భారతీయ సంగీత పండితుల్లో ఒకరు. త్యాగరాజస్వామి శిష్యపరంపరలో మూడవ తరానికి చెందినవారు. సాక్షాత్తు త్యాగరాజస్వామి శిష్యుడూ, తంజావూరులోని మానాంబుచావడి గ్రామ నివాసీ అయిన ఆకుమడుల వెంకట సుబ్బయ్యకు శిష్యుడైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి శిష్యులే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. దక్షిణామూర్తి శాస్త్రి వద్ద తన సంగీత శిక్షణ కొనసాగించి గాయకుడిగా, వాయులీన విద్వాంసునిగా అసమాన ప్రతిభ గడించారు. తెలుగు నేలపై శాస్త్రీయ సంగీత పునరుజ్జీవనానికి మూలపురుషులయ్యారు.
ఆయన 1882 డిసెంబర్ 5న కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో జన్మించారు. సంగీత సంప్రదాయాన్ని తన ఆసీస్వరాలతో మనసా, వాచా, కర్మణా... జాతి, కుల, మత వర్గ విభేదాల కతీతంగా శిష్యకోటికి ప్రసాదించారు. విజయవాడను కేంద్రబిందువుగా చేసుకొని శాస్త్రీయ సంగీత ప్రాచుర్యానికి పునాదులు వేశారు. శిష్యుల సంగీత అధ్యయనం, సాధనలతో నిత్యమూ గురుకులం కళకళలాడుతుండేది. అన్ని వర్గాలవారు ఈ గురుకులంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు అందుకొని శ్రద్ధగా సంగీతం నేర్చుకొని వృద్ధిలోకి వచ్చారు.
పంతులుగారి శిష్యులు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గురువుగారి గురించి చెబుతూ ‘వారు పాఠం చెప్పే తీరు, పాడే తీరుకూడా నేర్చుకునేవారికి సుబోధకంగానూ, మార్గదర్శకంగానూ ఉండేది. వారు కచేరీలలో రాగం పాడినా, నెరవు చేసినా, స్వర ప్రస్తారం చేసినా ప్రతి విషయం నమూనాలుగా భాసించేవి’ అన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, నేతి శ్రీరామ శర్మ, టి.కె. యశోద దేవి, జి. వి. రామకుమారి వంటివారు ఆయన శిష్యులే.
పారుపల్లివారు మద్రాసు సంగీత అకాడమీ నిపుణుల సంఘంలో సభ్యుడుగా చాలాకాలం పనిచేశారు. తిరువాయూరులోని త్యాగబ్రహ్మ ఆరాధన ఉత్సవ కార్యక్రమ నిర్వాహక సభ్యునిగా ఉన్నారు. ఆ రోజులలో కొలంబియా గ్రామఫోన్ కంపెనీ అయన కార్యక్రమాలను రికార్డు చేసింది. పంతులుగారి కృషి, ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ పట్టణంలో ప్రప్రథమంగా ఆకాశవాణి కేంద్రం, తదుపరి సంగీత కళాశాల ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో కచేరీలు చేసి అనేక బిరుదులూ, పురస్కారాలు అందుకొన్నారు. 1915 ప్రాంతములో మద్రాసు గవర్నర్ లార్డ్ పెంట్లాండ్ తెనాలి వచ్చినప్పుడు పంతులుగారి వేణుగానాన్ని విని తన్మయత్వం చెంది సువర్ణపతకం బహుకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిషత్తు వారు ‘భారతీ తీర్థోపాధ్యాయ’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. 1951 జూలై 7న ఏకాదశి పర్వదినాన గురువులు దక్షిణామూర్తిశాస్త్రి ఆరాధనోత్సవాలు జరుపుతున్న వేళ సంగీత సరస్వతి ఒడికి చేరుకున్నారు. భారతీయ సంగీతం ఉన్నంత వరకూ ఆయన పేరు నిలిచి ఉంటుంది.
– యనమండ్ర వేంకట కృష్ణయ్య ‘ 9849986679
(విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో నేటి నుంచి 5 రోజుల పాటు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు జయంతి ఉత్సవాలు జరుగుతాయి.)
Comments
Please login to add a commentAdd a comment