హితవాక్యం... సమాజ హితం... | Community interest healthful words ... ... | Sakshi
Sakshi News home page

హితవాక్యం... సమాజ హితం...

Published Fri, Nov 13 2015 11:52 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

హితవాక్యం... సమాజ హితం... - Sakshi

హితవాక్యం... సమాజ హితం...

విద్య - విలువలు
 
ఈ ప్రపంచంలో ఎవడూ ఒప్పులకుప్ప కాదు. ఇన్ని చెబుతున్న నేను పూర్తి ఒప్పులకుప్పనేం కాదు. నాలో దోషం నేను తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి ‘‘... వద్దు, నీకేం లోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి. రాముడికి అపచారం చెయ్యకు...’’ అన్నాడు. అన్నీ విన్న రావణుడు ‘‘నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడి చేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో ఛస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’’ అన్నాడు. అంతే తప్ప నేను వింటానని అనలేదు.
 అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్నా, పదితలలున్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు? రాముడు చెప్పాడు, అంగదుడు, హనుమ, మహర్షులు చెప్పారు, కైకసి చెప్పింది.

తండ్రి, మేనమామలు చెప్పారు... ఆఖరున అన్నీ విరిగి యుద్ధభూమిలో నిలబడిపోతే రాముడు ‘ఇప్పటికైనా ఆలోచించు’ అన్నాడు. సీతమ్మ చెప్పింది, భార్య మండోదరి చెప్పింది. ఎవరు చెప్పినా వినలేదు. వినని తలలు తెగిపడిపోయాయి. సీతమ్మ ఎప్పుడో చెప్పింది... ‘నీకు తెలియదా, చెప్పేవాళ్ళులేరా.. చెబితే వినవా, ఎక్కడుంది నీ తప్పు, మాట్లాడకూడనిది మాట్లాడుతున్నావు రావణా, దీని పర్యవసానం ఏమిటో నీవు చచ్చాకే నీకు తెలుస్తుంది’’ చివరకు చచ్చిపడిపోయి ఉంటే మండోదరి వచ్చింది. భర్తను చంపినందుకు రాముడిని తిట్టడానికి వచ్చిందకున్నారంతా. వచ్చి రావణాసురుడి శవాన్ని చూసి ఓరి దుర్మార్గ్గుడా! నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనబడిందిరా! అన్యకాంతను తీసుకొచ్చావు. లోకాలన్నిటిని గెలవగలిగిన కొడుకుని కన్నాను. నీ కామానికి చంపేసావు, నేను చచ్చిపోతే కాల్చడానికి కొడుకును మిగల్చకుండా చచ్చిన ధూర్తుడా, నీ ఇంద్రియాలకి, నీ కామానికి చచ్చిపోయావురా’’ అంది. అంత వేదం చదువుకున్నాడు, కాంచనలంకాధిపత్యం వహించాడు. పుష్పకవిమానంలో తిరిగాడు... చివరకు ఏమయింది.. మంచి మాట వినలేదు, వెళ్ళిపోయాడు.
 మహాభారతం సమస్త సారాంశం కూడా ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటు చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు.

 జానామిధర్మం నచమే ప్రవృత్తి
 జానామ్యధర్మం నచమే నివృత్తి
 కేనాపిదేవేన హృదిస్థితేన
 యథాపవృతోస్మి తథాకరోమి

 అహంకారబలం అది - ‘‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యకుండా ఉండాలనిపించడం లేదు. అయినా నేను తప్పు చెయ్యడమేమిటి! లోపలున్న ఈశ్వరుడు చేయిస్తున్నాడు. నాకు చెబుతారెందుకు’’ అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడ విరిగి పడి పోయాడు.
 జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒక్కటే. మాటవినడమన్నది తెలుసుకోవాలి. నీకు తెలియదు, ఎప్పటికీ తప్పుకాదు. అది తప్పని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. శాస్త్రం కూడా ఎంత ఉదారంగా మాట్లాడిందో తెలుసా? తెలియక చేసిన తప్పు క్షమించమంది. తెలిసి చేసిన తప్పుకు క్షమార్పణ లేదు, పాయశ్చిత్తంలేదు. నీవు తెలుసుకునే ప్రయత్నం చేయి. ఎలా? ఆవుపాలధార నేలపాలు కాకుండా కుండలోకి ఎంత జాగత్తగా పిండుతావో పెద్దల మాటల వృథాకానీయకుండా అలా పట్టుకో. వేదం ఒక మాట చెప్పింది. భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవః’’ ‘చెవులు భద్రముగా ఉండుగాక, ఎప్పుడూ మేం మంచి మాటలనే వినెదముగాక’ అంటుంది. అలా వినడం చేతకాకపోతే జీవితం పాడయిపోతుంది.

 పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు. తల్లి, తండ్రి, గురువు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు కాఫీ తాగుతూ ఆయన చెప్పేది వింటుంటానా? అందుకే మహాత్ములు రాసిన పుస్తకాలు చదువుతుంటే అంత శ్రద్ధగా చదవాలి. పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థ స్వామివారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కు చదవండి. రామకృష్ణ పరమహంస వారి మాట చదవండి. ఎపిజె అబ్దుల్‌కలామ్‌గారి మాట చదవండి. ఒక్కమాట, అటువంటి మహితాత్ములు మాట్లాడితే ఎంత వృద్ధిలోకి వస్తారో తెలుసా?
 అబ్దుల్ కలామ్‌గారు చదువుకునే రోజుల్లో శివ సుబ్రమణ్యం అయ్యర్ అని ఒక మేష్టారుండేవారు. తెల్లవారుఝామున లేచి స్నానంచేసి వెళ్ళిన 10 మందికే లెక్కలు చెప్పేవారు. స్కూల్లో పాఠం చెప్పేవారు. ఒక రోజు పాఠం చెబుతూ... పక్షి ఎలా ఎగురుతుందో బ్లాక్ బోర్డు మీద బొమ్మలు వేసాడు. ఎలా కూర్చుంటుంది, ఎగిరేటప్పుడు రెక్కలు ఎలా విప్పుకుటుంది, శక్తినంతా కూడ దీసుకుని రెక్కలు అల్లారుస్తూ శరీరాన్ని పైకి ఎలా లేపుతుంది, తోకతో దిశను ఎలా మార్చుకుంటుందో చెప్పి మీకర్థమయిందా?’ అని అడిగారు.

కలాం గారు నిలబడి అయ్యా, మీరు చెప్పడంలో ఏమీ దోషంలేదు, కానీ మేమే అందుకోలేక పోయాం, అర్థం కాలేదు’ అన్నారు. ‘అయితే ఈ సాయంతం 5 గంటలకు సముద్రపు ఒడ్డుకు రండి (ఆ ఊరు సముద్రం పక్కనే ఉంది), నేనూ వస్తాను’’ అని అయ్యర్ చెప్పారు. ఆ సాయంత్రం పక్షులు బారులు బారులుగా వచ్చి వెడుతుంటే వాటి కదలికలను చూపుతూ వివరించి చెప్పారు. కలాం వాటిని చూస్తూ తాదాత్మ్యం చెందాడు. వేకువఝామునే వెళ్ళి గురువుగారిని కలిసి ‘‘నిన్న మీరు చెప్పిన పాఠం విన్నాను, పక్షులను చూచాను. విమానం గురించి విన్నాను. నాకు కూడా అలా గాలిలో ఎగిరేవి నిర్మించాలని ఉంది’’ అని చెప్పారు.

 అదెలా సాధ్యం?’ అని గురువుగారు అనలేదు. ‘‘నాన్నా, ఈ పరీక్షలు బాగా రాయి. మంచి మార్కులొస్తే చెన్నైలో ఒక కాలేజి ఉంది. అక్కడ సీటు వస్తుంది. అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని బ్రాంచ్ ఉంటుంది, దానిలో చేరితే నీవు కోరుకున్న వ్యక్తివి అవుతావు’’ అన్నారు. ఒక్కమాట... ఆ ఒక్కమాట ఆయన జ్ఞాపకం పెట్టుకుని చెల్లెలు అత్తగారు బంగారం ఇస్తే తాకట్టు పెట్టుకుని చదువుకున్నాడు. తాను కోరుకున్న వ్యక్తి అయ్యాడు. మనకు ప్రాతః స్మరణీయుడయ్యాడు. భారతదేశానికి ఉపగ్రహాలను నిర్మించడంలో సాటిలేనిమేటియై, ఏ మేష్టారు ఎంత ఓర్పుగా మాట్లాడితే ఈ అబ్దుల్ కలాం ఇంతటివాడయ్యాడో, రాష్ట్రపతి భవన్‌లో కూర్చోగలిగాడో అలాటి అయ్యర్‌గారిని దృష్టిలో పెట్టుకుని... ‘‘ఆయనలాగా అంతమంది పిల్లలను తయారు చేయడానికి రాష్ట్రపతి భవన్‌ను విడిచిపెట్టి విశ్వవిద్యాలయాలకు, పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులను కలవడానికి ఇష్టపడి వెళ్ళిపోతున్నాను’’ అని రాసుకున్నారు కలాం, తను రచించిన ‘ఇన్‌డామిటబుల్ స్పిరిట్’ అనే గ్రంథంలో.

 అదీ మంచిమాట వింటే ఫలితం. అదీ ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించడమంటే. అదీ తమసోమా జ్యోతిర్గమయ. అదీ సంస్కార వైభవమంటే. చదవండి. అన్నివేళలా క్లాస్ పుస్తకాలే చదవక్కరలేదు. దానితోపాటు సంస్కారమిచ్చే పుస్తకాలు చదవండి. మహాత్ములను దర్శించండి. మీరూ జీవితంలో అలా సమున్నత స్థానాల్లోకి రావాలనీ, మీరూ ఒక దీపమై వేల దీపాలు వెలిగించాలని మీరందరూ వృద్ధిలోకి రావాలని నేను పరిపూర్ణమైన హృదయంతో భగవతిపాదములు పట్టి పార్థిస్తాను.                    
 
లోకంలో మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమంకోరి మీ హితంకోరి, మీ వృద్ధికోరి
 మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి ప్రపంచం నలుమూలలా వెతికినా దొరకరు. ఒకవేళ దొరికినా అటువంటి మాట వినేవాడు దొరకడు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలోపడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ.
 చివరన నీకేం అర్థమయింది’ అని అడిగాడు. నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నే యుద్ధానికి బయల్దేరుతున్నా’’ అన్నాడు అర్జునుడు.
 
 బహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement