జారుడుమెట్లపై జర్నలిజం | shekhar gupta article on journalism values | Sakshi
Sakshi News home page

జారుడుమెట్లపై జర్నలిజం

Published Sat, Oct 15 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

జారుడుమెట్లపై జర్నలిజం

జారుడుమెట్లపై జర్నలిజం

జాతిహితం
కార్గిల్ యుద్ధ కాలం నుంచి మనం, జర్నలిస్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, మన దేశ బలాన్ని బహుళంగా హెచ్చింపజేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజానికి ఆ రెండూ కూడా కాగలరు. సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ, డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్‌పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్‌గా మార్చేయడం ద్వారానో కాదు.
 
భారతీయ జర్నలిజం స్వీయ వినాశకమైదిగా ఎప్పుడు మారింది? మన జర్నలిజం స్వీయ వినాశం ఎప్పుడు మొదలైంది? లేదా అది స్వీయ వినాశక దిశగా పయనిస్తోందా? మీరు ఎంతగా అందరి దృష్టిని ఆకర్షించాలని కోరు కుంటారనే దాన్ని బట్టి మీరే ఈ ప్రశ్నను ఎలా వేయాలో ఎంచుకోండి. మొదటిది ఊరిస్తున్నా, మూడోదాన్ని నేను ఎంచుకుంటున్నాను. కాబట్టి ఇది రాస్తున్నది స్వీయ (సంస్థాగత) సానుభూతితో  కాదు... స్వీయశోధనను, చర్చను ఆహ్వానించడం కోసం. పైన పేర్కొన్న ప్రశ్నలను సున్నితంగా రూపొందించే ఇతర మార్గాలూ ఉన్నాయి.

జర్నలిస్టులమైన మనం మన ప్రభుత్వానికి అధికార ప్రతినిధులమని, ఇతరుల నైతికతా పరిరక్షకులమని,  మాతృభూమి రక్షణ కోసం పోరాడే సైనికులమని భావించడం ఎప్పడు ప్రారంభమైంది? ఇదేదో బ్రెజ్నెవ్ పాలనలోని సోవియట్ రష్యా ప్రభుత్వం అన్నట్టు జాతీయ భద్రతాపరమైన,  విదేశాంగ విధానపరమైన సమస్యలను ప్రశ్నించ డాన్ని నిలిపి వేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాం? చాలామంది పాత్రికేయులు-మన సీనియర్ సహా-మన దేశం గురించి మాట్లాడేటప్పుడు ‘‘మేం,’’ ‘‘మన,’’ ‘‘మనం’’ అనే పదాలను వాడటాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు ఎందుకని? మన విదేశాంగ, భద్రతా విధానాలను ఎందుకు  ప్రశ్నిం  చడం లేదు? ‘‘మీ అమెరికన్లకు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధం సంక్లిష్టమైన దని, అది మాకు హానికరమని మాకు తెలుసు. అయినా మీ ఆందోళనల పట్ల మేం సున్నితంగా ఉంటామని మీరు ఆశించజాలరు’’ ఇలా మాట్లాడుతు     న్నారు. భారత జర్నలిజంలో వచ్చిన ఈ మలుపుతో మనం తప్పును చూడటం మానేసి సమష్టి అధికారిక వ్యవస్థలో భాగంగా మారిపోయాం.

నిష్ఠుర నిజాలు చెప్పే వారేరి?
విదేశాంగ, సైనిక విధానాలకు సంబంధించి భారత పాత్రికేయులు మరింత ఎక్కువ అధికారపక్షవాదంతో ఉంటారని పాకిస్తాన్ పాత్రికేయులు ఎప్పుడూ అంటుంటారు. అతి తరచుగా పాక్ పాత్రికేయులు ధైర్యంగా అధికారిక విధానాలను ప్రశ్నిస్తుంటారు. కశ్మీర్ విధానం, ఉగ్రవాద గ్రూపులను పెంచి పోషించడం, పౌర-సైనిక సంబంధాలు వంటి సమస్యలు సైతం అలా వారు ప్రశ్నించే వాటిలో ఉన్నాయి. అందుకుగాను కొందరు పాత్రికేయులు ప్రవా సంలో గడపాల్సి వస్తోంది (రజా రూమి, హస్సెన్ హఖాని), లేదా జైలు పాలు కావాల్సి వస్తోంది (నజామ్ సేథి). భారత మీడియా గుడ్డిగా అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సమర్థిస్తుందని ఎవరూ అనరు. ఎల్‌టీటీ యీకి సైనిక శిక్షణను, ఆయుధాలను ఇచ్చి ప్రోత్సహించడాన్ని మన మీడియా ప్రశ్నించింది. అలాగే ఆ తర్వాతి కాలంలో భారత శాంతి భద్రతా దళాలను (ఐపీకీఎఫ్) పంపి శ్రీలంక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్నీ భారత పాత్రికేయులు ప్రశ్నించారు. ఆపరేషన్ బ్లూస్టార్ నుంచి బస్తర్, కశ్మీర్ లోయల వరకు సైన్యాన్ని ప్రయోగించడంపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఈ ధోరణి మారుతోంది. ఇది కేవలం ఉడీ ఉగ్రదాడి తదుపరి మాత్రమే మొదలైంది కాదు. తేలికపాటి ఆయుధాలు ధరించిన నలుగురు సైనికేతరులు (పాక్ ఉగ్రవాదులు) ఒక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ భద్రతా వలయాలన్నిటినీ ఛేదించుకుని అధీన రేఖ దాటి దాదాపు రెండు కిలోమీటర్లు లోపలికి ఎలా చొచ్చుకు పోగలిగారని ఒకే ఒక్క టీవీ జర్నలిస్టు కరన్ థాపర్ ‘ఇండియా టు డే’లో ప్రశ్నించారు. విస్పష్టమైన ఈ వైఫల్యంపై విమర్శనాత్మకమైన అంచ నాను వేసిన గౌరవనీయులైన రిటైర్డ్ జనరల్ ఒకే ఒక్కరు.. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ థిల్లాన్. ఆయన 1987లో ఇదే అక్టోబర్ రోజుల్లో జాఫ్నాలోకి పోరా డుతూ చొచ్చుకుపోయిన ఐదు బ్రిగేడ్లలో ఒక దానికి  నేతృత్వం వహించారు. ఆయన బ్రిగేడ్ అతి వేగంగా, తక్కువ నష్టాలతో జాఫ్నాకు చేరింది. ఆయన  వ్యర్థ ప్రలాపాలు చేయని, పాత కాలపు సైనికుడు. నేటి తెల్ల మీసాల ప్రైమ్ టైమ్ కమెడియన్లకు అయన ఒక మినహాయింపు. ఈ మార్పు కార్గిల్‌తో ప్రారంభమైందని నేను అంటున్నాను.

కార్గిల్‌తోనే మొదలైన పతనం
కార్గిల్ కథనం లేదా యుద్ధం మూడు వారాల సార్వత్రిక ఖండనలతో మొద లైంది. పాకిస్తానీలు తామక్కడ లేమని ఖండించారు, మన సైన్యం వారు అంత లోతుగానూ, అంత విస్తృతంగానూ ఏమీ చొరబడలేదంటూ ఖండిం చింది. రక్షణ శాఖ సహా ప్రభుత్వం ఆ ఘర్షణ పర్యవసానాలను గ్రహించ లేదు. అందువల్లనే సీనియర్ జనరల్స్ కంటే ముందుగా మీడియా ప్రతిని ధులే అక్కడికి వెళ్లారు. ఇది అనుద్దేశపూర్వకంగానే ప్రత్యక్ష సైనిక చర్యల్లో పాలొంటున్న సైనిక బలగాలతో మీడియా ప్రతినిధులు భాగం కావడానికి దారి తీసింది. ఎవరూ పథకం పన్నకుండానే వారి మధ్య వ్యక్తిగతమైన, వృత్తిపరమైన బంధం అభివృద్ధి చెందింది. దాని ఫలితం ఉపయోగకరమై నదే... స్వతంత్ర పాత్రికేయులను, సెన్సార్‌షిప్‌లేని మీడియాను అనుమతి స్తోంది కాబట్టి భారత్ విశ్వసనీయత పెరిగింది. మన సైన్యం ప్రదర్శిం చిన నమ్మశక్యంకాని పరాక్రమం గురించిన కథనాలు దేశానికంతటికీ చేరడం వల్ల సైన్యం లాభపడింది. పాత్రికేయులకు కూడా ఆ ప్రతిష్ట కొంత అంటుకుంది.

ఆ క్రమంలో కీలకమైన ఒక కథనానికి హాని జరిగినా ఎవరికీ పట్టలేదు... అంతమంది పాకిస్తానీలు అంత లోలోతులకు ఎలా చొచ్చుకు వచ్చి, పాతు కుపోయి కూర్చున్నారు? అది తెలుసుకోడానికి మనకు అంత ఎక్కువ కాలం ఎందుకు పట్టింది? విచారణ బృందాలను మనం అంత అర్థ మనస్కంగా (కాబట్టే చిన్న గస్తీ బృందాలు) ఎందుకు పంపినట్టు? భుజంపై నుంచి పేల్చే క్షిపణులకు అందే వైమానిక బలాన్ని పంపి రెండు విమానాలను ఎందుకు కోల్పోయాం? గుడ్డిగా నెలల తరబడి పాక్ చొరబాటును నిలువరించడంలో విఫలమైంది ఎవరు? ఈ చొరబాటు తీవ్రతను గ్రహించడంలో విఫలమైన వారంతా ఎవరు? ఇవేవీ పట్టని ఫలితంగానే, ఎవరి స్థానాలకూ ముప్పు రాలేదు.
 
మన యువ సైనికాధికారులు, సైనికుల ప్రతాపాన్ని గురించి చెప్పే హక్కు మనకుంది. అయితే మన సైనిక వ్యవస్థ సైనిక విధులను నిర్లక్ష్యం చేయకపోయినా... అది చూపిన బ్రహ్మాండమైన అసమర్థతకు సంబంధించిన కథనం వెలుగు చూడకుండా పోయేలా చేయడానికి రాజకీయ, సైనిక వ్యవ స్థను మనం అనుమతించడం తప్పు. అర్హులైన పలువురు కార్గిల్ యువ సైనిక యోధులకు గాలంట్రీ అవార్డులు లభించాయి. కానీ ఉన్నత స్థానాలలో ఉండి తప్పు చేసిన వారు చాలా వరకు తప్పించుకున్నారు. ఈలోగా భారత మీడి యాకు చెందిన మనం బలాన్ని ద్విగుణీకృతం చేయగలవారంగా కీర్తించ బడ్డాం. ఆ ఆనందంలో మునిగిపోయాం.

అదే సమయంలో మనం, జర్నలి స్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, బలాన్ని  హెచ్చింప జేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజా నికి ఆ రెండూ కూడా కాగలరు.  సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్‌పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్‌గా మార్చే యడం ద్వారా మాత్రం జరగదు. ఎప్పుడూ కాస్త సంయమనాన్ని చూపే టీవీ చానళ్లు సైతం ‘‘మళ్లీ కాలుదువ్విన పాకిస్తాన్’’ అంటూ కశ్మీర్ హెడ్‌లైన్స్‌ను చూపాల్సిన దుస్థితి. ‘‘శత్రు’’ ప్రతినిధులుగా ఖండిస్తున్నా లెక్కచేయకుండా నిష్టుర నిజాలను చెపే సిరిల్ అల్మెడాలు, ఆయేషా సిద్దీఖాలు (ఇద్దరూ పాక్ పాత్రికేయులే) మనకు లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
 
మన జర్నలిజం స్వీయ వినాశం... భారత టీవీ స్టార్లు (చాలావరకు) స్వచ్ఛందంగా తమను తామే కమెడియన్లుగా కాకున్నా ప్రచారకర్తలుగా దిగ జార్చేసుకోడానికి సంబంధించిన కథనంలో పెద్ద భాగం. వాణిజ్యపరంగా అది ఫలప్రదమైనదనేది, ప్రతిదాన్ని ప్రశ్నించే సంశయవాదాన్ని తుడిచిపెట్టే యడం వారిని ఊరిస్తుంది. లేదంటే ఊహాత్మకతతో మిఠాయి లాంటి ఫార్ము లాను కనిపెట్టి ఎన్నటికీ మరువలేని పాత గబ్బర్ సింగ్ (షోలే)కు సమాన మైన నేటి టీవీ యుద్ధ యోధుని అవతారమెత్తి ‘‘కిత్నే పాకిస్తానే థే?’’ అనొచ్చు. జర్నలిస్టులను ‘బలాన్ని బహుళంచేసే గుణకం’’గా నిర్వచించడాన్ని కీలక వ్యాపార అంశంగా (కేఆర్‌ఏ) అంగీకరించడంతో ఇక సందేహానికి లేదా ప్రశ్నించడానికి అవకాశమే ఉండదు. పాత కాలపు అశ్విక యోధునిలా ఇష్ట మొచ్చినట్టు వాగొచ్చు. అయితే అది శత్రువు ఉపగ్రహ కనెక్షన్‌కు అవతల ఉండగా ఇవతల సుఖప్రదంగా స్టుడియోలో కూచుని చేయొచ్చు.
 
రెండుగా చీలిన పాత్రికేయ ప్రపంచం
ఉడీ, తదుపరి ఘటనలే ఈ వాదనకు ప్రేరేపణ అనేది స్పష్టమే. అది మీడి యాను అత్యంత అసమానంగా చీలిపోయేట్టు చేసింది. ఒకటి, బాగా ఆధి క్యతను ప్రదర్శించే పక్షం. వారు ఏ ప్రశ్నలూ అడగకపోవడమే కాదు, ప్రభు త్వాన్ని, సైన్యాన్ని దాటేసి వారెన్నడూ చేయని ప్రకటనలను సైతం చేసేస్తారు. కాల్పనికమైన కమాండోల రాత్రి విన్యాసాల ‘‘ప్రాతినిధ్య’’ వీడియోలను వాటికి అండగా చూపిస్తారు, ఏ ఒక్కరికీ, నిజంగానే ఏ ఒక్కరికీ ఎలాంటి సాధికారతతో లేదా స్పష్టతతో మూడు వారాల క్రితం ఏం జరిగిందో తెలియదు. రహస్యాలను కాపాడటంలో ప్రభుత్వం ఆరితేరిపోయిందో లేక పాత్రి కేయులు లీకుల గురించి వెతకడం మానేశారో గానీ ఇది నిజం. ఎందుకో మీరే చూడొచ్చు. మరోవైపున, చిన్నది, కుచించుకుపోతున్న మరో భాగంగా ఉన్న వారు నిత్య సందేహులు. ప్రభుత్వం చెప్పిన దానికి ఆధారాలు లేకపోతే దాన్ని కొట్టిపారేస్తారు.

వాస్తవాలు లేనిదే వారు వెల్లడించే కథనాలూ ఉండవు. ప్రభుత్వం, తను చెప్పేదానికి ఆధారాలు చూపాలని వారు కోరుతారు. ప్రభు త్వాలు వాస్తవాలను దాస్తాయని, పాత్రికేయులు వాటిని కనిపెట్టాలని జర్న లిజం స్కూలుకు వెళ్లిన ప్రతివారికీ బోధిస్తారు. అత్యంత ఉదారవాదులు, ఉత్తమ విద్యావంతులు, ప్రతిష్టగల, సుప్రసిద్ధ సెలబ్రిటీ పాత్రికేయులు అంతా ఈ నిత్య సందేహుల జాగాలో ఉన్నారు. ఆధారాలు లేకుండానే గరం గరం వార్తలు తేకుండా, పత్రికా సమావేశాలను కోరుతున్నారు. అవతలి పక్షం మన శత్రువు కాబట్టి మీరు చెప్పేదానికన్నా ఎక్కువ నేను నమ్ముతాను, నాకు ఆధారాలు అవసరం లేదు అంటోంది ఒక పక్షం. మరో పక్షం.. మీరు చెబుతున్న ఆ సైనిక చర్యను బహిర్గతపరచండి లేదా మీరు అబద్ధం ఆడుతు న్నారంటాం అంటోంది. భారతీయ జర్నలిజం స్వీయ వినాశనానికి ఎందుకు పాల్పడింది? అని నేను ఇక అడగాల్సిన పనే లేదు.

శేఖర్ గుప్తా
twitter@shekargupta
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement