ఆలోచనల్లో స్పష్టత... అప్రమత్తత
విద్య - విలువలు
‘వ్యక్తిత్వ వికసనం’ అన్న అంశంలోని ఐదు లక్షణాల్లో మొదటిదైన ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. రెండవది అత్యవసాయం. అంటే ఆలోచనల్లో అప్రమత్తత. దీన్ని ఆంగ్లంలో మెంటల్లీ అలర్ట్ అంటారు. మీరు ఎక్కడికి ఎప్పుడు వెడుతున్నా మీకో స్పష్టత ఉంటుంది. నేను ఒక సభకు వెడుతున్నాననుకోండి. పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వెడుతున్నప్పుడు రామాయణ, భారత, భాగవతాదులు, శివుడి అష్టమూర్తితత్త్వం వంటి విషయాలపై ప్రవచనాలు చెప్పకూడదు కదా! పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వెళ్లేటప్పుడు ప్రతి మాటా పిల్లలకు పనికివచ్చేదే మాట్లాడుతున్నానా అని నేను నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి. అదీ అలర్ట్‌గా ఉండడం అంటే. అది ఆలోచనల్లో స్పష్టతను ఏర్పరుస్తుంది. నేను మా నాన్నగారి దగ్గరికి వెడుతున్నాను.
ఈ పని చెయ్యవచ్చా, చెయ్యకూడదా, ఇది చేస్తే మంచిదా, చెయ్యకపోతే మంచిదా? అని నేను మా నాన్నగారిని అడగబోతున్నాననుకోండి. మనసులో ఒక స్పష్టత ఉండాలి. నేను ముందే ఒక నిర్ణయం చేసేసుకుని, మా నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేయకూడదు. నాన్నగారు విజ్ఞులు, అనుభవజ్ఞులు. వారికి తెలుసు. నాన్నగారూ! ఇలా చెయ్యమంటారా? అని అడుగుతాను. ఇలా చెయ్యి అంటే అలానే చేసేస్తాను. వద్దంటే మానేస్తాను. అంతే తప్ప ముందే నిశ్చయం చేసేసుకుని, అది ఒప్పుకునేటట్లు ఆయనపై ఒత్తిడి తేవడానికి నేనెళ్లకూడదు. అలా చేస్తే నేను అడగడానికి వెళ్లలేదు, నేననుకున్నది సాధించుకోవడానికి వెళ్లినట్లు లెక్క. అలా ఉండకూడదు. స్పష్టత ఉండాలి.
మన శ్రేయస్సు కోరి ఆయన సభలో మాట్లాడుతున్నాడు. అవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. వాటిని అనుసరించడానికి అవేమైనా కష్టమైనవా? ప్రతిరోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చెయ్యండని ఆయన చెబుతున్నారు. అది మంచి సలహానా, దోష భూయిష్టమైనదా? మంచి విషయమని మీరు నమ్మారనుకోండి, దాన్ని కచ్చితంగా పాటించడానికి సిద్ధపడి ఉండాలి. మీ మనసు అందుకు సిద్ధంగా లేదనుకోండి. ఉపన్యాసం విని కూడా రేపు మీరు ఒక్క అరగంట నడవడం కానీ, 10 నిమిషాలు పరుగెత్తడం కానీ, నాలుగు బస్కీలు తియ్యడం కానీ చెయ్యలేదనుకోండి. అప్పుడు ఎన్ని విన్నా అది ఒక వినోద ప్రక్రియలాగా ఉంటుంది.
శోభానాయుడిగారి నృత్యం చూడడానికి వెళ్లాం. ‘పద్మావతీ కళ్యాణం’ ఆమె ఎంత బాగా చేశారో! అంటాం. అంతే తప్ప ఆవిడ ఎలా చేశారో చేసి చూపే ప్రయత్నం చేయం. సాధ్యం కాదు. అది మనసు సంతోషం, ఉల్లాసం పొందడానికి. కానీ మన మంచి కోరి ఎవరైనా చెబుతుంటే వాటిని వినడం ఎందుకంటే జీవితంలో పాటించడానికి. అంతే తప్ప- ‘‘చాలా బాగా చెప్పారండీ’’ అని ఆయనకు కితాబివ్వడానికి కాదు. అవి మనకు ఉపయోగపడతాయనుకున్నప్పుడు వాటిని ఆచరణలోకి తెస్తే ఆయన శ్రమకు, ఆర్తికి ఫలితం లభిస్తుంది. అదీ స్పష్టత. మెంటల్లీ అలర్ట్. అది అలవాటయితే మీరు ఏ పనిమీద ఉంటే మీ మనసు దానియందే లగ్నమై ఉంటుంది.
ఆడుకోవడానికి వెళ్లారు. ఆటల్లో పూర్తిగా మునిగిపోతారు. పూజ చేసుకోవడానికి వెళ్లారు, పూజలో నిమగ్నమైపోతారు. అంతేతప్ప పూజ చేయడానికి వెళ్లి కాలేజి గురించి ఆలోచించడం, క్లాస్‌రూమ్‌లో కూర్చుని పాఠం వింటూ ‘అయ్యో, నేను ఈవేళ పూజ సరిగా చేసుకోలేకపోయాను’ అని చింతించడం, అమ్మతో కఠినంగా మాట్లాడడం, ఆ తరువాత బయటికెళ్లి ‘అనవసరంగా అమ్మతో దెబ్బలాడానేమో, పాపం బాధపడిందేమో’ అని ఏడవడం, ఇంటికెడితే చులకనైపోతానేమోననే అయోమయం... అన్నీ అయోమయమే. జీవితంలో ఏ ఒక్క విషయంలో స్పష్టత ఉండకపోతే ఎలా!
జీవితంలో ఏది చేస్తున్నా ఇది నేనెందుకు చేస్తున్నాననే విషయంలో స్పష్టత ఉంటే మీకు జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా వాటిని అనాయాసంగా అధిగమించగలుగుతారు. తెల్లవారుఝామున 5గంటలకు లేవాలని అలారం పెట్టుకుంటారు. దాని పేరే అలారం. అంటే నీవు ఇప్పుడు లేవకపోతే ప్రమాదంలో పడిపోతావు అనే హెచ్చరిక అది. నీవు మోగమంటేనే అది మోగింది. లేచి దాని నోరు నొక్కేసి మళ్లీ వెళ్లి పడుకుంటే... ఏదీ స్పష్టత? ఒకసారి చేద్దామనుకోవడం, ఒకసారి వద్దనుకోవడం, ఒకసారి చేయడం, మరోసారి ఇంకోలా చేయడం. అది జీవితాన్ని ఆయోమయం పాలు చేస్తుంది
సినిమా చూడ్డానికి వెళ్లాడు. దేనికెళ్లాడు? వినోదించడానికెళ్లాడు. సినిమాలో చెప్పిన విషయాలు ఆదర్శంగా తీసుకొమ్మనమని ఎవడు చెప్పాడు? సినిమా ఎప్పుడైపోతుందంటే... అందులో వాడనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. నీవు జీవితంలో అలా చేసుకుంటే అయిపోతుందా? అయిపోదు. అక్కడ మొదలవుతుంది నీ జీవితం. సినిమా ఎంతవరకో అంతవరకే. దాన్ని జీవితంలోకి తెచ్చుకోవడమేమిటి? సినిమాలో ప్రేయసీ ప్రియులు పార్కుల్లో పాటలు పాడతారు, నృత్యాలు చేస్తారు. అలా చేస్తున్న ప్రేయసీ ప్రియులను నేనెక్కడా చూడలేదు నిజ జీవితంలో.. సినిమాలో చూపించినట్లు బయట ఉండదు. సినిమాలో వందమందిని చితకబాదినవాడు బయట చీపురుపుల్లలాంటివాడు. చెయ్యెత్తితే కిందపడిపోతాడు. అవన్నీ నిజాలు కావు, నటనలు. అందులో నటుడు నిజ జీవితంలో కోటీశ్వరుడు. భారతదేశంలో బయటికొస్తే వెంటపడతారని, సింగపూర్ వెళ్లి షాపింగ్ చేస్తుంటాడు. ఆయన మీకు ఆదర్శం ఏంటి? వినోదాన్ని వినోదం వరకే తీసుకోవడం అలవాటు చేసుకోండి.
పెద్దల దగ్గరికెళ్లావు- ‘‘ఇవిగో ఇవీ నా ఆలోచనలు. ఈ ఈ విషయాల్లో నాకు మీ మార్గదర్శనం కావాలి’’ అని స్పష్టంగా అడగగలగాలి. నిద్రపోవడానికి వెళ్లావు. అన్ని అలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా నిద్రపో. మళ్లీ రేపు నిద్ర లేచిన తరువాతే ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకో. తరగతి గదిలోకి వెళ్లావు. పాఠం వినడమే ప్రయోజనం. బండి నడుపుతున్నావు మరో ఆలోచన లేకుండా నడపడమే నీ ప్రయోజనం. మనసు పరధ్యానంగా ఉంచి బండి నడిపితే ఏమవుతుందో... జీవితంలో స్పష్టత కోల్పోయిన ప్రతి సందర్భంలో అవే అనుభవాలు ఎదురవుతాయి. దీన్నే మెంటల్లీ అలర్ట్ అంటాం. ఆలోచనల్లో స్పష్టత, అప్రమత్తత. ఇవి రావాలంటే మిమ్మల్ని మీరుగా ప్రతిక్షణం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రయత్న పూర్వకంగానూ, అభ్యాసం మీద ఇది అలవాటు చేసుకోండి.