపట్ల కూడా సద్భావనతోనే మెలగాలి. ఎందుకంటే అభిప్రాయ భేదాలన్నవి మానవ సమాజంలో సహజం. దాన్ని భూతద్దంలో చూడడమే విలువలకు వ్యతిరేకం అవుతుంది. జీవితంలో ఏది సాధించాలన్నా ఈనాడు ధనమే ప్రధానమైపోయింది. మంచీ చెడు, న్యాయం అన్యాయం, విలువలు అని మడి కట్టుకుంటే ఈ ప్రాపంచిక పరుగు పందెంలో వెనుకబడి పోవడం ఖాయమన్నభావన బలపడింది. బాగా డబ్బు గడించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నవారితో పోల్చుకొని నిరాశకు గురవుతూ ఉంటాం. ఇదే దురాశకు దారితీసి, జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది. చట్టసమ్మతమైన, ధర్మబద్దమైనమార్గంలో ఎంత సంపాదించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు.అది ఆమోదయోగ్యమే. అయితే సంపాదనే లక్ష్యంగా అడ్డమైన గడ్డికరుస్తూ దొడ్డిదారుల్లో సంపాదించాలనుకుంటే తరువాత చేదుఅనుభవాలను రుచి చూడవలసి ఉంటుంది. ఇలా సాధించిన సంపాదనా, సోపానాలు కేవలం తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. అంతేకాదు, అది జీవితంలో అశాంతికి, అభద్రతకు, అపజయాలకు కారణమవుతుంది. పేరు ప్రఖ్యాతుల కోసం, అధికారం హోదాలకోసం సంపాదనకు వక్రమార్గాలు అవలంబిస్తే ఖచ్చితంగా మనశ్శాంతి దూరమవుతుంది. విజయం దరిచేరినట్లనిపించినా అది నీటిబుడగతో సమానం. అసలు విజయం, నిజమైన శాంతి సంతృప్తి నైతిక విలువలతోనే సాధ్యం. ఇహలోక విజయమైనా, పరలోక సాఫల్యమైనా విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా మంచీ చెడుల విచక్షణా జ్ఞానంతో, ధర్మబద్దమైన జీవితం గడిపితేనే. అందుకే ముహమ్మద్ ప్రవక్త మానవజీవితంలో నైతిక విలువలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. ‘నైతికత, మానవీయ విలువల పరంగా మీలో ఎవరు ఉత్తములో వారే అందరికన్నా శ్రేష్టులని, ప్రళయ దినాన విశ్వాసి కర్మల త్రాసులో ఉత్తమ నడవడి కన్నా బరువైన, విలువైన వస్తువు మరొకటి ఉండదని’ అన్నారాయన. ప్రజల్ని ఎక్కువగా స్వర్గానికి తీసుకుపోయే కర్మలు ‘దైవభీతి, నైతిక విలువలే’ అని ఉపదేశించారు. కనుక నిత్యజీవితంలో అనైతికతకు, అక్రమాలకు, అమానవీయతకు తావులేకుండా సాధ్యమైనంత వరకు, విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే సమాజంలో ఆదరణ, గౌరవం లభిస్తాయి. దేవుడుకూడా మెచ్చుకుంటాడు.మంచి ప్రతి ఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
జారుడుమెట్లపై జర్నలిజం
జాతిహితం కార్గిల్ యుద్ధ కాలం నుంచి మనం, జర్నలిస్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, మన దేశ బలాన్ని బహుళంగా హెచ్చింపజేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజానికి ఆ రెండూ కూడా కాగలరు. సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ, డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్‌పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్‌గా మార్చేయడం ద్వారానో కాదు. భారతీయ జర్నలిజం స్వీయ వినాశకమైదిగా ఎప్పుడు మారింది? మన జర్నలిజం స్వీయ వినాశం ఎప్పుడు మొదలైంది? లేదా అది స్వీయ వినాశక దిశగా పయనిస్తోందా? మీరు ఎంతగా అందరి దృష్టిని ఆకర్షించాలని కోరు కుంటారనే దాన్ని బట్టి మీరే ఈ ప్రశ్నను ఎలా వేయాలో ఎంచుకోండి. మొదటిది ఊరిస్తున్నా, మూడోదాన్ని నేను ఎంచుకుంటున్నాను. కాబట్టి ఇది రాస్తున్నది స్వీయ (సంస్థాగత) సానుభూతితో కాదు... స్వీయశోధనను, చర్చను ఆహ్వానించడం కోసం. పైన పేర్కొన్న ప్రశ్నలను సున్నితంగా రూపొందించే ఇతర మార్గాలూ ఉన్నాయి. జర్నలిస్టులమైన మనం మన ప్రభుత్వానికి అధికార ప్రతినిధులమని, ఇతరుల నైతికతా పరిరక్షకులమని, మాతృభూమి రక్షణ కోసం పోరాడే సైనికులమని భావించడం ఎప్పడు ప్రారంభమైంది? ఇదేదో బ్రెజ్నెవ్ పాలనలోని సోవియట్ రష్యా ప్రభుత్వం అన్నట్టు జాతీయ భద్రతాపరమైన, విదేశాంగ విధానపరమైన సమస్యలను ప్రశ్నించ డాన్ని నిలిపి వేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాం? చాలామంది పాత్రికేయులు-మన సీనియర్ సహా-మన దేశం గురించి మాట్లాడేటప్పుడు ‘‘మేం,’’ ‘‘మన,’’ ‘‘మనం’’ అనే పదాలను వాడటాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు ఎందుకని? మన విదేశాంగ, భద్రతా విధానాలను ఎందుకు ప్రశ్నిం చడం లేదు? ‘‘మీ అమెరికన్లకు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధం సంక్లిష్టమైన దని, అది మాకు హానికరమని మాకు తెలుసు. అయినా మీ ఆందోళనల పట్ల మేం సున్నితంగా ఉంటామని మీరు ఆశించజాలరు’’ ఇలా మాట్లాడుతు న్నారు. భారత జర్నలిజంలో వచ్చిన ఈ మలుపుతో మనం తప్పును చూడటం మానేసి సమష్టి అధికారిక వ్యవస్థలో భాగంగా మారిపోయాం. నిష్ఠుర నిజాలు చెప్పే వారేరి? విదేశాంగ, సైనిక విధానాలకు సంబంధించి భారత పాత్రికేయులు మరింత ఎక్కువ అధికారపక్షవాదంతో ఉంటారని పాకిస్తాన్ పాత్రికేయులు ఎప్పుడూ అంటుంటారు. అతి తరచుగా పాక్ పాత్రికేయులు ధైర్యంగా అధికారిక విధానాలను ప్రశ్నిస్తుంటారు. కశ్మీర్ విధానం, ఉగ్రవాద గ్రూపులను పెంచి పోషించడం, పౌర-సైనిక సంబంధాలు వంటి సమస్యలు సైతం అలా వారు ప్రశ్నించే వాటిలో ఉన్నాయి. అందుకుగాను కొందరు పాత్రికేయులు ప్రవా సంలో గడపాల్సి వస్తోంది (రజా రూమి, హస్సెన్ హఖాని), లేదా జైలు పాలు కావాల్సి వస్తోంది (నజామ్ సేథి). భారత మీడియా గుడ్డిగా అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సమర్థిస్తుందని ఎవరూ అనరు. ఎల్టీటీ యీకి సైనిక శిక్షణను, ఆయుధాలను ఇచ్చి ప్రోత్సహించడాన్ని మన మీడియా ప్రశ్నించింది. అలాగే ఆ తర్వాతి కాలంలో భారత శాంతి భద్రతా దళాలను (ఐపీకీఎఫ్) పంపి శ్రీలంక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్నీ భారత పాత్రికేయులు ప్రశ్నించారు. ఆపరేషన్ బ్లూస్టార్ నుంచి బస్తర్, కశ్మీర్ లోయల వరకు సైన్యాన్ని ప్రయోగించడంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ ధోరణి మారుతోంది. ఇది కేవలం ఉడీ ఉగ్రదాడి తదుపరి మాత్రమే మొదలైంది కాదు. తేలికపాటి ఆయుధాలు ధరించిన నలుగురు సైనికేతరులు (పాక్ ఉగ్రవాదులు) ఒక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ భద్రతా వలయాలన్నిటినీ ఛేదించుకుని అధీన రేఖ దాటి దాదాపు రెండు కిలోమీటర్లు లోపలికి ఎలా చొచ్చుకు పోగలిగారని ఒకే ఒక్క టీవీ జర్నలిస్టు కరన్ థాపర్ ‘ఇండియా టు డే’లో ప్రశ్నించారు. విస్పష్టమైన ఈ వైఫల్యంపై విమర్శనాత్మకమైన అంచ నాను వేసిన గౌరవనీయులైన రిటైర్డ్ జనరల్ ఒకే ఒక్కరు.. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ థిల్లాన్. ఆయన 1987లో ఇదే అక్టోబర్ రోజుల్లో జాఫ్నాలోకి పోరా డుతూ చొచ్చుకుపోయిన ఐదు బ్రిగేడ్లలో ఒక దానికి నేతృత్వం వహించారు. ఆయన బ్రిగేడ్ అతి వేగంగా, తక్కువ నష్టాలతో జాఫ్నాకు చేరింది. ఆయన వ్యర్థ ప్రలాపాలు చేయని, పాత కాలపు సైనికుడు. నేటి తెల్ల మీసాల ప్రైమ్ టైమ్ కమెడియన్లకు అయన ఒక మినహాయింపు. ఈ మార్పు కార్గిల్‌తో ప్రారంభమైందని నేను అంటున్నాను. కార్గిల్‌తోనే మొదలైన పతనం కార్గిల్ కథనం లేదా యుద్ధం మూడు వారాల సార్వత్రిక ఖండనలతో మొద లైంది. పాకిస్తానీలు తామక్కడ లేమని ఖండించారు, మన సైన్యం వారు అంత లోతుగానూ, అంత విస్తృతంగానూ ఏమీ చొరబడలేదంటూ ఖండిం చింది. రక్షణ శాఖ సహా ప్రభుత్వం ఆ ఘర్షణ పర్యవసానాలను గ్రహించ లేదు. అందువల్లనే సీనియర్ జనరల్స్ కంటే ముందుగా మీడియా ప్రతిని ధులే అక్కడికి వెళ్లారు. ఇది అనుద్దేశపూర్వకంగానే ప్రత్యక్ష సైనిక చర్యల్లో పాలొంటున్న సైనిక బలగాలతో మీడియా ప్రతినిధులు భాగం కావడానికి దారి తీసింది. ఎవరూ పథకం పన్నకుండానే వారి మధ్య వ్యక్తిగతమైన, వృత్తిపరమైన బంధం అభివృద్ధి చెందింది. దాని ఫలితం ఉపయోగకరమై నదే... స్వతంత్ర పాత్రికేయులను, సెన్సార్‌షిప్‌లేని మీడియాను అనుమతి స్తోంది కాబట్టి భారత్ విశ్వసనీయత పెరిగింది. మన సైన్యం ప్రదర్శిం చిన నమ్మశక్యంకాని పరాక్రమం గురించిన కథనాలు దేశానికంతటికీ చేరడం వల్ల సైన్యం లాభపడింది. పాత్రికేయులకు కూడా ఆ ప్రతిష్ట కొంత అంటుకుంది. ఆ క్రమంలో కీలకమైన ఒక కథనానికి హాని జరిగినా ఎవరికీ పట్టలేదు... అంతమంది పాకిస్తానీలు అంత లోలోతులకు ఎలా చొచ్చుకు వచ్చి, పాతు కుపోయి కూర్చున్నారు? అది తెలుసుకోడానికి మనకు అంత ఎక్కువ కాలం ఎందుకు పట్టింది? విచారణ బృందాలను మనం అంత అర్థ మనస్కంగా (కాబట్టే చిన్న గస్తీ బృందాలు) ఎందుకు పంపినట్టు? భుజంపై నుంచి పేల్చే క్షిపణులకు అందే వైమానిక బలాన్ని పంపి రెండు విమానాలను ఎందుకు కోల్పోయాం? గుడ్డిగా నెలల తరబడి పాక్ చొరబాటును నిలువరించడంలో విఫలమైంది ఎవరు? ఈ చొరబాటు తీవ్రతను గ్రహించడంలో విఫలమైన వారంతా ఎవరు? ఇవేవీ పట్టని ఫలితంగానే, ఎవరి స్థానాలకూ ముప్పు రాలేదు. మన యువ సైనికాధికారులు, సైనికుల ప్రతాపాన్ని గురించి చెప్పే హక్కు మనకుంది. అయితే మన సైనిక వ్యవస్థ సైనిక విధులను నిర్లక్ష్యం చేయకపోయినా... అది చూపిన బ్రహ్మాండమైన అసమర్థతకు సంబంధించిన కథనం వెలుగు చూడకుండా పోయేలా చేయడానికి రాజకీయ, సైనిక వ్యవ స్థను మనం అనుమతించడం తప్పు. అర్హులైన పలువురు కార్గిల్ యువ సైనిక యోధులకు గాలంట్రీ అవార్డులు లభించాయి. కానీ ఉన్నత స్థానాలలో ఉండి తప్పు చేసిన వారు చాలా వరకు తప్పించుకున్నారు. ఈలోగా భారత మీడి యాకు చెందిన మనం బలాన్ని ద్విగుణీకృతం చేయగలవారంగా కీర్తించ బడ్డాం. ఆ ఆనందంలో మునిగిపోయాం. అదే సమయంలో మనం, జర్నలి స్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, బలాన్ని హెచ్చింప జేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజా నికి ఆ రెండూ కూడా కాగలరు. సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్‌పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్‌గా మార్చే యడం ద్వారా మాత్రం జరగదు. ఎప్పుడూ కాస్త సంయమనాన్ని చూపే టీవీ చానళ్లు సైతం ‘‘మళ్లీ కాలుదువ్విన పాకిస్తాన్’’ అంటూ కశ్మీర్ హెడ్‌లైన్స్‌ను చూపాల్సిన దుస్థితి. ‘‘శత్రు’’ ప్రతినిధులుగా ఖండిస్తున్నా లెక్కచేయకుండా నిష్టుర నిజాలను చెపే సిరిల్ అల్మెడాలు, ఆయేషా సిద్దీఖాలు (ఇద్దరూ పాక్ పాత్రికేయులే) మనకు లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. మన జర్నలిజం స్వీయ వినాశం... భారత టీవీ స్టార్లు (చాలావరకు) స్వచ్ఛందంగా తమను తామే కమెడియన్లుగా కాకున్నా ప్రచారకర్తలుగా దిగ జార్చేసుకోడానికి సంబంధించిన కథనంలో పెద్ద భాగం. వాణిజ్యపరంగా అది ఫలప్రదమైనదనేది, ప్రతిదాన్ని ప్రశ్నించే సంశయవాదాన్ని తుడిచిపెట్టే యడం వారిని ఊరిస్తుంది. లేదంటే ఊహాత్మకతతో మిఠాయి లాంటి ఫార్ము లాను కనిపెట్టి ఎన్నటికీ మరువలేని పాత గబ్బర్ సింగ్ (షోలే)కు సమాన మైన నేటి టీవీ యుద్ధ యోధుని అవతారమెత్తి ‘‘కిత్నే పాకిస్తానే థే?’’ అనొచ్చు. జర్నలిస్టులను ‘బలాన్ని బహుళంచేసే గుణకం’’గా నిర్వచించడాన్ని కీలక వ్యాపార అంశంగా (కేఆర్ఏ) అంగీకరించడంతో ఇక సందేహానికి లేదా ప్రశ్నించడానికి అవకాశమే ఉండదు. పాత కాలపు అశ్విక యోధునిలా ఇష్ట మొచ్చినట్టు వాగొచ్చు. అయితే అది శత్రువు ఉపగ్రహ కనెక్షన్‌కు అవతల ఉండగా ఇవతల సుఖప్రదంగా స్టుడియోలో కూచుని చేయొచ్చు. రెండుగా చీలిన పాత్రికేయ ప్రపంచం ఉడీ, తదుపరి ఘటనలే ఈ వాదనకు ప్రేరేపణ అనేది స్పష్టమే. అది మీడి యాను అత్యంత అసమానంగా చీలిపోయేట్టు చేసింది. ఒకటి, బాగా ఆధి క్యతను ప్రదర్శించే పక్షం. వారు ఏ ప్రశ్నలూ అడగకపోవడమే కాదు, ప్రభు త్వాన్ని, సైన్యాన్ని దాటేసి వారెన్నడూ చేయని ప్రకటనలను సైతం చేసేస్తారు. కాల్పనికమైన కమాండోల రాత్రి విన్యాసాల ‘‘ప్రాతినిధ్య’’ వీడియోలను వాటికి అండగా చూపిస్తారు, ఏ ఒక్కరికీ, నిజంగానే ఏ ఒక్కరికీ ఎలాంటి సాధికారతతో లేదా స్పష్టతతో మూడు వారాల క్రితం ఏం జరిగిందో తెలియదు. రహస్యాలను కాపాడటంలో ప్రభుత్వం ఆరితేరిపోయిందో లేక పాత్రి కేయులు లీకుల గురించి వెతకడం మానేశారో గానీ ఇది నిజం. ఎందుకో మీరే చూడొచ్చు. మరోవైపున, చిన్నది, కుచించుకుపోతున్న మరో భాగంగా ఉన్న వారు నిత్య సందేహులు. ప్రభుత్వం చెప్పిన దానికి ఆధారాలు లేకపోతే దాన్ని కొట్టిపారేస్తారు. వాస్తవాలు లేనిదే వారు వెల్లడించే కథనాలూ ఉండవు. ప్రభుత్వం, తను చెప్పేదానికి ఆధారాలు చూపాలని వారు కోరుతారు. ప్రభు త్వాలు వాస్తవాలను దాస్తాయని, పాత్రికేయులు వాటిని కనిపెట్టాలని జర్న లిజం స్కూలుకు వెళ్లిన ప్రతివారికీ బోధిస్తారు. అత్యంత ఉదారవాదులు, ఉత్తమ విద్యావంతులు, ప్రతిష్టగల, సుప్రసిద్ధ సెలబ్రిటీ పాత్రికేయులు అంతా ఈ నిత్య సందేహుల జాగాలో ఉన్నారు. ఆధారాలు లేకుండానే గరం గరం వార్తలు తేకుండా, పత్రికా సమావేశాలను కోరుతున్నారు. అవతలి పక్షం మన శత్రువు కాబట్టి మీరు చెప్పేదానికన్నా ఎక్కువ నేను నమ్ముతాను, నాకు ఆధారాలు అవసరం లేదు అంటోంది ఒక పక్షం. మరో పక్షం.. మీరు చెబుతున్న ఆ సైనిక చర్యను బహిర్గతపరచండి లేదా మీరు అబద్ధం ఆడుతు న్నారంటాం అంటోంది. భారతీయ జర్నలిజం స్వీయ వినాశనానికి ఎందుకు పాల్పడింది? అని నేను ఇక అడగాల్సిన పనే లేదు. శేఖర్ గుప్తా twitter@shekargupta -
విలువలు పెంపొందించాలి
మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కల్చరల్ : ప్రస్తుత సమాజంలో మానవవిలువలు, కుటుంబ సంబంధాలు అంతరించిపోయాయని వాటిని పెంపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక సంఘం, తెలంగాణ రంగస్థల సాంస్కృతిక కళాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలను ఆదివారం స్థానిక కళాభారతిలో ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సినిమాలు, టీవీలలో ప్రసారమయ్యే సీరియల్స్ మానవ విలువలు తగ్గేంచేలా ఉంటున్నాయన్నారు. ప్రభుత్వం కళలు, కళాకారులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు గోపాల్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, జిల్లా అధ్యక్షుడు వంగల సుధాకర్ పాల్గొన్నారు. -
నేను అదే! నా లోపలా అదే!నా బయటా అదే!
విద్య - విలువలు ఈ పని చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అందుకని ఈ పని చేయను. శక్తి లేక కాదు. ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడో అదే చేస్తాను. ఏది చేస్తే మా నాన్నగారు బాధపడతారో అది చేయను. ఏది చేస్తే మా అమ్మగారు సంతోషిస్తారో అది చేస్తాను. వశవర్తి అంటే అదీ. అదే ఆధ్యాత్మికత. అది క్రమ క్రమంగా పరిణతి చెందాలి. మీరు రేపు ఓ గొప్ప ఉన్నతాధికారో, జిల్లా అధికారో అయినప్పుడు- పుష్కరాలొస్తున్నాయి ఏంచేయాలని ఎవరైనా మిమ్మల్ని అడిగితే నాబోటి వాళ్ల చుట్టూ తిరిగే పరిస్థితిలో మీరుండకూడదు. పుస్తక పఠనం అలవాటైతే మీకు ఆ అవసరం రాదు. మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా, భగవంతుడి కోసం, పదిమందిని సంతోష పెట్టడం కోసం బతకడం రావాలి. అదీ ఆధ్యాత్మిక పరిణతి అంటే..! పరమేశ్వరుడు తప్ప మరొకటి లేదు. భూమి ఆయనే, గాలి ఆయనే, నీరు ఆయనే, నిప్పు ఆయనే. ఆయనే సూర్యుడు, చంద్రుడు, జీవుడు. ఆయన కానిదేముంది? నా ఎదురుగుండా ఉన్నదదే, నేను అదే, నాలో ఉన్నదదే. నాకు బయట ఉన్నదదే. ఉన్నది ఒక్కటే అన్న భావనతో జీవితం పూర్తయిపోతే... ఆ పరిణతికి ముగింపు. ఇలా ఇప్పటివరకు మనం వ్యక్తిత్వ వికసనంలో చెప్పుకున్న ఐదింటిని నిరంతరం పరిశీలన చేసుకుంటూ ఉంటే... ఆగిపోవడమన్నది ఉండదు. వీటిలో మొదటిది ఆరోగ్యం. నాకు ఎన్నేళ్లు వచ్చాయన్నది ప్రశ్న కాదు. ఆరోగ్య పరిరక్షణ కోసం వయసుకు తగిన వ్యాయామం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. రెండవది అధ్యవసాయం (మెంటల్లీ అలర్ట్)- నాకు 90 ఏళ్లు అనుకోండి. ఆ వయసులో సమాజానికి ఏం చేయవచ్చో నాకో స్పష్టత ఉండాలి. మూడవది సునిశిత ప్రజ్ఞ-నా అనుభవాన్ని, నా చదువును దృష్టిలో పెట్టుకుని సునిశిత ప్రజ్ఞతో ప్రకాశించాలి. నాలుగవది ఆవేశంలో సమతౌల్యత. దీనివల్ల నా వృద్ధిని, సమాజాభివృద్ధిని నేను సమన్వయం చేసుకోవాలి. చివరిది - ఆధ్యాత్మికత. దీనిలో నిరంతరం పురోభివృద్ధి పొందుతూ ఉండాలి. ఈ ఐదూ ఉంటేనే వ్యక్తిత్వ వికసనం అంటారు. ఇసుక, ఇటుక, సిమెంట్, నీరు... ఇవన్నీ విడివిడిగా ఉన్నప్పుడు కాలితో, వేలితో కదిపినా చెరిగిపోతాయి. కానీ అవన్నీ కలిపి కట్టే గోడను నేనొక్కడినే కాదు, మనందరం కలిసి నెట్టినా పడిపోదు, గట్టిగా ఉంటుంది. ఈ విధమైన స్థిరమైన స్థితి పొందితే వికసనం పొంది ఉన్నాడని అర్థం. అటువంటి వ్యక్తి ఎక్కడున్నా సమాజ అభ్యున్నతికి, తన అభివృద్ధికి, తన కుటుంబ అభివృద్ధికీ కారణమౌతాడు. ‘‘నువ్వెవరు? నీది ఏ కులం? నీ తల్లిదండ్రులెవరు? నీకు ఐశ్వర్యమెంత ఉన్నది? ఎంత చదువుకున్నావు? అన్న విషయాల కన్నా నీ నడవడిక ఎలా ఉంటుంది? నీవు పెద్దల దగ్గరికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తిస్తావు? నీ కన్నా తక్కువవాడు కనబడితే ఎలా సమన్వయం చేసుకుంటావు? నీతో సమానులు కనబడితే ఎలా ఆదరభావాన్ని ప్రకటిస్తావు? వీటిలో నీ ఆచరణను బట్టి నీ శీలాన్ని నిర్ణయం చేస్తారు - అంటుంది రామాయణం. శీలం అంటే స్వభావమని అర్థం. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక స్వభావంతో ఉంటాడు. ఒక తల్లికి ఒకే సమయానికి పుట్టిన కవల పిల్లలు కూడా ఒకే స్వభావంతో ఉండరు. ఒకరు ఒకటి ఇష్టపడితే ఇంకొకరు వేరొకదానిని ఇష్టపడతారు. లోపల స్వభావం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే మనిషి నడవడిక కూడా ఉంటుంది. స్వభావం పుట్టుకతో వస్తుంది. కానీ పుట్టుకతో వచ్చిన స్వభావం సత్సంగం చేత, నీవు ఆచరించే మంచి పనుల చేత, మంచి గుణాల చేత, మంచి మాటలు వినడం చేత మారుతుంది. ‘‘నా చెవులు ఎప్పుడూ భద్రమైన మాటలు వినుగాక’’ అంటుంది శాస్త్రం. అంటే ‘‘ఏ మాటలు వినడం చేత నా స్వభావంలో మార్పు కలుగుతుందో, నా మనసును ప్రభావితం చేస్తాయో, ప్రభావితమైన మనసు ఆ సంకల్పం చేస్తుందో, ఆ సంకల్పానికి అనుగుణంగా ప్రవర్తిస్తేనే నాకు కీర్తి కానీ, అపకీర్తి కానీ కలగడమనేది జరుగుతుంది. కనుక నా ప్రవర్తన పదిమంది చేత గౌరవం పొందడానికి యోగ్యమైన రీతిలో మనసును ప్రచోదితం చేయగల మంచి మాటలు మాత్రమే నా చెవులయందు పడుగాక !’’ అని. ‘‘ఒకవేళ నా చెవులు అన్నిటినీ విన్నప్పటికీ, నా మనసు మాత్రం సారవంతమైన మాటలను మాత్రమే పుచ్చుగొనుగాక! దానిచేత ప్రభావాన్ని పొందిన మనసు సత్సంకల్పాలను ఇచ్చి, బుద్ధి నిర్ణయం చేసి తదనుగుణమైన ప్రవర్తన చేత నేను శోభిల్లెదను గాక’’ అని దేవతలను మనం ప్రార్థన చేస్తాం. అందుచేత శీలం అనేది అత్యంత ప్రధానమైన విషయం. అది స్త్రీకి కానివ్వండి, పురుషుడికి కానివ్వండి, శీలమే గొప్ప సంపద. ఎవరు శీలవంతులో వారి శరీరం వెళ్లిపోయినప్పటికీ కూడా వారి నడవడికను ఆదర్శంగా యుగాల తరువాత కూడా చెప్పుకుంటారు. రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జీవించాడు. దాని తరువాత ద్వాపరయుగం వచ్చింది. తరువాత కలియుగం వచ్చింది. అయినా మనుష్యుడు-ప్రవర్తన-నడవడిక-శీలం- జీవితం-ఆదర్శం వంటి విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు రాముడినే ఉదాహరణగా చెబుతారు. రాముడిలా బతకండి అని చెబుతారు. -
అందంగా ఎవరు కనబడినా ప్రేమించేయడమేనా!!
విద్య - విలువలు వయసురీత్యా కానీ, చదువురీత్యా కానీ ఇప్పుడిప్పుడే మీరు బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. మంచి ఉపాధి చూసుకుని జీవితంలో స్వతంత్రంగా నిలదొక్కుకోవడానికి ముందువచ్చే దశ ఇది. ఈ దశలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసేవి - స్నేహితాలు. స్నేహం చేయడం గొప్పకాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ఈ వేళ స్నేహం చేస్తారు, ఎక్కడో ఒక చిన్నదోషాన్ని అడ్డుపెట్టుకుని స్నేహాన్ని చంపేసుకుంటారు. దోషంలేని వారెవరుంటారు! ఎక్కడ దోషం ఉందో అదే మాట్లాడాలి తప్ప వ్యక్తి శీలం మొత్తాన్ని గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. కిందటేడాది వచ్చినప్పుడు రామాచారిగారు నాకు గొప్ప మిత్రుడండీ అని పరిచయం చేశాను. ఈ ఏడాది వచ్చినప్పుడు ‘రామాచారిగారేరండీ’ అని అడిగారనుకోండి, ‘‘ఏమో అనుకున్నాను గానీ, ఆయన అంత మంచి వాడు కాదండోయ్, ఇప్పుడు నేనూ ఆయనా మాట్లాడుకోవడం లేదు’’ అన్నాననుకోండి. ఇప్పుడు తప్పు ఆయనది కాదు, నాది. ఎందుకంటే.... స్నేహమంటే కాపాడుకోవాలి. అందరిలో అన్నీ సుగుణాలే ఉండవు. ఏవో బలహీనతలు ఉండొచ్చు. స్నేహితుడంటే కోడిపెట్ట పిల్లల్ని కాపాడుకున్నట్లు స్నేహితులను కాపాడుకోవాలి. ఒకవేళ దోషం కనిపిస్తే ఒక్కడిగా ఉన్నప్పుడు అతని లోపాన్ని దిద్ది అతని ఉన్నతికి కారణం కావాలి. ఆయనలో ఉన్న మంచిని పదిమందికీ చెప్పాలి తప్ప, దోషాల్ని కాదు. ఎక్కడో ఒక దోషం కనిపించగానే అతనిపట్ల వ్యతిరేకభావాల్ని పెంచుకుని గతంలోని వాటిని కూడా దుర్భిణీ వేసి వెతికి పట్టుకుని నిందలు వేయడం మన బలహీనతను సూచిస్తుంది. ఈ భావోద్రేకాలు ఒక్కొక్కసారి ఎక్కడిదాకా పోతాయంటే... చిన్నచిన్న విషయాలకు చచ్చిపోతానంటాడు. పరీక్ష ఫెయిలయ్యాడా చచ్చిపోతాడు. అదా పరిష్కారం ? అమ్మ కొట్టింది - ఏట్లో పడిపోయాడు, నాన్నగారు కొట్టారు - రైలు కింద తలపెట్టేశాడు, టీచర్ దెబ్బలాడాడు - కొండెక్కి కిందకు దూకాడు. ఇక ఎవరైనా లోకంలో అందంగా కనిపిస్తే మనం ప్రేమించేయడమే! కన్నవాడికి ఎన్ని ఆశలుంటాయి? వీడు ప్రేమించాట్ట - ఆ అమ్మాయి ఒప్పుకోలేదట - యాసిడ్ పోసేస్తాడట - లేకపోతే ఐదో అంతస్థు ఎక్కి దూకేస్తాడట! ఎంత అర్థంలేని జీవితం? కంటికి కనబడినవన్నీ కావాలన్నవాడు... అదో గొప్ప సౌందర్యంగా భావించి, జీవితాంతం నేను సద్భావనతో స్నేహం చేయగల ఉత్తమురాలు అని ఎందుకు సంభావించలేడు? మంచి సంస్కారం ఉంటే మంచి ఆలోచనలొస్తాయి. ఇవి క్లాసురూములో వింటే వచ్చేవి కావు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఇంత ఎమోషనల్ ఫెలో జీవితంలో ఏం సాధిస్తాడు? తన పిల్లలకు కూడా తాను ఎలా ఆదర్శంగా నిలబడగలడు ? ఒక మంచి పొరుగింటి వ్యక్తిగా కానీ, ఒక మంచి అన్నగా కానీ, ఒక మంచి గురువుగా కానీ, ఒక మంచి ఉద్యోగిగా కానీ ఎలా అవుతాడు? ఇంత ఎమోషనల్‌గా ఉంటే తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలా ఉపయోగపడగలడు? అలాగే చిన్న కష్టం వచ్చిందనుకోండి. అయిపోతుందనుకున్నాడు... అయిపోలేదు. మృత్పిండంలా నేలవాలిపోకూడదు. మట్టిముద్దను చేత్తో పట్టుకుని ఉన్నప్పుడు అది చెయ్యిజారి కిందపడిందనుకోండి. అది నేలను అంటుకుపోతుంది. అదే... బంతి చేతిలో నుంచి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. మనిషి బంతిలా ఉండాలి. అంతేకానీ జీవితంలో ఏదైనా ఒక విషయం అనుకున్నట్లు జరగనప్పుడు బెంగ పెట్టుకోకూడదు. నెల్సన్ మండేలా, మహాత్మాగాంధీ వంటివారి జీవిత చరిత్రలు చదివితే తెలుస్తుంది - మహాత్ముల జీవితాలు వడ్డించిన విస్తళ్ళు కావు. ఎంత కష్టమొచ్చినా వారు నేలపడిపోలేదు. ఒక్క క్షణం నిర్వేదం పొందినా మళ్ళీ పుంజుకుని ముందుకెళ్ళారు. అందుకే చెబుతున్నా - ఎవరి జీవితంలోనైనా అన్నివేళలా విజయాలే ఉండవు. పడినా లేచి నిలబడడం చేతకావాలి. అలా కావాలంటే - భావోద్రేకాలలో సమతౌల్యత ఉండాలి. ఆధ్యాత్మిక పురోగతి ఇక ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా నిరంతరం పురోగతిని సాధిస్తూనే ఉండాలి. ఆధ్యాత్మికత అన్నదానికి మీ స్థాయిలో మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దానికి పర్యాయపదాలు చెబుతాను - అవి వశవర్తి అగుట, లొంగి ఉండుట. లొంగకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఓఋద్ధిలోకి రాలేడు. ఒక ఏనుగు మావటికి లొంగితే, వశవర్తి అయితే దాని కుంభస్థలం మీద భగవంతుడి ఉత్సవమూర్తిని ఉంచి ఉరేగింపుగా తీసుకెడతారు. అది లొంగలేదనుకోండి స్వామిని దింపి, ఆ ఏనుగును తీసుకెళ్ళి ఇనుప గొలుసులతో కట్టేస్తారు. ఒకసారి ఒక ఏనుగు మాడవీథులలో ఊరేగింపు సమయంలో కట్టుతప్పి విచ్చలవిడిగా ప్రవర్తించినందుకు దానిని వేరుగా ఇనుప గొలుసులతో బంధించి ఉంచారు. తర్వాత దాన్ని అరణ్యంలో వదిలే ఏర్పాటు చేశారు. ఇంత బుద్ధినిచ్చి, మేధస్సునిస్తే ఎవరికీ లొంగకుండా, ఎవరిమాటకూ వశపడనన్నవాడిని ఏం చేయాలసలు? ఏనుగు కాబట్టి మావటి లొంగేటట్లు చేస్తాడు. మరి మనిషో! మనిషి స్వచ్ఛందంగా వశపడాలి. ఎవరికి వశపడాలి? తల్లికో, తండ్రికో వశపడాలి, అథవా భార్యకయినా వశపడాలి. జీవితాంతం తనతో కష్టసుఖాలు కలిసి పంచుకున్న భాగస్వామి, ఆమెకయినా వశపడాలి. అది క్రమేణా భగవంతుడికి వశపడేటట్లు చేస్తుంది. ఆధ్యాత్మికతకు అసలు అర్థం - భగవంతుడికి వశపడేటట్లు చేయడమే. అంటే నాకంటే, నా బంధుమిత్రులకంటే, నా చుట్టూ ఉన్న ప్రపంచంకంటే శక్తిమంతుడైనవాడు ఒకడున్నాడని అంగీకరించడం. వాడికి లొంగితే, వాడికి నేను పూర్తిగా వశవర్తి అయితే వాడు ప్రసన్నుడై నాకు పెద్ద దిక్కయి ఉండగా ఇక నాకు ఎదురేముందన్న భావన. దీనితో నీ మీద, నీ శక్తిమీద నీకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రతి సంక్షోభంలోనూ నిన్ను చెయ్యిపట్టుకుని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తుంది. -
ఆలోచనల్లో స్పష్టత... అప్రమత్తత
విద్య - విలువలు ‘వ్యక్తిత్వ వికసనం’ అన్న అంశంలోని ఐదు లక్షణాల్లో మొదటిదైన ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. రెండవది అత్యవసాయం. అంటే ఆలోచనల్లో అప్రమత్తత. దీన్ని ఆంగ్లంలో మెంటల్లీ అలర్ట్ అంటారు. మీరు ఎక్కడికి ఎప్పుడు వెడుతున్నా మీకో స్పష్టత ఉంటుంది. నేను ఒక సభకు వెడుతున్నాననుకోండి. పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వెడుతున్నప్పుడు రామాయణ, భారత, భాగవతాదులు, శివుడి అష్టమూర్తితత్త్వం వంటి విషయాలపై ప్రవచనాలు చెప్పకూడదు కదా! పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వెళ్లేటప్పుడు ప్రతి మాటా పిల్లలకు పనికివచ్చేదే మాట్లాడుతున్నానా అని నేను నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి. అదీ అలర్ట్‌గా ఉండడం అంటే. అది ఆలోచనల్లో స్పష్టతను ఏర్పరుస్తుంది. నేను మా నాన్నగారి దగ్గరికి వెడుతున్నాను. ఈ పని చెయ్యవచ్చా, చెయ్యకూడదా, ఇది చేస్తే మంచిదా, చెయ్యకపోతే మంచిదా? అని నేను మా నాన్నగారిని అడగబోతున్నాననుకోండి. మనసులో ఒక స్పష్టత ఉండాలి. నేను ముందే ఒక నిర్ణయం చేసేసుకుని, మా నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేయకూడదు. నాన్నగారు విజ్ఞులు, అనుభవజ్ఞులు. వారికి తెలుసు. నాన్నగారూ! ఇలా చెయ్యమంటారా? అని అడుగుతాను. ఇలా చెయ్యి అంటే అలానే చేసేస్తాను. వద్దంటే మానేస్తాను. అంతే తప్ప ముందే నిశ్చయం చేసేసుకుని, అది ఒప్పుకునేటట్లు ఆయనపై ఒత్తిడి తేవడానికి నేనెళ్లకూడదు. అలా చేస్తే నేను అడగడానికి వెళ్లలేదు, నేననుకున్నది సాధించుకోవడానికి వెళ్లినట్లు లెక్క. అలా ఉండకూడదు. స్పష్టత ఉండాలి. మన శ్రేయస్సు కోరి ఆయన సభలో మాట్లాడుతున్నాడు. అవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. వాటిని అనుసరించడానికి అవేమైనా కష్టమైనవా? ప్రతిరోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చెయ్యండని ఆయన చెబుతున్నారు. అది మంచి సలహానా, దోష భూయిష్టమైనదా? మంచి విషయమని మీరు నమ్మారనుకోండి, దాన్ని కచ్చితంగా పాటించడానికి సిద్ధపడి ఉండాలి. మీ మనసు అందుకు సిద్ధంగా లేదనుకోండి. ఉపన్యాసం విని కూడా రేపు మీరు ఒక్క అరగంట నడవడం కానీ, 10 నిమిషాలు పరుగెత్తడం కానీ, నాలుగు బస్కీలు తియ్యడం కానీ చెయ్యలేదనుకోండి. అప్పుడు ఎన్ని విన్నా అది ఒక వినోద ప్రక్రియలాగా ఉంటుంది. శోభానాయుడిగారి నృత్యం చూడడానికి వెళ్లాం. ‘పద్మావతీ కళ్యాణం’ ఆమె ఎంత బాగా చేశారో! అంటాం. అంతే తప్ప ఆవిడ ఎలా చేశారో చేసి చూపే ప్రయత్నం చేయం. సాధ్యం కాదు. అది మనసు సంతోషం, ఉల్లాసం పొందడానికి. కానీ మన మంచి కోరి ఎవరైనా చెబుతుంటే వాటిని వినడం ఎందుకంటే జీవితంలో పాటించడానికి. అంతే తప్ప- ‘‘చాలా బాగా చెప్పారండీ’’ అని ఆయనకు కితాబివ్వడానికి కాదు. అవి మనకు ఉపయోగపడతాయనుకున్నప్పుడు వాటిని ఆచరణలోకి తెస్తే ఆయన శ్రమకు, ఆర్తికి ఫలితం లభిస్తుంది. అదీ స్పష్టత. మెంటల్లీ అలర్ట్. అది అలవాటయితే మీరు ఏ పనిమీద ఉంటే మీ మనసు దానియందే లగ్నమై ఉంటుంది. ఆడుకోవడానికి వెళ్లారు. ఆటల్లో పూర్తిగా మునిగిపోతారు. పూజ చేసుకోవడానికి వెళ్లారు, పూజలో నిమగ్నమైపోతారు. అంతేతప్ప పూజ చేయడానికి వెళ్లి కాలేజి గురించి ఆలోచించడం, క్లాస్‌రూమ్‌లో కూర్చుని పాఠం వింటూ ‘అయ్యో, నేను ఈవేళ పూజ సరిగా చేసుకోలేకపోయాను’ అని చింతించడం, అమ్మతో కఠినంగా మాట్లాడడం, ఆ తరువాత బయటికెళ్లి ‘అనవసరంగా అమ్మతో దెబ్బలాడానేమో, పాపం బాధపడిందేమో’ అని ఏడవడం, ఇంటికెడితే చులకనైపోతానేమోననే అయోమయం... అన్నీ అయోమయమే. జీవితంలో ఏ ఒక్క విషయంలో స్పష్టత ఉండకపోతే ఎలా! జీవితంలో ఏది చేస్తున్నా ఇది నేనెందుకు చేస్తున్నాననే విషయంలో స్పష్టత ఉంటే మీకు జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా వాటిని అనాయాసంగా అధిగమించగలుగుతారు. తెల్లవారుఝామున 5గంటలకు లేవాలని అలారం పెట్టుకుంటారు. దాని పేరే అలారం. అంటే నీవు ఇప్పుడు లేవకపోతే ప్రమాదంలో పడిపోతావు అనే హెచ్చరిక అది. నీవు మోగమంటేనే అది మోగింది. లేచి దాని నోరు నొక్కేసి మళ్లీ వెళ్లి పడుకుంటే... ఏదీ స్పష్టత? ఒకసారి చేద్దామనుకోవడం, ఒకసారి వద్దనుకోవడం, ఒకసారి చేయడం, మరోసారి ఇంకోలా చేయడం. అది జీవితాన్ని ఆయోమయం పాలు చేస్తుంది సినిమా చూడ్డానికి వెళ్లాడు. దేనికెళ్లాడు? వినోదించడానికెళ్లాడు. సినిమాలో చెప్పిన విషయాలు ఆదర్శంగా తీసుకొమ్మనమని ఎవడు చెప్పాడు? సినిమా ఎప్పుడైపోతుందంటే... అందులో వాడనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. నీవు జీవితంలో అలా చేసుకుంటే అయిపోతుందా? అయిపోదు. అక్కడ మొదలవుతుంది నీ జీవితం. సినిమా ఎంతవరకో అంతవరకే. దాన్ని జీవితంలోకి తెచ్చుకోవడమేమిటి? సినిమాలో ప్రేయసీ ప్రియులు పార్కుల్లో పాటలు పాడతారు, నృత్యాలు చేస్తారు. అలా చేస్తున్న ప్రేయసీ ప్రియులను నేనెక్కడా చూడలేదు నిజ జీవితంలో.. సినిమాలో చూపించినట్లు బయట ఉండదు. సినిమాలో వందమందిని చితకబాదినవాడు బయట చీపురుపుల్లలాంటివాడు. చెయ్యెత్తితే కిందపడిపోతాడు. అవన్నీ నిజాలు కావు, నటనలు. అందులో నటుడు నిజ జీవితంలో కోటీశ్వరుడు. భారతదేశంలో బయటికొస్తే వెంటపడతారని, సింగపూర్ వెళ్లి షాపింగ్ చేస్తుంటాడు. ఆయన మీకు ఆదర్శం ఏంటి? వినోదాన్ని వినోదం వరకే తీసుకోవడం అలవాటు చేసుకోండి. పెద్దల దగ్గరికెళ్లావు- ‘‘ఇవిగో ఇవీ నా ఆలోచనలు. ఈ ఈ విషయాల్లో నాకు మీ మార్గదర్శనం కావాలి’’ అని స్పష్టంగా అడగగలగాలి. నిద్రపోవడానికి వెళ్లావు. అన్ని అలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా నిద్రపో. మళ్లీ రేపు నిద్ర లేచిన తరువాతే ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకో. తరగతి గదిలోకి వెళ్లావు. పాఠం వినడమే ప్రయోజనం. బండి నడుపుతున్నావు మరో ఆలోచన లేకుండా నడపడమే నీ ప్రయోజనం. మనసు పరధ్యానంగా ఉంచి బండి నడిపితే ఏమవుతుందో... జీవితంలో స్పష్టత కోల్పోయిన ప్రతి సందర్భంలో అవే అనుభవాలు ఎదురవుతాయి. దీన్నే మెంటల్లీ అలర్ట్ అంటాం. ఆలోచనల్లో స్పష్టత, అప్రమత్తత. ఇవి రావాలంటే మిమ్మల్ని మీరుగా ప్రతిక్షణం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రయత్న పూర్వకంగానూ, అభ్యాసం మీద ఇది అలవాటు చేసుకోండి. -
కాలమేం మారలేదు, అప్పటికీ... ఇప్పటికీ...
విద్య - విలువలు పొరబాటు ప్రతివాడి జీవితంలో జరుగుతుంది. ఇన్ని మంచి మాటలు చెప్పే నా జీవితంలో కూడా ఏవో పొరబాట్లు జరుగుతుంటాయి. ఎవడైనా తప్పు చేస్తాడు. ఏదో చిన్న చెడు లేకుండా ఎవడూ ఉండడు. తన తప్పు దిద్దుకుని తన జీవితాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి అన్ని అవకాశాలు వచ్చినా సైంధవుడు వాటిని ఉపయోగించుకోలేకపోయాడు. లోకంలో ‘కాలం మారుతోంది’ అనే తప్పుమాట ఒకటి ప్రచారంలో ఉంది. కాలం మారదు. త్రేతాయుగంలో సూర్యుడు దక్షిణ దిక్కున ఉదయించలేదు, ఇప్పటిలాగే అప్పుడూ ఉదయించాడు, అలాగే అస్తమించాడు. భూమి తిరగడంలో తేడా వచ్చిందా? ఋతువులు మారడంలో తేడా వచ్చిందా? లేదు... కాలంలో ఏ మార్పూ రాలేదు. ఏదయినా మార్పు వచ్చిందంటే మనలో వచ్చింది. రాముడు తెల్లవారుఝామునే లేచేవాడు. మానేసింది మనం. వాళ్లలా బతకడం మానేసి నెపం కాలంమీద నెడుతున్నాం. దుర్మార్గపు బుద్ధుల్లో కూడా మహాభారతకాలానికీ ఇప్పటికీ తేడా ఏమీ లేదు. కోటికాస్యుడు అనే స్నేహితుడితో కలిసి సైంధవుడు అరణ్యం గుండా వెడుతున్నాడు. ద్రౌపదీ దేవి ఆశ్రమంలో పూలు కోసుకుంటున్నది. ఆమె మహా సౌందర్యవతి. వరసకు ఆమె చెల్లెలవుతుంది (సైంధవుడు- కురుపాండవుల చెల్లెలు దుస్సల భర్త). ఆ సమయంలో పాండవులు ఆశ్రమంలో లేరు. వేటకు వెళ్లారు. పాండవులు లేరు కనుక, ఒక్కతే ఉంది కనుక కబురు చేసాడు. అన్నగారే కనుక రమ్మనమంది. ఆ మర్యాదతోనే ఆయనకు మంచినీళ్లు ఇచ్చి పళ్లు తెచ్చిపెట్టింది. దుర్మార్గపు బుద్ధితో వచ్చిన సైంధవుడు ‘‘నేను నిన్ను నా భార్యను చేసుకుందామనుకుంటున్నాను’’ అన్నాడు. ఆవిడ హతాశురాలై ‘‘అన్నా ! నీ నోటివెంట ఈ మాట రావచ్చా ! అన్న చెల్లెలితో ఇలా మాట్లాడవచ్చా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అన్నా’’ అంది. అంతే! ఆమెను అపహరించి రథంలో చాలా వేగంగా తీసుకుపోయాడు. బుద్ధియందు రుగ్మత ఒక నాటిది కాదు. మనుషుల మనసులకు సంబంధించినది. ఒక కాలంలో మంచివాళ్లున్నారు, మరో కాలంలో చెడ్డవాళ్లున్నారన్న సిద్ధాంతం ఎప్పుడూ ఉండదు. చెడు బుద్ధి ఉన్నవాడు ఏ కాలంలో ఉన్నా పాడైపోతాడు. కొద్దిసేపటి తర్వాత పాండవులు వచ్చి విషయం తెలుసుకున్నారు. వెంటనే పరమ వేగంతో వెళ్లి సైంధవుణ్ణి బంధించి పట్టుకొచ్చారు. పాండవుల శక్తి అటువంటిది. ఇక్కడ మీరొక విషయాన్ని గమనించాలి. వ్యక్తిలో దోషం ఉంటే దాన్ని వ్యవస్థకు ఆరోపించి మాట్లాడకూడదు. అలాగే వ్యవస్థలో దోషం ఉంటే దాన్ని అలాగే చూడాలి, వ్యక్తులకు ఆపాదించకూడదు. ఒక డాక్టర్ తప్పుగా ఆపరేషన్ చేస్తే డాక్టర్లందరూ అలా చేస్తారని కాదు కదా, ఒక ఆఫీస్‌లో ఒకడు లంచం పుచ్చుకుంటే అన్ని ఆఫీసుల్లో అందరూ లంచాలు పుచ్చుకుంటారని కాదు కదా! నేనీమాట ఎందుకు చెప్తున్నానంటే... మీలో కొంతమంది రేపు పాత్రికేయులు కావచ్చు, టెలివిజన్ తదితర ప్రచార సాధనాల్లోకి వెళ్లవచ్చు. ఏ పని చేస్తున్నా వ్యక్తి దోషాన్ని వ్యవస్థ మీద రుద్దకండి.అలాగే వ్యవస్థ దోషాన్ని వ్యక్తులకు ఆపాదించకండి. సైంధవుడు తప్పు చేశాడు. ధర్మరాజు ధర్మాత్ముడు. ఆయనకు కూడా కోపం వచ్చింది. భార్యను ఎత్తుకుపోతే కోపం ఎవరికి రాదు కనుక! కానీ భీముడు కోపంతో సైంధవుణ్ణి చంపేస్తాడేమోనని... ‘‘కోపంతో చంపేస్తావేమో! ఒక్కటి గుర్తుపెట్టుకో. మన చెల్లెలు పసుపు కుంకుమలు పోతాయి. చెల్లెలు ఇంటికొచ్చి- అన్నయ్యా, నా పసుపు కుంకుమలు తుడిచేశావా? అంటే ఏం చెప్తాం. కోపాన్ని నిగ్రహించుకో’’ అన్నాడు. అయినా భీముడి కోపం చల్లారలేదు. అందుకే అర్జునుడిని తోడిచ్చి పంపాడు. వాళ్లు వెళ్లి సైంధవుణ్ణి బంధించి తీసుకొచ్చి ధర్మరాజు కాళ్లముందు పడేశారు. ‘‘నీచమైన గుణానికి లోనయ్యావు. బావవి కనుక చెల్లెలి ముఖం చూసి వదిలేస్తున్నా. లేకపోతే చంపేసుండేవాళ్లు నా తమ్ముళ్లు. బుద్ధి మార్చుకుని బతుకుపో’’ అన్నాడు. ఇది ఒక సంఘటనే కావచ్చు. అందరి జీవితాల్లో అన్ని వేళల్లో మంచి సంఘటనలే జరగవు. ఒక్కొక్కసారి పొరబాట్లు జరుగుతాయి. సైంధవుడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు ఈ క్షమాభిక్ష అవకాశంగా తీసుకుని తన తప్పు దిద్దుకుని మంచివాడుగా మారిపోవచ్చు. కానీ ఆయన వెళ్లి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. సైంధవుడు మోక్షం అడిగి ఉండవచ్చు, నాలో ఇక చెడు భావనలు రాకుండా ఈ కాలం ఉన్నంతవరకు మహాత్ముడిగా నా కీర్తి ప్రచోదనం చెయ్యమని అడగవచ్చు. కానీ అలా అడగలేదు. ప్రాణభిక్ష పెట్టిన పాండవుల మీద కక్షపెట్టుకుని వారిని చంపగల శక్తి ఇవ్వమని అడిగాడు. ‘‘వారు ధర్మ రక్షకులు. అలా కుదరదు. అయితే ఒక వరం ఇస్తాను. నా పాశుపతాస్త్రం ఉంది కనుక అర్జునుణ్ణి నీవెలాగూ ఓడించలేవు. అర్జునుడు లేని సమయంలో మిగిలిన నలుగురినీ ఒక్కరోజు మాత్రం వారెంత బలగంతో వచ్చినా నీవు ఓడించగలవు’’ అన్నాడు. దానిని అవకాశంగా తీసుకున్న సైంధవుడు అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లగానే ధర్మరాజు, భీముడు, నకుడు, సహదేవులను లోనికి వెళ్లకుండా అడ్డుకుని పాండవుల మీది పగతో చంపేశాడు. ఏమయింది సైంధవుడి జీవితం? - అంత తపస్సు ప్రాణభిక్ష పెట్టిన పాండవుల కొడుకును చంపడానికి మాత్రమే పనికొచ్చింది. తర్వాత చాలా కథ నడిచింది. అర్జునుడు ఊరుకుంటాడా, ఆ మర్నాడు సాయంత్రానికల్లా సైంధవుడి తల నరికేశాడు. ఇది ఎప్పటి మాట. ద్వాపరయుగం నాటిది. ఒక్కరోజు అడ్డుకున్నందుకు, అదీ ఎవరిని.. ఓ నలుగురిని. కానీ ఇప్పటికీ ఒక మంచి పనికి ఎవరడ్డువచ్చినా ‘సైంధవుడిలా అడ్డుపడ్డాడు’ అని అంటూంటాం. అటువంటి అపకీర్తిని శాశ్వతంగా మూటగట్టుకున్నాడు. సైంధవుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది. పొరబాటు ప్రతివాడి జీవితంలో జరుగుతుంది. ఇన్ని మంచి మాట చెప్పే నా జీవితంలో కూడా ఏవో పొరబాట్లు జరుగుతుంటాయి. ఎవడైనా తప్పు చేస్తాడు. ఏదో చిన్న చెడు లేకుండా ఎవడూ ఉండడు. తన తప్పు దిద్దుకుని తన జీవితాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి అన్ని అవకాశాలు వచ్చినా సైంధవుడు వాటిని ఉపయోగించుకోలేకపోయాడు. ప్రతి వ్యక్తీ మంచీ చెడుల సమాహార స్వరూపం. తన తప్పొప్పులను తాను గుర్తించగలగాలి. పొరబాటు జరిగిందని మృత్పిండంలా నేలమీద పడిపోకూడదు. పైకి లేవాలి. ధైర్యంగా సందర్భాన్ని ఎదుర్కోవాలి. ఎదురైన అవకాశాల్ని తప్పుల్ని దిద్దుకోవడానికి, అభివృద్ధి కొరకు ఉపయోగించుకోగలగాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పిల్లలకు క్షమాపణ చెప్పకూడదు!
విద్య - విలువలు అన్నీ నాకు తెలుసు-అన్న భావన అహంకారానికి కారణమౌతుంది. శంకరాచార్యుల వారు భగవంతుడిని గురించి ప్రార్థన చేయవలసివస్తే మొదట-’’అవినయమపనయ విష్ణో..’’ అంటారు. అంటే ‘‘శంకరా నాకు అవినయాన్ని తీసెయ్. వినయాన్ని కటాక్షించు’’ అని ప్రార్థిస్తారు. అవినయం అంటే అహంకారం. అలాగే వినయం ఎక్కడ ఉండాలో అది అక్కడ అలా ఉండాలి. ఎక్కడ వినయం ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించకూడదు. ఇది కూడా చాలా అవసరం. వినయమన్న మాటలోనే దాని అంతర్భావం దాగి ఉంది. ఉదాహరణకు నా కుమారుడిని నేను నిష్కారణంగా కోప్పడ్డాననుకోండి. నిష్కారణంగా అంటే పొరపాటున అని. నా కలం అక్కడ పెట్టుకున్నాను. అది కనబడలేదు. నా కుమారుడు తీసి ఉంటాడన్న అనుమానంతో వాడిని చెడామడా తిట్టాను తీరా కాసేపాగిన తరువాత ఏదో వెదుకుతూ ఉంటే అంతకుమునుపు నేను సగం చదివి పెట్టిన ఒక పుస్తకంలో అది కనబడింది. అయ్యో పాపం, అనవసరంగా తిట్టానే వాణ్ణి. ఏడ్చాడు కూడా’’. అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి? నేను చాలా వినయశీలిని కనుక పిల్లలైనా, పెద్దలైనా నావల్ల తప్పు జరిగితే క్షమాపణ అడగాలనుకుని వాడి చేయి పట్టుకుని ’నాన్నా చాలా సారీ రా’’ అని అనాలి. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే నా వినయం అవతలివాడి అవినయానికి కారణం కాకూడదు. రేప్పొద్ద్దున మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా కనబడక వాడిని అడిగితే ’అస్తమాను ఇలా అంటారేమిటి నాన్నా, వెళ్ళి ఏ పుస్తకంలో పెట్టుకున్నారో చూసుకోండి’’ అని వాడు నన్ను అనకూడదు. నేను ఎవరికి క్షమాపణ చెప్పాలంటే ‘‘ఈశ్వరా! ఈవేళ పుస్తకంలో కలం పెట్టుకున్న సంగతి మరిచి నా కుమారుడిని నిష్కారణంగా నిందించాను. వాడు ఏడ్చాడు. వాడిని బాధపెట్టాను. నన్ను మన్నించండి’’ అని వేడుకోవాలి. లేదా నా తల్లిదండ్రులు జీవించి ఉంటే, నా కుమారుడు చూడకుండా వెళ్ళి వారికి చెప్పుకోవాలి. దీనివల్ల కిందివాడి వినయం నిలబడుతుంది. నేను వినయంగా ఉండడం అవతలివాడి అవినయానికి ఎప్పుడూ కారణం కాకూడదు. నాకు తెలిసిన ఒక ఉన్నతాధికారికి కోపమొస్తే అవతలి వాళ్ళను భయపెడుతుండేవాడు. బెల్ కొట్టి మేనేజర్ని పిలిచి ‘‘వీడి పర్సనల్ ఫైల్ పట్రండి. వీడి సంగతి చెప్తా. వారం రోజుల్లో తెలిసొస్తుంది’’ అనేవాడు. అవతలివాడు హడిలిపోయి వెళ్ళిపోయేవాడు. వాడు వెళ్ళిన పదినిమిషాలకే బెల్ కొట్టి మేనేజర్ని పిలిచి ఆ ఫైల్ తీసికెళ్ళిపొమ్మని చెప్పేవాడు. సార్ ఏం చేశాడని వాణ్ణి అంతలా భయపెట్టేశారని అడిగితే..‘‘వాడిని దెబ్బతీయడం చాలా తేలికండి. వీడి ఆశంతా డబ్బే కనుక ఒక ఇంక్రిమెంట్ కట్ చేయవచ్చు. వీడి క్రమశిక్షణారాహిత్యానికి ఫైల్ అడ్డుపెట్టుకుని వీడిని మార్చాలి తప్ప వీడిని నమ్ముకున్న కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తే ఎలా? నోరు చేసుకున్నా ఆలోచించి చేస్తానండోయ్. అలా తొందరపడి చర్య తీసుకోను సుమా. ఇదంతా వ్యవస్థను చక్కదిద్దడానికే.’’ అనేవాడు. నేను ఆయన పరిణతిని చూసి ఆశ్చర్యపోయే వాడిని. వ్యవస్థను చక్కబరచడానికి ‘క్రోధమాహారయత్’ అంటాడు వాల్మీకి మహర్షి. అంటే కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలి తప్ప దానికి వశపడకూడదు-అని. ఒకసారి కోపానికి వశపడి పోయాడనుకోండి, ఇక వాడేమైపోతాడనేది ఎవరూ చెప్పలేరు. ఒకసారి క్రోధం గనుక ఆవహించిందా ఎవరూ పట్టుకోలేరు, గురువును కూడా చంపేస్తాడు. సర్వకా లాలలో మనుష్యజన్మ ఎత్తినవాడికి సంస్కారమనే మాటలో అత్యంత ప్రధానమైనదేది - అంటే వినయం కలిగి ఉండుట అంటే తలవంచగలిగి ఉండుట. ’పెద్దలపొడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతుల్ చేయువాడు’ ఎవరైనా పెద్దలు ఎదురైతే ఒక సేవకుడు ఎలా నమస్కారం చేస్తాడో ప్రహ్లాదుడు అలా నమస్కారం చేసేవాడట. ఇప్పటికీ మనం గమనిస్తే పెద్దలైనవారి జీవితాల్లో వాళ్ళు పాటించినన్ని నియమాలు, వాళ్ళు చూపించినంత గౌరవం, వాళ్ళు అలవరచుకున్నంత వినయం వాళ్ళని అంతటి పైస్థాయికి తీకెళ్ళి నిలబెట్టాయనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో రామకృష్ణావధాన్లుగారని గొప్పవేద పండితుడున్నాడు. వారి కిప్పుడు 80 ఏళ్ళు. సందర్భవశాత్తూ వారి గురువుగారిని ఆయన ప్రస్తావించిన ప్రతిసారీ ఆయన కళ్ళవెంట, ముక్కుల వెంట నీళ్ళు ధారగా ప్రవహిస్తాయి. గొంతు గాద్గదికమౌతుంది. గురువుగారితో ఆయనకున్న అనుబంధం అది. ఒకసారి తుపాను వచ్చి యానాం అంతా కొట్టుకుపోయింది. ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఒక సంపన్నుడొచ్చి డబ్బిస్తే ‘‘ఒరే నాయనా, నేను పందిట్లో ఉన్నా ఫరవాలేదు’’ అని పక్కనే ఉన్న శివాలయాన్ని ఉద్ధరింపచేసాడు. అయినా ఆ సంపన్నుడు మళ్ళీ వచ్చి డబ్బు కట్ట అక్కడ పెట్టబోతే...’’దీనికంటే వీలయితే నాకు ఇంకొక విద్యార్థిని అప్పచెప్పు. వాడికి వేదం చెబితే ఈ జీవితానికి సార్థకత. ఆ వేదమంత్రాలతో వాడు ఊరికి ఉపకారం చేస్తాడు. మా గురువుగారిలా నేను ఓ పదిమందికి పాఠం చెబితే చాలు.’’ అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అదే వినయం, అదే విధేయత. ఇంతంత పాండిత్యం ఉన్న వారికి ఇంతంత పెద్ద పెద్దపదవుల్లో ఉన్న వారికి ఇంత వినయమా అని ఆశ్చర్యమేస్తుంది. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందనే సామెత ఉత్తిగా రాలేదు. ఈ లోకంలో వినయానికి పరాకాష్ఠ హనుమ. ఆ తర్వాత శంకర భగవత్పాదులు. హనుమంతుడిని స్మరిస్తే చాలు, అన్ని సద్గుణాలూ అబ్బుతాయి. హనుమ నాకొరకు’ అని జీవితం మొత్తంమీద చేసుకున్న పని ఒక్కటీ లేదు. చివరికి పెళ్ళికూడా అంతే. ఆయన ఎంత వేగంగా వెళ్ళగలడో అంత నిశ్చలంగా కూర్చొని ధ్యానం చేయగలడు. ఎంతటి శక్తిమంతుడో అంతటి వినయశీలి, అంతటి ఇందియ నిగ్రహం కల్గినవాడు ఆదర్శప్రాయుడు. -
ప్రజలే ప్రతిపక్షంగా మారతారు: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉండేవారికి చేతులెత్తి నమస్కరించాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన అనంతరం ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.‘‘ప్రత్యేక హోదా అంశం, రాష్ట్రానికి ఇచ్చిన హామీల గురించి అడిగాం. నియోజకవర్గాల పునర్విభజన గురించి ప్రస్తావించాం. రాజ్‌నాథ్‌సింగ్ కూడా దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి లేదని ఇప్పటికే అటార్నీ జనరల్ కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పారన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడంపై ప్రస్తావించగా..‘‘ప్రభుత్వం ప్రతిపక్షంలోని నాయకులందరినీ తీసుకున్నా ప్రజలే ప్రతిపక్షంగా మారతారు. రాజకీయ నాయకులు విలువలకు కట్టుబడి ఉండాలి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోకి వెళ్లడమేనా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ’’ అని మేకపాటి తెలిపారు. ఎంపీ వెలగపల్లి మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేయాలని అడుగుతాం, ప్రజలు కూడా అడుగుతారు అని పేర్కొన్నారు. -
వశం చేసుకోవడం కాదు... వశవర్తులు కావడం నేర్చుకోవాలి..!
డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు-అన్నదానితో సంబంధం లేకుండా, సంపాదిస్తున్నాడా లేదా అదొక్కటే ప్రమాణంగా... అతి తక్కువకాలంలో ఎంత ఎక్కువ సంపాదించవచ్చన్న లక్ష్యంగా వెడుతున్నాడనుకోండి. వాడంత ప్రమాదకరమైన మనిషి మరొకడుండడు. అందుకే... మీరేం చేస్తున్నారన్నది కాదు, ఎలా చేస్తున్నారన్నది ప్రధానం. మన ఆర్షవాఙ్మయం అంతా ధర్మం గురించే మాట్లాడుతుంది. ధర్మం అంటే... నీవల్ల ఎంతమందికి ఉపయోగముంటున్నది, నీ బతుకు ఎంతమందిని బతికిస్తున్నదన్నది ఇందులో ముఖ్యం. ఇది సాధించాలంటే గురువు దగ్గర ఎప్పుడూ బుద్ధి శిక్షింపబడడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే శిష్యుడు’ అని అంటారు. బుద్ధి శిక్షింపబడడమంటే... గురువుకి వశవర్తి కావాలి. నేనుగా గురువుగారికి లొంగిపోతున్నాను - అని సంకల్పం చేసుకుని గురువుగా ఏ మాట చెబితే ఆ మాట శిరసా వహిస్తాను’ అన్నాడనుకోండి. అప్పుడతడు సమాజానికి పనికివచ్చేవాడవుతాడు. ‘నేను ఎవ్వరికీ లొంగను. నేననుకుంటే నా మాట నేనే వినను’ అన్నాడనుకోండి. వాడంత పనికిమాలినవాడు ఇంకొకడు ఉండడు. వాడిమాట వాడే వినకపోతే ఎవడికి పనికొస్తాడు? అంతకన్నా దౌర్భాగ్యమైన మాట మరొకంటుంటుందా? ఉండదు. ఒక గుర్రం ఉంది. గొప్పగా దౌడు తీయగలదు. కొండలు, గుట్టలు కూడా ఎక్కగలదు. అది తనమీద ఎక్కి స్వారీ చేస్తున్న వ్యక్తిని క్షేమంగా తీసుకెడుతుంది. అలా తీసుకెళ్లగలిగిన దానినే ఉత్తమాశ్వం అంటారు. అది తన యజమానికి వశమైపోతుంది. ఏనుగు చాలా బలంగా ఉంటే, మావటివాడేమో బలహీనంగా ఉంటాడు. అది కట్టుకొయ్య దగ్గరకెళ్లి అక్కడ ఉన్న ఇనుప గొలుసులను తొండంతో తీసి మావటికి ఇచ్చి కట్టవలసిందని కాలు చాపుతుంది. నిజానికి ఏనుగు కదలకుండా ఉండలేదు. అది కదలకపోయినా కనీసం తొండమన్నా కదిలిస్తూనే ఉంటుంది. అరుణాచలం, వేంకటాచలం వంటి క్షేత్రాలకు వెళ్లి చూడండి. మావటి తన చేతిలో ఉన్న అంకుశాన్ని దాని రెండు ముంగాళ్ల వద్ద పెడతాడు. అంతే. అది దాటదు. కాలు ఎత్తుతుంది, కానీ వెనక్కి తీసుకుంటుంది తప్పితే అడుగు ముందుకు వేయదు. ‘నేను దాటను’ అని దానికది పెట్టుకుందా నియమం. నిజానికి అంకుశం సంగతి సరే, తొండంతో మావటిని తిప్పి విసిరివేయగల శక్తి ఉన్నా మావటికి తనకు తానుగా లొంగిపోయింది. కాబట్టే వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తిని ఉరేగింపుగా తీసుకెడుతుంది. పండితులకు పెద్ద సత్కారం - గజారోహణం. దాని అంబారీ మీద కూర్చోబెడతారు. గాడిద వెనుక ఎవరైనా నిలబడితే కాళ్లతో తంతుంది. అలాంటిది అది దాని యజమానికి వశమైపోయిన తరువాత ఎంత బరువయినా మోస్తూ ఉపయోగపడుతుంది. కుక్కకు ఒక లక్షణం ఉంటుంది. పట్టెడన్నం పెడితే చాలు ఎంతగా వశమైపోతుందంటే యజమాని ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఊరెళ్లినా ఇంటికి దొంగల బారి నుంచి కాపలా కాస్తుంది. కర్ర పెట్టి కొట్టినా, రాళ్లు విసిరినా మొరుగుతూనే ఉంటుంది. దూరంగా తరిమినా మొరగడం ఆపదు. యజమానికి వశవర్తి అయిపోయింది. ఎద్దు-దానికేమీ తెలియదు. బండి తెచ్చి కాడి పెకైత్తి దాని కిందకు రమ్మంటే మొదట మొరాయిస్తుంది. నాలుగు రోజులు బండికి కట్టిన తర్వాత రైతు ఎద్దులను తీసుకురాడు. అవి అటొకటి, ఇటొకటి పడుకుని ఉంటాయి. కాడి ఎత్తి పట్టుకుని వాటివంక చూస్తూ నోటితో చిన్న శబ్దం చేస్తాడు. అంతే! రెండూ లేచి వచ్చి మెడ దానికింద పెట్టేస్తాయి. ఎద్దు వశవర్తి అయింది. కాబట్టే రైతు దానిని కుటుంబసభ్యులలాగా ఆదరిస్తాడు. ఏరువాక పౌర్ణమి వస్తే పసుపు కుంకుమలతో పూజించి ప్రత్యేకంగా దానికి పాయసాన్ని వండి పెడతాడు. లోకంలో నోరులేని ప్రాణులు కూడా వశవర్తులయ్యాయి కాబట్టే, సమాజానికి ఉపయోగపడుతున్నాయి. అటువంటిది ఒక మనిషి ‘నేను ఎవరి మాటా వినను, నామాట నేనే వినను’ అంటున్నాడంటే వాడు మనుష్య జన్మకు పనికొచ్చేవాడేనా? అందుకే తనంతటతానుగా వశపడాలి. ఎవరికి? ఎవరు తనకు హితైషులో, ఎప్పుడూ తన హితాన్ని కోరుతారో వారికి వశవర్తి కావాలని వేదం చెప్పింది. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురికీ వశవర్తి కావాలి. అంటే ‘వాళ్లు చెప్పింది నాకు శిలాశాసనం’ అనుకోవాలి. వాళ్లేం చెప్పారో అది చేయాలి. అలా చేయాలంటే ఉండాల్సింది వినయం. అదెలా వస్తుందంటే ‘నాకు వీళ్లు దైవసమానులు. వాళ్లు నా హితం కోరి చెబుతారు. కాబట్టి నేను వాళ్ల మాట వినాలి’ అన్న సంకల్పంతో! మీకు పాఠాలు చెప్పే గురువు కూడా మీ కుటుంబసభ్యుడే అని గుర్తించండి. నేను, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులతో పాటూ నా గురువుగారు కూడా కలిస్తేనే అది నా కుటుంబం అని భావన చేసుకోండి. గురువుగారంటే కేవలం నాకు పాఠం చెప్పడం వరకే కాదు. ‘‘దీని తరువాత నా స్థాయిబట్టి నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఏం చదవవచ్చు, నా మనస్తత్వం దేనికి సరిపోతుంది, గురువుగారూ, దయచేసి నాకు సలహా చెప్పండి’’ అనో, ‘‘సార్ ! నేను బాగా చదువుకోలేకపోతున్నాను. నాకు పాఠం అర్థం కావడం లేదు. దయచేసి నాకు ఇంకొక్కసారి చెప్పండి’’ అని మనసువిప్పి గురువుగారితోటి మీ కుటుంబసభ్యునిలా గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి. ఆ వినయం అలవాటు పడిన నాడు, గురువుకి వశవర్తి అయిన నాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు. మహాజ్ఞాని, తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం కదా.. ఆ రోజున ఎవరో బయటివాళ్లను తీసుకువచ్చి ఉపన్యాసాలు చెప్పించి, పూలదండలు వేయించాలని ఆయన చెప్పలేదు. ఆయన ప్రసంగాలు శ్రద్ధగా చదివితే ఆయన మనస్సేమిటో తెలుస్తుంది. ఆయన కోరుకున్నదేమిటంటే... ‘‘ఆ రోజున నాకు పూలదండ వేయవద్దు. మీకు పాఠాలు చెప్పే గురువుగారు కూడా మీ కుటుంబసభ్యుడే అని గుర్తించండి. -
ఇన్ని ఇచ్చినా ఇంకా ఏదో లేదని ఏడుపా!!!
విద్య - విలువలు ఒక వ్యక్తి సమాజంలో ఆదరణీయంగా బతకాలంటే, ఆదర్శనీయంగా, శాంతికి పర్యాయపదంగా బతకాలంటే రెండు విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని పెద్దలు చెప్పారు. మొదటిది-నేను తెలుసుకుని తీరవలసిన విషయాలలో నాకు తెలిసినది ఎంత? అని ప్రశ్నించుకోవడం. రెండవది-భగవంతుడు నాకు ఇవ్వనిది ఏముంది కనుక! అని కృతజ్ఞతాపూర్వకంగా తృప్తిపడడం. లోకంలో కళ్లు లేని వారు, నోరు, చెవులు ఉండి కూడా మాట్లాడడానికి, వినడానికి నోచుకోని వారెందరో ఉన్నారు. మనం పొందుతున్న సుఖాలలో సగం వాళ్లకు లేవు. అమ్మ నోరారా ‘అమ్మా!’ అని పిలవలేని అసమర్థత ఒకరిది, ఆర్తితో తండ్రి ‘ఒరే కన్నా ఇలా రా!’ అని పిలిస్తే వినలేని దురదృష్టం మరొకరిది. సూర్యోదయాన్ని చూడలేరు, కోయిల గానాన్ని, చిలక పలుకులను వినలేరు, మంచి ఉపన్యాసాలు వినలేరు. ఎన్నో కోల్పోతున్నారు జీవితంలో. వారితో పోల్చుకుంటే మనకు భగవంతుడు ఎన్నో సుఖాలు అధికంగా ఇచ్చాడు. కుటుంబాన్ని పోషించుకోగలిగిన శక్తి ఇచ్చాడు. తల్లిని ఇచ్చాడు, తండ్రిని ఇచ్చాడు. భార్యను ఇచ్చాడు, కొడుకును ఇచ్చాడు, కూతురును ఇచ్చాడు. చేతులూ కాళ్లూ కదపలేని వారెందరో ఉన్నారు. అవి కదలక ఎలక్ట్రిక్ షాక్ పెట్టించుకుంటున్న వాళ్లున్నారు, నాకా పరిస్థితి లేదు. నేను స్వేచ్ఛగా నడవగలుగుతున్నాను. వాళ్లతో పోలిస్తే భగవంతుడు నాకేమి ఇవ్వలేదు కనుక. ఇన్ని ఇచ్చినా ఇంకా లేదని ఏడవడం ఆశకు కారణమౌతుంది. ఆశ అంతులేనిదై పోయిందనుకోండి. అక్కడే నైతిక భ్రష్టత్వమొస్తుంది. కారణం-తనకు లేదన్న ఏడుపే. అది కృతఘ్నత. వచ్చినదానితో తృప్తితో ఉన్నామనుకోండి. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి! అనుకున్నామకోండి. అది తృప్తికి కారణమౌతుంది. వాడు పక్కవాడి శాంతికి, సమాజ హితానికి కారకుడవుతాడు. నాకు తెలిసినదెంత అన్నవాడు వినయమున్నవాడు. ఈ రెండు లక్షణాలనూ ప్రయత్నపూర్వకంగా ప్రోది చేసుకోమన్నారు. అంతేకానీ, అవతలివాడు బాధపడుతుంటే వాడిని చూసి సంతోషించగల మనస్తత్త్వం నాలో ఉందనుకోండి. వాడు మరో పావుగంట అలా బాధపడితే బాగుందని చూడడం, దాన్ని సెల్ఫోన్లో రికార్డు చేయడం, దాన్ని పదిసార్లు చూకోవడం, దాన్ని నెట్లో, ఫేస్బుక్లో పెట్టడం చేశాననుకోండి. అంటే నేను చూసిన ఆనందం, రికార్డు చేసిన ఆనందం, దాన్ని లక్షల మందికి చూపిన ఆనందం... అది చివరకు పైశాచిక ఆనందం. అలా కాక ఆ సమయంలో దయ పెల్లుబుకడం ముఖ్యం, అంతేకాదు అవతలివాడి బాధ ఎంత త్వరగా తగ్గించావన్నది మరీ ముఖ్యం. ఓ రోజున ఒక వృద్ధురాలు రోడ్డు దాటుతూ అరటిపండు తొక్క మీద కాలేసి జారిపడ్డది. ఆ దగ్గర్లోనే నిలుచున్న ఒకావిడ అర్థంపర్థం లేకుండా పమిటకొంగు అడ్డుపెట్టుకుని విరగబడి నవ్వుతున్నది. ఈలోగా ఒక చిన్న పిల్లవాడు, బహుశా ఎనిమిదో, తొమ్మిదో తరగతి చదివే వయసున్నవాడు పుస్తకాల సంచీ పక్కన పారేసి పరుగు పరుగున ఆ ముసలావిడ దగ్గరకెళ్లి ఆవిడ కాలు పట్టుకుని నెమ్మదిగా రోడ్డు పక్కకు తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. నేనూ వెళ్లాను. వాడలా కూర్చోబెట్టి ‘బామ్మగారూ ఇప్పుడెలా ఉంది, తగ్గిందా, నొప్పి ఎక్కువగా ఉందా, బామ్మగారూ మీ ఇల్లు ఇక్కడికి దగ్గరా దూరమా... బస్సెక్కగలరా’ అంటూ అడుగుతున్నాడు. వాడు నన్ను చూసి ‘అంకుల్, మీ దగ్గరేమయినా డబ్బులున్నాయా. బామ్మగారిని ఆటో ఎక్కించేద్దామా?’ అంటున్నాడు. వాడూ సంస్కారవంతుడంటే. ఎప్పుడు ఏ భావన పెల్లుబుకాలో, ఎప్పుడు ఏ భావన పైకి రావాలో అది అలా పైకి రావాలి. ఎంగిలి మనసును ఎలా పసిగట్టగలం? రాకూడని భావన పైకి వస్తుందనుకోండి... అంటే... ఆడదయితే చాలు... లోపలి నుంచి వచ్చే చూపు ఎప్పుడూ ఒకటే... ఏమిటి దానివల్ల ఉపయోగం. ‘మాతృవత్ పరదారేషు..’ భార్య మినహా పరస్త్రీ తల్లితో సమానం’-అంటుంది వేదం. అన్యస్త్రీ కనబడితే చూడడం తప్పు కాదు. చూడు. కానీ నేను ప్రతిరోజూ తెల్లవారుఝామున నిద్ర లేవగానే ఏ కామాక్షీ పరదేవత ఆరాధన చేస్తానో అ తల్లి ఇన్ని ముఖాలతో కనిపిస్తున్నదని భావన చేశాననుకోండి.... నేను సంస్కారవంతుడిని. నా చూపు వల్ల దోషం రాదు, నేను పతనం కాను. లోచూపుకి సంస్కారం చాలా అవసరం. అది లేదనుకోండి. మాట వెనుక, చూపు వెనుక ఎంగిలి ఉందనుకోండి, ఎంగిలంటే నా ఉద్దేశం- అనుభవించాలన్న కోర్కె. లోపల ఉండే భావాలను ఎవడు పసిగట్టగలడు కనుక. పశువైతే తెలిసిపోతుంది. పశువు చూసే చూపును బట్టి ఇది మీదపడుతుందేమోనని తెలుస్తుంది. కానీ లోపల రాక్షస భావాలను దాచుకుని పైకి ఉత్తమ భావాలను ప్రదర్శించే మనిషి లోచూపును ఎవరు కనిపెట్టగలరు? మీరెంతమంది పోలీసులను పెట్టగలరు? ఈ పరిస్థితి ఎలా మారుతుంది,? మనిషిలో దేనివలన మానవత్వం మిగులుతుందంటే... ఒక్క సంస్కారం వల్లనే సాధ్యం. ఈ సంస్కారం కోసం చదువు పనికిరావాలి. విద్య గొప్పదా, సంస్కారం గొప్పదా అంటే సంస్కారం లేని విద్య పతన హేతువవుతుంది. సంస్కారంతో కూడుకున్న విద్య మాత్రమే పదిమందికి పనికి వస్తుంది. రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలకు వశిష్ఠుడు పాఠం చెప్పాడు. చెప్పినప్పుడు గురువు ఎలా చెప్పాడు, పాఠం విన్నవాళ్లకు ఎలా అర్థమైందని అడుగుతూ మహర్షి ఇలా అన్నారు. చదువు ఒకరి నుంచి మరొకరికి ప్రవహించాలన్న మాట వాస్తవమే అయినా, అది అలా ప్రవహించుకుంటూ పోవడం మాత్రమే కాదు. ఒకరి నుంచి మరొకరిలోకి ప్రవహించిన తరువాత అక్కడి నుంచి ఎలా ప్రవహించాలి అన్న విషయానికి ప్రాముఖ్యత ఉంది. అంటే ఉన్న చదువుకు గుణాలు ఆధారం కావాలి. గుణం అంటే ఎప్పుడు మనసులో ఏ భావం కలగాలో ఆ భావన మాత్రమే కలగడానికి ఆ చదువు ఉపయోగపడాలి. నేను ఒక పసిపిల్లవాడి వంక చూశాననుకోండి. వాడు నా మనవడా కాదా అన్నది ప్రధానం కాదు, వాడిపట్ల నాలో వాత్సల్యం పెల్లుబకాలి. నేను ఒక దీనుడి వంక చూస్తే నాలో దయాగుణం పెల్లుబుకాలి. -
డబ్బు, స్టైలేకాదు.. ముందు విలువలుండాలి
ముంబయి: ఓ వ్యక్తి చూడ్డానికి చక్కగా కనిపించొచ్చు.. బాగా డబ్బు కలిగుండొచ్చు ఇంకా స్టైల్‌గా కూడా ఉండవచ్చు కానీ.. అలాంటి వ్యక్తికి మాత్రం మంచి ప్రవర్తన ఉండదని, ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా సరిగా తెలిసి ఉండదని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా అంది. తనది మంచి వ్యక్తిత్వం అనుకునే ప్రతి వ్యక్తి అది వాస్తవ జీవితంలోనూ, సామాజిక అనుసంధాన వేదికల్లోనూ ఒకే మాదిరిగా ఉండాలని చెప్పారు. ట్విట్టర్లో ఆమె ఆదివారం వాస్తవ జీవితంలో, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తుల ప్రవర్తనలు, నడుచుకునే తీరు అనే అంశంపై చర్చ జరిపారు. చూడ్డానికి గొప్పగా కనిపించేవారి ప్రవర్తన తీరు సరిగా లేకుంటే ఇంకే ఉన్నా వ్యర్థమే అని చెప్పారు. సాధారణంగా జీవిస్తూ దయాగుణంతో, ఎదుటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా బతికేయాలని సెలవిచ్చింది ఈ అమ్మడు. అంతేకాకుండా చిన్నారులు కూడా విలువలు మర్చిపోతున్నారని, భారత్‌లో మెయిడ్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
రాజాజీ రాజనీతి విలువలు అసమానం
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేటి తరానికి ఆదర్శనీయుడన్న ఎం.కె. నారాయణన్ హైదరాబాద్: వ్యక్తిగతంగా, రాజకీయ విషయాల్లో సి. రాజగోపాలచారి పాటించిన విలువలు అసమానమైనవని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసించారు. స్వాతంత్య్రోద్యమంలో రాజాజీ ఎంత కీలక పాత్ర పోషించారో, స్వతంత్ర భారత అభివృద్ధికి కూడా అంతే కృషి చేశారని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రాజాజీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాజాజీ ప్రాముఖ్యత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేంద్ర మాజీ భద్రతా సలహాదారు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ ఎం. కె. నారాయణన్‌తోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. రాజాజీ పాటించిన సుపరిపాలన విలువలను నేటి తరానికి గుర్తుచేయడానికి ఈ సంస్థ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. అనంతరం ఎం. కె. నారాయణన్ ముఖ్య ఉపన్యాసం చేస్తూ, స్వాతంత్య్రోద్యమంలో రాజాజీ తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే దేశ స్వేచ్ఛ, సౌభాగ్యంపై ఆయనకున్న దార్శనికత కనబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాజీ ఇన్స్టిట్యూట్ గౌరవ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎ. నరసింహారావు, డెరైక్టర్ ఇ.సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విలువలులేని విద్య నిరర్థకం
హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకరరావు భవానీపురం : మానవత, విలువలు లేని విద్య, ఆత్మ ప్రబోధంలేని వృత్తి నిరర్థకమని హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు అన్నారు. గవర్నర్‌పేటలోని సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో శనివారం రిజి స్ట్రేషన్, స్టాంపుల చట్టాలు, వీలునామా, స్థలం అమ్మకాలు-కొనుగోలు, తనఖా తదితర అంశాలపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమాజంలోని పరిస్థితులను సరిదిద్దడానికి నూతన చట్టాలు పుట్టుకొస్తున్నాయని తెలి పారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత పెడదారిన పడుతోందని, అది చాలా బాధాకరమని పేర్కొన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, తాము ఎంచుకున్న వృత్తిలో ముందడుగు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. మనిషి సమాజంలోని మంచిని మాత్రమే స్వీకరించి చెడును విడనాడాలని సూచించారు. న్యాయవాదులు నిజాయితీ, మానవత విలువలను కాపాడుతూ న్యాయస్థానాలకు సహకరించడం ద్వారా ఉత్తమ తీర్పులు వెలువడే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్‌లో జరుగబోయే లావాదేవీల గురించి వివరించారు. రిజిస్ట్రేషన్-స్టాంపుల చట్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా పూర్తి అదనపు ప్రధాన న్యాయమూర్తి ఆర్.మురళి మాట్లాడుతూ గతంలో కృష్ణాజిల్లాలో పని చేసిన శివశంకరరావు ఉన్నత శిఖరాలను చేరుకుని ఉత్తమ తీర్పులను ఇస్తున్నారని కొనియాడారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపర దుర్గాశ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు దివ్వెల పిచ్చయ్య, హేమంత్‌కుమార్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, బీబీఏ ప్రధాన కార్యదర్శి వజ్జే వెంకటరవికుమార్, ఉపాధ్యక్షులు ప్రసాద్, గోగిశెట్టి వెంకటేశ్వరరావు, పిళ్లారవి, కార్యవర్గ సభ్యులు చింతా ఉమామహేశ్వరరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, ఎం.హెప్సిబా, బి.సాయిబాబు, ఎం.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సంగీతం... ఎప్పుడూ... చెవులకు ఇంపుగా ఉండాలి!
రావు బాల సరస్వతి... తొలి తరం సినీ నేపథ్య గాయని. పాట అంటే చెవులకు ఇంపుగా ఉండాలంటారామె. గాయకులు ప్రతి ఒక్కరూ తాము పాడే పాటలో సాహిత్యపు విలువలను గమనించుకోవాలని చెప్తున్నారు. విలువలు లోపించిన పాట గానం చేయకూడదనే నిబంధనను పాటించాలంటారు. మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు ? 1928వ సంవత్సరం ఆగస్టు 28న మద్రాసులో పుట్టాను. తొలి పాట... నా ఆరవ యేట. ఏ సినిమాకి ?... సినిమాకి కాదు, ప్రైవేట్ ఆల్బమ్ కోసం ‘పరమ పురుషా పరంధామా...’ అనే పాట పాడాను. గాయని కావడానికి ప్రోత్సహించింది ఎవరు ? మా నాన్నగారు పార్థసారథి రావు. ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం. గుంటూరులో మా థియేటర్లో డ్రామాలు వేయించేవారు. నేను మూడేళ్ల వయసులోనే స్థానం నరసింహరావు లాంటి ప్రముఖుల పాటలు విన్నాను. అలా ఆసక్తి పెరిగింది. అప్పట్లో సంగీత సాధన ఎలా చేసేవారు ? గ్రామఫోన్ రికార్డుల్లో విని అలాగే పాడేదాన్ని. అలా నాకిది స్వతహాగా అబ్బిన కళ. బాంబేలో హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నాను. సాటి గాయకుల్లో ఎవరి గొంతు ఇష్టం ? ... సుశీల గొంతు ఇష్టం. మీరు ఏయే భాషల్లో పాడారు? ... మళయాళం, కన్నడం, తమిళం, తెలుగు, సింహళీ భాషల్లో పాడాను. మీరు పాటించిన నియమాలేమైనా ఉన్నాయా? డబ్బు కోసమే అన్నట్లు పాడలేదు. పాట నచ్చితేనే పాడేదాన్ని. సాహిత్యపు విలువల్లో అప్పుడు - ఇప్పుడు తేడా? కొన్ని పాటలనైతే వినలేక పోతున్నాను. అప్పట్లో శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి లాంటి వాళ్లు స్వయంగా రికార్డింగుకు వచ్చే వాళ్లు. ఎవరైనా ఒక పదం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే వారు ఆ పదాన్ని అక్కడే మార్చేసేవారు. నాటి గాయకులకు - నేటి గాయకులకు మధ్య మీరు గమనించిన తేడా? ఘంటసాలలో తొలిపాట సమయంలో ఉన్న వినయం ఆయన చచ్చిపోయే వరకు అలాగే ఉండింది. ఇప్పుడు కొందరిని చూస్తే వారిలో వినయం సహజం అనిపించకపోగా, వినయాన్ని నటిస్తున్నట్లు ఉంటోంది. బాల గాయకులకు సూచన? ఏం పాడుతున్నామో తెలుసుకుని హాయిగా పాడాలి. కష్టపడుతూ కాదు. గాయకుల తల్లిదండ్రులకు... పిల్లలు బాగా పాడితే మెచ్చుకోండి. అతిగా పొగడకండి. ప్రశంస మితిమీరిన ఆత్మవిశ్వాసానికి కారణం కాకూడదు. మీరు పాడడం ఎందుకు మానేశారు? మా వారు ‘రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు’ అభిప్రాయం మేరకు 1958 నుంచి మానేశాను. పరిశ్రమను చూస్తే ఏమనిపిస్తుంది? బాగా పాడే పిల్లల్ని పాడనివ్వకపోతే వారిలో ఆ కళ అంతరిస్తుంది. సంగీత జ్ఞానం తెలిసిన వారు ఆ పాపం చేయకూడదు. అత్యంత సంతృప్తినిచ్చిన పాట? ... ప్రతిదీ నచ్చిన తర్వాతనే పాడాను. కుటుంబం, పిల్లలు... ఇద్దరు కొడుకులు. రావు వెంకట రాజగోపాల కృష్ణ సూర్యారావు, రావు వెంకట కుమార కృష్ణ మహీపతి సూర్యారావు. రాజా గారి శ్రీమతి అంటే రాణిగారి హోదా ఉండేదా? మా ఎస్టేట్‌లో ఉండేది. ‘రాణీ రావు బాల సరస్వతీదేవి’ అని రాసేవారు. ఒక సినిమాకి కూడా పేరు అలాగే వేస్తే నేను తీయించేశాను. ఎందుకలా? సినిమాలో పాట పాడినందుకు డబ్బు తీసుకుంటున్నప్పుడు అక్కడ నా రాణి హోదా ప్రదర్శించకూడదు. అక్కడ నేను నేపథ్యగాయనిని మాత్రమే. మిమ్మల్ని నొప్పించే విషయం? నాకు మనుమళ్లు, మనుమరాళ్లు, ముని మనుమళ్లు, ముని మనుమరాళ్లు ఉన్నారు. వారికెవరికీ సంగీత జ్ఞానం అబ్బలేదు. మీకు సంతోషం కలిగించే విషయం... నన్నింకా కొంతమంది జ్ఞాపకం ఉంచుకున్నారు. దేవుడు వరమిస్తానంటే... సంగీత కుటుంబంలో పుట్టించమని అడుగుతాను. జగ్జీత్సింగ్ వంటి వారింట్లో పుట్టాలని కోరిక. - వాకా మంజులారెడ్డి -
విలువలు పాటించండి..!
బీజేపీ కొత్త ఎంపీలకు మోడీ దిశానిర్దేశం సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన శిక్షణ శిబిరం న్యూఢిల్లీ: ‘ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంటులోనూ, ప్రజల్లో ఉన్నప్పుడూ మీ వ్యవహార శైలి, ప్రవర్తనపై దృష్టి పెట్టండి. విలువలతో కూడిన ప్రజాజీవితం గడపండి. మీ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయండి. సుపరిపాలన సందేశాన్ని వ్యాప్తి చేయండి’.. తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్న బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కర్తవ్య బోధ ఇది. లోక్‌సభ, రాజ్యసభల్లో తొలిసారి అడుగుపెడుతున్న బీజేపీ ఎంపీలకు రెండురోజుల శిక్షణశిబిరాన్ని ఢిల్లీ శివార్లలోని సూరజ్‌కుండ్(హర్యానా)లో శనివారం మోడీ ప్రారంభించారు. ‘పార్లమెంటు సభ్యుడు కావడం గొప్పవిషయం. ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి రావడమంటే కొన్ని సీట్లు మారి అటునుంచి ఇటు వచ్చినట్లు కాదు. ఇదో కీలక మార్పు. ఇప్పుడు మీపై బాధ్యతలు మరింత పెరిగిన విషయాన్ని గుర్తించాలి’ అని వారికి బోధించారు. ‘నేనూ లోక్‌సభకు మొదటిసారే వచ్చాను. నేను కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది’ అన్నారు. నూతన ఎంపీలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కొందరు ఎగతాళి చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయ వ్యవస్థల్లో మానవవనరుల అభివృద్ధికి శిక్షణ వ్యవస్థ లేకపోవడం పెద్ద లోపమని వ్యాఖ్యానించారు. మోడీ దిశానిర్దేశం లోని కొన్ని ముఖ్యాంశాలు.. ⇒ సహచరులతో విభేదాలుంటే వాటిని బహిరంగంగా వ్యక్తపరచవద్దు. అంతా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్న స్నేహితుల్లా, ఒక కుటుంబంలా వ్యవహరించాలి. ⇒ చిన్నచిన్న విషయాలకు హైరానా పడవద్దు. రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదు. ⇒ పార్లమెంటులో చేసే ప్రసంగంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. అది క్లుప్తంగా ఉండేలా చూసుకోండి. వివిధ అంశాలపై లోతైన పరిజ్ఞానం పెంచుకోండి. ⇒ ఆరునెలల్లో నియోజకవర్గ అభివృద్ధిపై నివేదికను సిద్ధం చేయండి. ⇒ పార్లమెంటు రూల్‌బుక్‌ను భగవద్గీతలా భావించండి. దాన్ని అతిక్రమించకండి. ⇒ సభాధ్యక్షుడిని గౌరవించాలి. వారి అనుమతి లేకుండా చట్ట సభలో ఏమీ చేయకూడదు. ప్రభుత్వ నిర్ణయాలకు ఎంపీలు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారే పనులు చేసి విపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వొద్దు. ⇒ కుటుంబపాలన, అవినీతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోరపరాజయం ఎదురైంది. అలాంటి మచ్చ తెచ్చుకోకుండా వాటికి దూరంగా ఉండాలి. ⇒ దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలేవీ తీరలేదన్న విషయాన్ని వీలైన ప్రతీచోటా ప్రముఖంగా ప్రస్తావించండి. పార్టీ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోండి. శిక్షణతో నాణ్యత..రాజ్‌నాథ్ కార్యక్రమంలో అధ్యక్షోపన్యాసం చేసిన రాజ్‌నాథ్ సింగ్.. ఇలాంటి శిక్షణల ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను అత్యంత నాణ్యమైన ప్రజాస్వామ్యంగా రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని, ప్రజల ఆకాంక్షల భారాన్ని అర్థం చేసుకోవాలని ఎంపీలకు సూచించారు. కార్పొరేట్ సంస్థల వలలో చిక్కుకుపోవద్దని, కార్యదర్శుల నియామకంలో జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కొత్త ఎంపీలను హెచ్చరించారు. కొన్నేళ్ల క్రితం ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకుని సస్పెండ్ అయిన ఎంపీల ఉదంతాన్ని ఆమె గుర్తుచేశారు. శిక్షణ శిబిరానికి 170 మంది లోక్‌సభ, 25 మంది రాజ్యసభ సభ్యులకు ఆహ్వానాలు వెళ్లగా నలుగురైదుగురు మినహా అంతా హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. కాగా, బీజేపీ శిక్షణ కార్యక్రమంపై కాంగ్రెస్ వ్యంగ్యోక్తులు విసిరింది. ‘మొదటిసారి ఎంపీగా ఎన్నికైన నరేంద్ర మోడీ.. పార్లమెంటరీ వ్యవస్థ లోతుపాతుల గురించి 195 మంది కొత్త ఎంపీలకు పాఠాలు చెబుతున్నారు. ఇది వింతగా లేదూ?’ అంటూ ట్విట్టర్లో పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆదివారం ట్వీట్ చేశారు. -
కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి.. సైకిలెక్కేశారు
విలువలకు పాతర...పదవులకు పాకులాట బుద్ధప్రసాద్‌కు అవనిగడ్డ ? పిన్నమనేనికి ఏదో ఒకటి! సాక్షి ప్రతినిధి,విజయవాడ : విలువలు.. విశ్వసనీయతకు చెల్లుచీటీ రాసేసి పదవే పరమావధిగా జిల్లాలో కీలక నేతలు ఇద్దరూ కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి సైకిలెక్కేశారు. అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌ను నమ్ముకుంటే పదవులు దక్కవనే ఆలోచనతో వాళ్లు పార్టీ ఫిరాయించడంపై ఆయా నియోజకవర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. వారి తండ్రుల కాలం నుంచి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా తెచ్చుకున్న మంచి పేరు కాస్తా పార్టీ ఫిరాయింపుతో పోగొట్టుకున్నారన్న విమర్శలు రేగుతున్నాయి. గాంధేయవాది కృష్ణారావు... మండలి బుద్ధప్రసాద్ తండ్రి మండలి వెంకట కృష్ణారావు గాంధేయవాదిగా గుర్తింపు పొందడంతో పాటు ఎంత కష్టమొచ్చినా కాంగ్రెస్‌ను వీడలేదు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1957లో కృష్ణారావు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం 1962లో కూడా లోక్‌సభకు ఇక్కడి నుంచే పోటీచేసి ఓటమి చవిచూశారు. 1972లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఆయన అవనిగడ్డ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 1978, 1983 వరుస ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు. 1983లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచినప్పుడు కూడా ఆయన గెలుపొందడం విశేషం. ఎమ్మెల్యేగా అవనిగడ్డ నుంచి హ్యాట్రిక్ సాధించిన మండలి వెంకట కృష్ణారావు పలుమార్లు మంత్రి పదవులను నిర్వహించారు. జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో మండలి కృష్ణారావు మంత్రిగా పనిచేశారు. జై ఆంధ్ర ఉద్యమంలోను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న ఆయన ఉద్యమకారుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా మండలి వెంకట కృష్ణారావు తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఉనికి కోసం పాట్లు... వెంకట కృష్ణారావు వంటి రాజకీయ నేతకు వారసుడిగా వచ్చిన మండలి బుద్ధప్రసాద్ పదవుల కోసం పార్టీ ఫిరాయించడం, ఉనికి కోసం కునికిపాట్లు పడటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1999, 2004 ఎన్నికల్లో రెండు పర్యాయాలు వరుస విజయాలు సాధించిన మండలి బుద్ధప్రసాద్ 2009 ఎన్నికల్లో అంబటి బ్రాహ్మణయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారం చేపట్టడంతో.. ఓడిపోయినప్పటికీ బుద్ధప్రసాద్‌కు తగిన గుర్తింపు లభించింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కలిగిన అధికార భాషా సంఘం చైర్మన్ పదవిని ఇచ్చింది. కాంగ్రెస్‌లో పదవులను ఎంజాయ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనని గుర్తించారు. అంతే గత కొద్ది రోజులుగా పావులు కదిపిన ఆయనకు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పార్టీ ఫిరాయించారు. గతనెల 27న విజయవాడలో చంద్రబాబు నిర్వహించిన మహిళా గర్జనలో బుద్ధప్రసాద్ చేరాల్సి ఉంది. అప్పుడు రాజ్యసభ సభ్యుడు గరికిపాటి రామ్మోహన్రావు ఫోన్ చేసి బ్రేక్ వేయడంతో ఆలస్యంగానైనా బుద్ధప్రసాద్ హైదరాబాద్ వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముత్తంశెట్టికి హ్యాండిస్తారా? టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్‌కు అవనిగడ్డ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు బాబు హామీ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే సీటు ఇస్తామంటూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఖర్చులు పెట్టించిన ముత్తంశెట్టి కృష్ణారావును నమ్మించి మోసగిస్తారా అనే అనుమానాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. నోవా విద్యా సంస్థల అధిపతిగా ఉన్న ముత్తంశెట్టి ఎమ్మెల్యే పదవిపై మోజుతో చంద్రబాబు ఆమోదంతో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌గా క్యాడర్‌ను చక్కబెట్టుకుంటున్నారు. మొదట్లో ముత్తంశెట్టిని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా స్థానిక సమరంలో అభ్యర్థుల ఖర్చు ఆయనే పెట్టుకుని క్యాడర్‌ను బుజ్జగించుకుంటున్న తరుణంలో తీరుబడిగా పార్టీలో చేరి ఎమ్మెల్యే టిక్కెట్ ఎగరేసుకుపోయేలా బుద్ధప్రసాద్ రావడం ముత్తంశెట్టి అనుచరులకు మింగుడు పడటంలేదు. శ్రీహరిప్రసాద్‌ను కాదని.. అవనిగడ్డలో అంబటి బ్రాహ్మణయ్యపై సానుభూతిని ఓట్లుగా మలుచుకునేందుకు ఆయన కుమారుడిని ఎన్నికల్లో దించి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న టీడీపీ అంబటి శ్రీహరిప్రసాద్‌ను కాదని ముత్తంశెట్టిని రంగంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ముత్తంశెట్టికి చెయ్యిచ్చి బుద్ధప్రసాద్‌కు పచ్చకండువా కప్పేసింది. అవనిగడ్డ కాకుంటే బందరు నుంచి బుద్ధప్రసాద్‌ను పోటీకి దించేలా మరో ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా బుద్ధప్రసాద్ కుటుంబానికి కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని పదవుల కోసం టీడీపీ పంచన చేరిపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. పిన్నమనేనికి ఏదో ఒకటి చేస్తారంట... టీడీపీలో చేరితే ఏదోక అవకాశం రాకపోదనుకున్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సైతం 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. మూడు పర్యాయాలు జెడ్పీ చైర్మన్ పదవిని చేపట్టిన పిన్నమనేని కోటేశ్వరరావు రెండు పర్యాయాలు ముదినేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కుమారుడిగా పిన్నమనేని వెంకటేశ్వరరావు 1989, 1999, 2004లో ముదినేపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు 2004లో వైఎస్ క్యాబినెట్లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కృష్ణా జిల్లా కేంద్ర సహకార (కేడీసీసీ) బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని ఆయన పదవుల కోసం టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతానికి ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ హామీ ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ కోసం పనిచేస్తే ఏదో ఒక పదవి ఇస్తారనే ధీమాతో పిన్నమనేని వెంకటేశ్వరరావు వ్యూహాత్మకంగా పార్టీ ఫిరాయించేయడం కొసమెరుపు. -
విలువలతోనే విద్యకు సాకారం
= పిల్లలపై ఒత్తిడి పెంచొద్దు =తల్లిదండ్రులకు ప్రముఖ సైకాలజిస్టు పట్టాభిరామ్ గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : విద్యార్థుల్లో సంస్కృతి, విలువలు, ఆత్మీయత, సంప్రదాయాలపై అవగాహన పెంచినప్పుడే వారి విద్యకు సాకారం లభిస్తుందని ప్రముఖ సైకాలజిస్టు బి.వి.పట్టాభిరామ్ అన్నారు. శనివారం రాత్రి విశ్వభారతి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరగడం, తల్లిదండ్రులపై గౌరవం, ఉపాధ్యాయులపై భయభక్తులు తగ్గడానికి కారణం కేవలం వారిపై తల్లిదండ్రులు తెస్తున్న ఒత్తిడేనని చెప్పారు. కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మానసిక వైద్యుల అవసరం సమాజానికి ఉండేది కాదన్నారు. తాత నిష్ణాతుడైన సైకాలజిస్టుగా ఆ కుటుంబంలో ఉండటం వల్ల వారిలో సంప్రదాయాలు, విలువలు ఉండేవని చెప్పారు. తల్లిదండ్రులు అత్సుత్యాహంతో తమ కుమారుడు ఏ ర్యాంకులో ఉన్నాడనే దానిపై శ్రద్ధ చూపుతున్నారే తప్ప దాని దుష్పరిణామం ఎలా ఉంటుందో గమనించలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. దాని ఫలితాలే వృద్ధాశ్రమాలు, తల్లిదండ్రుల సామూహిక ఆత్మహత్యలు, కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం వంటి వికృత పోకడలు అని వివరించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి, వ్యక్తి మనుగడకు వినియోగించాల్సింది పోయి ఫేస్‌బుక్‌లు, ఇతర చాటింగ్‌లు అంటూ యువత పెడదోవ పడుతున్నారన్నారు. ఇవి సమాజపు కళ్లు మూస్తాయని, నోరు నొక్కేస్తాయని తెలిపారు. యువత ఒక స్థితికి చేరాల్సిన సమయంలో సమయం వృథా చేయడం వల్ల అతని స్థితిగతులనే మార్చేస్తున్నాయని చెప్పారు. పిల్లలకు కొంత సమయం వెచ్చించాలి... పిల్లలకు విలువలు నేర్పేందుకు తల్లిదండ్రుల వారితో విధిగా కొంత సమయం గడపాలని పట్టాభిరామ్ సూచించారు. ప్రధానంగా విద్యలో ఏబీసీడీలతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో మరో కొత్త కోణంలో ఏబీసీడీలు నేర్పించాలని సమాజానికి తాను సూచిస్తున్నానని వివరించారు. అవి ఎ ఫర్ ఆటిట్యూడ్, బి ఫర్ బిహేవియర్, సి ఫర్ క్రియేటివిటీ, డి ఫర్ డిసిప్లిన్ అండ్ ఫైనాన్షియల్ ఎగ్జిస్టెన్స్ అంటూ వీటి అర్థాలు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పినప్పుడే వారి భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. విశ్వభారతి విద్యాసంస్థ ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థుల్లో విలువలు పెంచడానికి కృషిచేస్తోందన్నారు. విశ్వభారతి చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు తేవాలని టీచర్లపై ఒత్తిడి తేవడం కంటే వారిలో విలువలు తేవాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. స్కూల్ సీఈఓ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.