పాలలా పొంగండి.. కానీ ఒలకకండి!
విద్య - విలువలు
వ్యక్తిత్త్వ వికసనముకు సంబంధించి ఇప్పటివరకు రెండు విషయాలు ప్రస్తావించుకున్నాం. మొదటిది - Physically Fit (ఆరోగ్యంతో ఉండాలి), రెండవది - క్ఛ్ట్చడ అ్ఛట్ట (అధ్యవసాయంతో ఉండాలి) అంటే జీవితంలో ప్రతి విషయంలో స్పష్టతతో ఉండాలి. ఇక ఇప్పుడు- విషయాన్ని ధారణ చేసి, నిర్ణయం చేసేటప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకుని దాని ప్రకారం చేసే ప్రజ్ఞతో ఉండాలి. ఈ లక్షణం ఉన్నవారు దేశ సౌభాగ్యానికి కారణమవుతారు. అంటే మరింత సూటిగా మీకు అర్థం కావాలంటే ఇది ఎలా ఉండాలంటే - Intellectually sharp and emotionally well balanced too - అన్ని సందర్భాల్లో సునిశిత ప్రజ్ఞతోపాటూ, భావోద్రేకాల పరంగా సమతౌల్యతతో ఉండాలి.
పొంగనివి పాలు కావు. అతిగా పొంగినవి ఉపయోగపడేవి కావు. పొంగనివాటిని పాలు అనరు, నీళ్ళు అంటారు. పొంగే లక్షణం పాలకుంటుంది. అగ్నిహోత్రం మీద పెట్టినప్పుడు పాలు పొంగాలి. కానీ అవి పొంగి నిప్పులో పడిపోయాయనుకోండి... అవి పనికి రావు. ముందు నిలబడి అవి పొంగినప్పుడు వాటిమీద నీళ్ళు చల్లితేనే అవి పనికొస్తాయి. జీవితంలో కూడా ఈ పొంగు ఉండాలి. అది ఉన్నవాడు జీవితంలో ఏదైనా సాధించగలడు. మాట విన్నాడనుకోండి. ఒక పొంగు ఉండాలి. ఒక కుతూహలం ఉండాలి. ఒక ఉత్సాహం ఉండాలి. నేను దీన్ని పాటిస్తాను, నేను దీనిపట్ల ఉత్సాహంతో ప్రవర్తిస్తాను, నేను దీనిని ఎందుకు సాధించలేను? నేనెందుకు అధ్యయనం చేయలేను, ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనలేను... అన్న ఉత్సాహం ఉండాలి. అదే సమయంలో అత్యుత్సాహం పనికిరాదు. నేనొక్కడినే చేసేస్తాను. మీరెవ్వరొద్దు - అని అనకూడదు. ‘‘అయ్యా! ఈ పని చేయకండి’’ అని పెద్దలు అన్నప్పుడు, చేయకుండా ఆగిపోగలిగిన నియంత్రణ ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే... సమతౌల్యతతో ఉన్నాడని అంటారు.
అయినా జీవితంలో ఉద్రేకపడకుండా ఎవరుంటారు? కోపం లేకుండా ఎవరుంటారు? కానీ కోపం వచ్చిందనుకోండి. దానికి వశపడి పోకూడదు. కోపానికి వశపడిపోయారా, నోటివెంట రాకూడని మాటలు వచ్చేస్తాయి. ఎక్కడివరకు అవసరమో అక్కడివరకే కోపం. వ్యవస్థలో ఒక దోషం ఉండి దాన్ని చక్కదిద్దాలనుకున్నప్పుడు కోపం అక్కడివరకు ఉండాలి. చక్కదిద్దడమన్న ప్రయోజనం నెరవేరిన తరువాత కోపాన్ని విడిచిపెట్టాలి.
పాము శరీరంలో కుబుసం పుడుతుంది. కుబుసం దాని శరీరంలో అంతర్భాగం. కానీ ఆ కుబుసం ఉన్నప్పుడు దానికి కళ్ళు సరిగా కనబడవు. అందుకే పాము దాన్ని వదిలిపెట్టేస్తుంది తప్ప ఉంచుకోదు. కోపం రావడం తప్పుకాదు. ఒక్కొక్కసారి కోపాన్ని నటించడం అవసర మౌతుంది. నేను పూజ చేసుకుంటున్నాననుకోండి. పండగకని ఒక్కసారిగా బంధువులంతా వచ్చి పెద్దగా మాట్లాడుతూ హడావిడి చేస్తున్నారు. పూజ సాగడంలేదు. అందరినీ బ్రతిమలాడుతూ ఉంటే పూజలో ఏకాగ్రత కుదరదు. గట్టిగా కోప్పడితే చిన్నబుచ్చుకుంటారు. బయటికొచ్చి ఒక్కసారి గంభీరంగా చూడాలి. అంతే! అర్థం చేసుకుని అంతా ప్రశాంతంగా అయిపోతారు. పూజ పూర్తవగానే ’’రండ్రా అందరూ తీర్థ ప్రసాదాలు పుచ్చుకుందురుగాని’’ అని నవ్వుతూ పలకరించాననుకోండి. నేను నటించిన కోపం ప్రయోజనం నెరవేరడమేగాక, మళ్ళీ ఎవరూ నొచ్చుకోకుండా అంతా సుఖాంతమైపోతుంది. అలాకాక కోపానికి వశపడిపోయాననుకోండి. నేను ఊగిపోతాను. దానివల్ల ఉపయోగాలేవీ లేకపోగా, అనర్థాలే ఎక్కువ.
అందుకే ఎమోషన్ (భావోద్రేకం) ఎక్కడ అవసరమో అక్కడివరకే దాన్ని వాడాలి తప్ప కట్టుతప్పి ప్రవర్తించకూడదు. ఉత్సాహం మంచిదే. అత్యుత్సాహం ప్రమాదకరం. అందరూ శ్రమదానం చేద్దామని వచ్చారు. గురువుగారు కూడా వచ్చారు. ‘అయ్యో గురువుగారూ, మీరు చేయడమేమిటి, మీరు కూర్చోండి... ముందు మీరు కూర్చోండి’’ అని పదేపదే ఆయన్ని కాలు కదపకుండా ఇబ్బందిపెట్టడమేమిటి? ఆయన అలా కూర్చుంటే గురువుగారెందుకవుతారు? పదిమందికి ఆయన ఎలా మార్గదర్శకుడయ్యాడు? పదిమంది శ్రమదానం చేస్తున్నప్పుడు ఆయనా చేద్దామని వచ్చాడు. ఆయన చేయదగినదేదో ఆయన చేస్తున్నాడు. ఆయన చేయకూడనిదేదో ఆయనకు తెలియదా? ఇదే అత్యుత్సాహం. పరిమితిని దాటిపోకూడదు.
‘మీరు నలుగురు కలిసి ఈ పని చేయండి’ అన్నాననుకోండి. ఎందుకండీ, అదెంత పని నేనొక్కణ్ణే చేసేస్తా’ అనకూడదు. శ్రీరామాయణంలో ఇటువంటి వ్యక్తులు కొందరు కనబడతారు. అంగదుడు అటువంటి వ్యక్తే. హనుమ అంతటివాడికి నూరు యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ దర్శనం చేయడం ఎంత కష్టమయిందో తెలుసుకదా. లంకనుంచి వచ్చిన తరువాత సీతమ్మ దర్శనం అయిందని చెప్పడానికి హనుమ వచ్చినప్పుడు. అంగదుడన్నాడు కదా - ‘‘ఈపాటిదానికి ఇదంతా రాముడికి చెప్పడమెందుకు, లక్ష్మణుడికి చెప్పడమెందుకు, సుగ్రీవుడికి తెలపడమెందుకు? మనం నలుగురం వెళ్ళి రావణాసురుడిని చంపి సీతమ్మను తెచ్చి రాముడికి ఇచ్చేస్తేపోలా?’’ నిజంగా యుద్ధకాండ జరిగినప్పుడు రావణాసురుడిని గెలవడం రామలక్ష్మణులకు, కొన్ని కోట్ల వానరములకు అంత తేలిగ్గా ఏం జరగలేదు. అంత ఎమోషనల్‌గా మాట్లాడకూడదు.
పదిమంది చేయవలసిన పనిని పదిమందీ కలిసి చేయాలి. దేవుడి పల్లకీ పట్టుకోవాలి, పదిమంది కలిసి పట్టుకోవాలి. వందమంది ఉన్నారనుకోండి. మనకు బలమున్నా నేనొక్కడినే పట్టుకుంటానంటే ఎట్లా? అది అందరూ పట్టుకుని తరించే మార్గం. పది అడుగులు వేసి మరొకడికి ఇచ్చేయాలి. ఆకలేసింది. పదిమందీ తిన్న తరువాత తింటానంటే ఎలా? ఏది ఎప్పుడు చేయాలో ఏది పదిమందితో కలిసి పంచుకోవాలో ఆ ఎరుక, ఆ ప్రజ్ఞ ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఆవేశాన్ని అణచుకుని ఆచితూచి మాట్లాడాలి. మరీ అతిగా వెడితే అత్యంత ప్రమాదకరమవుతుంది.
అందుకే కోపంలో, ఉద్రేకంలో, ఆవేశంలో, భావ ప్రకటనలో సమతుల్యత ఉండాలి. సందర్భాన్ని బట్టి సమయోచితంగా వ్యవహరించడం తెలుసుకోవాలి. మీకున్న తెలివితేటలకు మీకున్న విద్యార్హతలకు, మీకు సమాజంలో రాబోయే హోదాకు... ఇటువంటి నైపుణ్యాలు తోడయితే మీ వ్యక్తిత్వం వికసించడమే కాదు, పరిమళిస్తుంది, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని పరిమళభరితం చేస్తుంది.
ఒకప్పుడు కిష్కింధకాండలో సీతమ్మ దర్శనానికి వెడితే సాయం సమయం అయిపోయి సుగ్రీవుడిచ్చిన కాలం దాటిపోయింది.ఒక బిలంలోకి వెళ్లారు. ‘‘వెనక్కివెడితే మా బాబాయిచంపేస్తాడు. అసలు మా బాబాయి నన్ను యువరాజును చేసిందేచంపెయ్యడానికి. నేనంటే ఆయనకు ఎప్పుడూ ఇష్టంలేదు. అందుకని ప్రాయోపవేశం చేసేద్దాం. ఇక్కడే చచ్చిపోదాం’’ అంటాడు. ఇటువంటి వ్యక్తులు ఇప్పటికీ సమాజంలో మనకు తారసపడుతుంటారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు