తగు సమయం.. తగిన పని...
విద్య - విలువలు
ఒక గోడకట్టాలనుకున్న వ్యక్తి నాదగ్గర ఇటుకలున్నాయికదా అనుకుంటే గోడ లేవదు. ఒక్క సిమెంట్ ఉందంటే గోడ సిద్ధం కాదు. ఇటుకలు ఉండాలి, సిమెంట్ ఉండాలి, ఇసుక ఉండాలి, నీళ్ళుండాలి, కట్టే తాపీ మేస్త్రీ ఉండాలి... ఇలా అన్నీ సమకూరితేనే గోడ కట్టగలడు. కేవలం బి.టెక్ అయినందువల్ల అతను ఇంజనీరని నేననుకోను. ఒక వ్యక్తి ఎం.బి.బి.ఎస్ అయితే అతను డాక్టరని నేననుకోను. ఎందుకంటే ఒక డాక్టర్ డాక్టరనిపించుకోవడానికి ఒక ఆంతరంగిక వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఒక ఇంజనీరు ఇంజనీరనిపించుకోవడానికి కొన్ని వ్యక్తిగత లక్షణాలుండాలి. ఏ వృత్తివిద్య తీసుకున్నా, ఆ విద్య తాలూకు ప్రత్యేకించి ఉండాల్సిన కొన్ని లక్షణాలుంటాయి. అందుకే నేను గతంలో జడము అనే మాటను అంత వివరంగా ప్రస్తావించాను. తెలియకపోవడం తప్పుకాదు, విషయం తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందించి ఆచరించడానికి సిద్ధం కాకపోవడం మాత్రం నేరమే, కచ్చితంగా దోషమే.
హఠాత్తుగా రైల్లో ప్రయాణం చేయాల్సిన అవసరం పడింది. తత్కాల్! దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే... శీఘ్రదర్శనం! ఆశ్చర్యకరమైన విషయ మేమిటంటే- ఆస్పత్రికి వెడితే... నిర్మొహమాటంగా కొంతమంది డాక్టర్లు స్పీడ్ కన్సల్టేషన్! అని బోర్డు పెట్టేస్తున్నారు. గోరుచుట్టున్నవాడయినా, కాళ్లూ చేతులు విరిగి వచ్చినవాడయినా వరస క్రమంలో వెళ్ళాలి. అయితే ఎవరిని ముందు చూడాలి, ఎవరిని కాదనేది డాక్టర్ నిర్ణయించుకోవాలి తప్ప డబ్బున్న పేషంట్ నిర్ణయించుకుంటే ఎలా! ఆ డబ్బు తీసుకుని వాళ్ళని ముందుగా చూసి పంపే డాక్టర్ ఒక డాక్టరా!!! ఆంతరంగిక వ్యక్తిత్వం చచ్చిపోయి కీర్తిని డబ్బుకు అమ్ముకున్నవాడు డాక్టరా! ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకొచ్చారంటే.. అందరూ ఏదో ప్రమాదంలో కాళ్ళు విరిగిన వాళ్లే, చేతులు విరిగిన వాళ్ళే, ముందుగా నిర్ణయించిన సాధారణ చార్జీ చెల్లించుకోగలిగిన వాళ్ళు వారిలో 10 మంది ఉంటే, స్పీడ్ కన్సల్టేషన్ కింద ఎక్కువ మొత్తం చెల్లించుకోగలిగిన వాడు వేలిమీద గోరు మొలిచిందని వస్తే వాడిని ముందు చూసి, ఎముకలు విరిగి బాధతో మెలికలు తిరుగుతున్నవాడిని, నాలుగైదుచోట్ల ఎముకలు విరిగి రక్తమోడుతూ బయటపడి ఉన్నవాడిని గంట తరవాత చూస్తావా? స్పీడ్ కన్సల్టేషన్ ఫీజు చెల్లించినవారు మరో ఐదుగురున్నారు
తరవాత చూస్తానంటావా? కాల్చనా నీ చదువు! ఆ చదువు ఒక చదువా, ఆ డాక్టర్ ఒక డాక్టరా! డాక్టర్ హనుమను ఉపాసన చేసి నేర్చుకోవాలి..’’ఇది కాదు నా బతుకు, ఇలా కాదు, నే జీవించవలసింది’’ అని. ఆర్తితో గబగబా బయటకు వచ్చి బల్లమీద మెలికలు తిరుగుతున్న వాడిని ముందుగా చూచినవాడు డాక్టర్. ఒక డాక్టర్ కూడా శాశ్వతంగా ఉండడు. కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఎంత కీర్తిని వారు సంపాదించగలిగారు, ఎంత గౌరవంగా బతకగలిగారు, ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారన్నది వారికి పేరు తీసుకు వస్తుంది, కన్నవాళ్ళకు గౌరవాన్ని తీసుకొస్తుంది. సమాజమంతా ఎంతో సంతోషంగా వారిని ఆదరిస్తుంది.
ఒంట్లో ఓపిక ఉండగానే మనం ఏది చేస్తామో అదే మనకు తృప్తి. ఆ ఓపిక పోయిన తర్వాత ‘‘నేనది చేసుంటే బాగుండేది’’అని వగచి ప్రయోజనం లేదు. నేను ఏ స్వార్థంతోనో మీకీ బోధ చేయడం లేదు. నా ఆర్తిని గ్రహించండి. పనికిమాలిన విషయాల మీద దృష్టిపెట్టకండి. చాలామంది విద్యార్థులు పనికిమాలిన కార్యక్రమాలు చాలా చూస్తుంటారు. ఎవరో ఒకావిడ అవతలవాడెవడో తెలియదు, ఫోన్ మోగుతుంది మీ టీవీ వాయిస్ తగ్గించండంటుంది. మీరెవరు, ఏం చేస్తున్నారంటూ అరగంట గడుపుతుంది. తరవాత అడ్వర్టయిజ్ మెంట్లు-పళ్ళు ఏం పెట్టి తోముకోవాలో, ఏం పెట్టి రుద్దుకుంటే జుట్టు ఎంత పొడుగు సాగుతుందో ఎంతసేపు చూసినా పళ్ళు, జుట్టు... ఈ ప్రకటనలే... మీరు కోరుకున్నదో, మీరు కోరుకోనిదో ఓ 5 నిమిషాలు చూపడానికి ఇంత ముఖ్యమైన సమయం వృథా అయిపోతున్నది. అది ఒకసారి పోతే మీరు కావాలనుకున్నది మీరవడం ఎలా సంభవిస్తుంది? తర్వాత ఏడ్చి ప్రయోజనం ఉండదు.. ఎందుచేతంటే....
ఈవేళ మీకు తెలియదు, భవిష్యత్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో... మీరు పిల్లలు. ఉన్న సమయం దుర్వినియోగమయిపోతోంది.. ఇంటర్‌లో, ఎంసెట్‌లో ఎవడు కష్టపడి చదివాడో వాడిస్థితి వేరు. అంత గొప్పగా చదువుకున్నవాడు మంచి కాలేజీలకు లేదా కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో రివ్వున ఎగిరిపోతాడు. ఇంటర్లో రెండేళ్ళు బాగా చదువుకున్నందుకు వాడి భవిష్యత్తుకు భరోసా దొరికిపోయింది.
ఎంసెట్‌లో సరిగా రాయనందుకు ఏదో ప్రఖ్యాతిలేని ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుకుని బయటకు వచ్చిన వాడి తల్లిదండ్రులు పడుతున్న ఆర్తి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎంతోమంది తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చి ఏడుస్తూ వాళ్ళ బాధ వెళ్ళగక్కుకుంటుంటారు.
365 రోజులూ క్రికెట్ ఆడుతూనే ఉంటారు. వాళ్ళకది అలవాటు. దానివల్ల వాళ్ళకు కోట్లు వస్తాయి. వాళ్ళు ఆడతారు. నీవు అదేపనిగా చూస్తూ కూర్చుంటే రేప్పొద్దున ఆరేళ్ళు తిరిగేసరికి ఇంజనీరింగ్ అయిపోయినా ఇంకా నీ జీవితంలో సెటిలవక ’’అమెరికా వెళ్ళి ఎంఎస్ చదువుతాను నాన్నగారూ, మీకున్నదంతా అమ్మి ఇస్తారా’’ అంటే తండ్రి ఇంట్లో ఏడుస్తూ కూర్చొని ఉండగా నీవు సైకిల్ మీద బయటికొచ్చి సిగ్నల్ లైట్ దగ్గర ఆగినప్పుడు- నీతోపాటు చదువుకున్న విద్యార్థి 70 లక్షల రూపాయల కారులో ఒక ఐశ్వర్యవంతుడి కుమార్తెను భార్యగా స్వీకరించి గొప్ప అధికారి హోదాలో ముందు డ్రైవర్ కారు నడుపుతుంటే- అదే సిగ్నల్ లైట్ దగ్గర ఆగినప్పుడు- అక్కడే ఆగి ఉన్న నిన్ను చూసి ‘‘ఏరా బాగున్నావా?’’ అని అడిగిన క్షణాన నీవు పోగొట్టుకున్నదేదో నీకు తెలిసివస్తుంది.
కాలం ఇక వెనక్కి రాదు. మీరు దానిని సక్రమంగా ఉపయోగించుకోవలసిన సమయంలో సక్రమంగా ఉపయోగించుకున్నారా జీవితం సార్థకమవుతుంది. అందుకే మహాత్ములయిన వారికి క్రోధం ఒక్క కారణం చేత మాత్రమే వస్తుందంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అదెప్పుడంటే....చెయ్యవలసిన పని, చెయ్యవలసిన సమయంలో చెయ్యనివాడిని చూస్తే వస్తుందంటారు.
ఈ కాలమంతా మీరు బాగా చదువుకోవలసిన కాలం. ఈవేళ దారుణాతి దారుణమైన స్థితి ఎక్కడుందీ అంటే... అసలు ఏ పిల్లల జీవితాలు తల్లిదండ్రుల మనశ్శాంతికి కారకాలో అది లోపించిన నాడు... ఇంజినీరింగ్‌లో సరిగా చదవక, మంచి ఉద్యోగంలో సెటిలవకపోతే నేను, నాభార్య లక్షల రూపాయలు సంపాదించినా ‘అయ్యయ్యో, చదువుకోవలసిన సమయంలో మా వాడు సరిగా చదువుకోలేదు. ఎక్కడా ఉద్యోగం లేదు’ అంటుంటే లోపల మనసు కుతకుత ఉడికిపోతుంటుంది.
బీటెక్ అయిన తర్వాత జెరాక్స్ సెంటర్లలో పనిచేస్తున్న పిల్లలను చూస్తున్నాం. హైదరాబాద్ వెళ్ళి ఏదో కంప్యూటర్ కోర్స్‌లో చేరి నేర్చుకుంటానంటే....’’మీ అబ్బాయికింకా ఎక్కడా ఏమీ రాలేదా?’’ అని కనిపించిన వాడల్లా అడుగుతుంటే సిగ్గుతో తలవంచుకుని ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకుని కొడుకును వెంటబెట్టుకుని హైదరాబాద్‌కు వెళ్ళి చేర్పించి వస్తే.... వాడెందులోనూ సెటిలవక ఇంటికి తిరిగొచ్చేస్తే... తర్వాత సంవత్సరం చదువుకున్న వాళ్ళు కూడా కాలేజ్ ప్లేస్ మెంట్‌లలో కార్పొరేట్లలో, మల్టీనేషనల్ కంపెనీల్లో జాయిన్ అయిపోతుంటే...ఒకే ఒక్క దోషానికి ఒక ఏడాది సరిగా చదవని దోషానికి వాడు ఏడుస్తూ, వాడి తల్లిదండ్రులు ఏడుస్తూ పదిమందిలో వచ్చి నిలబడలేక ....ఇదంతా... ఏం ఖర్మ... మిమ్మల్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులకు. సమయాన్ని వాడుకోవలసిన సమయంలో వాడుకోనివాడు ఎంతటి ప్రజ్ఞావంతుడయినా దానివల్ల ఉపయోగం ఉండదు. సమయాన్ని సక్రమంగా వాడుకోవడమన్నది ఎంతో ప్రధానమైన విషయం.
దీనితోపాటుగా జీవితంలో ఒక విషయాన్ని బాగా నేర్చుకోండి. ఈ వేళ మిమ్మల్ని పాడుచేసే వాటిని ఆపగలిగిన శక్తి కలిగిన వ్యవస్థ నాకు ఎక్కడా కనబడడంలేదు. ఇలా పిల్లల్ని పాడుచేయవద్దు. ఆని శాసించగల యంత్రాంగం నాకు కనబడడంలేదు. ఇలా సినిమా తీయవద్దని చెప్పగలిగిన వాడు లేడు. ఇటువంటి సీరియల్ ప్రసారం చేయవద్దని చెప్పేవాడు లేడు. ఇటువంటి వ్యాసం రాయవద్దని చెప్పేవాడు లేడు. ఇటువంటి పుస్తకం ముద్రించవద్దని చెప్పేవాడు లేడు. అందువల్ల మీకు మీరే జాగత్తపడాలి. అటువంటి అక్కరలేని విషయాల జోలికి పోకుండా మీకు మీరే నియంత్రించుకోగలిగిన శక్తి పెంచుకోవాలి. అంటే ఇది ఎంత దారుణమైన విషయమంటే... నిజానికి తల్లిదండ్రులు ఉండి కూడా బిడ్డలను అనాథగా వదిలివేసిన స్థితి ఎటువంటిదో ఈవేళ చదువుకుంటున్న విద్యార్థులకు సమాజం చేస్తున్న ఉపకారం అటువంటిది.
కాలం ఇక వెనక్కి రాదు. మీరు దానిని సక్రమంగా ఉపయోగించుకోవలసిన సమయంలో సక్రమంగా ఉపయోగించుకున్నారా జీవితం సార్థకమవుతుంది. అందుకే మహాత్ములయిన వారికి క్రోధం ఒక్క కారణం చేత మాత్రమే వస్తుందంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అదెప్పుడంటే.. చెయ్యవలసిన పని, చెయ్యవలసిన సమయంలో చెయ్యనివాడిని చూస్తే వస్తుందంటారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు