‘మనవాళ్లొట్టి వెధవాయిలోయ్’ అని ‘కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం నోట పలికించారు గురజాడ. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మనవాళ్లు కూడా ఆయన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా, వెధవాయిత్వాన్ని కడు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారులెండి. దేశంలో నిరక్ష రాస్యత ఎంతగా తగ్గుముఖం పట్టినా, ఎన్ని విశ్వవిద్యాలయాలు పుట్టుకొస్తున్నా, ఎన్నెన్ని జ్ఞాన ప్రవచనాలు మన చెవుల్లో అనుదినమూ మార్మోగుతూనే ఉన్నా, మన వెధవాయిత్వం మాత్రం నానాటికీ వర్ధిల్లుతూనే ఉంది.
వెధవాయిత్వం అనగా మూర్ఖత్వం. ఇది మానవ సహజ లక్షణం. ఈ లక్షణం గురజాడవారికి ముందూ ఉంది, ఆ తర్వాతా ఉంది. మూర్ఖత్వానికి మూలకారణమేంటి అని తరచి చూస్తే, అజ్ఞానమే కారణంగా కనిపిస్తుంది. అజ్ఞానాన్ని అంతం చేస్తే, మూర్ఖత్వం తొలగిపోతుంది కదా అనుకోవచ్చు. అదంత తేలికపాటి వ్యవహారం కాదు. ‘మూర్ఖత్వానికీ జ్ఞానానికీ ఉన్న తేడా అల్లా జ్ఞానానికి అవధులు ఉన్నాయి’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్. మూర్ఖత్వం అవధులు లేనిదని ఆయన కవిహృదయం. లోకంలో అవధులు లేని మూర్ఖత్వమే లేకుంటే, జ్ఞానానికి విలువెక్కడిది? చీకటి ఉన్నచోటే కదా చిరుదీపానికి విలువ!
చరిత్రంతా మూర్ఖత్వానికీ జ్ఞానానికీ మధ్య సంఘర్షణే! ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు/ దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు/ తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు/ చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు’ అని భర్తృహరి ఏనాడో సంస్కృతంలో చెప్పిన మాటలను ఏనుగు లక్ష్మణకవి తేట తెలుగులో చెప్పాడు.
లోకంలో ఎలాంటి అసాధ్యాన్నయినా సాధించవచ్చు గాని, మూర్ఖులను ఒప్పించి మెప్పించడం సాధ్యంకాని పని అని గుర్తించిన భర్తృహరిని మించిన మహాజ్ఞానులు ఇంకెవరుంటారు? భర్తృహరి మాటలను గుర్తుంచుకుంటే, మూర్ఖులతో పేచీ లేకుండా మన మానాన మనం కడుపులో చల్ల కదలకుండా బతికేయవచ్చు. కాదూ కూడదని పని గట్టుకుని మరీ మూర్ఖులను ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం అది వికటించి, ప్రాణాల మీదకు కూడా రావచ్చు. మూర్ఖబలాన్ని తక్కువగా అంచనా వేయడం మూర్ఖత్వమే అవుతుంది.
కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించిన గెలీలియో ఉదంతమే ఇందుకు ఉదాహరణ. సూర్యుని చుట్టూనే భూమి తిరుగుతుందని చెప్పిన పాపానికి నాటి మతాధి కారులు గెలీలియోను ఖైదుపాలు చేశారు. చివరకు ఖైదులోనే అతను కన్నుమూశాడు. అంతకంటే ముందుకాలం వాడు సోక్రటీస్. యువకులకు జ్ఞానబోధ చేశాడు. మూర్ఖ మతాధిపతులు కన్నెర్ర చేశారు. అతడి చేతికి విషపాత్రనిచ్చారు. అదీ మూర్ఖత్వం తడాఖా! సత్యాన్ని వెల్లడించిన పాపానికి ప్రాణాలనే బలిగొనేంత బలవత్తర శక్తి మూర్ఖత్వానిది.
‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజి చేస్తుంటేగాని పొలిటీషియను కానేరడు’ అని మహాజ్ఞాని గిరీశం నుడివాడు. పొలిటీషియన్ అయినా కాకున్నా, మానవమాత్రులందరూ కాలానుగుణంగా అభిప్రాయాలను మార్చుకుంటూనే ఉంటారు. బాల్యంలో ఉన్న అభిప్రాయాలు యవ్వనంలో మారి పోతాయి. యవ్వనంలోని అభిప్రాయాలు వార్ధక్యంలో పటాపంచలైపోతాయి. అసలు అభిప్రాయాలను మార్చుకోని వారు ఇద్దరే ఇద్దరు అంటాడు అమెరికన్ కవి జేమ్స్ రసెల్ లోవల్. ‘ఈ ప్రపంచంలో మూర్ఖుడూ, మృతుడూ మాత్రమే తమ అభిప్రాయాలను మార్చుకోరు’ అన్నాడు.
‘ఎఱుగువాని దెలుప నెవ్వడయినను జాలు/ నొరుల వశము గాదు వోగు దెల్ప/ యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా?’ అన్నాడు వేమన. అయినా, మూర్ఖులకు జ్ఞానబోధ చేయాలనే కాంక్ష కొందరు జ్ఞానులలో మితిమీరి ఉంటుంది. పరిసరాలను, పరిసరాల్లోని పరిస్థితులను పట్టించు కోకుండా ప్రవచనాలకు లంకించుకునే ‘జ్ఞానులు’ ఆ బాపతులోకే వస్తారు. అయితే, మూర్ఖులను జ్ఞానబోధ చేయడంతోనే మన విద్యావ్యవస్థలో పురోగతి మొదలైన సంగతిని మనం మరువరాదు.
మూర్ఖులైన ముగ్గురు రాకుమారులకు విష్ణుశర్మ బోధించిన ‘పంచతంత్రం’ ప్రపంచ సాహిత్యంలోనే ఒక మైలురాయి. మూర్ఖులకు జ్ఞానబోధ చేయడం అంటే కత్తిమీద సాము వంటి విన్యాసమే! విష్ణుశర్మ ఆ పనిని విజయవంతంగా చేసి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటి రచన ‘పంచతంత్రం’.
దాదాపు అదేకాలంలో– క్రీస్తుశకం ఐదు నుంచి పదిహేనో శతాబ్ది మధ్యకాలంలో యూరోప్‌లో ‘ఫూల్స్ లిటరేచర్’ ప్రాచుర్యంలోకి వచ్చింది. ‘ఫూల్స్ లిటరేచర్’లో వెలువడిన కవితలు, కథలలో ‘ఫూల్’ పాత్ర తప్పనిసరి. యూరోపియన్ మూర్ఖసాహిత్యంలోని ‘ఫూల్’ పాత్ర ఒక్కోసారి తెలివితక్కువ మూర్ఖునిగా, ఒక్కోసారి మొండి మూర్ఖునిగా, ఒక్కోసారి అతితెలివి మూర్ఖునిగా కనిపిస్తాడు. ప్రపంచ సాహిత్యంలో మూర్ఖపాత్రలు కోకొల్లలు.
‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అనేది సనాతన మూర్ఖత్వం. ‘అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉన్నాయిష’ అనేది హైటెక్ మూర్ఖత్వం. కాలం శరవేగంగా మారుతోంది. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా పురోభివృద్ధి చెందుతోంది. మనుషుల మూర్ఖత్వంలోనూ మార్పులు వస్తున్నాయి. అయితే, ముడి పదార్థమైన మూర్ఖత్వం మాత్రం యథాతథంగానే ఉంటోంది. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని మనసారా ఆకాంక్షించాడు గురజాడ. మనుషుల్లోని మూర్ఖత్వం మాసిపోయి, జ్ఞానమొక్కటే నిలిచి వెలిగే రోజులు ఎప్పటికైనా వస్తాయా?
అవధులు లేనిదదే!
Published Mon, Dec 5 2022 12:23 AM | Last Updated on Mon, Dec 5 2022 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment