అందంగా ఎవరు కనబడినా ప్రేమించేయడమేనా!! | story of Beauty and love | Sakshi
Sakshi News home page

అందంగా ఎవరు కనబడినా ప్రేమించేయడమేనా!!

Published Sat, Jul 2 2016 11:29 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

అందంగా ఎవరు కనబడినా ప్రేమించేయడమేనా!! - Sakshi

అందంగా ఎవరు కనబడినా ప్రేమించేయడమేనా!!

విద్య - విలువలు

వయసురీత్యా కానీ, చదువురీత్యా కానీ ఇప్పుడిప్పుడే మీరు బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. మంచి ఉపాధి చూసుకుని జీవితంలో స్వతంత్రంగా నిలదొక్కుకోవడానికి ముందువచ్చే దశ ఇది. ఈ దశలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసేవి - స్నేహితాలు. స్నేహం చేయడం గొప్పకాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ఈ వేళ స్నేహం చేస్తారు, ఎక్కడో ఒక చిన్నదోషాన్ని అడ్డుపెట్టుకుని స్నేహాన్ని చంపేసుకుంటారు. దోషంలేని వారెవరుంటారు! ఎక్కడ దోషం ఉందో అదే మాట్లాడాలి తప్ప వ్యక్తి శీలం మొత్తాన్ని గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు.

 కిందటేడాది వచ్చినప్పుడు రామాచారిగారు నాకు గొప్ప మిత్రుడండీ అని పరిచయం చేశాను. ఈ ఏడాది వచ్చినప్పుడు ‘రామాచారిగారేరండీ’ అని అడిగారనుకోండి, ‘‘ఏమో అనుకున్నాను గానీ, ఆయన అంత మంచి వాడు కాదండోయ్, ఇప్పుడు నేనూ ఆయనా మాట్లాడుకోవడం లేదు’’ అన్నాననుకోండి. ఇప్పుడు తప్పు ఆయనది కాదు, నాది. ఎందుకంటే.... స్నేహమంటే కాపాడుకోవాలి. అందరిలో అన్నీ సుగుణాలే ఉండవు. ఏవో బలహీనతలు ఉండొచ్చు. స్నేహితుడంటే కోడిపెట్ట పిల్లల్ని కాపాడుకున్నట్లు స్నేహితులను కాపాడుకోవాలి. ఒకవేళ దోషం కనిపిస్తే ఒక్కడిగా ఉన్నప్పుడు అతని లోపాన్ని దిద్ది అతని ఉన్నతికి కారణం కావాలి. ఆయనలో ఉన్న మంచిని పదిమందికీ చెప్పాలి తప్ప, దోషాల్ని కాదు. ఎక్కడో ఒక దోషం కనిపించగానే అతనిపట్ల వ్యతిరేకభావాల్ని పెంచుకుని గతంలోని వాటిని కూడా దుర్భిణీ వేసి వెతికి పట్టుకుని నిందలు వేయడం మన బలహీనతను సూచిస్తుంది.

 ఈ భావోద్రేకాలు ఒక్కొక్కసారి ఎక్కడిదాకా పోతాయంటే... చిన్నచిన్న విషయాలకు చచ్చిపోతానంటాడు. పరీక్ష ఫెయిలయ్యాడా చచ్చిపోతాడు. అదా పరిష్కారం ? అమ్మ కొట్టింది - ఏట్లో పడిపోయాడు, నాన్నగారు కొట్టారు - రైలు కింద తలపెట్టేశాడు, టీచర్ దెబ్బలాడాడు - కొండెక్కి కిందకు దూకాడు. ఇక ఎవరైనా లోకంలో అందంగా కనిపిస్తే మనం ప్రేమించేయడమే! కన్నవాడికి ఎన్ని ఆశలుంటాయి? వీడు ప్రేమించాట్ట - ఆ అమ్మాయి ఒప్పుకోలేదట - యాసిడ్ పోసేస్తాడట - లేకపోతే ఐదో అంతస్థు ఎక్కి దూకేస్తాడట! ఎంత అర్థంలేని జీవితం? కంటికి కనబడినవన్నీ కావాలన్నవాడు...

అదో గొప్ప సౌందర్యంగా భావించి, జీవితాంతం నేను సద్భావనతో స్నేహం చేయగల ఉత్తమురాలు అని ఎందుకు సంభావించలేడు? మంచి సంస్కారం ఉంటే మంచి ఆలోచనలొస్తాయి. ఇవి క్లాసురూములో వింటే వచ్చేవి కావు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఇంత ఎమోషనల్ ఫెలో జీవితంలో ఏం సాధిస్తాడు? తన పిల్లలకు కూడా తాను ఎలా ఆదర్శంగా నిలబడగలడు ? ఒక మంచి పొరుగింటి వ్యక్తిగా కానీ, ఒక మంచి అన్నగా కానీ, ఒక మంచి గురువుగా కానీ, ఒక మంచి ఉద్యోగిగా కానీ ఎలా అవుతాడు? ఇంత ఎమోషనల్‌గా ఉంటే తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలా ఉపయోగపడగలడు?

 అలాగే చిన్న కష్టం వచ్చిందనుకోండి. అయిపోతుందనుకున్నాడు... అయిపోలేదు. మృత్‌పిండంలా నేలవాలిపోకూడదు. మట్టిముద్దను చేత్తో పట్టుకుని ఉన్నప్పుడు అది చెయ్యిజారి కిందపడిందనుకోండి. అది నేలను అంటుకుపోతుంది. అదే... బంతి చేతిలో నుంచి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. మనిషి బంతిలా ఉండాలి. అంతేకానీ జీవితంలో ఏదైనా ఒక విషయం అనుకున్నట్లు జరగనప్పుడు బెంగ పెట్టుకోకూడదు. నెల్సన్ మండేలా, మహాత్మాగాంధీ వంటివారి జీవిత చరిత్రలు చదివితే తెలుస్తుంది - మహాత్ముల జీవితాలు వడ్డించిన విస్తళ్ళు కావు. ఎంత కష్టమొచ్చినా వారు నేలపడిపోలేదు. ఒక్క క్షణం నిర్వేదం పొందినా మళ్ళీ పుంజుకుని ముందుకెళ్ళారు.

 అందుకే చెబుతున్నా - ఎవరి జీవితంలోనైనా అన్నివేళలా విజయాలే ఉండవు. పడినా లేచి నిలబడడం చేతకావాలి. అలా కావాలంటే - భావోద్రేకాలలో సమతౌల్యత ఉండాలి.

 ఆధ్యాత్మిక పురోగతి
ఇక ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా నిరంతరం పురోగతిని సాధిస్తూనే ఉండాలి. ఆధ్యాత్మికత అన్నదానికి మీ స్థాయిలో మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దానికి పర్యాయపదాలు చెబుతాను - అవి వశవర్తి అగుట, లొంగి ఉండుట. లొంగకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఓఋద్ధిలోకి రాలేడు. ఒక ఏనుగు మావటికి లొంగితే, వశవర్తి అయితే దాని కుంభస్థలం మీద భగవంతుడి ఉత్సవమూర్తిని ఉంచి ఉరేగింపుగా తీసుకెడతారు. అది లొంగలేదనుకోండి స్వామిని దింపి, ఆ ఏనుగును తీసుకెళ్ళి ఇనుప గొలుసులతో కట్టేస్తారు. ఒకసారి ఒక ఏనుగు మాడవీథులలో ఊరేగింపు సమయంలో కట్టుతప్పి విచ్చలవిడిగా ప్రవర్తించినందుకు దానిని వేరుగా ఇనుప గొలుసులతో బంధించి ఉంచారు. తర్వాత దాన్ని అరణ్యంలో వదిలే ఏర్పాటు చేశారు.

 ఇంత బుద్ధినిచ్చి, మేధస్సునిస్తే ఎవరికీ లొంగకుండా, ఎవరిమాటకూ వశపడనన్నవాడిని ఏం చేయాలసలు? ఏనుగు కాబట్టి మావటి లొంగేటట్లు చేస్తాడు. మరి మనిషో! మనిషి స్వచ్ఛందంగా వశపడాలి. ఎవరికి వశపడాలి? తల్లికో, తండ్రికో వశపడాలి, అథవా భార్యకయినా వశపడాలి. జీవితాంతం తనతో కష్టసుఖాలు కలిసి పంచుకున్న భాగస్వామి, ఆమెకయినా వశపడాలి. అది క్రమేణా భగవంతుడికి వశపడేటట్లు చేస్తుంది. ఆధ్యాత్మికతకు అసలు అర్థం - భగవంతుడికి వశపడేటట్లు చేయడమే.

అంటే నాకంటే, నా బంధుమిత్రులకంటే, నా చుట్టూ ఉన్న ప్రపంచంకంటే శక్తిమంతుడైనవాడు ఒకడున్నాడని అంగీకరించడం. వాడికి లొంగితే, వాడికి నేను పూర్తిగా వశవర్తి అయితే వాడు ప్రసన్నుడై నాకు పెద్ద దిక్కయి ఉండగా ఇక నాకు ఎదురేముందన్న భావన. దీనితో నీ మీద, నీ శక్తిమీద నీకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రతి సంక్షోభంలోనూ నిన్ను చెయ్యిపట్టుకుని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement