మధుర... వాణి | Gurajada Apparao Jayanthi to celebrate on September 21 | Sakshi
Sakshi News home page

మధుర... వాణి

Published Sun, Sep 21 2014 1:33 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మధుర... వాణి - Sakshi

మధుర... వాణి

సత్వం: ‘నాతో మాట్లాడడవే ఒక ఎడ్యుకేషన్’ ‘తనకి రొట్టా? ఒహడికి ముక్కానా?’ ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అంటూ ప్రతి సందర్భాన్నీ నాటకంతో ముడిపెట్టి మాట్లాడే ‘కన్యాశుల్కం’ భక్తులే పుట్టుకొచ్చారు.
 
 ‘కవిత్రయమంటే- తిక్కన, వేమన, గురజాడ’ అన్నాడు శ్రీశ్రీ, ప్రాచీన కవిత్రయపు పీఠాల్ని కాసేపు కదిలించి. గురజాడ భక్తుడిగా మాత్రమే శ్రీశ్రీ ఈమాట చెప్పి ఉండకపోవచ్చు; ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ పరిచిన బాటే, ఆయన్ని, తనకంటే ముందరి, భిన్నకాలాలకు చెందిన ఇరువురు మహనీయులతో కూడిన ఒక పదబంధాన్ని పంచుకునేలా చేసివుంటుంది. ‘ప్రాచీనత’, ‘ఆధునికత’ సంధియుగంలో జన్మించాడు గురజాడ. సాహిత్యం పునాదిగా ఆకాలాన్ని అర్థం చేసుకుంటే- అది పురుషుడి విలాస వస్తువుగా స్త్రీ చూడబడుతున్న కాలం; వెర్రిగా బాల్యవివాహాలు జరుగుతున్న కాలం; కన్యాశుల్కం కింద చిన్నారిబాలికల్ని, కడువృద్ధులకు సైతం కట్టబెడుతున్న ‘రక్తమాంసాల విక్రయ’ కాలం; వితంతువుల పునర్వివాహానికి ఏమాత్రం ఆమోదం లేని కాలం; సామాన్యప్రజలు తమని తాము ‘కర్మ’కు  వదిలేసుకుని బతుకులీడుస్తున్న కాలం; మొత్తంగా- ‘నీతులూ, బూతులూ’ కలగలిసిన యుగం. అందుకే గురజాడ తన యావత్ సాహిత్యాన్ని ఈ సామాజిక రుగ్మతలపై పోరాటం కోసమే వెచ్చించాడు. దేశాన్ని ఉద్ధరించే, దేహాన్ని గౌరవించే, హేతువును పెంపొందించే రచనలకు శ్రీకారం చుట్టాడు. ‘సమాజాన్ని అప్రతిష్టపాలు చేసే పరిస్థితిని కళ్లముందర పెట్టి, నైతిక భావాల ఉన్నత ప్రమాణాల్ని ప్రాచుర్యానికి తేవడం కంటే, సాహిత్యానికి ఉత్తమమైన కార్యమేదీ ఉండదు’.
 
 ఉపాధ్యాయుడిగానూ, డిప్యుటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్‌క్లర్కుగానూ, విజయనగరం రాజు ఆస్థానంలోనూ, అధ్యాపకుడిగానూ పనిచేసిన గురజాడ- తొలుత ఆంగ్లంలో రాసినప్పటికీ, తర్వాత తెలుగులోకీ, అందునా ఆ సారం చేరవలసిన జనభాషలోకీ మరలాడు. స్నేహితుడు గిడుగు రామ్మూర్తితో కలిసి వ్యావహారిక భాషోద్యమానికి నడుం బిగించాడు. విజయనగర కేంద్రంగా జరిగే ‘కన్యాశుల్కము’ నాటకంలో అక్కడి యాసతో పాత్రోచిత భాషను ప్రవేశపెట్టాడు. పెద్ద కుటుంబాలనుంచి వచ్చినవారే నాయికానాయకులుగా సాహిత్యాన్ని ఆక్రమించుకుంటున్న కాలంలో వేశ్య మధురవాణిని నాయికను చేశాడు. వేశ్యావృత్తిని నిర్మూలించాలంటే, ముందుగా వేశ్యలను కూడా మనుషులుగా చూడటం అవసరమన్నాడు.
 
  గిరీశం, బుచ్చమ్మ, సౌజన్యారావు, రామప్పంతులు, లుబ్ధావదాన్లు, వెంకటేశం, కరటకశాస్త్రి... రచయితతో సమానంగా పాత్రలు గుర్తింపులోకి రావడం ఎప్పుడోగానీ జరగదు. వందేళ్లు పూర్తిచేసుకున్న ఈ నాటకం ప్రపంచనాటకాల్లో ఎన్నదగినదిగా ఖ్యాతిగాంచింది. ‘డామిట్! కథ అడ్డంగా తిరిగింది’ ‘నాతో మాట్లాడడవే ఒక ఎడ్యుకేషన్’ ‘తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం’ ‘తాంబూలాలిచ్చాను, తన్నుకు చావండి’ ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్’ ‘డబ్బు తేని విద్య దారిద్య్ర హేతువు’ ‘తనకి రొట్టా? ఒహడికి ముక్కానా?’ ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అంటూ ప్రతి సందర్భాన్నీ నాటకంతో ముడిపెట్టి మాట్లాడే ‘కన్యాశుల్కం’ భక్తులే పుట్టుకొచ్చారు.
 
 ‘దేశమును ప్రేమించుమన్నా’... గురజాడ తత్వం మొత్తాన్నీ వెల్లడించే గేయం. దానికి ప్రపంచ జాతీయగీతం కాగల శక్తివుందన్నాడు శ్రీశ్రీ. ‘వొట్టి మాటలు కట్టిపెట్టోయ్/ గట్టి మేల్ తలపెట్టవోయ్... ఈసురోమని మనుషులుంటే/ దేశమేగతి బాగుపడునోయ్... అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్/ దేశి సరుకుల నమ్మవలెనోయ్... పరుల కలిమికి పొర్లి యేడ్చే/ పాపి కెక్కడ సుఖం కద్దోయ్... సొంతలాభం కొంతమానుకు/ పొరుగువానికి తోడుపడవోయ్/ దేశమంటే మట్టికాదోయ్/ దేశమంటే మనుషులోయ్... దేశమనియెడి దొడ్డవృక్షం/ ప్రేమలను పూలెత్తవలెనోయ్’...
 
 ఉత్తి భౌగోళిక దృష్టితో కాకుండా, మనుషులతో ముడిపెడుతూ దేశాన్ని చూశాడు గురజాడ. స్వయంసమృద్ధ, సహకారపూరిత అవనిని కాంక్షించాడు. అస్పృశ్య నివారణ ఉద్యమరూపు దాల్చకముందే, ‘మంచి చెడ్డలు ఎంచి చూడగ మనుజులందున రెండె కులములు, మంచి యన్నది మాలయైతే మాలనే అగుదున్’ అని ప్రకటించాడు. సహపంక్తి భోజనంలో పాల్గొన్నాడు. గురజాడ రాసిన ప్రతివాక్యమూ తెలుగునాట వ్యాప్తిలోకి వచ్చింది. ‘ఆటల పాటలతోటి కన్నియలు/ మొగుడు తాత యని కేలించ/ ఆటల పాటల కలియక పూర్ణిమ/ దుర్గను చేరీ దుఃఖించే (పూర్ణమ్మ); ‘పట్టమేలే రాజు అయితె/ రాజునేలే దైవముండడొ?/ పరువు నిలపను పౌరుషము మీ/ కేల కలగదొకో?’ (కన్యక); ఏనుగు ఎక్కి మనము/ ఏ వూరెళదాము?/ ఏనుగు ఎక్కి మనము/ ఏలూ రెళదాము (మిణుగురులు); ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ (ముత్యాల సరములు)... కవిగా, నాటకకర్తగానే కాకుండా, ‘దిద్దుబాటు’తో ఆధునిక కథకు బలమైన పునాదిని ఏర్పాటుచేశాడు. దంపతుల మధ్య తప్పక ఉండవలసిన అనురాగాన్ని చిత్రించాడు. 1862లో జన్మించిన ఈ మహాకవి అనారోగ్యంతో 53 ఏళ్లకే కన్నుమూశాడు. ‘బ్రతికి చచ్చియు, ప్రజలకెవ్వడు/ బ్రీతి కూర్చునొ, వాడె ధన్యుడు’. కృష్ణశాస్త్రి అన్నట్టు, ‘గురజాడ 1915లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు’.
 - సెప్టెంబర్ 21న రచయిత
 గురజాడ అప్పారావు జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement