కాలమేం మారలేదు, అప్పటికీ... ఇప్పటికీ... | Education - Values | Sakshi
Sakshi News home page

కాలమేం మారలేదు, అప్పటికీ... ఇప్పటికీ...

Published Sat, Apr 9 2016 10:30 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

కాలమేం మారలేదు,   అప్పటికీ... ఇప్పటికీ... - Sakshi

కాలమేం మారలేదు, అప్పటికీ... ఇప్పటికీ...

విద్య - విలువలు

 

పొరబాటు ప్రతివాడి జీవితంలో జరుగుతుంది. ఇన్ని మంచి మాటలు చెప్పే నా జీవితంలో కూడా ఏవో పొరబాట్లు జరుగుతుంటాయి. ఎవడైనా తప్పు చేస్తాడు. ఏదో చిన్న చెడు లేకుండా ఎవడూ ఉండడు. తన తప్పు దిద్దుకుని తన జీవితాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి అన్ని అవకాశాలు వచ్చినా సైంధవుడు వాటిని ఉపయోగించుకోలేకపోయాడు.

 

లోకంలో ‘కాలం మారుతోంది’ అనే తప్పుమాట ఒకటి ప్రచారంలో ఉంది. కాలం మారదు. త్రేతాయుగంలో సూర్యుడు దక్షిణ దిక్కున ఉదయించలేదు, ఇప్పటిలాగే అప్పుడూ ఉదయించాడు, అలాగే అస్తమించాడు. భూమి తిరగడంలో తేడా వచ్చిందా? ఋతువులు మారడంలో తేడా వచ్చిందా? లేదు... కాలంలో ఏ మార్పూ రాలేదు. ఏదయినా మార్పు వచ్చిందంటే మనలో వచ్చింది. రాముడు తెల్లవారుఝామునే లేచేవాడు. మానేసింది మనం. వాళ్లలా బతకడం మానేసి నెపం కాలంమీద నెడుతున్నాం. దుర్మార్గపు బుద్ధుల్లో కూడా మహాభారతకాలానికీ ఇప్పటికీ తేడా ఏమీ లేదు.

 
కోటికాస్యుడు అనే స్నేహితుడితో కలిసి సైంధవుడు అరణ్యం గుండా వెడుతున్నాడు. ద్రౌపదీ దేవి ఆశ్రమంలో పూలు కోసుకుంటున్నది. ఆమె మహా సౌందర్యవతి. వరసకు ఆమె చెల్లెలవుతుంది (సైంధవుడు- కురుపాండవుల చెల్లెలు దుస్సల భర్త). ఆ సమయంలో పాండవులు ఆశ్రమంలో లేరు. వేటకు వెళ్లారు. పాండవులు లేరు కనుక, ఒక్కతే ఉంది కనుక కబురు చేసాడు. అన్నగారే కనుక రమ్మనమంది. ఆ మర్యాదతోనే ఆయనకు మంచినీళ్లు ఇచ్చి పళ్లు తెచ్చిపెట్టింది. దుర్మార్గపు బుద్ధితో వచ్చిన సైంధవుడు ‘‘నేను నిన్ను నా భార్యను చేసుకుందామనుకుంటున్నాను’’ అన్నాడు. ఆవిడ హతాశురాలై ‘‘అన్నా ! నీ నోటివెంట ఈ మాట రావచ్చా ! అన్న చెల్లెలితో ఇలా మాట్లాడవచ్చా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అన్నా’’ అంది. అంతే! ఆమెను అపహరించి రథంలో చాలా వేగంగా తీసుకుపోయాడు.

 
బుద్ధియందు రుగ్మత ఒక నాటిది కాదు. మనుషుల మనసులకు సంబంధించినది. ఒక కాలంలో మంచివాళ్లున్నారు, మరో కాలంలో చెడ్డవాళ్లున్నారన్న సిద్ధాంతం ఎప్పుడూ ఉండదు. చెడు బుద్ధి ఉన్నవాడు ఏ కాలంలో ఉన్నా పాడైపోతాడు. కొద్దిసేపటి తర్వాత పాండవులు వచ్చి విషయం తెలుసుకున్నారు. వెంటనే పరమ వేగంతో వెళ్లి సైంధవుణ్ణి బంధించి పట్టుకొచ్చారు. పాండవుల శక్తి అటువంటిది. ఇక్కడ మీరొక విషయాన్ని గమనించాలి.

 
వ్యక్తిలో దోషం ఉంటే దాన్ని వ్యవస్థకు ఆరోపించి మాట్లాడకూడదు. అలాగే వ్యవస్థలో దోషం ఉంటే దాన్ని అలాగే చూడాలి, వ్యక్తులకు ఆపాదించకూడదు. ఒక డాక్టర్ తప్పుగా ఆపరేషన్ చేస్తే డాక్టర్లందరూ అలా చేస్తారని కాదు కదా, ఒక ఆఫీస్‌లో ఒకడు లంచం పుచ్చుకుంటే అన్ని ఆఫీసుల్లో అందరూ లంచాలు పుచ్చుకుంటారని కాదు కదా! నేనీమాట ఎందుకు చెప్తున్నానంటే... మీలో కొంతమంది రేపు పాత్రికేయులు కావచ్చు, టెలివిజన్ తదితర ప్రచార సాధనాల్లోకి వెళ్లవచ్చు. ఏ పని చేస్తున్నా వ్యక్తి దోషాన్ని వ్యవస్థ మీద రుద్దకండి.అలాగే వ్యవస్థ దోషాన్ని వ్యక్తులకు ఆపాదించకండి. సైంధవుడు తప్పు చేశాడు. ధర్మరాజు ధర్మాత్ముడు. ఆయనకు కూడా కోపం వచ్చింది. భార్యను ఎత్తుకుపోతే కోపం ఎవరికి రాదు కనుక! కానీ భీముడు కోపంతో సైంధవుణ్ణి చంపేస్తాడేమోనని... ‘‘కోపంతో చంపేస్తావేమో! ఒక్కటి గుర్తుపెట్టుకో. మన చెల్లెలు పసుపు కుంకుమలు పోతాయి. చెల్లెలు ఇంటికొచ్చి- అన్నయ్యా, నా పసుపు కుంకుమలు తుడిచేశావా? అంటే ఏం చెప్తాం. కోపాన్ని నిగ్రహించుకో’’ అన్నాడు. అయినా భీముడి కోపం చల్లారలేదు. అందుకే అర్జునుడిని తోడిచ్చి పంపాడు. వాళ్లు వెళ్లి సైంధవుణ్ణి బంధించి తీసుకొచ్చి ధర్మరాజు కాళ్లముందు పడేశారు. ‘‘నీచమైన గుణానికి లోనయ్యావు. బావవి కనుక చెల్లెలి ముఖం చూసి వదిలేస్తున్నా. లేకపోతే చంపేసుండేవాళ్లు నా తమ్ముళ్లు. బుద్ధి మార్చుకుని బతుకుపో’’ అన్నాడు.

 
ఇది ఒక సంఘటనే కావచ్చు. అందరి జీవితాల్లో అన్ని వేళల్లో మంచి సంఘటనలే జరగవు. ఒక్కొక్కసారి పొరబాట్లు జరుగుతాయి. సైంధవుడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు ఈ క్షమాభిక్ష అవకాశంగా తీసుకుని తన తప్పు దిద్దుకుని మంచివాడుగా మారిపోవచ్చు. కానీ ఆయన వెళ్లి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. సైంధవుడు మోక్షం అడిగి ఉండవచ్చు, నాలో ఇక చెడు భావనలు రాకుండా ఈ కాలం ఉన్నంతవరకు మహాత్ముడిగా నా కీర్తి ప్రచోదనం చెయ్యమని అడగవచ్చు. కానీ అలా అడగలేదు. ప్రాణభిక్ష పెట్టిన పాండవుల మీద కక్షపెట్టుకుని వారిని చంపగల శక్తి ఇవ్వమని అడిగాడు. ‘‘వారు ధర్మ రక్షకులు. అలా కుదరదు. అయితే ఒక వరం ఇస్తాను. నా పాశుపతాస్త్రం ఉంది కనుక అర్జునుణ్ణి నీవెలాగూ ఓడించలేవు. అర్జునుడు లేని సమయంలో మిగిలిన నలుగురినీ ఒక్కరోజు మాత్రం వారెంత బలగంతో వచ్చినా నీవు ఓడించగలవు’’ అన్నాడు. దానిని అవకాశంగా తీసుకున్న సైంధవుడు అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లగానే  ధర్మరాజు, భీముడు, నకుడు, సహదేవులను లోనికి వెళ్లకుండా అడ్డుకుని పాండవుల మీది పగతో చంపేశాడు. ఏమయింది సైంధవుడి జీవితం? - అంత తపస్సు ప్రాణభిక్ష పెట్టిన పాండవుల కొడుకును చంపడానికి మాత్రమే పనికొచ్చింది. తర్వాత చాలా కథ నడిచింది. అర్జునుడు ఊరుకుంటాడా, ఆ మర్నాడు సాయంత్రానికల్లా సైంధవుడి తల నరికేశాడు.

 
ఇది ఎప్పటి మాట. ద్వాపరయుగం నాటిది. ఒక్కరోజు అడ్డుకున్నందుకు, అదీ ఎవరిని.. ఓ నలుగురిని. కానీ ఇప్పటికీ ఒక మంచి పనికి ఎవరడ్డువచ్చినా ‘సైంధవుడిలా అడ్డుపడ్డాడు’ అని అంటూంటాం. అటువంటి అపకీర్తిని శాశ్వతంగా మూటగట్టుకున్నాడు. సైంధవుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది. పొరబాటు ప్రతివాడి జీవితంలో జరుగుతుంది. ఇన్ని మంచి మాట చెప్పే నా జీవితంలో కూడా ఏవో పొరబాట్లు జరుగుతుంటాయి. ఎవడైనా తప్పు చేస్తాడు. ఏదో చిన్న చెడు లేకుండా ఎవడూ ఉండడు. తన తప్పు దిద్దుకుని తన జీవితాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి అన్ని అవకాశాలు వచ్చినా సైంధవుడు వాటిని ఉపయోగించుకోలేకపోయాడు. ప్రతి వ్యక్తీ మంచీ చెడుల సమాహార స్వరూపం. తన తప్పొప్పులను తాను గుర్తించగలగాలి. పొరబాటు జరిగిందని మృత్పిండంలా నేలమీద పడిపోకూడదు. పైకి లేవాలి. ధైర్యంగా సందర్భాన్ని ఎదుర్కోవాలి. ఎదురైన అవకాశాల్ని తప్పుల్ని దిద్దుకోవడానికి, అభివృద్ధి కొరకు ఉపయోగించుకోగలగాలి.   బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement