ఏ విద్యా వ్యవస్థ ముఖ్యోద్దేశమైనా విద్యార్థులలో విషయ పరిజ్ఞానం పట్ల ఉత్సాహం, సృజనాత్మకమైన ఆలోచనల పట్ల ఆసక్తి రెకెత్తించటమే. ఒక మంచి ఉపాధ్యాయుడు సాక్షాత్తూ ఆ పరబ్రహ్మతో సమాన మని వేదాలు చెబుతున్నాయి. అందుకనే ‘గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మ’ అన్నారు. బ్రహ్మలాగా గురువు విద్యార్థులలో చదువుపట్ల ఉత్సాహం రేకెత్తించగల గాలి. విష్ణువులాగా చదివేవారికి ప్రాధాన్యతనిస్తూ, చదవని వారిని దండిస్తూ పరిపాలించగలగాలి. మహేశ్వరుడిలా విద్యార్థులలోని అవలక్షణాలను, చెడు ప్రవర్తనను నిర్మూలించాలి.
కానీ నేడు ఉపాధ్యాయులు అవలక్షణాలను పెంచి పోషిస్తూ, తన కులం, తన వర్గం వారికి ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థులలోని సృజనాత్మకతను నాశనం చేస్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే కొన్ని కళాశాలల్లో ముందు బెంచీలలో వారి వర్గం విద్యార్థులకే చోటు దక్కుతోంది.
విద్యావ్యవస్థలో ఇటువంటి పరిణామాలకు చోటు ఇవ్వరాదు. వీటివల్ల విద్యార్థుల మనసులలో విషబీజాలు నాటుకుపోతాయి. ఏ విద్యార్థి అయినా ఒక వయస్సు వచ్చేసరికి తనదైన ఆలోచనా విధా నాన్ని ఏర్పరచుకుంటాడు. తన చుట్టూ జరిగే పరి ణామాలు, సంఘటనలు అన్నిటినీ ఈ ఆలోచనల నుంచే విశ్లేషించుకుంటాడు. ఈ ఆలోచనలు సకారా త్మకమైనవిగా ఉండేటట్లు చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఉపాధ్యాయులు చూపించే దురభిమానంవల్ల విధ్వం సకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. కొన్ని దేశాలలో ఉగ్రవాద కార్యకలాపా లలో పాఠశాల విద్యార్థులు చేరడం ఇలాంటి వాటి ఫలితమే.
పాఠశాలల్లో, కళాశాలల్లో తమ వర్గం విద్యార్థులకు నిబంధనలకు విరు ద్ధంగా మేలు చెయ్యాలని చూడటం, ఎన్ని తప్పులు చేసిన వెనకేసుకు రావటం, ఏ తప్పు చేయకపోయినా ఇతర వర్గాల వారిని ఇబ్బందులకు గురి చెయ్యటం, కించపరచటం వంటి చర్యలవల్ల విద్యా ర్థులలో విపరీత ఆలోచనలకు తావిస్తున్నాయి.
ఉపాధ్యాయులంతా ఈ రకంగానే ఉంటారని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ కొందరి వల్ల ఉపాధ్యాయ లోకం ఈ నిందను భరించక తప్పడం లేదు. తరగతిలోని విద్యార్థులందరినీ సమదృష్టితో చూసే ఉపాధ్యాయులను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. గురుస్థానంలో ఉన్నవారు ప్రదర్శించే దురభిమానా లతో జరిగే నష్టం ఏ ఒక్కరికో పరిమితం కాదు. మొత్తం సమాజానికి చేటు చేస్తుంది. తప్పుచెయ్యని విద్యార్థిని దండించటంవల్ల అలాంటివారు ఆత్మహ త్యలు చేసుకునే ప్రమాదం ఉంది.
ఇటువంటి వాటిని పెంచి పోషిస్తే ర్యాగింగ్ వంటి మహ మ్మారిని మరింత పెంచడమే అవుతుంది. వీటిని మొగ్గలోనే తుంచాలి. అందుకు ప్రతి పాఠశాలలో/కళాశాలలో ఒక కమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. వివక్షకు గురైన విద్యార్థులు తమ ఆవేదనను తెలుపుకోవటానికి ఒక వేదిక అవసరం. దురభిమా నంతో ప్రవర్తించే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. అవసరమైతే వారి మానసిక ఆరోగ్యాన్ని సమీక్షించాలి. నేను గొప్ప, నా కులం గొప్ప, నా వర్గం గొప్ప అనుకోవటం కూడా ఒక రకమైన మానసిక వ్యాధి లక్షణమే. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తమ కులం, వర్గం మాత్రమే గొప్పదనే విష బీజాలు నాట డం మానుకోవాలి.
బోధన అంటే కేవలం అక్షరాలను నేర్పటం కాదు, పిల్లలలో విలువలను పాదుకొ ల్పటం. ఉపా ధ్యాయ వృత్తి మిగతా వృత్తులకన్నా భిన్నమైనది. విద్యార్థికి ఇంట్లో తల్లి, తండ్రి, అన్న, అక్క అందరూ ఉండి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మార్గదర్శనం చేస్తారు. కానీ పాఠశాలలో ఉపాధ్యా యుడు ఒక్కడే ఈ పాత్రలన్నీ పోషించాలి.
ఉపాధ్యాయుడు అరవటం, మానసిక వైక ల్యంతో ప్రవర్తించటం, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించటం, బూతులు మాట్లాడటం వంటి వాటికి పాల్పడితే, తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవటం తప్ప ఉపయోగం ఉండదు. ఉపాధ్యాయుడు నియంత కారాదు. ఉపాధ్యాయుడంటే– ఉప+అధ్యయనం చేసేవాడు. అంటే విద్యార్థులకు సహచరుడని అర్థం. ప్రేమ, దయ, స్నేహం వంటి వాటివల్లే ఇది సాధ్య పడుతుంది.
ప్రొ. ఇ. శ్రీనివాస్ రెడ్డి
వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ‘ 78931 11985
Comments
Please login to add a commentAdd a comment