జిగురుకు భయపడితే పనసతొనలు ఎప్పటికీ తినలేరు | Education - Values | Sakshi
Sakshi News home page

జిగురుకు భయపడితే పనసతొనలు ఎప్పటికీ తినలేరు

Published Sat, Apr 16 2016 11:14 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

జిగురుకు భయపడితే   పనసతొనలు ఎప్పటికీ తినలేరు - Sakshi

జిగురుకు భయపడితే పనసతొనలు ఎప్పటికీ తినలేరు

విద్య - విలువలు

 

జీవితంలో పొరబాట్లు జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. అది జీవితాన్ని మార్చుకోవడానికి పనికి రావాలి. ఇకపై నేనెటువంటి పొరబాటు చేయకూడదని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనిషికి ఆర్ద్రత ఉండాలి, మనసులో తడి ఉండాలి. అది ఉంటే-ఎవరైనా ఏవైనా ఒక మంచి మాట చెప్తే దానిని మనసులో నాటుకునేటట్లుగా, గుర్తుపెట్టుకునేటట్లుగా వినే లక్షణాన్ని ఇస్తుంది. ఇదొక్కటి ఉంటే-మీకు జీవితంలో ఏది తెలియకపోయినా వృద్ధిలోకి వస్తారు. ఎవరు చెప్పినా అది మంచి మాటయితే వినగలగాలి.


శ్రీ రామాయణంలో ఎప్పుడైనా, ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు రామచంద్రమూర్తి అందర్నీ కూర్చోబెట్టుకుని పేరుపేరునా అడుగుతాడు. తప్పు చెప్పినా, ఒప్పు చెప్పినా వింటాడు. విమర్శ చేయడు. చివరన శాస్త్రంతో సమన్వయం చేసుకుని నిర్ణయం తీసుకుంటాడు. మనకు కూడా జీవితంలో ఇది అలవాటు కావాలి. రేపు పొద్దున మీరు అధికారులౌతారు. జీవితంలో సమున్నత స్థితికి వెడతారు. అందుకని చెపుతున్నా. ఎవరిలోనైనా మంచి చూడడాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోండి. దానివల్ల మీరు ప్రశాంతంగా ఉండడమే కాదు, మీ దగ్గరికి వచ్చిపోయే వాళ్లు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇంతకన్నా మనుష్య జన్మకు ప్రయోజనం లేదు. మీరు ఎంత పెద్ద స్థానంలో ఉండండి, మీరు అశాంతిగా ఉండి, మీ దగ్గరికి వచ్చినవాడు కూడా అశాంతిగా వెళ్లిపోతే, జీవితంలో అంతకన్నా నరకం మరొకటి ఉండదు.


నేను తెల్లవారుఝామున లేచాను. ఇంకా స్నానాదికాలు కాలేదు. గంట ఐదయింది. లేచి తలుపులు తీసుకుని బయటికి వచ్చాను. అప్పటికే విభూతి పెట్టుకుని వచ్చి ఒకాయన దభాల్న నా కాళ్లమీద పడ్డాడు. ‘‘ఏవయ్యా! ఎంకొచ్చావు?’’ అని అడిగితే, ‘‘... ఫలానా ఊరు నుంచి వచ్చానండీ. మా ఊరు ఉపన్యాసాలకు వస్తారా’’ అని అడిగాడు. ‘ఖాళీ దొరక్క చచ్చిపోతుంటే తెల్లవారకముందే వచ్చేసాడేందిలాగా...’ అని నేను అనుకోవచ్చు. కానీ - ఇంత పొద్దున్నే అయితే ఎవరూ ఉండరు, నేను ప్రశాంతంగా ఉంటాననుకొని నాతో మాట్లాడాలనుకుని వేకువఝామున మూడోగంటకే లేచి స్నానం, పూజ చేసుకుని నన్ను ఒప్పించడానికి ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నాడో, నన్ను చూడగానే మాట రాక దభాల్న నేలమీద సాష్టాంగపడ్డాడన్న భావన నాకు కలగాలి. అప్పుడు... కనీసంగా పలకరించినా వచ్చినవాడు సంతోషిస్తాడు. ‘నీవొచ్చిన పని మంచిదే నాయనా, కానీ నాకు చాలా ఒత్తిడిగా ఉంది. ఎక్కడా ఖాళీలేదు. ఏమనుకోకు. నే ను రాలేను’ అని మంచిమాటలు ప్రశాంతంగా చెప్పి పంపించాననుకోండి. వచ్చిన పని కాకపోయినా సంతోషంగా వెడతాడు. అబద్ధాలొద్దు. ఉన్న మాట ప్రసన్నతతో చెప్పు. కోపం వ్యవస్థను చక్కబరచడానికే తప్ప అన్యథా ప్రదర్శించకూడదు. అదే నేనతని మీద వేళగాని వేళ వచ్చి విసిగించాడని కోప్పడి ఉంటే... అతను ఆ బాధను జీవితాంతం మర్చిపోలేడు. పైగా మనల్ని గురించి కూడా ‘‘ఆయన పైకి అలా కన్పిస్తాడు కానీ ధూర్తతనంగా మాట్లాడతాడు. వెళ్ళలేం దగ్గరికి’’- అని నలుగురికీ చెపుతాడు.

 
అందుకే నీవేదైనా పని చేసేముందు అవతలివాళ్లలో ఉన్న మంచిని గుర్తించడం మొదలుపెట్టు. భార్యను ఎత్తుకెళ్లిన రావణాసురుడిలో కూడా రాముడు ఎంతో కొంత మంచి చూశాడు, విభీషణుడిలో, రాక్షస స్త్రీలలో, అనాగరికుడైన గుహుడిలో కూడా మంచితనం చూశాడు. వేషం చూసి మోసపోవద్దని ఇంగ్లీష్‌లో ఒక సామెత. మనిషి అందంగా కనిపించినంత మాత్రాన లోపల కూడా అంతే అందం ఉందని చెప్పలేం. పైకి అందంగా కనబడక పోయినా లోపలి సౌందర్యం లేదని చెప్పలేం. కంచి కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర మహాస్వామివారి ఫొటోఎక్కడైనా చూడండి. పొట్ట లోపలికి అంటుకుపోయి, ఉరఃపంజరం పైకి వచ్చి ఉంటుంది. విభూతి రేఖలు కూడా సరిగా ఉండవు. ఇంత లావుగా ఉంటాయి. కుంకుమ బొట్టు కూడా ఇంత పెద్దగా అద్దుకుని ఉంటారు. కాషాయ వస్త్రం తలమీద కప్పుకుని 90 సంవత్సరాల వయసులో రిక్షా ఆసరాగా పట్టుకుని అలా నడిచి వెడుతుంటే... బస్సుల్లో వెళ్లేవాళ్లు కూడా ఆపుకుని దిగి వచ్చి రోడ్డుకు రెండు వైపులా నేలమీద సాష్టాంగపడేవారు. వ్యక్తి గౌరవమనేది ఒక్క రూపంతో రాదు. అంతఃశీలం వల్ల, నడవడిక వల్ల వస్తుంది. ఎదుటివారిలో మంచి చూడడం మొదలుపెడితే, లోకం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. చెడుతనాన్ని పరిశీలించొద్దు... చూడొద్దు అని చెప్పడం కాదు నా ఉద్దేశం, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

 
పనస పండు తొనలు బాగుంటాయి. కానీ జిగురుకు భయపడి విసుక్కుంటుంటే మీరు వాటిని ఎప్పటికీ తినలేరు. మీ చేతులకు నూనె రాసుకోండి, జిగురు అంటకుండా పనస తొనలు ఒలుచుకుని తినొచ్చు. మంచితో చెడు కలిసి ఉంటుంది. చెడుతో కలవకుండా మంచి ఉండడం జీవితంలో సాధ్యం కాదు.

 
నా దగ్గరకు కొంతమంది వచ్చి, ‘‘భగవంతుడంటారు, ఈశ్వరుడంటారు, ఇలా రోడ్లమీద పడి కష్టపడి ఊళ్లు తిరిగి ఉపన్యాసాలు చెప్పి తలబద్దలు కొట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని... ఎందుకొచ్చిన వ్యాపకమండీ. మీరు కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగి. నెల తిరిగేటప్పటికి వేలకు వేల జీతం వస్తుంది. మీ భార్యగారు కూడా ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలు సెటిలయ్యారు. సునాయాసంగా ఇంట్లో కూర్చుంటే నెల తిరిగేసరికి లక్ష పైచిలుకే వస్తుంది. కూర్చుని హాయిగా టీవీ చూస్తూ సంతోషంగా గడపక మీకేం లోటా పాటా! శుభ్రంగా సూటూ బూటూ వేసుకోక, ఆ పంచేమిటి? ఆ లాల్చీ ఏమిటి? ఆ పిలకేమిటి? ఎందుకొచ్చిన కష్టం’’ అంటూంటారు. నేనంటాను... ‘‘అలా ఉండడంలో మీకు శాంతి, ఇలా ఉంటే నాకు శాంతి. ఎవరికి ఎలా శాంతిగా ఉంటే అలాగే ఉంటే సరిపోతుంది. మీ శాంతికోసం నన్ను మార్చకండి. మీకు నచ్చితే నేను చెప్పిన మార్గంలో వెళ్లండి. నచ్చలేదనుకోండి. అలాగే ఉండండి. నేనేమీ బలవంతంగా మీ చేత ప్యాంటూ, చొక్కా విప్పించి పంచె కట్టించడం లేదుగా’’ అంటాను.

 
కాబట్టి అవతలి వారిలో మంచిని చూడండి. కాలం మారలేదు. ఆ మార్పు మనలో వస్తున్నది. మంచి మాటలు వినడాన్ని, ఎదుటివారిలో మంచిని చూడడాన్ని అలవాటు చేసుకోవడం వల్ల, అమూల్యమైన మన వాఙ్మయాన్ని అనుసరిస్తున్నందు వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే... ఎప్పటికప్పుడు మన తప్పులను దిద్దుకుంటూ మనల్ని మనం సంస్కరించుకోవడానికి వీలవుతుంది, మన జీవితాలను ప్రశాంతంగా గడపడానికి ఉపయోగపడుతుంది.

 

 కంచి కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర మహాస్వామివారి ఫొటోఎక్కడైనా చూడండి. పొట్ట లోపలికి అంటుకుపోయి, ఉరఃపంజరం పైకి వచ్చి ఉంటుంది. విభూతి రేఖలు కూడా సరిగా ఉండవు. ఇంత లావుగా ఉంటాయి. కుంకుమ బొట్టు కూడా ఇంత పెద్దగా అద్దుకుని ఉంటారు. కాషాయ వస్త్రం తలమీద కప్పుకుని 90 సంవత్సరాల వయసులో రిక్షా ఆసరాగా పట్టుకుని అలా నడిచి వెడుతుంటే... బస్సుల్లో వెళ్లేవాళ్లు కూడా ఆపుకుని దిగి వచ్చి రోడ్డుకు రెండు వైపులా నేలమీద సాష్టాంగపడేవారు. వ్యక్తి గౌరవమనేది ఒక్క రూపంతో రాదు. అంతఃశీలం వల్ల, నడవడిక వల్ల వస్తుంది.

 

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement