ఈ వ్యాసాలలో విషయం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది తాను చదివిన కొన్ని రచనలలో తాను గ్రహించిన విశేషాలను పాఠకులకు అర్థమయ్యే విధంగా చెప్పటం. రెండవది జ్ఞాపకాల పుటలలో నుంచి విలువైన వాటిని సేకరించి, మనతో పంచుకోవటం. ఇందులో ఏది చెయ్యాలన్నా ముందుగా కావలసినది సహృదయం, తన పరిసరాల మీద మమకారం, తన పరిచయాల పట్ల గౌరవం, తనను ఆకర్షించిన పాత్రల మీద అవ్యాజమైన ప్రేమ. తులసిగారిలో ఇవన్నీ సమపాళ్లలో సమృద్ధిగా ఉన్నాయని ఈ వ్యాసాలు చదవటం మొదలుపెట్టగానే గ్రహిస్తాం.
పూర్ణమ్మ గేయానికి చేసిన వ్యాఖ్య ఎంతో అర్థవంతంగా ఉంది. పూర్ణమ్మ మనసును గురజాడ ఎంత బాగా అర్థం చేసుకున్నాడో, అంత బాగాను గురజాడ మనసును తులసి గారు అర్థం చేసుకున్నారనిపిస్తుంది. ‘‘నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొకపరి తలవండి’’ అనటం, ‘‘దీవెన వింటూ ఫక్కున నవ్వటం’’– ఇవన్నీ పూర్ణమ్మ తీసుకున్న అంతిమ నిర్ణయాన్ని సూచించే సంకేతాలని తులసిగారు వివరిస్తారు. ఆమె కవితాహృదయం రావిశాస్త్రి కథల గురించి, చాసో మాస్టర్ ఆర్ట్ గురించి, పతంజలి రచనా ప్రస్థానం గురించి రాసిన వ్యాసాల్లో స్పష్టంగా వ్యక్తమౌతోంది.
‘జీవితంలోంచి చాసో సిద్ధాంతాన్ని చూసాడు, సిద్ధాంతంలోంచి రావిశాస్త్రి జీవితాన్ని చూసాడు, వీటిలో ఉన్న తేడా పతంజలి చూపుకు ఆనిం’దని చెప్పటం పతంజలి రచనలకి లోతైన వ్యాఖ్యానంగా నాకు తోస్తుంది. గురజాడ సమకాలీన భారతీయ రచయితల గురించి రాసిన వ్యాసం ఎంతో విలువైన చారిత్రక సమాచారాన్ని ఇస్తుంది. పలు అనువాదాలు చేసిన రచయిత్రిగా ఇరుగు పొరుగు భాషల నుంచి వస్తున్న అనువాద రచనల్లోని లోటుపాట్లను గురించి అర్థవంతమైన చర్చ చేశారు.
రచయిత్రులకు సహజమైన, సమర్థనీయమైన స్త్రీ పక్షపాతం ఈ వ్యాసాలలో కనిపిస్తుంది. అమృతా ప్రీతమ్, కుర్రతుల్ ఇన్ హైదర్, ఆశాపూర్ణాదేవి, మహాదేవి వర్మ, కె.రామలక్ష్మి వంటి వారితోపాటు, ఒడియా సాహిత్యంలో స్త్రీవాద రచయిత్రుల రచనల గూర్చిన చర్చ ఇక్కడ చూడవచ్చు.
చాసో, నారాయణబాబు, రోణంకి, పురిపండా, ఆరుద్ర, శ్రీశ్రీ, ఉప్పల లక్ష్మణరావు మొదలైనవారి ముఖచిత్రాలను, హావభావాలను, దైనందిన జీవితంలో వారు మసలిన విధానాన్ని వారి గురించి ప్రస్తావించిన పలు వ్యాసాలు కళ్లకు కట్టినట్టుగా వివరిస్తాయి.
మౌలికంగా మార్క్సిస్టు భావజాలంతో ముడిపడిన అభ్యుదయ మార్గానికి చెందిన తులసిగారి అన్ని అభిప్రాయాలతో నాకు నూరు శాతం ఏకీభావం ఉందని చెప్పలేను. ఐతే, వ్యాసాలను చదవటానికి, అభిమానించటానికి అది అవరోధం కాదు. కారా మాష్టారి ‘హింస’ కథలో మూడు ప్రధాన పాత్రలూ వైఫల్యం చెందటం వల్ల ప్రయోజనం దిశగా కథ ముగియలేదని ఆవిడ అభిప్రాయపడటం అర్థం చేసుకోవచ్చు. కానీ మానవ వైఫల్యం కూడా జీవితంలో భాగమే. ఆ విధంగా ఏర్పడిన పరిస్థితులను, వాటి అనివార్యతను చిత్రించటంలోనే సహజత్వం సిద్ధిస్తుంది. కేవలం కథా ప్రయోజనం కోసం దానిని మార్చినంత మాత్రాన ఒనగూరేదేమీ ఉండదు.
-విన్నకోట రవిశంకర్
Comments
Please login to add a commentAdd a comment