పిల్లలకు క్షమాపణ చెప్పకూడదు! | don't say sorry to child | Sakshi
Sakshi News home page

పిల్లలకు క్షమాపణ చెప్పకూడదు!

Published Sun, Feb 28 2016 12:05 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

పిల్లలకు క్షమాపణ చెప్పకూడదు! - Sakshi

పిల్లలకు క్షమాపణ చెప్పకూడదు!

విద్య - విలువలు
అన్నీ నాకు తెలుసు-అన్న భావన అహంకారానికి కారణమౌతుంది. శంకరాచార్యుల వారు భగవంతుడిని గురించి ప్రార్థన చేయవలసివస్తే మొదట-’’అవినయమపనయ విష్ణో..’’ అంటారు. అంటే ‘‘శంకరా నాకు అవినయాన్ని తీసెయ్. వినయాన్ని కటాక్షించు’’ అని ప్రార్థిస్తారు. అవినయం అంటే అహంకారం. అలాగే వినయం ఎక్కడ ఉండాలో అది అక్కడ అలా ఉండాలి. ఎక్కడ వినయం ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించకూడదు. ఇది కూడా చాలా అవసరం. వినయమన్న మాటలోనే దాని అంతర్భావం దాగి ఉంది.

 ఉదాహరణకు నా కుమారుడిని నేను నిష్కారణంగా కోప్పడ్డాననుకోండి. నిష్కారణంగా అంటే పొరపాటున అని. నా కలం అక్కడ పెట్టుకున్నాను. అది కనబడలేదు. నా కుమారుడు  తీసి ఉంటాడన్న అనుమానంతో వాడిని చెడామడా తిట్టాను తీరా కాసేపాగిన తరువాత ఏదో వెదుకుతూ ఉంటే అంతకుమునుపు నేను సగం చదివి పెట్టిన ఒక పుస్తకంలో అది కనబడింది. అయ్యో పాపం, అనవసరంగా తిట్టానే వాణ్ణి. ఏడ్చాడు కూడా’’. అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి? నేను చాలా వినయశీలిని కనుక పిల్లలైనా, పెద్దలైనా నావల్ల తప్పు జరిగితే క్షమాపణ అడగాలనుకుని వాడి చేయి పట్టుకుని ’నాన్నా చాలా సారీ రా’’ అని అనాలి. కానీ అలా చేయకూడదు.

 ఎందుకంటే నా వినయం అవతలివాడి అవినయానికి కారణం కాకూడదు. రేప్పొద్ద్దున మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా కనబడక వాడిని అడిగితే ’అస్తమాను ఇలా అంటారేమిటి నాన్నా, వెళ్ళి ఏ పుస్తకంలో పెట్టుకున్నారో చూసుకోండి’’ అని వాడు నన్ను అనకూడదు. నేను ఎవరికి క్షమాపణ చెప్పాలంటే ‘‘ఈశ్వరా! ఈవేళ పుస్తకంలో కలం పెట్టుకున్న సంగతి మరిచి నా కుమారుడిని నిష్కారణంగా నిందించాను. వాడు ఏడ్చాడు. వాడిని బాధపెట్టాను. నన్ను మన్నించండి’’ అని వేడుకోవాలి. లేదా నా తల్లిదండ్రులు జీవించి ఉంటే, నా కుమారుడు చూడకుండా వెళ్ళి వారికి చెప్పుకోవాలి. దీనివల్ల కిందివాడి వినయం నిలబడుతుంది. నేను వినయంగా ఉండడం అవతలివాడి అవినయానికి ఎప్పుడూ కారణం కాకూడదు.

 నాకు తెలిసిన ఒక ఉన్నతాధికారికి కోపమొస్తే అవతలి వాళ్ళను భయపెడుతుండేవాడు. బెల్ కొట్టి మేనేజర్‌ని పిలిచి ‘‘వీడి పర్సనల్ ఫైల్ పట్రండి. వీడి  సంగతి చెప్తా. వారం రోజుల్లో తెలిసొస్తుంది’’ అనేవాడు. అవతలివాడు హడిలిపోయి వెళ్ళిపోయేవాడు. వాడు వెళ్ళిన పదినిమిషాలకే బెల్ కొట్టి మేనేజర్‌ని పిలిచి ఆ ఫైల్ తీసికెళ్ళిపొమ్మని చెప్పేవాడు. సార్ ఏం చేశాడని వాణ్ణి అంతలా భయపెట్టేశారని అడిగితే..‘‘వాడిని దెబ్బతీయడం చాలా తేలికండి. వీడి ఆశంతా డబ్బే కనుక ఒక ఇంక్రిమెంట్ కట్ చేయవచ్చు. వీడి క్రమశిక్షణారాహిత్యానికి ఫైల్ అడ్డుపెట్టుకుని వీడిని మార్చాలి తప్ప వీడిని నమ్ముకున్న కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తే ఎలా? నోరు చేసుకున్నా ఆలోచించి చేస్తానండోయ్. అలా తొందరపడి చర్య తీసుకోను సుమా. ఇదంతా వ్యవస్థను చక్కదిద్దడానికే.’’ అనేవాడు. నేను ఆయన పరిణతిని చూసి ఆశ్చర్యపోయే వాడిని. 

 వ్యవస్థను చక్కబరచడానికి ‘క్రోధమాహారయత్’ అంటాడు వాల్మీకి మహర్షి. అంటే కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలి తప్ప దానికి వశపడకూడదు-అని. ఒకసారి కోపానికి వశపడి పోయాడనుకోండి, ఇక వాడేమైపోతాడనేది ఎవరూ చెప్పలేరు.

 ఒకసారి క్రోధం గనుక ఆవహించిందా ఎవరూ పట్టుకోలేరు, గురువును కూడా చంపేస్తాడు. సర్వకా లాలలో మనుష్యజన్మ ఎత్తినవాడికి సంస్కారమనే మాటలో అత్యంత ప్రధానమైనదేది - అంటే వినయం కలిగి ఉండుట అంటే తలవంచగలిగి ఉండుట.

 ’పెద్దలపొడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతుల్ చేయువాడు’

 ఎవరైనా పెద్దలు ఎదురైతే ఒక సేవకుడు ఎలా నమస్కారం చేస్తాడో ప్రహ్లాదుడు అలా నమస్కారం చేసేవాడట. ఇప్పటికీ మనం గమనిస్తే పెద్దలైనవారి జీవితాల్లో వాళ్ళు పాటించినన్ని నియమాలు, వాళ్ళు చూపించినంత గౌరవం, వాళ్ళు అలవరచుకున్నంత  వినయం వాళ్ళని అంతటి పైస్థాయికి తీకెళ్ళి నిలబెట్టాయనిపిస్తుంది.

 తూర్పుగోదావరి జిల్లాలో రామకృష్ణావధాన్లుగారని గొప్పవేద పండితుడున్నాడు. వారి కిప్పుడు 80 ఏళ్ళు. సందర్భవశాత్తూ వారి గురువుగారిని ఆయన ప్రస్తావించిన ప్రతిసారీ ఆయన కళ్ళవెంట, ముక్కుల వెంట నీళ్ళు ధారగా ప్రవహిస్తాయి. గొంతు గాద్గదికమౌతుంది. గురువుగారితో ఆయనకున్న అనుబంధం అది. ఒకసారి తుపాను వచ్చి యానాం అంతా కొట్టుకుపోయింది. ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఒక సంపన్నుడొచ్చి డబ్బిస్తే ‘‘ఒరే నాయనా, నేను పందిట్లో ఉన్నా ఫరవాలేదు’’ అని పక్కనే ఉన్న శివాలయాన్ని ఉద్ధరింపచేసాడు. అయినా ఆ సంపన్నుడు మళ్ళీ వచ్చి డబ్బు కట్ట అక్కడ పెట్టబోతే...’’దీనికంటే వీలయితే నాకు ఇంకొక విద్యార్థిని అప్పచెప్పు. వాడికి వేదం చెబితే ఈ జీవితానికి సార్థకత. ఆ వేదమంత్రాలతో వాడు ఊరికి ఉపకారం చేస్తాడు. మా గురువుగారిలా నేను ఓ పదిమందికి పాఠం చెబితే చాలు.’’ అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అదే వినయం, అదే విధేయత. ఇంతంత పాండిత్యం ఉన్న వారికి ఇంతంత పెద్ద పెద్దపదవుల్లో ఉన్న వారికి ఇంత వినయమా అని ఆశ్చర్యమేస్తుంది. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందనే సామెత ఉత్తిగా రాలేదు.

 ఈ లోకంలో వినయానికి పరాకాష్ఠ హనుమ. ఆ తర్వాత శంకర భగవత్పాదులు. హనుమంతుడిని స్మరిస్తే చాలు, అన్ని సద్గుణాలూ అబ్బుతాయి. హనుమ నాకొరకు’ అని జీవితం మొత్తంమీద చేసుకున్న పని ఒక్కటీ లేదు. చివరికి పెళ్ళికూడా అంతే. ఆయన ఎంత వేగంగా వెళ్ళగలడో అంత నిశ్చలంగా కూర్చొని ధ్యానం చేయగలడు. ఎంతటి శక్తిమంతుడో అంతటి వినయశీలి, అంతటి ఇందియ నిగ్రహం కల్గినవాడు ఆదర్శప్రాయుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement