శ్రద్ధగా వినడం.. ఆచితూచి మాట్లాడటం.. | Listening attentively to speak with caution | Sakshi
Sakshi News home page

శ్రద్ధగా వినడం.. ఆచితూచి మాట్లాడటం..

Published Sat, Dec 5 2015 12:14 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

శ్రద్ధగా వినడం.. ఆచితూచి మాట్లాడటం.. - Sakshi

శ్రద్ధగా వినడం.. ఆచితూచి మాట్లాడటం..

విద్య - విలువలు
 
మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సందర్భంలో సంభాషిస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నా... అవతలివాడు చెప్పేది శ్రద్ధగా వినాలి, వింటున్న విషయం మీద అత్యంత జాగరూకతతో ఆలోచన చేయాలి. అలాగే మనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక్కమాట పొల్లుపోకూడదు. కొన్ని ప్రమాదకరమైన ఊతపదాలు అపయత్నంగా దొర్లుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో వృద్ధిలోకి రావడానికి మొట్టమొదట అలవరచుకోవలసింది ఈ నైపుణ్యాలనే. ఒకవేళ అవి లేకపోతే భేషజాలకు పోకుండా నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి.

నేను గమనిస్తుంటాను... ఈ వేళ చాలామంది విద్యార్థులు ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు ఎందుకు జరిగి ఉండొచ్చన్న పోస్ట్‌మార్టమ్ మీద ఎక్కువ శ్రద్ధచూపుతుంటారు. ‘‘సరే! ఈ తప్పు జరిగింది, వెంటనే దీన్ని ఎలా సరిదిద్దవచ్చు, సాధ్యమైనంతగా దీన్ని మనం ఎలా సఫలీకృతం చేయవచ్చు’’ అన్నదాని మీద దృష్టి పెట్టండి. విమర్శించడానికి, రాళ్ళు వేయడానికి గుంపులో ఒకడిగా నిలబడడం గొప్పకాదు. ఒకరు చేసిన పొరబాటును వేరొకరు దిద్దడం అనేది విశాల హృదయానికి సంకేతం. ఎప్పుడు కూడా ఎక్కడ నిలబడినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ టెంపో పెంచుకోండి, ఆ తత్త్వాన్ని అలవరచుకోండి.

ఒకసారి మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో రైల్లో పోతున్నారు. ఆరోజుల్లో నల్లజాతీయులు నిలబడి వెళ్ళవలసిందే. తలుపుదగ్గర నిలబడి ఉండగా కుడికాలి చెప్పొకటి చటుక్కున జారి కిందపడి పోయింది. వెంటనే గాంధీగారు ఎడమకాలి చెప్పు తీసి బయటికి వదిలేశారు. పక్కన ఉన్నవాళ్ళు విస్తుపోయి అదేమిటని అడిగితే ‘‘కుడికాలి చెప్పుపడిపోయిన తరవాత ఎడమకాలి చెప్పు నేను ఉంచుకున్నా ఉపయోగంలేదు. ఒక్క చెప్పు దొరికినవాడికీ ఉపయోగం లేదు. ఆ చెప్పుకోసం రైలును ఆపలేం కాబట్టి రెండోచెప్పు వదిలేస్తే కనీసం అది దొరికిన వాడికన్నా ఉపయోగంగా ఉంటుందని అలా చేశా’’ అన్నారు. సమయస్ఫూర్తితో అంత త్వరగా అంత మంచి నిర్ణయం చేయగలిగిన సమర్థుడు కనుకనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అహింసా  సిద్ధాంతంతో ఎదుర్కొని ఈ దేశమాత దాస్యశృంఖలాలను తెంచ గలిగాడు.

ఏదైనా ఒక విషయంలో అవతలివాడు నోరు విప్పకముందే మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. అలా వచ్చేసిన తరవాత ఎదుటివాడు చెప్పేది వినడానికి మీ మనసు అంగీకరించదు, కాబట్టి మీరు వినరు. అది ప్రతిఘటనకు దారితీస్తుంది. వినే ఓపిక నశించిపోయి అవతలివాడిమీద కోప్పడడం, అతడు చిన్నబుచ్చుకోవడం... ఇది మీ ఆభిజాత్యమని మీరనుకుంటారు. అది ఒక మనిషికి ఉండవలసిన లక్షణం కాదు. అందుకే అవతలివారి మాట బాగా వినాలి. విన్న తరువాత బాగా ఆలోచించాలి. తరవాత తప్పుంటే దిద్దుబాటే చేయాలి. అంతే! అవతలివాడి తప్పు దిద్దడానికి మనం ఉన్నాం తప్ప వాడి తప్పు ఒప్పుకుని వాడిని రాపాడించడానికి కాదని మీరు గుర్తించాలి. అవతలి వ్యక్తిపట్ల ఉన్న ప్రేమను అలాగే ఉంచుకుని కేవలం తప్పు దిద్దే ప్రయత్నం చేస్తూ ఉండాలి, అదీ నిస్వార్థంగా. అంతే తప్ప కేవలం మీ మాట నెగ్గించుకోవడానికి మీరెప్పుడూ ఏ కార్యం చేయకూడదు. మీ మాట ఎప్పుడు నెగ్గించుకోవాలంటే దానివల్ల పదిమందికి ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే అలా చేయాలి. మరో విషయం. పని సానుకూలమైనప్పుడు ఇది నేను జోక్యం చేసుకోవడం’ వల్ల జరిగిందని పొంగిపోకూడదు. ఈశ్వరుడు నాచేత సమయాకూలంగా ఈ కార్యాన్ని చేయించాడని పొంగిపోవాలి. అటువంటి మానసిక స్థితిని మీరు పొందిననాడు మీరు ఎక్కడున్నా ఆ సమాజానికి ఆస్తి. మీరు ఎక్కడున్నా పదిమందిచేత ఆదరింపబడతారు. కొన్ని వందలమంది సంతోషానికి కారణమవుతారు. మీరు పరోక్షంలో కూడా ఆయన ఉండివుంటే’ అన్న ఆలోచన అక్కడివారికి కంది. ఓహో ఇలా కదా ప్రవర్తించాలి’ అని మిమ్మల్ని అనుసరించేవారు తయారవుతారు.

అసలు మీకు ఈ నైపుణ్యాలే లేవనుకోండి. మీరు చాలా ర్తత్వమున్న వ్యక్తి అనుకోండి. మీరు ఏ వృత్తిలోనైనా ఉండండి, మీరు నెగ్గుకువస్తారని నేననుకోలేదు. ఒక సబార్డినేట్‌గా పైఅధికారి కొత్తగా వచ్చి మిమ్మల్ని పక్కన కూర్చో బెట్టుకుని ఏవో కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మీరతను చెప్పే మాటవినలేదు. పైగా ‘‘అబ్బా సుత్తేశాడ్రా’’ అంటారు. ఏమిటి సుత్తేసేది, ఆయన అనుభవం ఏపాటిది ? ఆయన ఎన్ని క్లిష్టపరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని ఎంత అనుభవం మూటగట్టుకున్నాడు, అటువంటి అనుభవశాలి దగ్గర కూర్చొని వినడం నా భాగ్యవిశేషమని కూర్చోవాలి కదా! అలా చేయకపోతే ఎవరికి నష్టం ?

నేను చాలా మందిని చూస్తుంటాను....ఆఫీసుల్లోకానీ, విద్యాసంస్థల్లోకానీ, సమాజంలో కానీ...... అవతలి వాళ్ళ గురించి తగినంత కారణం లేకుండా, విమర్శించడానికి తగిన భూమిక లేకుండా మాట్లాడుతుంటారు...దీనినే లూజ్ టాక్ అంటారు. వాళ్ళేం తప్పుచేసిన వాళ్ళు కారు, వీళ్ళ డబ్బేమీ తీకెళ్ళినవాళ్ళూ కారు, వీళ్ళ వస్తువులనూ పట్టుకెళ్ళలేదు... మరెందుకలా మాట్లాడడం! మీరు అలానే మాట్లాడుతున్నారనుకోండి. మీతో ఉన్నవాళ్ళు వినివిని... ఈయన అందరి గురించి ఇలానే మాట్లాడుతుంటారు. రేపు నా గురించి కూడా ఇలానే మాట్లాడతారు’’ అనుకుంటారు కదా! మీరు ఇంకొకళ్ళమీద క్రిటికల్ అనాలసిస్ చేసేముందు ఈయన చెప్పింది నిజమే అయి ఉంటుంది’’ వంటి దృక్పథంలో మీ విశ్లేషణ ఉండాలి తప్పించి మీ వారి పరోక్షంలో లూజుగా మాట్లాడినందువల్ల మీకు ఒనగూరే ప్రయోజనం సంగతి అలా ఉంచండి. మీ వ్యాఖ్యలను మళ్ళీ వాళ్ళకు చేరవేసే వాంటారనే విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి.

చాలామంది ఉద్యోగులు తమ జీవితాల్లో మనశ్శాంతిని మొట్టమొదట్లో పోగొట్టుకోవడానికి ఇవే ప్రధాన కారణాలవుతుంటాయి. ‘‘సార్! వీడు నిన్నగాక మొన్న జాయినయ్యాడు. మీ గురించి ఏమన్నాడో తెలుసా .....’’ అలా మోసేస్తాడు. మీరెవరి గురించి వ్యాఖ్య చేసారో వారి పట్ల మీకు మనసులో పూజ్య భావన ఉండొచ్చు. కానీ ఆ ఒక్క వెలితి మాట అన్నందుకు జీవితా పాడవుతాయి. అందుకే నోటిమాటను చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి విడిచి పెట్టాలి. ‘ఇంత కోపాన్ని నటిస్తే తప్ప మనం పరిస్థితిని అధిగమించలేం’ అనుకున్నప్పుడు మాత్రమే కోపాన్ని అభినయించాలి తప్ప ఎప్పుడుపడితే అప్పుడు ఎటువంటి వారిమీదపడితే అటువంటివారిమీద మనం అలవాటు చేసుకున్న నిర్లక్ష్యపు ఊతపదాలు మాట్లాడకూడదు.

అందుకే మీ నోటివెంట వచ్చే మాటలను నియంత్రించుకుని మాట్లాడడం అలవాటు చేసుకోండి. పవిత్రమైన వాక్కు, మంగళకరమైన వాక్కు మాట్లాడడం, మీకు అంగీకారం కాని విషయాన్ని ఆవిష్కరించేటప్పుడు ఎంతో చక్కని మాటలతో చెప్పడాన్ని అలవాటు చేసుకోండి. అంతేకానీ చాలా చౌకబారు విషయాలను మాట్లాడకండి. భాష విషయంలో జాగ్రత్తగా ఉండండి. చక్కటి భాషకు చక్కటి తెలుగున్న పుస్తకాలు చదవండి. పోతన భాగవతం చదవండి. మీరు చిన్నతనం అనుకోకపోతే...మీరు చిన్నబుచ్చుకోరనుకుంటే ఒక ప్రశ్న అడుగుతాను... మీలో ఎంతమంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి’ చదివారో చెప్పండి. వాల్మీకి, వ్యాసుడువంటి వాళ్ళు పుట్టిన ఈ దేశంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఏైకక వ్యక్తి ఠాగూర్. అటువంటి వారి పుస్తకాలను కానీ, జనగణమన అధినాయక జయహే!’ అన్న పాటకు పూర్తి అర్థంకానీ, బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం’ గీతానికి పూర్తి అర్థంకానీ తాత్పర్యం కానీ ఎంతమంది చదువుకున్నారు!! గీతాంజలి పుస్తకం కొనివ్వమని మీ నాన్నగారిని అడిగితే, ఆయన ఆ మాత్రం కొనివ్వని వ్యక్తా!!!
 తేటతెలుగులో అర్థం చేసుకోగలిగిన పద్యాలు రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగా, ఎంకిపాటల నండూరి సుబ్బారావుగారు, వీరేశలింగం పంతులుగారు, చిన్నిచిన్నిమాటలతో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులుగారు రచించిన గణపతి’, చంద్రశేఖరపరమాచార్యవారి, భారతీతీర్థస్వామి వారి అనుగ్రహభాషణాలు....అసలటువంటి మహాత్ములు రాసిన పుస్తకాలను చదవండి. ఆ పుస్తకాలు మీమీద ఎటువంటి ప్రభావం చూపుతాయో  చూడండి. వారి అనుభవాలు, వారు ఈ దేశాన్ని రక్షించడానికి పొందిన పరివేదన తెలుసుకున్నవాడు ఉద్యోగంలోకి వెళ్లినతర్వాత బల్లకింద చెయ్యి పెట్టి లంచం పుచ్చుకోగలడా ?
 
అరవిందో దేశ స్వాతంత్య్రంకోసం పోరాడుతుంటే తీసుకెళ్ళి గోవా జైల్లో  కాలు పూర్తిగా చాపడానికికూడా వీలులేనంత ఇరుకు గదిలో ఉంచారు. మలమూత్రాలను అక్కడే విసర్జించాలి. ఒక్కసారి మాత్రమే వస్తాడు ఒక వ్యక్తి. ఆ గదిలోని మలాన్ని ఎత్తి బుట్టలో వేకుని వెళ్ళిపోతాడు. ఇనుప ఊచలమధ్యలోంచి మునివేళ్ళతో పట్టుకుని గ్లాసు బయటికి పెట్టి మంచినీళ్ళు తీసుకుని మళ్ళీ జాగత్తగా లోపలికి లాక్కుని తాగితేనే ఆ రోజుకు దాహం తీరేది. పొరబాటున గ్లాస్ కిందపడి నీళ్ళు ఒలికిపోయాయా...మళ్ళీ రేపు మలం ఎత్తేవాడొస్తేనే నీళ్ళు. అరచిగోలపెట్టినా ఏ వ్యక్తీ పలకడు. భారత మాతాకీ జై  అంటూ అలా నానా కష్టాలూ పడి జైళ్ళలో సంవత్సరాలపాటు మగ్గి ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు. అది మనం లంచాలు పుచ్చుకోవడానికీ, వ్యవస్థలను నాశనంచేయడానికీ తెచ్చింది కాదు. దేశ గౌరవాన్ని, దేశ ప్రతిష్ఠనూ మనం ఇమడింపచేయాలి.

దేశంనిండా మంచివాళ్ళు ఉన్నప్పుడు పరిపాలన దుర్మార్గంగా ఎందుకుండాలి ? ఈ లోటు ఏదయితే ఉందో దాన్ని భర్తీచేయాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే రేపటితరం మీది కనుక. మేధావులు, వేదాల్ని, ఉపనిషత్తుల్నీ వడగట్టిన వాళ్లున్న దేశంలో అటువంటి వాళ్ళు ఒక్కళ్లూ లేకుండా ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానాల పాలకమండళ్ళను ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఎక్కడుందీ దోషం? ఈ దోషాన్ని దిద్దడానికి రేపు కలం పుచ్చుకుని సంతకం చేయాల్సిన అధికారులు మీరు. గాంధీజీ కలలు కన్న దేశాన్ని తీసుకురావాలంటే వాళ్ళలా మీ ఆంతరంగిక వ్యక్తిత్వం తయారు కావాలి.
 
 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement