నిరక్షరాస్యురాలే.. కానీ ఆరితేరిన పర్యావరణవేత్త..!
కృషి ఉంటే మనుషులు రుషులౌతారు అన్న మాటకు ఆమె ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించడమే లక్ష్యంగా అడుగు ముందుకేసింది. అక్షర జ్ఞానం లేకున్నా... అవగాహతో దూసుకుపోయింది. కాలుష్యాన్ని సృష్టించే క్వారీలను నిర్మూలించేందుకు నడుంబిగించి, స్థానికుల మద్దతుతో విజయతీరాలను చేరిన హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాకు చెందిన పర్యావరణవేత్త.. కింక్రీదేవి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
క్వారీ కారణంగా జరుగుతున్న జరుగుతున్న నష్టాన్నిఎత్తి చూపడం, స్థానికుల్లో అవగాహన కల్పించడమే కాదు.. ఆ క్వారీల యాజమాన్యాలను ఆమె కోర్టుకీడ్చింది. పేద కుటుంబంలో జన్మించిన కింక్రీదేవీ చిన్నప్పటి నుంచి వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. 14 ఏళ్ళప్పుడే ఆమెకు శ్యాము రామ్ అనే ఓ కూలి పనిచేసుకునే వ్యక్తితో వివాహం చేశారు. 22 ఏళ్ళ వయసు వచ్చేసరికే భర్త చనిపోవడంతో కింక్రీదేవి... భుక్తికోసం స్వీపర్ గా పని ప్రారంభించింది. చదవడం, రాయడం ఏమాత్రం తెలియకపోయినా.. ఆమె పర్యావరణం గురించి ఎంతగానో అవగాహన పెంచుకుంది. మైనింగ్ వల్ల కలిగే అనర్థాలను తెలుసుకొని అందుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది.
వ్యవసాయ భూముల్లో నీటి వనరుల కొరత, అటవీప్రాంతం తగ్గిపోవడం, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాలతో 1985 లో డూన్ వ్యాలీ క్వారీని బలవంతంగా మూసి వేయించారు. అనంతరం సిర్ మౌర్ జిల్లాలో సున్నపురాయి క్వారీ అతి పెద్ద వ్యాపారంగా మారిపోయింది. దీంతో క్వారీలకు వ్యతిరేకంగా కింక్రీదేవి పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించింది. ముందుగా స్థానికుల్లో అవగాహన కల్పించడంతో తన పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఆమె పోరాటానికి స్థానికులంతా అండగా నిలిచారు. సున్నపురాయి క్వారీయింగ్ తో పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని తెస్తున్న 48మంది క్వారీ యజమానులపై 1987లో' పీపుల్స్ యాక్షన్ ఫర్ పీపుల్ ఇన్ నీడ్' స్వచ్ఛంద సంస్థ మద్దతుతో సిమ్లా హై కోర్టులో పిల్ కూడా దాఖలు చేసింది. అయితే ఎన్నాళ్ళు వేచినా తన వ్యాజ్యానికి ఎటువంటి స్పందనా రాకపోవడంతో కోర్టు ముందు నిరాహార దీక్షకు దిగింది. 19 రోజులపాటు నిర్వహించిన దీక్ష చివరకు విజయవంతమైంది. కొండలు పేల్చే చర్యలతోపాటు మైనింగ్ లపై హైకోర్టు స్టే విధించింది.
అనంతరం ఆమె అంతర్జాతీయంగా ప్రముఖ పర్యావరణవేత్తల సరసన చేరింది. దీంతో ఆమెను బీజింగ్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ కు హాజరుకావాలని ఆహ్వానించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కింక్రీదేవిని జ్యోతి వెలిగించమని స్వయంగా హిల్లరీ క్లింటన్ కోరడం ప్రత్యేకతగా నిలిచింది. ఆ తర్వాత 1999 లో కింక్రీదేవిని ఝాన్సీ లక్ష్మీబాయి శ్రీ శక్తి పురస్కారంతో సత్కరించారు.
ఆమె పయనం అంతటితో ఆగిపోలేదు. స్థానిక మౌలిక సదుపాయాలకోసం కూడ ఆమె ఎన్నో పోరాటాలు చేశారు. తాను ఎక్కువకాలం జీవితం గడిపిన సంగ్రహ్ గ్రామంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకోసం ఉద్యమాన్ని నిర్వహించారు. 2006 లో కళాశాల ప్రారంభమవ్వడం ఆమె వైవిధ్య వ్యక్తిత్వానికి మరో సాక్ష్యం. చివరికి 82 ఏళ్ల వయసులో 2007 లో మరణించిన ఆమె.. ఎందరికో స్ఫూర్తిదాతగానే కాక స్థానికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.