journalism
-
జర్నలిజం నేరం కాదు: జూలియన్ అసాంజే
వికీలీక్స్ వ్యవస్థపకుడు జూలియన్ అసాంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జర్నలిజం నేరం అని ఒప్పుకున్నందుకే విడుదల అయినట్లు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తొలిసారి మంగళవారం అసాంజ్.. స్ట్రాస్‌బర్గ్ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ ఆఫ్ యూరప్ హక్కుల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.‘‘నేను స్వేచ్ఛగా లేను. ఎందుకంటే వ్యవస్థ అలా సాగుతోంది. అయితే కొన్ని ఏళ్ల నిర్భందం తర్వాత నేను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నాను. దానికి గల కారణం జర్నలిజం నేరాన్ని ఒప్పుకున్నాను. అందుకే నిర్భందం నుంచి బయటపడ్డాను. చివరికి అవాస్తవమైన న్యాయం కంటే స్వేచ్ఛను ఎంచుకున్నా. నాకు న్యాయం ఇప్పుడు అసాధ్యంగా మారింది. నేను ప్రస్తుతం 175 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్నా. అయితే జర్నలిజం నేరం కాదు. పౌర సమాజానికి, స్వేచ్ఛకు ఒక మూల స్తంభం. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏం లేదు. కానీ, జర్నలిస్టులుగా తమ విధులు నిర్వహిస్తున్నవారిని విచారించవద్దు’ అని అన్నారు. అదేవిధంగా తాను ఖైదీగా ఉన్న సమయంలో తనకు సంబంధించిన భూమిని కోల్పోయానని తెలిపారు. నిజం చెప్పినందుకు శిక్ష, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చినట్లు అయిందని అసాంజే పేర్కొన్నారు."I want to be totally clear. I am not free today because the system worked. I am free today because after years of incarceration I pleaded guilty to journalism. I pleaded guilty to seeking information from a source" - Julian Assange, Council of Europe pic.twitter.com/N0Ix58CeSu— WikiLeaks (@wikileaks) October 1, 2024 గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను ఇటీవల అసాంజ్ అంగీకరించారు. దీంతో ఆయన్ను అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా బ్రిటన్‌లో జైలు జీవితం అనుభవిస్తున్న అసాంజే.. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో విడుదలకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ఇదీ నేపథ్యంఇరాక్, అఫ్గానిస్తాన్ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్ చేసి జూలియన్ అసాంజే సంచలనం సృష్టించడం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అసాంజే స్థాపించిన వికీలీక్స్ అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియో వంటివి వీటిలో ఉన్నాయి.అఫ్గాన్ యుద్ధానికి సంబంధించి 91,000కు పైగా పత్రాలనూ వికీలీక్స్ విడుదల చేసింది. తర్వాత ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజ్‌పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజే అరెస్టుకు స్వీడన్ కోర్టు 2010 నవంబర్‌లో ఆదేశించింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.చదవండి: WikiLeaks: అసాంజ్‌కు విముక్తి -
జర్నలిజంలో గోపాలకృష్ణకు గోల్డ్ మెడల్
జర్నలిజంలో విస్తృత పరిశోధన చేసిన గోపాలకృష్ణకు గోల్డ్‌మెడల్ లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక పత్రికలు - భాష, విషయ విశ్లేషణ అన్న అంశంపై M Phil పరిశోధన చేసిన సీనియర్ జర్నలిస్ట్ మల్లాది వెంకట గోపాలకృష్ణకు శ్రీ బొప్పన్న స్మారక స్వర్ణ పథకం లభించింది. రవీంద్ర భారతిలో జరిగిన విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గోపాలకృష్ణ స్వర్ణ పథకాన్ని అందుకున్నారు. జర్నలిజం కమ్యూనికేషన్ థియరీస్, ఆధ్యాత్మికత, తెలుగు భాష అనే నాలుగు విస్తృతమైన పరిధి కలిగిన రంగాలను మేళవించి, ప్రతిపాదనలు చేసి శాస్త్రబద్ధంగా ఆ ప్రతిపాదనను నిరూపించినందుకు గాను మల్లాది పరిశోధన స్వర్ణ పథకానికి ఎంపికయింది. సబ్ ఎడిటర్ కం రిపోర్టర్ గా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి పలు ఛానళ్లు, పత్రికల్లో పని చేసిన మల్లాది తనదైన శైలిలో ప్రతిభను కనబరిచారు. కవి, రచయిత, భాషావేత్తగా, అనువాదకుడు. బోధకుడిగా నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా రాణించారు. పరిశోధన రంగంలో విస్తృతంగా పని చేసిన మల్లాదిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు తంగడి కిషన్ రావు, రిజిస్ట్రార్, గైడ్ ఆచార్య కడియాల సుధీర్ కుమార్, ఆచార్య వెంకటరామయ్య అభినందించారు. పథకాలు అందుకున్న పరిశోధక విద్యార్థిని విద్యార్థులందరికీ గవర్నర్ తమిళసై శుభాకాంక్షలు తెలిపారు. -
ఐటీ నోటీసులిస్తే మీకది వార్త కాదా?
సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు జర్నలిజంపై గౌరవాన్ని పూర్తిగా దిగజారుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిస్తే ఆ పత్రికల్లో కనీసం వార్త కూడా ప్రచురించకపోవటానికి మించి దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో మీకు నచ్చిందే రాస్తారా? అని నిలదీశారు. మంగళవారం సచివాలయం వద్ద మంత్రి సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పకపోవటాన్ని బట్టి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చాలాసార్లు తప్పించుకున్నారు. ఆయన అక్రమాల్లో ఐటీ శాఖ గుర్తించింది అవగింజంతే. ‘సీబీఐ, ఈడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తక్షణం అదుపులోకి తీసుకోవాలి. చంద్రబాబు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో అందరికీ తెలుసు. రాజధానిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రూ.ఐదు లక్షలు దాటిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా పోలవరంలో నామినేషన్‌పై రూ.వేల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఎంతో కాలం తప్పించుకోలేరు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌లా జైలుకు వెళ్లక తప్పదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాననే పవన్‌కళ్యాణ్ దీనిపై ఎందుకు స్పందించరు?’ అని మంత్రి సత్య నారాయణ నిలదీశారు. -
బాబును రాష్ట్రం నుంచి బహిష్కరించాలి
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు ప్రమాదకరం. ప్రతిపక్షాలు విధానపరమైన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అధికారం కోసం అమాయకులను రెచ్చగొట్టడం సమంజసం కాదు. అసమర్థుల ఆఖరి అస్త్రమే హింస. పుంగనూరు, అంగళ్లు ఘటనలను నివారించాల్సిన చంద్రబాబు.. ఆయనే కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయించడం హేయమైన చర్య. రాజ్యాధికారాన్ని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి, రాజకీయాల నుంచి బహిష్కరించాలి. తనపై పోలీసులు కేసు నమోదు చేస్తే స్పందించిన చంద్రబాబు.. దాడుల్లో గాయపడిన పోలీసులకు సంఘీభావం తెలియజేయకపోవడం ఆయన నీచత్వానికి పరాకాష్ట. అదేవిధంగా కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ ఏకపక్షంగా వార్తలు రాస్తూ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయి. అల్లరిమూకల దాడిలో కన్ను పోగొట్టుకున్న కానిస్టేబుల్, గాయపడిన 30 మంది పోలీసుల గురించి ఒక్కమాట కూడా రాయకపోవడం సిగ్గుచేటు. ఇదేమి జర్నలిజం..’ అని వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్‌లో హింసా రాజకీయాలు–కట్టడి–మీడియా పాత్ర’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు హింసా రాజకీయాలపై ప్రజలకు వాస్తవాలను తెలిపేలా ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. అనిశ్చితిని పెంచే కుట్ర ఎన్నికలు సమీపిస్తుండటంతో హింసా ధోరణిని పెంచి ప్రజల్లో అనిశ్చితిని సృష్టిస్తున్నారు. దానిని తిరిగి పాలకపక్షంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హింసను ప్రభుత్వం అరికట్టలేకపోతోందని ఒక వర్గం మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో కార్యకర్తలు చావులకు సిద్ధపడి రావాలని పిలుపునివ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. లోకేశ్ సైతం ఎక్కువ కేసులు ఉన్నవారికి పదవులు కట్టబెడతామని చెప్పడం హింసా రాజకీయానికి నిదర్శనం కాదా!. ప్రజలు ఇవన్నీ గుర్తించాలి. హింసను ప్రోత్సహించేవారికి బుద్ధి చెప్పాలి. – మేడపాటి వెంకట్, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు రూట్ మ్యాప్‌ను ఎందుకు మార్చారు? చంద్రబాబు ప్లాన్ ప్రకారమే తన పర్యటన రూట్ మ్యాప్‌ను పుంగనూరు ఊరిలోకి మార్పు చేసినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే పోలీసులు కాల్పులు జరుపుతారని, అప్పుడు తమ కార్యకర్తలు చనిపోతే సానుభూతి పొందవచ్చని పథకం రచించారు. సభకు వచ్చేటప్పుడు వ్యాన్లలో రాడ్లు, తుపాకులు తీసుకురావడమే ఇందుకు నిదర్శనం. కానీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. – చెన్నంశెట్టి చక్రపాణి, మాజీ పోలీసుల అధికారి దిగజారిన ప్రతిపక్షాలు నాలుగేళ్లుగా ప్రభుత్వంపై దాడి జరుగుతూనే ఉంది. ప్రతిపక్షాలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. బాధితులను పట్టించుకోకుండా దాడులకు పురిగొల్పిన వారిని కొన్ని పత్రికలు, చానళ్లు వెనకేసుకురావడం క్రూరమైన చర్య. మేనిఫెస్టోను అమలు చేయని ప్రభుత్వాలను రీకాల్ చేయాలి. అప్పుడు చంద్రబాబు లాంటి నాయకులు నిలవలేరు. – చలాది పూర్ణచంద్రరావు, ఏపీ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు పవన్.. బలిదానాలు ఎందుకు? ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇది నచ్చకనే చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేశ్.. దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆత్మబలిదానాలకు సిద్ధం కావాలని జనసేన కార్యకర్తలకు చెబుతున్నారు. ఎవరి ఆత్మను ఎవరు బలి తీసుకుంటారు. ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకులుగా ప్రజల మేలుకోరే సూచనలను చేశారా?. – సునీత, మూరుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు చంద్రబాబుపై సివిల్ వార్ తప్పదు హింసను ప్రేరేపిస్తున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబుపై పోలీసులే తిరగబడే రోజు వస్తుంది. ఇకపై సివిల్ వార్ ప్రారంభమవుతుంది. అప్పుడు బయటకు రావాలంటేనే బాబు భయపడక తప్పదు. చంద్రబాబు తనను ప్రశ్నించిన వ్యక్తి రక్తం చూస్తాడు. ఈ విషయం అనేకసార్లు రుజువైంది. – మాదిగాని గురునాథం, ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిపక్షాల తీవ్రవాద రాజకీయం ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి అరాచక పరిస్థితులు కనిపించలేదు. అధికారం కోసం అర్రులు చాస్తూ.. హింసాత్మక ధోరణిని అవలంబిస్తున్నారు. ప్రతిపక్షాలు తీవ్రవాద రాజకీయాలు చేస్తున్నాయి. పుంగనూరులో పోలీసులపై దాడి గురించి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఇందులో ఆరు సెక్షన్ల ప్రకారం చంద్రబాబు నేరాలకు పాల్పడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అరాచక తీవ్రవాద రాజకీయాలను మొగ్గలోనే తుంచాలి. –వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు, పవన్ చీడపురుగులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు పెంచాలని సీఎం జగన్ చూస్తుంటే... ప్రతిపక్షాలు మాత్రం జనం చావులను కోరుకుంటున్నాయి. చంద్రబాబు చేసే ప్రతి పనిలోనూ హింస దాగుంటుంది. కార్యకర్తలు చనిపోతే వారి శవాలపై నుంచి వచ్చి అధికారం పొందాలని ప్లాన్ వేశారు. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ గుంటూరు కన్వినర్ రక్తపాతాన్ని కోరుకుంటున్న బాబు చంద్రబాబు ఓ ఘోరీ, ఓ గజినీ మహ్మద్ మాదిరిగా రక్తపాతాన్ని కోరుకుంటున్నారు. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తున్నారు. విధి నిర్వహణలో మహిళా సీఐ ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొడితే వీరంగం చేసిన వికృత రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్.. ఇంతమంది పోలీసులకు గాయాలైతే ఎందుకు నోరు మెదపడంలేదు. అధికారాన్ని ప్రజల మనసుల ద్వారా గెలుచుకోవాలి. – విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు కన్నుపోయిన కానిస్టేబుల్పైసానుభూతి చూపరా..? రాష్ట్రంలో హింసా రాజకీయం పేట్రేగుతోంది. దీనిపై మేధావులు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు ప్రజలను అప్రమత్తం చేయాలి. అసలు హింసకు పాల్పడినవారెవరో, బాధితులెవరో అందరికీ తెలిసినా కొన్ని పత్రికలు, చానళ్లు పోలీసులదే తప్పని వక్రీకరించి వార్తలు రాయడం, ప్రసారం చేయడం సిగ్గుచేటు. కన్ను కోల్పోయిన కానిస్టేబుల్‌పై కనీస సానుభూతి చూపని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. పుంగనూరు, అంగళ్లులో పోలీసులు దెబ్బలు తిని ప్రజల ప్రాణాలు కాపాడారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ -
నిరాధార వార్తలు.. జర్నలిజం విలువలకు వ్యతిరేకం: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: నిరాధార వార్తలను ప్రచురించడం ప్రసారం చేయడం జర్నలిస్టు విలువలకు వ్యతిరేకమని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆన్ లైన్ అవగాహన సదస్సులో జర్నలిజం డిప్లమో విద్యార్థులను, వర్కింగ్ జర్నలిస్టుల్ని ఉద్దేశించి "వార్తా రచన-నిజ నిర్ధారణ " అంశం పై సీనియర్ జర్నలిస్టు, యూనిసెఫ్ మీడియా అవార్డు గ్రహీత ఉడుముల సుధాకర రెడ్డి ప్రసంగానికి ముందు ఆన్ లైన్ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు పాఠశాలలో గొడుగులతో విద్యార్థుల ఫోటోలు, వీడియోలు తీసి, వర్షానికి తడిసి పోతున్నట్లు వార్తా కథనాలను ప్రచురించడం, ప్రసారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పాఠశాలను అధికారులు సందర్శించి దానిని "ఫేక్ న్యూస్" గా నిర్ధారించి చట్ట పరమైన చర్యలకు ఉపక్రమించారన్నారు. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? ఒక పక్క ప్రభుత్వం పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి దశలవారీగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోన్న సంగతి తెల్సినా, ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఇలా కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు వ్యవహరించడం రాష్ట్రం లో సర్వ సాధారణమైపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు, నైపుణ్యం పెంచడం మీడియా అకాడమీ బాధ్యత అని, అందుకే "వార్తా రాచన - నిజ నిర్ధారణ ", అంశం పై సీనియర్ జర్నలిస్టు, యూనిసెఫ్ మీడియా అవార్డు గ్రహీత ఉడుముల సుధాకర రెడ్డి ప్రసంగం ఏర్పాటు చేశామని ఆయన తమ అధ్యక్షుని తొలి పలుకుల్లో పేర్కొన్నారు. -
'నాటా అవార్డు ఇన్ జర్నలిజం-2023'ని అందుకున్న కొమ్మినేని
ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ - నాటా అవార్డు ఇన్ జర్నలిజం–2023 అందుకున్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో డల్లాస్ కన్వెక్షన్ సెంటర్లో జరిగిన నాటా మహాసభల్లో కొమ్మినేని ఈ అవార్డును అందుకున్నారు. నాటా ఆధ్వర్యం లో ప్రతి రెండేళ్ల ఒకసారి జరిగే తెలుగు మహాసభలు.. ఈ ఏడాది అమెరికాలోని డల్లాస్ లోని "డల్లాస్ కన్వెన్షన్ సెంటర్"లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్యాంక్వెట్ డేతో ప్రారంబమైన ఈ వేడుకలు జులై 2 వరకు జరగనున్నాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాలలోని ప్రముఖులను, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన పెద్దలను ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా.. 46 సంవత్సరాల పాటు వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేసిన అనుభవం, కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిజం విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. (చదవండి: 'నాటా’ అవార్డు ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ–2023కు కొమ్మినేని ఎంపిక ) -
‘నాటా’ అవార్డు ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ–2023కు కొమ్మినేని ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) అవార్డు ఇన్ జర్నలిజం–2023కు ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈ నెల 30 నుంచి జులై 3వ తేదీ వరకు అమెరికాలోని డల్లాస్ నగరంలో డల్లాస్ కన్వెక్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కొమ్మినేని అందుకోనున్నారని మీడియా అకాడమీ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఆయా రంగాల్లో చేసిన విశేష కృషికి నాటా ఉత్సవాల సందర్భంగా అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తారు. 46 సంవత్సరాల పాటు వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేసిన అనుభవం, కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిజం విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నాటా” ఆహ్వానం మేరకు సి. ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు ఈ నెల 29న (గురువారం) పయనమౌతున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యం లో ఏటా జరిగే తెలుగు ప్రజల ఉత్సవాలను యీ ఏడాది (2023) అమెరికా లోని డల్లాస్ లోని "డల్లాస్ కన్వెన్షన్ సెంటర్"లో నిర్వహిస్తున్నారు. జూన్ 30 నుండి జులై 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాలలోని ప్రముఖులను, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన పెద్దలను సన్మానించడం జరుగుతుంది. 2023 సంవత్సర "నాటా అవార్డు ఇన్ జర్నలిజం ఎక్స్ లెన్స్" అవార్డును అందుకునేందుకు శ్రీ కొమ్మినేని శ్రీనివాస రావు అమెరికాకు జులై 1 నాటికి చేరుకుంటారు. తిరిగి జులై 16న విజయవాడ చేరుకుంటారు. ఇది కూడా చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
విలువలతో కూడిన జర్నలిజం అవసరం
-
జర్నలిజం సామాజిక బాధ్యత: హరీశ్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: జర్నలిజం పవిత్రమైన వృత్తే కాదు.. సామాజికమైన బాధ్యత కూడా అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులు, కవులను ఆర్ఎస్ఎన్ అవార్డులతో సత్కరిం చారు. ఈ సందర్భంగా కలాలకు సలామ్ అనే సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాసమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని కొని యాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం రూ. 42 కోట్లు కేటాయించిందని... జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం కోసం సీఎం యోచిస్తున్నారని హరీశ్‌రావు వివరించారు. అనంతరం కామారెడ్డి సాక్షి విలేకరి ఎస్.వేణు గోపాలచారికి ద్వితీయ అవార్డుతోపాటు మరి కొందరు జర్నలిస్టులు, కవులను ఆర్ఎస్ఎన్ అవార్డులతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ఎన్ సేవా ఫౌండేషన్ ట్రస్టీ ఆర్.సత్యనారాయణ, టీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఆర్ఎస్ఎన్ అవార్డు జ్యూరీ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.రామచంద్ర మూర్తి, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
హోడ ఖామోష్..: అఫ్గాన్ అగ్నితేజం
టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితా (100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2022)లో చోటు సంపాదించిన వారిలో అఫ్గానిస్థాన్ అగ్నితేజం హోడ ఖామోష్ ఒకరు. ‘ఖామోష్’ అనేది పేరు కాదు. లక్షల గొంతుల రణనినాదం... ఇరాన్లో జన్మించింది హోడ ఖామోష్. తాను చిన్న వయసులో ఉన్నప్పుడే కుటుంబంతో పాటు అఫ్గానిస్థాన్‌కు వచ్చింది. ఆరోజుల్లో తనకు నిద్ర పట్టాలంటే అమ్మ తప్పనిసరిగా ఏదో ఒక కథ చెప్పాల్సిందే. అలా ఖామోష్ కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆ ప్రపంచంలో ఎన్నో కథలు చదివింది. ఎన్నో కవిత్వాలు విన్నది. తొలిరోజుల్లో తన కాల్పనిక ప్రపంచంలో వాస్తవాలతో సంబంధం లేని ఊహాకల్పిత సాహిత్యం మాత్రమే ఉండేది. ఆ తరువాత కాలంలో మాత్రం...తన ప్రపంచంలోకి వాస్తవికత నడిచి వచ్చింది. రాజులు, రాణులు, అందమైన కోటలు, అద్భుత దీపాల స్థానంలో... నిజమైన సమాజం దర్శనమిచ్చింది. మనుషులు ఎదుర్కొనే రకరకాల సమస్యలను గురించి లోతుగా తెలుసుకోగలిగింది. తన మనసులోని వేడివేడి భావాలను కవిత్వంగా రాసేది. ‘సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజం తరఫున పనిచేయడానికి ఇది మాత్రమే చాలదు’ అనుకొని జర్నలిస్ట్ కావాలనుకుంది. ఖామోష్ ఆలోచనను హర్షించిన వారు తక్కువ. భయపెట్టిన వారు ఎక్కువ. అయితే అవేమీ తన కలను అడ్డుకోలేకపోయాయి. జర్నలిజంలో శిక్షణ పొందిన ఖామోష్ ఆ తరువాత స్థానిక పత్రికలలో పనిచేసింది. స్త్రీల హక్కులు, ఉద్యమాలపై ప్రత్యేకకథనాలు రాసింది. లోకల్ రేడియో ఛానల్స్ ప్రెజెంటర్‌గా తన గొంతు వినిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే పౌరహక్కుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం మరో ఎత్తు. ఉద్యమంలో భాగంగా ఎందరో మహిళలకు అండగా నిలిచింది. దాడులను ఎదుర్కొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మడమ తిప్పలేదు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన మళ్లీ మొదలైన తరువాత చాలామంది కలాలు అటకెక్కాయి. గొంతులు మాట మార్చుకున్నాయి. కానీ ఖామోష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అవే అక్షరాలు...అదే గొంతు! తాలిబన్ల పాలన మొదలై అప్పటికే అయిదు నెలల దాటింది. ఆ సమయంలో ‘స్త్రీలపై జరుగుతున్న అణచివేత’ అనే అంశంపై నార్వేలో మాట్లాడే అవకాశం లభించింది. ‘ఈ సమయంలో మాట్లాడితే ప్రాణాలకే ముప్పు’ అని చాలామంది హెచ్చరించినా ఆమె భయపడలేదు. ‘నేను తప్పు చేయడం లేదు. తప్పుల గురించి మాట్లాడబోతున్నాను’ అంటూ నార్వేకి వెళ్లింది ఖామోష్. నీళ్లు నమలకుండా నిజాలు మాట్లాడింది. ఆనాటి ఆమె ప్రసంగంలో కొన్ని మాటలు... ‘నా పేరు హోడ ఖామోష్. అఫ్గానిస్థాన్‌లోని వేలాది మంది మహిళలలో నేను ఒకరిని. నేను ఏ రాజకీయపార్టీకి సానుభూతిపరురాలిని కాదు. సభ్యురాలిని కాదు. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నాను. తాలిబన్ల పాలనలో ఉన్నాను. భయంతో గుండె వేగంగా కొట్టుకునే చోట, బుల్లెట్ల చప్పుడు నిరంతరాయంగా వినిపించే చోట ఉన్నాను’ ‘కాబుల్ తాలిబన్ల వశం అయిన తరువాత రాజ్యం పోలీసు రాజ్యం అయింది. స్త్రీలపై వివక్షత పెరిగింది. మీరు ఉండాల్సింది విద్యాలయాల్లో కాదు ఇంట్లో...అంటూ అణచివేత మొదలైంది. ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పాపానికి ముర్తాజ సమది అనే ఫొటోగ్రాఫర్‌ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. కాబుల్‌లో స్త్రీల నిరసన ప్రదర్శనకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తమ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న 70 మంది పౌరులను అరెస్ట్ చేశారు. వారిలో 40 మంది మహిళలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురిచేశారు’ నార్వే సదస్సులో అఫ్గాన్ కన్నీటి చిత్రాన్ని కళ్లకు కట్టిన ఖామోష్ ‘ఇక అంతా అయిపోయింది’ అని నిరాశ పడడం లేదు. ‘స్త్రీలను గౌరవించే రోజులు, స్త్రీల హక్కులు రక్షించబడే రోజులు తప్పకుండా వస్తాయి’ అంటున్న ఖామోష్లో ‘ఆశ’ అనే జ్వాల ఉజ్వలంగా వెలుగుతూనే ఉంది. -
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
ఒక వినూత్న కార్యక్రమం
మన దేశంలో ఫోర్త్ ఎస్టేట్ మీడియా! దీనికున్న బలం గురించీ, అది చూపిన, చూపిస్తున్న ప్రభావం గురించీ అందరికీ తెలి సిందే. కానీ ఈ దేశంలోని దళితులు, అంటరాని కులా లుగా భావించే జన సమూహాలకు అందులో ఎంత భాగస్వామ్యం ఉంది? ఇదే ప్రశ్న 1996లో కాన్షీరాం వేసినప్పుడు... దానికి సమాధానం దొరక లేదు. ఇది నాడు, నేడు దేశవ్యాప్తంగా ఉన్న పరి స్థితి. కానీ తెలంగాణ దీనికి భిన్నం. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... మార్చి 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ మీడియా అకా డమీ, ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిం చిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులకు ఊహిం చలేనంత స్పందన వచ్చింది. బహుశా దేశంలోనే 16 వందల మందికి పైగా దళిత జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఉండటం గుర్తిం చాల్సిన ముఖ్యాంశం. మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ చొరవ వల్లనే ఇది సాధ్యమైంది. నిజంగానే ఇంత మంది జర్నలిస్టులు పేపర్, టీవీ, డిజిటల్ మీడియాల నుండి వచ్చారా అంటే... వచ్చారు! వందల సంఖ్యలో శిక్షణా తరగ తులకు హాజరు కావడమే దీనికి నిదర్శనం. ఇది పెద్ద విప్లవంగానే చెప్పాలి. తెలంగాణ... దళిత చైతన్యానికి ఎత్తిన పతాక వంటిది. మొదటగా 1888లో ‘విఠల్ విధ్వంసక్’ అనే పేపర్ దళితుల కోసం ఏర్పాటయింది. దీన్ని ఏర్పాటు చేసింది అంబేడ్కర్‌కు స్ఫూర్తినిచ్చినవారిలో ఒకరైన గోపాల్ బాబా వాలంగ్ కర్. ఆటు ఆంధ్ర ఏరియా నుండి కుసుమ ధర్మన్న లాంటి వాళ్లు ఏర్పాటు చేసినవి కొన్ని పత్రికలు ఉన్నాయి. ఈ చైతన్య ప్రవాహం తెలంగాణలో ఆంధ్రమహాసభ ఏర్పడేంత వరకు ఉన్నది. ఆ తర్వాత వచ్చిన పలు రకాల ఉద్యమాలు, వాటి ప్రభావాలు యావత్ తెలం గాణపై ఉన్నాయి. ఆ తర్వాత ఈ పరంపర కాస్త ఆగిపోయింది. మళ్లీ ఉమ్మడి రా్రçష్టంలో కంచిక చెర్ల కోటేశు హత్యోదంతం, కారంచేడు, నీరుకొండ ఘటనలు కొత్త తరం దళితులను సరికొత్త ఎజెండాతో కార్యోన్ముఖులను చేశాయి. మీడియాలో 1985ల నాటికి పేరు పొందిన దళిత జర్నలిస్టులు లేరు. కానీ 1996ల తర్వాత దళి తులు పేపర్ మీడియాలోకి ఒకరిద్దరు రావడం షురూ అయింది. ఆ తర్వాత 2000 సంవత్సర ఆరంభంలో తెలుగు నాట ప్రయివేటు ఛానళ్లు వచ్చాయి. అందులో ఇప్పటి ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలంగాణలోనే సుపరిచిత రిపోర్టర్‌గా ఎదిగారు. ఆ తర్వాత జై తెలంగాణ ఛానల్‌కు ఎడి టర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రభా వంతో చాలామంది సొంత పేపర్లు ఏర్పాటు చేసు కున్నారు. పలు మీడియా సంస్థల్లో కొంత మంది దళితులకు అవకాశం దొరికింది. 2014 తర్వాత డిజిటల్ మీడియాతో పాటు, చిన్న పేపర్ల సంఖ్య కూడా పెరిగింది. ఇందులో బీసీలు, దళితులే పెద్ద భాగం. వీరికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా భరోసానిస్తోంది. దళిత జర్నలిస్టులను గుర్తించి... వారి కోసం శిక్షణ ఇవ్వడమంటే గత చైతన్యానికి మరింత పదును పెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికేనని చెప్పొచ్చు. ఈ చైతన్య ఒరవడి మరింత ముందుకు సాగాలంటే కేసీఆర్ ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘దళిత బంధు’తో పాటు సబ్ ప్లాన్ నిధులలో జర్నలి స్టులకు కొంత శాతం ఇచ్చి, ఆర్థిక స్వయం వృద్ధి సాధించేందుకు చేయూతనిస్తే వారు బాగుపడటమే కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పించిన వారవుతారు. అస్కాని మారుతీ సాగర్ వ్యాసకర్త టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మొబైల్ : 90107 56666 -
ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో!
అక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. ‘మీ ముందు మైక్ ఉన్నట్లు పొరపొటున కూడా అనుకోకూడదు. మీ స్నేహితులతో సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి! భవ్యా... ఇప్పుడు నువ్వు ఆర్జేవి. నీకు ఇష్టమైన టాపిక్‌పై మాట్లాడు...’ భవ్య మైక్ ముందుకు వచ్చింది. ‘హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవ్యను. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. నాకు ఎప్పుడూ నవ్వు తెచ్చే జ్ఞాపకం ఒకటి ఉంది. మా గ్రామంలో సంగ్రామ్ అనే ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికో ఒకరికి జాగ్రత్తలు చెబుతూనే ఉండేవాడు. అయితే అందరికీ జాగ్రత్తలు చెబుతూనే తాను పొరపాట్లు చేసేవాడు. ఒకరోజు వర్షం పడి వెలిసింది. ఎటు చూసినా తడి తడిగా ఉంది..కాస్త జాగ్రత్త సుమా! అని ఎవరికో చెబుతూ ఈ సంగ్రామ్ సర్రుమని జారి పడ్డాడు. అందరం ఒకటే నవ్వడం! ఒకరోజు సంగ్రామ్ ఏదో ఫంక్షన్‌కు వచ్చాడు. ఎవరికో చెబుతున్నాడు... వెనకా ముందు చూసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది అసలే కలికాలం...అని చెబుతూ, తన వెనక కుర్చీ ఉందన్న భ్రమలో కూర్చోబోయి ధబాలున కిందపడ్డాడు!’ ....ఆ ఆరుగురు మహిళా ఆర్జేలు, హాస్యసంఘటనలను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలనే విషయంలో కాదు, శ్రోతలు కోరుకున్న పాట ప్లే చేసేముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ‘సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం’లాంటి ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఎలా సులభంగా చెప్పాలి... ఇలా ఎన్నో విషయాలలో ఒక రేడియోకోసం ఆ ఆరుగురు మహిళలు శిక్షణ తీసుకున్నారు. అయితే ఆ రేడియో మెట్రో సిటీలలో కొత్తగా వచ్చిన రేడియో కాదు, ఆ మహిళలు జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అంతకంటే కాదు. అది అంబాల జైలు రేడియో. ఆ ఆరుగురు మహిళలు... ఆ జైలులోని మహిళా ఖైదీలు. హరియాణాలోని అంబాల సెంట్రల్ జైలులో ఖైదీల మానసిక వికాసం, సంతోషం కోసం ప్రత్యేకమైన రేడియో ఏర్పాటు చేశారు. ఆరుగురు మగ ఆరేజే (ఖైదీలు)లు ఈ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిక మహిళల వంతు వచ్చింది. రేడియో కార్యక్రమాల నిర్వహణ కోసం ఆరుగురు మహిళా ఖైదీలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ‘ఆర్జే’గా విధులు నిర్వహించనున్నారు. దిల్లీ యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తిక నందా ఈ ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. ‘ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టడానికి, మనం ఒక కుటుంబం అనే భావన కలిగించడానికి ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది నందా. ఈ మాట ఎలా ఉన్నా మహిళా ఆర్జేల రాకతో ‘అంబాల జైలు రేడియో’కు మరింత శక్తి, కొత్త కళ రానుంది! -
ఉన్నది ఉన్నట్లుగా రాయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నందున తమకు సానుకూలంగా వార్తలు రాయాలని తాము కోరుకోవడం లేదని, ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేయాలని మాత్రమే కోరుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ అర్హులైన జర్నలిస్టులకు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదని పేర్కొన్నారు. నేషనల్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీయూజేఎఫ్) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల మాట్లాడారు. జర్నలిస్టులంటే గౌరవం ఉన్న ప్రభుత్వం ఇది అని తెలిపారు. జర్నలిజంలోని నకిలీలను ఏరివేయాల్సి ఉందన్నారు. జర్నలిస్టులంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అపారమైన గౌరవ భావం ఉందన్నారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మిడిల్ ఇన్కమ్ గ్రూపు (ఎంఐజీ)లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దీనిపై త్వరలో విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సౌకర్యం కల్పిస్తామని, ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే చక్కదిద్దుతామన్నారు. అంతకుముందు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు. -
ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం.. 2021–22 విద్యాసంవత్సరానికి వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివరాలు ► పీజీ ప్లొమా ఇన్ జర్నలిజం(పీజీడీజే)– కోర్సు కాల వ్యవధి 12 నెలలు. ► డిప్లొమా ఇన్ జర్నలిజం(డీజే)–కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ► డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం(డీటీవీజే)–కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. ► సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం(సీజే)–కోర్సు కాల వ్యవధి మూడు నెలలు. ► విద్యార్హత: సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం కోర్సుకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగతా కోర్సులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ► ప్రవేశ విధానం: ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కోర్సుల్ని రెగ్యులర్ గాను, కరస్పాండెన్స్ (దూర విద్య) విధానంలోనూ చేయొచ్చు. ఆన్లైన్ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి నుంచే పాఠ్యాంశాలు లైవ్‌లో వినొచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో కళాశాల వెబ్సైట్ (www.apcj.in) ద్వారా పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ► దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021 ► అడ్మిషన్లు పొందటానికి చివరి తేది: 14.08.2021 ► వెబ్సైట్: www.apcj.in -
జర్నలిజంలో సర్టిఫికెట్ కోర్సు
సాక్షి, అమరావతి/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జర్నలిస్టులకు ఉపయుక్తంగా మూడు నెలల కాల పరిమితితో జర్నలిజం సర్టిఫికెట్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. యూజీసీ నిబంధనలను అనుసరించి ప్రెస్ అకాడమీ సొంతంగా నాలుగు సబ్జెక్టులతో కోర్సు రూపొందించినట్టు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ఉత్తీర్ణులై కోర్సులో చేరే జర్నలిస్టులకు 50 శాతం ఫీజు రాయితీతో కేవలం రూ.1500 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి జర్నలిజంపై ఆసక్తి ఉన్న యువత కూడా పూర్తి ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందొచ్చన్నారు. అనంతరం కోర్సు బ్రోచర్‌ను విడుదల చేశారు. కోవిడ్ దృష్ట్యా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమసింహపురి వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం(నేటి) నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రెస్‌అకాడమీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచినట్టు శ్రీనాథ్ వివరించారు. విక్రమసింహపురి వర్సిటీ రిజిస్ట్రార్ విజయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించి, డిసెంబర్ మొదటి వారంలో తుది పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 91541 04393 నంబర్‌ను, pressacademycontact@gmail.comను సంప్రదించాలని సూచించారు. -
జర్నలిజంలో ఘనాపాటి ‘తుర్లపాటి’
పటమట (విజయవాడ తూర్పు): దేశ స్వాతంత్య్రానికి ముందు, తరువాత కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అందరికీ ఆదర్శప్రాయుడని ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని స్వర్ణ కల్యాణ మండపంలో తుర్లపాటి కుటుంబరావు సంస్మరణ సభ ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 1990–92 మధ్య ఉదయం దినపత్రికలో పనిచేస్తున్న సమయంలో పలుమార్లు తుర్లపాటిని కలిశానని, సమాజంలో అనేక కోణాలను తుర్లపాటి ఆవిష్కరించేవారని చెప్పారు. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా తుర్లపాటి విలువైన సలహాలిచ్చేవారని వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో నేరుగా మాట్లాడే వ్యక్తుల్లో తుర్లపాటి ఒకరని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా కూడా తాము అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ తుర్లపాటి ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా ఉండేవని, రాజకీయాలకు అతీతంగా ఆయన అందరితో సంబంధాలను కలిగి ఉండేవారని అన్నారు. అసెంబ్లీ ఉప సభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ తుర్లపాటి 10వేలకు పైగా సభల్లో ఉపన్యాసాలిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారన్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి తెలుగు జర్నలిస్ట్ తుర్లపాటి అని కీర్తించారు. ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదనానికి ఆయన బ్రాండ్‌గా ఉండేవారన్నారు. అంతకుముందు సావిత్రి కళాపీఠం తుర్లపాటి జీవితంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంస్మరణ సభలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముప్పవరపు మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్ బాబురావు పాల్గొన్నారు. -
సారీ.. నేనేం జర్నలిస్ట్‌ను కాను చెప్పడానికి
‘కరోనా మహమ్మారి ఎప్పటికి తగ్గుముఖం పట్టొచ్చు డాక్టర్?’ ‘సారీ.. నేనేం జర్నలిస్ట్‌ను కాను చెప్పడానికి’ అంటాడు ఆ డాక్టర్. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన జోక్. జర్నలిస్టుల తీరుపై సోషల్ మీడియా పార్టిసిపెంట్స్ విసిరిన వ్యంగ్యాస్త్రం. ‘ఒరేయ్.. ఆక్సిజన్ సిలెండర్లు అయిపోయాట. ఇందాక నర్సులు మాట్లాడుకుంటుంటే విన్నాను. భయమేస్తోంది. ఏ రాత్రో ఆయాసపడితే ఎలాగా? గవర్నమెంట్ హాస్పిటల్స్ సిట్యుయేషన్ ఎట్లా ఉందో వాట్సప్‌లో చూశా. నేనిక్కడ ఉండను. రాత్రి వగరుస్తే కష్టం. చచ్చిపోవడమే. నన్ను ప్రైౖ వేట్ హాస్పిటల్‌కు మార్చండి’ ఓ కోవిడ్ పేషంట్ ఆక్రందన. ‘మేం దాహమేసినా కషాయాలే తాగుతున్నాం. కషాయాలతో కరోనా పని పట్టొచ్చని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కదా’ ‘కరోనా వచ్చిన వాళ్లను ఊరవతల పెట్టాలి.. అదేదో ఊళ్లో అలాగే చేశారు .. ఏదో వెబ్సైట్లో చదివాను. న్యూస్‌లో కూడా చూశాను.’ కరోనా నేపథ్యంలోనే జనాల మీదున్న సోషల్ మీడియా ప్రభావం అది. మీడియా అత్యుత్సాహం, సెన్సేషన్ దాహానికీ చిరుగుల గుర్తులెన్నో కనిపిస్తాయి చరిత్రలో. ప్రిన్సెన్స్ ఆఫ్ వేల్స్ డయానా, ఆమె స్నేహితుడు దోడీ ఫయేద్, వాళ్ల డ్రైవర్ల మరణం ఓ ఉదాహరణ. ప్రసిద్ధ నటి శ్రీదేవి చనిపోయాక మీడియా చేసిన నిర్వాకం ఇంకా మరచిపోనే లేదు. అయితే ఇలాంటి సందర్భాల్లో మీడియా పరిధిని గుర్తు చేస్తూ వస్తోంది సమాజమే. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టూ స్పందించింది. బాబ్రీ మసీదుకి సంబంధించిన తీర్పును వెలువరించే ముందు మీడియాను సూచించింది, హెచ్చరించింది సంయమనంతో వ్యవహరించమని. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కూడా మీడియాను హద్దుల్లో పెట్టే బాధ్యతను చేపట్టింది. మీడియాలో ఏ చిన్న తప్పు దొర్లినా వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్లలో మీమ్స్, సెటైర్స్, కామెంట్స్‌గా హైలైట్ చేస్తూ! ప్యారలెల్గా... గ్లోబలైజేషన్ తర్వాత పెట్టుబడిదారులు పెట్టిన పరుగుపందెంలో పిక్కబలం చూపించుకునే ప్రయత్నంలో ఉన్న యువతకు అసలు గమ్యం చూపించింది సోషల్ మీడియానే. రోబోలా మారిన మెదడుకు ప్రశ్నించడం నేర్పింది. జాస్మిన్ విప్లవాన్ని పూయించింది. తెలంగాణ ఉద్యమానికి ఊపుతెచ్చింది. ‘మీ టూ’కి జన్మనిచ్చింది. చేంజ్ డాట్ ఓఆర్జీని చూపించింది. మానవ తప్పిదాల మీదా ఎక్కుపెట్టింది. ప్రకృతి వైపరీత్యాలప్పుడు అవసరాలకు, సాయానికి మధ్య వారధిగా మారింది. మొన్నటికి మొన్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’కీ గళమైంది. జాత్యహంకారాన్ని వణికించింది. మన దగ్గరా కుల, మత వివక్షను ప్రశ్నిస్తోంది. ప్రజాహితంగా లేని ప్రభుత్వాలనూ నిర్భయంగా విమర్శిస్తోంది. మొత్తంగా ఆల్టర్నేటివ్ మీడియాగా, ఇంకా చెప్పాలంటే ప్యారలెల్ జర్నలిజంగా ఎస్టాబ్లిష్ అయింది సోషల్ మీడియా. అదే సోషల్ మీడియా ఇదే కరోనా కాలంలో సొంత వ్యాఖ్యా కథనాలనూ కళ్లకు కడుతోంది. ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే. కాని క్రెడిబులిటే మ్యాటర్స్. వైద్య సలహాలు, సూచనలు, అనుభవాల వేదికగా తయారైంది ఇది. జీవన శైలి మార్గదర్శిగా అవతారమెత్తింది. అది పంచుతున్న జ్ఞానంతో దాదాపు చాలా ఇళ్లూ రెమెడీ హోమ్స్ అయిపోయాయి. ఈ క్రమంలో వీడియోలూ ఫార్వర్డ్ అవుతున్నాయి. అవగాహన దిశగా కన్నా భయభ్రాంతులకు లోనుచేసివిగా ఉంటున్నాయి. పైన చెప్పిన భిన్న సంఘటనలే సాక్ష్యం. ఈ కథనం కోసం పేర్చిన కల్పనలు కావవి. సోషల్ మీడియా ఫాలోవర్స్ షేర్ చేస్తున్న సంగతులు. మైల్డ్ కరోనా లక్షణాలను కూడా సోషల్ మీడియా బోధతో మైక్రోస్కోప్‌లో చూడ్డం నేర్చుకున్నారు. ఆందోళనతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మీడియా దృష్టికి వస్తున్న ఇలాంటి కేసులెన్నో! కరోనా కన్నా దాని గురించిన పరస్పర విరుద్ధ సమాచార సేకరణే పేషంట్ కండిషన్‌ను క్రిటికల్ చేస్తోంది. పాజిటివ్‌ను హైబత్ (భయాందోళన)గా మార్చి శ్వాసను భారం చేస్తోంది. గూగుల్ డాక్టర్‌కు.. పేషంట్ నాడి పట్టుకుని చూసే ప్రాక్టీసింగ్ డాక్టర్‌కు చాలా తేడా ఉంటుంది. వదంతి .. వార్త కాదు. ఊహ .. సత్యం కాదు.. కనీసం అంచనా కూడా కాదు. ఈ వ్యత్యాసాలను స్పష్టంగా తెలిపేది మీడియానే. క్రెడిబులిటీ దానికి ఆక్సిజన్. అది తగ్గితే సమాజం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కనిపెట్టే ఆక్సీమీటర్ పాఠక సమాజమే. అంబుడ్స్‌మన్ పాత్ర వాళ్లది. సహజమైన కుతూహలంతో సంచలనాల కోసం ఆరాటపడ్డా రీడర్షిప్ నిక్కచ్చిగానే తీర్పునిస్తుంది. అదే మీడియా బాధ్యతను గాడిలో పెడుతుంది. ఇలాంటి వ్యవస్థ సోషల్ మీడియాకేది? స్వీయ నియంత్రణే తప్ప. అసలేదో.. ఫేక్ ఏదో గ్రహించే హంస నైజాన్ని అలవర్చుకోవాల్సి ఉంది. ఫార్వడింగ్ యాజ్ రిసీవ్డ్ మెథడ్‌కు బ్రేక్ వేయాల్సి ఉంది. ఫాల్స్, రూమర్స్.. మొత్తం సమాజాన్నే వ్యాధిగ్రస్తం చేస్తే కష్టం. ఇవి కరోనాను మించిన పాండమిక్స్. వీటికి వ్యాక్సిన్ మీడియానే. పాఠకుల విశ్వాసమే ఔషధం. కరోనా విషయంలో కూడా మీడియా ఆ గౌరవాన్ని కోల్పోలేదు. ‘తప్పుడు సమాచారం విస్తృతంగా ప్రచారం అవుతున్న టైమ్‌లో శాస్త్రీయ దృక్ఫథంతో అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది మీడియానే. జర్నలిస్టులూ వారియర్సే.’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు యూఎన్ఓ. ప్యారలెల్ జర్నలిజం అవసరమే.. వినోదం దాంట్లో భాగంగా ఉండొచ్చు. అవే నిజాలుగా ప్రచారమైతే ప్రాణాలతో చెలగాటమాడుతాయి. -శరాది -
ఫియర్లెస్ జర్నలిస్ట్
పేరు ఫే డిసూజా.. ఫియర్లెస్ జర్నలిస్ట్. మిర్రర్ నౌ ఎడిటర్. ఆశారాం బాపూ దగ్గర్నుంచి శానిటరీ నాప్కిన్స్ దాకా అన్ని విషయాల మీద నిష్పక్షపాతంగా చర్చను కొనసాగిస్తుంది. జర్నలిస్ట్‌గా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడ్డానికి కృషిచేస్తోంది. ఈ క్రమంలో చాలాసార్లు ట్రోలింగ్కి గురైంది. అయినా వెరవలేదు. తన పంథా మార్చుకోలేదు. ఫే డిసూజా నిర్వహించే ప్యానెల్ డిస్కషన్‌కి రావడానికి చాలామంది పెద్దలు ఇష్టపడ్తారు. అరవడాలు, వచ్చిన వాళ్ల నోరు మూయించే ప్రయత్నాలు లేకుండా.. చర్చ చక్కగా.. ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా ఉంటుందని. జెండర్ ఈక్వాలిటీ గురించి కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతుంది. ఆమె ఎక్కడ కనపడ్డా.. గుర్తుపట్టి పరిగెత్తుకొస్తారు.. ‘‘మీరంటే నాకు ఇష్టం’’ అని.. ‘‘మీరంటే మాకు అడ్మిరేషన్’’ అని, ‘‘మీరు మాకు ఇన్స్పిరేషన్’’ అని అభిమానం కురిపిస్తారు. ఆమె స్వస్థలం బెంగుళూరు. అక్కడి మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో జర్నలిజం చదివింది. అప్పుడే బెంగళూరు ఆల్ ఇండియా రేడియోలో న్యూస్‌రీడర్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది. సీఎన్‌బీసీ టీవీ18తో కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత బిజినెస్ రిపోర్టింగ్ వైపు మళ్లింది. 2008లో ఈటీ(ఎకనమిక్ టైమ్స్)లో పర్సనల్ ఫైనాన్స్ ఎడిటర్‌గా చేరింది ఫే డిసూజా. -
పాత్రికేయ వృత్తిలో శిఖర సమానుడు
జర్నలిజాన్ని కేవలం వృత్తిగా కాకుండా ఒక పవిత్ర కర్తవ్యంగా భావిం చిన అరుదైన పాత్రికేయుల్లో పెండ్యాల వామన్ రావు ఒకరు. వార్తలను నివేదించడంలో సమగ్రత, అంకితభావం, వస్తుగత తత్వం అనేవి కథనాలకు విశ్వసనీయతను తెచ్చిపెడతాయి. జర్నలిజంకి సంబంధించిన ఈ ప్రాథమిక లక్షణాల తోటే ఆయన కేఎమ్ మున్షీ, స్వామి రామానంద తీర్థ, పీవీ నరసింహారావు, పలువురు ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల గౌరవాన్ని, విశ్వాసాన్ని పొందారు. ఇలాంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు నెరిపినందువల్లే కావచ్చు.. తన 70 సంవత్సరాల వృత్తి జీవి తంలో కళ్లారా చూసిన చారిత్రక ఘటనలకు ఆయన అత్యంత వస్తుగతమైన, నిజాయితీతో కూడిన చిత్రణను అందిస్తూ వచ్చారు. హైదరాబాద్‌లో పోలీస్ చర్య, నిజాం పతనం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావం, రాజ్యాధికార విరామకాలంలో జరిగిన రెండు హింసాత్మక ఆందోళనలు వంటివి ఆయన నివేదించిన కీలక ఘట్టాలు. 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీసు చర్య కాలంలో దక్కన్ చరిత్రలో సంభవించిన ఒక కీలక అధ్యాయం గురించి ప్రస్తుత తరం జర్నలిస్టులకు తెలిసింది చాలా తక్కువ. మేధావులు, రాజకీయ నేతలు ఆ ఘటనను తమ తమ దృక్పథాలకు అనుగుణంగా విమోచన అనీ, స్వాధీనపర్చుకోవడం అనీ, దురాక్రమణ అనీ వ్యాఖ్యానించవచ్చు. కానీ వామనరావు హిందూ పత్రిక కరస్పాండెంట్‌గా ఆ సంక్షుభిత కాలంలో నిష్పాక్షిక కథనాలను సమర్పించారు. పాత్రికేయుల జీవితం కష్టాలతో కూడినది. ప్రభుత్వ లేక నిజాం అనుకూల జర్నలిస్టులు వార్తాపత్రికల్లో లేక ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కనీసపాటి విమర్శను కూడా సహించేవారు కాదు. ఆ రోజుల్లో పత్రికాప్రపంచం గట్టి నిఘాలో ఉండేది. ప్రెస్ కాన్ఫరెన్సుల్లో నిజాంకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రశ్న సంధించినా, నిజాం విశ్వసనీయ బ్రిగేడ్ నుంచి తీవ్రమైన హెచ్చరికలకు, మందలింపులకు గురికావలసి వచ్చేది. ప్రభుత్వం నుంచి ఎంతో కొంత గౌరవాన్ని అందుకుంటూ ఉన్న ది హిందూ పత్రికను సైతం ప్రతి రోజూ స్పెషల్ బ్రాంచ్ అధికారులు చదివి, అనుమతించిన తర్వాత మాత్రమే ప్రచురణకు, పంపిణీకి పంపే పరిస్థితి ఉండేదని వామన్‌రావు చెప్పేవారు. తమకు వ్యతిరేకంగా రాస్తున్న జర్నలిస్టులతో ప్రభుత్వం నేరుగా వ్యవహరించేది కాదు. ఆ పనిని పోలీ సులు సంఘవ్యతిరేక శక్తులకు బదలాయించేవారు. తర్వాత వారు అలాంటి జర్నలిస్టులను చితకబాదేవారు. నిఖార్సైన కాంగ్రెస్ వాదిగా ఉండి గవర్నర్‌గా మారిన మీర్ అక్బర్ ఆలీ, ఆనాడు కైరోలో భారత రాయబారిగా ఉండిన సయ్యద్ హుస్సేన్, సీనియర్ పాత్రికేయులు ఎల్డీ నటరాజన్ వంటివారు వీరి ఆగ్ర హజ్వాలల్ని చవిచూశారు కూడా. బంజారాహిల్స్‌లో ఉన్న ఆయన నివాసం రాక్ హౌస్‌ని నిత్యం సందర్శించే వాడిని. చారిత్రక ఉపాఖ్యానాలను, ఘటనల సారాంశాన్ని వివరించే అగ్రశ్రేణి కథకుడిగా వామన్‌రావు నాకు కనిపించేవారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. తన సైన్యం లొంగుబాటు గురించి హైదరాబాద్‌లోని భారత ఏజెంట్ జనరల్ కేఎమ్ మున్షీతో దక్కన్ రేడియోలో ఉమ్మడి ప్రసారంలో నిజాం ప్రకటించిన ఘట్టాన్ని వివరిస్తూ, నిజాం ఆ సందర్భంలో ఆందోళనా స్వరంతో కేఎంజీ, మున్షీజీ అంటూ తొట్రుపాటు పడటాన్ని కూడా వామన్‌రావు నమోదు చేశారు. కొన్ని సందర్భాల్లో అయితే కేఎమ్ మున్షీ వామన్‌రావును వార్తలు సకాలంలో పంపించడానికి తన కారులో స్వయంగా తీసుకెళ్లేవారు. భోజనానికి ఆహ్వానించేవారు. తన పరిచయస్తుల నుంచి వామన్‌రావు సాధించిన విశ్వాస స్థాయి అలాంటిది. వామన్‌రావుకు హన్మకొండలో పీవీ నరసింహారావు సీనియర్‌గా ఉండేవారని చాలామందికి తెలీదు. బిర్లాల ప్రతినిధిగా వ్యవహరిస్తూ, నౌబత్ పహాడ్‌పై బిర్లా మందిర్ నిర్మాణంలో ఆయన అందించిన తోడ్పాటు కూడా చాలా కొద్దిమందికే తెలుసు. వృత్తి జీవితంలో అనేకమంది జర్నలిస్టులు ఆయన సహాయాన్ని, ఔదార్యాన్ని పొందినవారే. వామన్‌రావు నా స్నేహితుడు, ఫిలాసఫర్, మార్గదర్శకుడు కూడా. ఆయన తోడ్పాటు వల్లే పదవీ విరమణ తర్వాత ఎన్నో రచనలు చేయగలిగాను. ఆయన నా బంధువే కానీ, అంతకంటే మించి మా మధ్య 50 సంవత్సరాలపాటు వృత్తిగత బాంధవ్యం కొనసాగింది. పెద్దాయన కనుమరుగైన తర్వాత కూడా ఆయన బాటలో నేను నడుస్తూనే ఉంటాను. వ్యాసకర్త ది హిందూ మాజీ డిప్యూటీ ఎడిటర్/బ్యూరో చీఫ్, హైదరాబాద్ దాసు కేశవరావు -
కర్నూలు కలెక్టరెట్ ఎదుట జర్నలిస్టు సంఘాల ఆందోళన
-
కలగళం
మీ టూ ... రెండక్షరాల పదం. రెండు పదాల వాక్యం. ప్రపంచాన్ని మండిస్తోన్న ఓ దావానలం. ఆవేదనతో, అవమానంతో రగిలిపోయిన... మహిళల మనసు నుంచి పుట్టిన అగ్నికీల. కామాగ్ని సమిధలు పేర్చిన చితిమంట. అడ్డూఅదుపూ లేని లైంగికవాంఛలకు చెలియలికట్టను నిర్మించడానికి చేస్తున్న ఓ ప్రయత్నం. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం గళమెత్తిన మహిళల కన్నీళ్ల ప్రవాహం. నవ సమాజ నిర్మాణం కోసం... రాళ్లెత్తుతున్న చేతుల సంఘటిత శక్తి మీటూ. సమాచార ప్రసార రంగంలో ఇన్నాళ్లూ అక్షరాల మాటున దాగిన ఆవేదన అగ్నిపర్వతంలా భళ్లున పేలింది. ఈ సందర్భంగా జర్నలిజంలో నలభై మూడేళ్ల అనుభవం ఉన్న అఖిలేశ్వరీ రామాగౌడ్ తో మాటా మంతీ. సాక్షి ఫ్యామిలీతో ఆమె పంచుకున్న అనుభవాల కథనాలు. ఈ ఉద్యమం ఇక ఆగదు.బిగుసుకున్న పిడికిళ్ల ఆవేశం లావాలా ఉడుకుతోంది. మీటూ సాకారమే మన కల. అందుకోసం... కలమూ వాడాలి... గళమూ వాడాలి. రిపోర్టింగ్ ఇవ్వలేదు నా తొలి పోస్టింగ్ 1975లో డెక్కన్ హెరాల్డ్ బెంగళూరులో. అప్పటికి నాకు ఇరవై మూడేళ్లు. రిపోర్టింగ్ చేస్తానంటే ‘అమ్మాయివి కదా, డెస్క్‌లో పని చెయ్యి’ అన్నారు. డెస్క్ మొత్తానికి ఒక్కర్తినే అమ్మాయిని. మరో ఇద్దరు మహిళలుండేవారు కానీ వాళ్లు జర్నలిస్టులు కాదు, పర్సనల్ అసిస్టెంట్లు. డెస్క్‌లో సీనియర్లు యాభై నిండిన వాళ్లే. హెరాస్‌మెంట్‌కు అవకాశం లేని వాతావరణం ఉండేది. అయితే ఒకతడు నా కంటే రెండు మూడేళ్ల సీనియర్. జోక్‌గా అన్నట్లు ఏదో అర్థవంతంగా మాట్లాడేవాడు. అర్థం తెలుస్తుంటుంది కానీ రెస్పాండ్ కావచ్చా కాకూడదా తెలియని సందిగ్దత ఉండేది. ఎదురు తిరిగితే ‘ఈ అమ్మాయికి దూకుడు ఎక్కువ’ అని ఒక లేబిల్ వేసేస్తారు. పైగా ఇంట్లో కూడా ‘ఆడపిల్ల నలుగురిలో గట్టిగా నవ్వకూడదు, మగవాడిని నేరుగా చూడకూడదు, మన సిగ్గును మనమే కాపాడుకోవాలి’... వంటి సూక్తులు నూరి పోసి పెంచి ఉంటారు. ఇవన్నీ మనలో ఏదో ఓ మూల స్థిరంగా ఉంటాయి. దాంతో అతడి ధోరణి తీవ్రమైనప్పుడు స్పందించాలని, అప్పటి వరకు వేచి చూద్దాం అనుకున్నాను. కొన్నిసార్లు విననట్లు, అర్థం కానట్లు ఉండాలి. కొన్నింటిని ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే అతడి మాటల్లో తేడా తెలుస్తుంటుంది, కానీ కచ్చితంగా ఇదీ అనడానికి వీలుండదు. అయితే కంప్లయింట్ అవసరం రాక ముందే హైదరాబాద్‌కి మారిపోయాను. అమ్మాయి వెంట అబ్బాయి... అప్పటికీ ఇప్పటికీ మార్పేమీ లేదు నేను అరవైల నుంచి సమాజాన్ని చూస్తున్నాను. అమ్మాయిలను అబ్బాయిలు ఫాలో కావడంలో అప్పటికీ ఇప్పటికీ ఎటువంటి మార్పూ లేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పరిచయమైన పది నిమిషాల్లోనే అమ్మాయిల ఫోన్ నంబర్ అడుగుతున్నారు. నేను డెక్కన్ హెరాల్డ్ కరస్పాండెంట్‌గా వాషింగ్టన్ డీసీలో ఉన్నప్పుడు తానా సభలకు ఆహ్వానం వచ్చింది. పాతికేళ్ల నాటి మాట ఇది. బయటి దేశంలో ఉన్నప్పుడు... తెలుగు వాళ్లు కలిసే సందర్భం అనగానే ఉత్సాహంగా వెళ్తాం కదా! నేనూ అలాగే వెళ్లాను. ఆ సమావేశాలకు ఓ తెలుగు ప్రముఖుడు వచ్చాడు. అతడు ఇండియా నుంచి మరే దేశానికో వెళ్తూ ఈ సభల కోసం రెండు రోజులు వాషింగ్టన్ డీసీలో ఆగాడన్నమాట. అతడిని చూడడం అదే మొదటిసారి, మాటలు కలిపిన వాడు కాస్తా... గంటలోపే ‘ఆ రోజు మనం నా గదిలో ఉండవచ్చు కదా’ అన్నాడు. నాకప్పుడు నలభై ఏళ్లుంటాయి. కోపం తారస్థాయికి చేరింది, కానీ అది పార్టీ, తిట్టడానికి లేదు. గయ్యాళి తనం చాలా సందర్భాల్లో రక్షణ కవచమే కానీ, అన్ని సందర్భాల్లోనూ కాదు. దాంతో అతడిని తప్పించుకుని దూరంగా మసలాను. అయితే ఆ సంఘటన నాకు చాలానే నేర్పించింది. ఒక ఇంటర్నేషనల్ మీట్లో కర్ణాటక క్యాడర్ ఆఫీసర్‌కి మాటకు మాట బదులు చెప్పడానికి దోహదం చేసింది. నేను ఒంటరిగా ఉన్నానని తెలుసుకున్న అతడు... ‘ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవాలి’ అన్నాడు నర్మగర్భంగా. వెంటనే నేను... ‘మీరు ఇక్కడికి వచ్చారు, మీ ఆవిడ ఇండియాలో ఒంటరిగా ఉంది కదా! ఆమెకు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాట్లు చేసి వచ్చారా’ అనడంతో అతడి ముఖంలో రంగులు మారిపోయాయి. ఇక నన్ను తప్పించుకు తిరగడం అతడి వంతైంది. సర్వీస్ సర్టిఫికేట్లో ఉండాలి నేను ఉస్మానియా, లయోలాల్లో జర్నలిజం పాఠాలు చెప్పాను. నా స్టూడెంట్ ఒకమ్మాయి ఓ చిన్న మీడియా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసి సర్టిఫికేట్ తెచ్చింది. అది కరెక్ట్ ప్రొఫార్మాలో లేదు. నేను కోప్పడి, మోడల్ ప్రొఫార్మా ఇచ్చి మళ్లీ వెళ్లి కరెక్ట్ ఫార్మాట్లో రాయించుకుని రమ్మన్నాను. అంతే... ఆ అమ్మాయికి కళ్లనీళ్లొక్కటే తక్కువ. ‘మళ్లీ అక్కడికి వెళ్లమంటారా మేడమ్’ అన్నది. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ‘అక్కడ సరిగ్గా లేదా’ అని అడిగినప్పుడు ‘న్యూస్ ఎడిటర్ వేధిస్తున్నాడని, తాను చెప్పినట్లు ఉండకపోతే కెరీర్ లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడ’ని చెప్పింది. వెంటనే ఆ యాజమాన్యానికి ఫోన్ చేశాను. భార్యాభర్తలిద్దరూ కలిసి నడుపుతున్న సంస్థ అది. వాళ్లు వెంటనే ఆ న్యూస్ ఎడిటర్‌కి నోటీస్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత అతడు మరొక పెద్ద సంస్థలో ఉద్యోగంలో చేరాడు. కొత్త యాజమాన్యానికి ఇవేవీ చెప్పకుండా చేరి ఉంటాడు. కొత్త చోట కూడా ఇదే బుద్ధిని ప్రదర్శిస్తాడు కదా. నోటీస్‌లో అతడిని ఎందుకు సంస్థను వదిలి వెళ్లమని చెప్పాల్సి వచ్చిందనే (లైంగిక వేధింపుకు పాల్పడ్డాడనే) విషయాన్ని కూడా మెన్షన్ చేస్తే కొత్తగా ఉద్యోగం ఇచ్చే వాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఇలాంటిదే మరో సంఘటన... నేను ఎన్డబ్లు్యఎమ్ఐ కో ఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు జరిగింది. ఇంటర్న్‌షిప్ పూర్తయిన ఓ అమ్మాయికి ది హిందూలో ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని నలభై ఐదేళ్ల వ్యక్తి వేధించడం మొదలుపెట్టాడు. ఆమె రిపోర్టుతో ఎన్డబ్లు్యఎమ్ఐలో చర్చించి రిజల్యూషన్ పాస్ చేసి, ఆ ఎడిటర్‌కి లెటర్ పెట్టాం. అతడిని వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. దానిని అవమానంగా భావించిన అతడు ఆ ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు. అతడికి మరో పెద్ద సంస్థ ఉద్యోగం ఇచ్చింది. సర్వీస్ సర్టిఫికేట్లో లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని రాయడం తప్పనిసరి చేయాలనేది ఇలాంటి పరిణామాలను అరికట్టడానికే. తొంభైలలో... ఈ తరం అమ్మాయిల్లో ఉన్నంత ధైర్యం తొంభైల నాటి అమ్మాయిలకు ఉండేది కాదు. నా సర్వేలో అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పేవారు కానీ సెక్సువల్ హెరాస్మెంట్ విషయానికి వచ్చే సరికి నీళ్లు నమిలేవాళ్లు. ‘లేదు’ అని చెప్పే పరిస్థితుల్లేవు. ‘ఉంది’ అని చెప్పడానికి సందేహించేవాళ్లు. ‘హెరాస్మెంట్ ఉన్న మాట నిజమే, కానీ...’ అంటూ దాట వేయడానికి ప్రయత్నించేవాళ్లు. కొంతమంది... తమకు తెలిసిన ఇతర సంఘటనలను ఉదహరించేవారు తప్ప తమకు ఎదురైన వాటిని బయటపెట్టుకునేవాళ్లు కాదు. త్రివేండ్రంలో ఒకమ్మాయి కూడా స్థానిక రాజకీయనాయకుడి నుంచి ఎదురైన ఇబ్బందికరమైన పరిస్థితిని సర్వేలో చెప్పింది తప్ప ఇన్‌హౌస్ వేధింపు గురించి చెప్పలేదు. ఉన్నదున్నట్లు బయటపెడితే తిరిగి అదే మనుషుల మధ్య ఉద్యోగం చేయడం కష్టమనే భయమే వాళ్ల నోటిని కట్టేసేది. కొంతమందికి భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏమంటారోననే బెరుకు కూడా ఉండేది. ఇదంతా అరిటాకు మీద ముల్లు సామెతను ఒంటపట్టించుకున్న మనస్తత్వమే. అది ఇప్పటికీ పెద్దగా మారలేదు. వేధింపులు నేషనల్ మీడియాలోనే కాదు, రీజినల్ మీడియాలో కూడా కొల్లలుగా ఉన్నాయి. కానీ నోరు విప్పే సాహసం చేయడం లేదు. ఎం.జె అక్బర్ మీద నోరు విప్పిన ప్రియారమణికి ఆమె భర్త మద్దతుగా నిలిచాడు. అలా నిలిస్తే సంతోషమే. భర్తలు మద్దతుగా నిలవకపోయినా, కనీసం ఆడవాళ్లను వెనక్కి లాగకపోతే చాలు. కత్తిమీద సాము మీడియా రంగంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలు అందులో పనిచేసే వాళ్లకు తప్ప, ఇతరులకు ఎంత చెప్పినా అర్థం కావు. బాస్ నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ లైంగిక వేధింపులు ఉంటే అవి ఆ మహిళ కెరీర్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ‘నేషనల్ కమిషన్ ఫర్ విమెన్’ మహిళా జర్నలిస్టుల పని పరిస్థితుల మీద సర్వే చేసింది. దక్షిణాది రాష్ట్రాల సర్వే కోసం నేను స్వయంగా నాలుగు వందల మంది అమ్మాయిలతో మాట్లాడాను. ఒక కన్నడ అమ్మాయి తన గోడు ఇలా వెళ్లబోసుకుంది. ఆ అమ్మాయి రాసినవి పబ్లిష్ అయ్యేవి కాదు, పబ్లిష్ చేసినా ఆమె బైలైన్ ఇచ్చేవారు కాదు, మరుసటి రోజు అదే విషయం అడిగితే ‘పొరపాటైంది సారీ’ అంటారు. ఆ తర్వాత కూడా వ్యూహాత్మకంగా బైలైన్ తీసేస్తారు. ఒకవేళ బైలైన్ ఇచ్చారంటే ఆ ఆర్టికల్‌లో మొదట ఉండాల్సిన విషయాన్ని చివరికి, ముగింపులో చెప్పాల్సిన విషయం మధ్యలో ఎక్కడో ఉండేటట్లు కాపీని అర్థరహితంగా చేసేవాళ్లు. ఇది ఆ కన్నడమ్మాయికి మాత్రమే కాదు. నూటికి తొంభై మందికి ఎదురవుతున్న అనుభవమే. పైకి కనిపించదు కానీ మీడియారంగంలో కులాల విభజన కూడా ఉంటుంది. డెక్కన్ హెరాల్డ్‌లో ఒకమ్మాయి రిపోర్టర్‌గా చేరింది. చురుకైన పిల్ల. ఎడిటర్ చెప్పిన అసైన్మెంట్లు ఉత్సాహంగా చేసుకొచ్చేది. దాంతో కీలకమైన అసైన్మెంట్లు ఇచ్చేవారు. ఎడిటర్ వయసు, ఆ అమ్మాయి వయసులను కూడా చూడకుండా సంబంధం అంటగట్టేశారు సిబ్బంది. ‘ముసలాడికి పడుచుపిల్ల బాగా దొరికింది’ అంటూ కారుకూతలు కూడా. ఆ మాటలు క్యాబిన్లో ఉండే ఎడిటర్ చెవిన పడవు, కానీ సెక్షన్లో వాళ్ల మధ్య పని చేసే అమ్మాయి చెవిని దాటిపోవు. పైగా ఆమె వినాలనే అంటారు కూడా. ఆమె మీద బురద జల్లడంతోపాటు ఆ అమ్మాయి రాసిన కాపీలో లీడ్ పాయింట్స్ తీసేసి అసంబద్ధంగా ఎడిట్ చేసేవారు. ఆ పరిస్థితి తట్టుకోలేక ఆమె ఉద్యోగం మానేసి వెళ్లి పోయింది. ఇంకా దారుణమైన విషయమేమిటంటే... తమ ప్రపోజల్‌కి అనుమతించని మహిళ మీద దుష్ప్రచారానికి కూడా వెనుకాడకపోవడం. మీడియాలో ఉద్యోగం మానేసి వెళ్లిన అమ్మాయిల్లో ఏ అమ్మాయి కూడా పని చేతకాక వెళ్లలేదు, ఇలాంటి వేధింపులు తట్టుకోలేకనే. మృదుత్వాన్ని వదిలించుకుని కరకుదనం పెంచుకున్న వాళ్లు మనగలుగుతున్నారు. గొంతు కలపాలి ఒకప్పుడు మహిళలు ‘ఐ వజ్ హెరాస్డ్’ అని చెప్పలేకపోయేవాళ్లు, నిజానికి సిగ్గుపడాల్సింది వేధించిన వాడే కానీ వేధింపుకు గురయిన వాళ్లు కాదు. మగవాళ్లలో పరస్పరం భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా, ఒక మహిళ తమలో ఒకడి మీద లైంగికవేధింపుల ఆరోపణ చేస్తే వెంటనే అంతా ఒక్కటైపోతారు. అలాంటి ఐకమత్యం ఆడవాళ్లలో కనిపించేది కాదు ఒకప్పుడు. అప్పటి సమాజంలో ఒక మహిళ గొంతు విప్పితే సాటి మహిళల నుంచి మద్దతు కరువయ్యేది. ఇప్పుడు తోటి మహిళలు ఆమెకి అండగా నిలుస్తున్నారు. ఇది స్వాగతించాల్సిన పరిణామం. ‘మీటూ’ అంటూ ఎలుగెత్తిన గొంతుకకు తోడుగా మరికొన్ని గొంతుకలు కలుస్తున్నాయి. ఆ స్వరాన్ని పెంచుతున్నాయి. గళాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఎన్ని యుగాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఒక్కసారి మొదలైన తర్వాత ఇక పెను ఉప్పెన కాక ఆగదు. న్యాయం జరిగే వరకు కొనసాగి తీరుతుంది. ‘నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను’ అని చెప్పడానికి విప్పిన ఈ ‘మీ టూ’ గళం, ‘నాక్కూడా న్యాయం జరిగింది’ అనే విజయదరహాసంతో సమాజంలో సమున్నత శిఖరాన్ని చేరాలి. ‘మీటూ’ అనగానే ఈ ఉద్యమం మగవాళ్ల మీద పోరాడడానికే అనే అపోహ నెలకొంటోంది. నిజానికి ఇది ఆడవాళ్ల ఆత్మగౌరవ నినాదం. మా హక్కుల పోరాటం. రాబోయే తరాలకు ఈ వేధింపులు ఉండకూడదనే ఆరాటం. మగవాళ్లలో సున్నితత్వపు పొరలను తట్టి లేపడానికి చేస్తున్న ప్రయత్నం. పెళ్లయినట్లు మంగళసూత్రాలు ఇది ముప్పయ్ ఐదేళ్ల కిందటి మాట. మహిళల్లో ఎంతటి అభద్రత ఉండేదంటే... నేను హైదరాబాద్‌లోని ఓ గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో అసిస్టెంట్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు మరో విభాగంలో ఇద్దరు పెళ్లి కావల్సిన అమ్మాయిలు ఆఫీసుకు మంగళసూత్రాలు వేసుకుని వచ్చేవాళ్లు. పెళ్లయిన అమ్మాయిలకు లైంగిక వేధింపులు తగ్గుతాయని వాళ్లలా వేసుకునే వాళ్లు. కానీ నిజానికి పెళ్లయినా, బిడ్డకు తల్లయినా, గర్భవతి అయినా సరే... కారుకూతలు కూసేవాళ్లకు అవేమీ పట్టవు. బస్టాపుల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో అనుచితంగా ప్రవర్తించిన వాళ్లను డీల్ చేయడం చాలా తేలిక. ‘ఏమిటి దగ్గరకొస్తున్నావు, తగలకు, దూరం జరుగు’ అని గట్టిగా అంటే చాలు. ఎవరైనా చూస్తారేమోనని తల వంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. నారాయణగూడ నుంచి ఆర్ట్స్ కాలేజ్‌కి వెళ్తున్నాను, బస్‌లో రాడ్ పట్టుకుని నిలబడితే నా చేతి మీద మరో చేయి పడింది. చూసి నా చేతిని లాక్కుని కొంచెం ముందుకు జరిగి రాడ్ పట్టుకున్నాను. మళ్లీ అదే చెయ్యి. మూడు నాలుగు సార్లు ముందుకు జరిగిన తర్వాత ఇక ఊరుకోలేదు. ‘లం... కొడకా ఏంటి సంగతి, చెప్పు తీసి కొడతాను’ అని గట్టిగా అనగానే ఏమీ తెలియనట్లు జారుకున్నాడు. ఆడవాళ్లు బూతులు మాట్లాడితే ఎంతటి మగవాడైనా భయపడిపోతాడు. ఆడవాళ్లం అలాంటి మాటలు ఎలా మాట్లాడతాం అనుకుంటే మన కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రారు. ఎవరో వచ్చి కన్నీళ్లు తుడవాలని ఎదురుచూసే పరిస్థితిలో ఉండరాదు కూడా. సభ్య సమాజంలో సభ్యతగా మాట్లాడడం ఎంత అవసరమో, నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి గొంతులో కాఠిన్యాన్ని పలికించడమూ అంతే అవసరం. -
నిబద్ధ జర్నలిజానికి నిరుపమాన నిదర్శనం
కులదీప్‌కు సంబంధించినంతవరకు అన్నిటికన్నా ముఖ్య విషయం ఒకటుంది. చాలా మందికి ఇప్పటికీ ఇది తెలియదు. మానవ చరిత్రలోనే అత్యంత పాశవిక సందర్భంగా భావించే దేశ విభజన రోజులవి. మతం ప్రాతిపదికగా జరిగిన ఈ విభజన సందర్భంగా 1947 ఆగస్ట్–సెప్టెంబర్ మాసాల్లో ఇండియా, పాకిస్తాన్లో జరిగిన మత ఘర్షణల్లో రక్తం ఏరులై పారింది. ఆ సమయంలో పాకిస్తాన్ నాయకుడు మహ్మదలీ జిన్నా లాహోర్ పర్యటనకు వచ్చారు. జిన్నాతోపాటు ఓ మంత్రి, ఒక జర్నలిస్టు కూడా విమానంలో లాహోర్ చేరుకున్నారు. మత ఘర్షణల ఫలితంగా లక్షలాది మంది జనం పాకిస్తాన్లోకి రావడం, అంతే సంఖ్యలో దేశం నుంచి ఇండియాకు పారిపోవడం స్వయంగా జిన్నా గమనించారు. ఈ దారుణ దృశ్యాలను కళ్లారా చూసిన జిన్నా బాధతో నుదిటిపై చేయి వేసుకుని, ‘‘నేనెంత పని చేశాను?’’ అని నిరాశతో అన్నారు. జిన్నా అన్న మాటలు ప్రపంచానికి వెల్లడించింది కులదీప్ నయ్యర్. కులదీప్ నయ్యర్ నాకంటే 20 ఏళ్లు పెద్ద. కాని, 1975 శీతాకాలంలో న్యూఢిల్లీలోని త్రివేణీ కళా సంఘంలో జరిగిన మధ్యాహ్న భోజన సమావేశంలో తొలిసారి మేం కలుసుకున్నప్పటి నుంచీ మంచి స్నేహితుల మయ్యాం. లండన్‌లోని ద సండే టైమ్స్‌లో వేసవి స్కాలర్‌గా పనిచేసి అప్పుడే దేశ రాజధానికి తిరిగొచ్చాను. నయ్యర్ వల్ల నేను ఎలా ఇబ్బందిపడ్డానో చెప్పడానికే అక్కడకు ఆయ నను ఆహ్వానించాను. ఓ శుక్రవారం మధ్యాహ్నం ద సండే టైమ్స్ సాహిత్య విభాగం ఎడిటర్ త్వరలో ప్రచురించే కుల దీప్ పుస్తకం పేజీల ప్రూఫుల కట్ట పట్టుకుని నా డెస్క్ దగ్గరకు వచ్చారు. ఇండియాలో ఎమర్జెన్సీ కారణంగా ఆ సమయంలోనే నయ్యర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఆంగ్ల వారపత్రిక ఎడిటర్‌గా పనిచేస్తున్న ప్రఖ్యాత జర్నలిస్ట్ హెరాల్డ్ ఈవాన్స్ కులదీప్ అరెస్టుపై వార్తా కథనం రాయాలని నన్ను కోరారు. నేను ఆ ప్రూఫులు చదివి 300 పదాల వార్త రాశాను. పొగరుబోతు ప్రధానోపాధ్యాయురాలు తన క్లాసు లోని విద్యార్థు లను ఎలా బెదరగొడతారో ఇందిరాగాంధీ కూడా కేబినెట్ సమావేశాల్లో తన మంత్రులను అలాగే చూస్తారని నయ్యర్ చెప్పిన విషయం కూడా రాశాను. ఈ వార్త ఇందిరకు నచ్చలేదు. లండన్ నుంచి ఢిల్లీలో దిగగానే ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు మూడు గంటల పాటు నా బ్యాగులన్నీ క్షుణ్నంగా తనిఖీచేశారు. వాటిలో అభ్యంతరకరమైనదేదీ దొరకకపోవడంతో నన్ను బయటకు వెళ్లనిచ్చారు. నేను ఈ సంగతి వివ రించాక, నేనూ, కులదీప్ పగలబడి నవ్వుకున్నాం. ‘‘ఇందిరను మీరెప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా?’’ అని ఆయనను అడిగాను. ‘నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు, ఇంటర్వ్యూ ఇవ్వాలని అడగలేదు’ అని ఆయన జవాబిచ్చారు. ఎందుకని అడగలేదని ప్రశ్నిం చగా, ‘నన్ను చూడడానికి ఆమె ఎన్నటికీ అంగీకరించ రని అనుకున్నా’అని ఆయన తెలిపారు. అప్పటి నుంచీ ఆయన, నేనూ అప్పుడప్పుడూ కలుస్తుండే వాళ్లం. ఏడాది క్రితం చివరిసారిగా బంగ్లా దేశ్ హైకమిషన్‌లో కల్సుకున్నాం. బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం పలుకుతూ హైకమిషనర్ సయ్యద్ మువజ్జమ్ అలీ ఇచ్చిన విందులో ఇద్దరం పాల్గొన్నాం. అప్పుడు కులదీప్ చేతికర్రతో, ఓ మనిషి సాయంతో అక్కడికి వచ్చారు. కార్యక్రమం చివర్లో బయల్దేరే ముందు ‘‘నేను మరో పుస్తకం రాస్తు న్నాను, తెలుసా?’’ అన్నారు కులదీప్. దాదాపు 80కి పైగా పత్రికలకు వేలాది వ్యాసాలతోపాటు ఆయన 15 గ్రంథాలు రాశారు. ఈ పుస్తకాలన్నీ పాఠ కాదరణ పొందాయి. మరో ప్రసిద్ధ జర్నలిస్టు కుష్వంత్ సింగ్‌తో కలిసి ఓ పుస్తకం రాశారు. లాహోర్ లా కాలే జీలో కులదీప్‌కు కుష్వంత్ పాఠాలు చెప్పారు. 1979 డిసెంబర్లో లోక్‌సభ ఎన్నికల ప్రచా రంలో ఇందిరాగాంధీతోపాటు ఓ ఫోకర్ ఫ్రెండ్షిప్ విమానంలో నేను కూడా వెళ్లాను. ఆమె దేశ వ్యాప్తంగా అనేక బహిరంగ సభల్లో ప్రసంగించడం దగ్గర నుంచి గమనించాను. అప్పుడు నేను పనిచేస్తున్న ఆంగ్ల పక్ష పత్రిక ఇండియా టుడేలో మూడు పేజీల వ్యాసం రాశాను. ఇందిర ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ ప్రధాని అవుతారని ఈ వ్యాసంలో చెప్పాను. ఓ దౌత్య విందులో అదే వారం కులదీప్‌ను కలిశాను. తల అడ్డంగా ఊపుతూ ‘ఎంత పని చేశావు? నీకు రాజ కీయాల గురించి ఏమీ తెలియదు. నువ్వేమో ఇందిర మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పావు. ఈ విషయం ఇక మర్చిపో. అది ఎన్నటికీ జరగదు. పాత్రికేయునిగా నీ జీవితం నాశనం చేసుకున్నావు’ అని ఆయన అన్నారు. తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమిద్దరం మారిషస్ రాజధాని సెయింట్ లూయిస్ వెళ్లాం. కులదీప్ వచ్చారని తెలుసుకున్న ఆ దేశ గవ ర్నర్ జనరల్ సర్ శివసాగర్ రాంగులాం హిందూ మహాసముద్రానికి ఎదురుగా నిర్మించిన తన భారీ నివాస భవనానికి టీ పార్టీకి రావాలని మమ్మల్నిద్దరినీ ఆహ్వానించారు. అక్కడి నుంచి మేం మా హోటల్‌కు కాస్త ఆలస్యంగా చేరుకున్నాం. మాకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి సహాయకుడు ‘మీకు ఆడవాళ్ల తోడు కావాలా?’ అని భయం భయంగా అడిగాడు. ‘పులి తాను తినే జంతువులను తానే వేటాడి పట్టుకుంటుంది’ అని కులదీప్ చమత్కరించారు. కులదీప్ న్యాయశాస్త్రం చదివి లాయర్ కావడా నికి తగిన శిక్షణపొందారు. ఓ లాహోర్ కాలేజీలో జర్నలిజం డిప్లొమా కోర్సులో చేరారుగాని అందులో ఆయన తప్పారు. ఐఏఎస్‌లో చేరడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఢిల్లీ వచ్చాక కులదీప్ మొదట చేసిన జర్నలిస్టు ఉద్యోగం అంజామ్ అనే ఓ ఉర్దూ దినపత్రికలోనే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఉర్దూ దినపత్రిక విలేకరిగా ఆయన పాత్రికేయ జీవితం మొదలైంది. అయిష్టంగానే పాత్రికేయ వృత్తిలోకి కుల దీప్ ప్రవేశించారు. అయితే, చెప్పుకోదగ్గ ప్రావీ ణ్యంతో ఆయన జీవితాంతం జర్నలిస్టుగానే బతి కారు. మంచి రిపోర్టర్‌గా ఆయన ఎన్నో సంచలన వార్తలను మొదటిసారి రాసి దేశవ్యాప్తంగా కీర్తినార్జిం చారు. ఇక్కడ అలాంటి సంచనల వార్తల జాబితా ఇవ్వడానికి వీలులేనన్ని ఎక్కువ ఆయన రాశారు.అయితే, కులదీప్‌కు సంబంధించి వీటన్నిటి కన్నా ముఖ్య విషయం ఒకటుంది. చాలా మందికి ఇప్పటికీ ఇది తెలియదు. మానవ చరిత్రలోనే అత్యంత పాశవిక సందర్భంగా భావించే దేశ విభజన రోజులవి. మతం ప్రాతిపదికగా జరిగిన ఈ విభజన సందర్భంగా 1947 ఆగస్ట్–సెప్టెంబర్ మాసాల్లో ఇండియా, పాకిస్తాన్లో జరిగిన మత ఘర్షణల్లో రక్తం ఏరులై పారింది. ఆ సమయంలో పాకిస్తాన్ నాయ కుడు మహ్మ దలీ జిన్నా లాహోర్ పర్యటనకు వచ్చారు. జిన్నా తోపాటు ఓ మంత్రి, ఒక జర్నలిస్టు కూడా విమా నంలో లాహోర్ చేరుకున్నారు. మత ఘర్షణల ఫలి తంగా లక్షలాది మంది జనం పాకిస్తాన్ లోకి రావడం, అంతే సంఖ్యలో దేశం నుంచి ఇండి యాకు పారిపోవడం స్వయంగా జిన్నా గమనిం చారు. ఈ దారుణ దృశ్యాలను కళ్లారా చూసిన జిన్నా బాధతో నుదిటిపై చేయి వేసుకుని ‘‘నేనెంత పని చేశాను?’’ అని నిరాశతో అన్నారు. జిన్నా అన్న మాటలు ప్రపం చానికి వెల్లడించింది కులదీప్ నయ్యర్. జిన్నాతో పాటు లాహోర్ వచ్చిన పాక్ జర్న లిస్టు మరణించాక కొన్నేళ్లకు ఆయన భార్య చెప్పగా కులదీప్‌కు ఈ విషయం తెలిసింది. ఎస్ వెంకటనారాయణ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
నా కదలికలపై నిఘా కొనసాగుతోంది
-
మహాభారత కాలంలోనే జర్నలిజం..
సాక్షి, మధుర : జర్నలిజంపై యూపీ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతం సమయంలోనే పాత్రికేయ వృత్తి ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. హిందీ జర్నలిజం డే సందర్భంగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.హిందూ పురాణాల్లో దేవతలకు వార్తలను చేరవేసే నారదుడిని ఆయన ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌తో పోల్చారు. మీ గూగుల్ ఇప్పుడు ప్రారంభమైతే తమ గూగుల్ శతాబ్ధాల కిందటే వెలుగుచూసిందని, సమాచార సారధైన నారదముని సందేశాలను ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి వాయువేగంతో చేరవేసేవారని అన్నారు. ఇక హస్తినాపురంలో కూర్చుని సంజయుడు మహాభారత యుద్ధాన్ని దృతరాష్ర్టుడికి వివరిస్తాడని ఇది ప్రత్యక్ష ప్రసారం కాక మరేమిటని దినేష్ శర్మ ప్రశ్నించారు. సంజయుడి కళ్ల ద్వారా మహాభారత ఘట్టాలను ఇతరులు ఎలా వీక్షించారని ప్రశ్నించగా అలాంటి సాంకేతికత అప్పట్లోనే అందుబాటులో ఉందని వ్యాఖ్యానించారు. అంధుడైన ధృతరాష్ట్రుడు ఇంట్లో కూర్చుని యుద్ధ విశేషాలను తెలుసుకుంటాడని, ఇది సనాతన భారత్ సాధించిన విజయంగా త్రిపుర గరవ్నర్ తథాగథ రాయ్ గతంలో పేర్కొన్నారు. కాగా, మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్ వ్యవస్థ ఉందని అస్సాం సీఎం విప్లవ్ దేవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఫేక్ న్యూస్‌కి అటు ఇటూ..!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ‘ఫేక్ న్యూస్’ (నకిలి వార్తలు) అంశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఫేక్‌న్యూస్ రాసినట్టు, ప్రసారం చేసినట్టు నిరూపితమైన జర్నలిస్ట్‌లకు ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డు రద్దుచేస్తామన్న కేంద్ర సమాచారశాఖ వివాదాస్పద పత్రికా ప్రకటన మనదేశంలో సంచలనం సృష్టించింది. దీనిపై దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, రాజకీయపార్టీలు మొదలుకుని అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో కొన్ని గంటల్లోనే ప్రభుత్వం దీన్ని వెనక్కు తీసుకుంది. వచ్చే ఏడాది లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పత్రికలు, మీడియా నియంత్రణ ప్రయత్నాల్లో భాగంగానే జర్నలిస్టుల గుర్తింపు కార్డుల రద్దు ప్రతిపాదన వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. విశ్వసనీయతకు గ్రేడింగ్... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యాజోక్యంపై ఆధారాలు బయటపడుతున్న నేపథ్యంలో ఐరోపా వ్యాప్తంగా ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై బ్రసెల్స్ కసరత్తుచేస్తోంది. నకిలి వార్తలపై పోరులో భాగంగా సరిహద్దులు లేని విలేకరులు (రిపోర్టర్స్ వితవుట్ బార్డర్స్–ఆర్ఎస్ఎఫ్), వివిధ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కలిసి మంగళవారం జర్నలిస్టుల కోసం విశ్వాస,పారదార్శకత ప్రమాణాలు ప్రకటించాయి. జర్నలిజం ట్రస్ట్ ఇనిషియేటివ్ (జేటీఐ) ద్వారా స్వతంత్రత, వార్త వనరులు (న్యూస్ సోర్స్), ఉన్నతస్థాయి నైతికత ప్రమాణాలు »ే రీజు వేసి మీడియా సంస్థలను సర్టిఫై చేయాలని భావిస్తున్నారు. దీనికి ఏజెన్సీఫ్రాన్స్ ప్రెస్ (ఏఎఫ్సీ), యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (ఈబీయూ), గ్లోబల్ ఎడిటర్స్ నెట్వర్క్ మద్దతు తెలిపాయి. ఫేక్‌న్యూస్ పేరిట పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కుంటున్న దృష్ట్యా మీడియాకు విశ్వసనీయతను కలిగించేందుకు ఈ చర్య దోహదపడుతుందని ఆర్ఎస్ఎఫ్ అధిపతి క్రొస్టోఫో డెలోరి అభిప్రాయపడ్డారు. ప్రపంచస్థాయిలో వార్తలు, సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా స్వయం నియంత్రిత యంత్రాంగాన్ని తాము ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ట్రంప్‌తో... 2016 ఎన్నికల్లో అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక ఆయనపై అనేక వ్యతిరేకవార్తలొచ్చాయి. మీడియాలో తనపై వచ్చిన కథనాలను ‘ఫేక్‌న్యూస్’గా అభివర్ణిస్తూ ట్రంప్ ఈ పదబంధాన్ని ›ప్రచారంలోకి తీసుకొచ్చారు. దరిమిలా తమకు వ్యతిరేకంగా వచ్చే మీడియా కథనాలు, వార్తాసంస్థల వార్తలను గురించి వివిధదేశాల్లోని నాయకులు ఈ పదాన్నే ఉపయోగించడం పరిపాటిగా మారింది. ఫేక్‌న్యూస్‌తో పాటు తప్పుడు సమాచారంతో జరిగే ప్రచారాల వల్ల ప్రస్తుత సమాజం నిజమైన సవాళ్లనే ఎదుర్కుంటున్నా, ఈ వార్తల నియంత్రణ ముసుగులో పత్రికాస్వేచ్ఛను హరించేందుకు వివిధదేశాల్లోని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మీడియాపై విమర్శలు, దాడికి ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందిస్తుంటారు. ఫేక్‌న్యూస్ స్టోరీలను విమర్శిస్తూ సింక్లర్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ ప్రసారం చేసిన వార్తలను వెనకేసుకొచ్చారు. మలేషియాకు, ఆ దేశ పౌరులకు నష్టం జరిగేలా మలేషియాలో, బయటా అసత్య వార్తలు ప్రచారంలోకి తీసుకొచ్చే వారిపై 5 లక్షల రింగిట్టుల (1.23 లక్షల డాలర్ల) వరకు జరిమానాతో పాటు గరిష్టంగా ఆరేళ్ల జైలుశిక్ష విధించేలా అక్కడి ప్రభుత్వం చట్టం తెచ్చింది. సాథారణ ఎన్నికల నేపథ్యంలో ఈ చట్టపరిధిలోకి వార్తాసంస్థలు, డిజిటల్ పబ్లికేషన్లు, సోషల్ మీడియాను తీసుకొచ్చారు. ఆన్లైన్లో పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అంశాన్ని సింగపూర్ పార్లమెంటరీ కమిటీ సమీక్షిస్తోంది. ఆ దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా (8 రోజుల పాటు) సాగిన సమీక్ష గతనెల 29న ముగిసింది. తీసుకురాబోయే కొత్త చట్టంపై వచ్చేనెలలో ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. ‘రాప్లర్’ అనే న్యూస్సైట్పై తనకు నమ్మకం పోయిందని పేర్కొంటూ అధికార కార్యకలాపాలు కవర్ చేయకుండా ఆ సంస్థపై ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగొ డ్యూటెర్టొ నిషేధం విధించారు. ఆ సంస్థను ఫేక్‌న్యూస్ సంస్థగా ఆయన అభివర్ణించారు. డ్యూటెర్టో విధానాలు, ప్రకటనల్లో కచ్చితత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ఎండగట్టడమే ‘రాప్లర్’చేసిన నేరం.ఈ చర్యతో పాటు యాంటీ ఫేక్ న్యూస్ చట్టాన్ని కూడా డ్యూటెర్టొ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుడు వార్తలకు జరిమానతో పాటు ఇరవై ఏళ్ల వరకు జైలుశిక్ష విధించాలని ప్రతిపాదిస్తున్నాడు. థాయ్‌లాండ్ సైబర్ భద్రతా చట్టం కింద అసత్య సమాచార వ్యాప్తికి ఏడేళ్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అక్కడి రాచరిక కుటుంబం అవమానాల పాలు కాకుండా అడ్డుకునేందుకు ఆ దేశ మిలటరీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. బోగస్ రిపోర్టులు, ఇతరులను కించపరిచేలా చేసిన పోస్టింగ్‌లను వెంటనే తొలగించకపోతే సామాజిక మాధ్యమాలపై 50 మిలియన్ల యూరోల (60 మిలియన్ డాలర్లు) వరకు జరిమానా విధించేలా జర్మనీ ఇప్పటికే చట్టం చేసింది. ఎన్నికల నేపథ్యంలో నకిలి వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫ్రాన్స్ కూడా చట్టాన్ని రూపొందిస్తోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పారికర్‌పై అలాంటి వార్తలు ఘోరం : వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : సమాజానికి దర్పణం జర్నలిజం అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నారదుడు మొదటి జర్నలిస్టు అని చెప్పారు. లోకకళ్యాణం కోసమే జర్నలిజం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రముఖ సాహితీ వేత్త ఎన్ఆర్ చందూర్-జగతి జర్నలిస్టు అవార్డు 2018ని ప్రముఖ జర్నలిస్టు, గిజ్మోడో మీడియా గ్రూప్ సీఈవో రాజు నరిశెట్టి(అమెరికా)కు అందించిన సందర్భంగా వెంకయ్య జర్నలిజంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జర్నలిస్టులు పోరాడారని, జర్నలిజం ఒకప్పుడు మిషన్ గా ఉండేదని, ఇప్పుడు కమీషన్‌గా మారిందన్నారు. వ్యాపారం కోసం మీడియా సంస్థలు పెడుతున్నారని, ప్రజలతో గడపడంకన్నా ఆనందం మరొకటి లేదన్నారు. తెలుగు పాత్రికేయులు నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఎవరో ఒకరు చేసిన పొరపాట్లకు దేశాన్ని అవమానించడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టడం తప్పు అని, వ్యక్తిగత అవసరాలకు, వ్యాపార విస్తరణ కు మీడియా సంస్థలు పెట్టడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికలకు కొంత స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పారు. పెద్ద కుంభకోణాలను బయటపెట్టిన ఘనత పాత్రికేయులదేని, జర్నలిజం లో విలువలు, ప్రమాణాలు పాటించాలని సూచించారు. పొరపాట్లు అంగీకరించినప్పుడే విశ్వసనీయత పెరుగుతుందని చెప్పారు. మనోహర్ పారికర్ బాగానే ఉన్నారని, కానీ, ఆయన చనిపోతే, మరొకరు సీఎం అవుతారని వార్తలు రాయడం ఘోరం అని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా మీడియా ఉండాలని సూచించారు. -
సంస్కరణలకు వేగుచుక్క
భారతీయ భాషా జర్నలిజానికి రాజా రామమోహన్ రాయ్ (మే 22, 1772–సెప్టెంబర్ 27,1833) ఆద్యుడని అంటారు నెహ్రూ. ఆధునిక యుగపు ప్రాధాన్యం గురించి ఆనాడే∙ఆలోచించగలిగిన ఏకైక వ్యక్తి రాయ్ అని రవీంద్రనాథ్ టాగూర్ శ్లాఘించారు. రాయ్ ఏకేశ్వరోపాసనను ప్రగాఢంగా నమ్మారు. మాతృభాష బెంగాల్‌తో పాటు, పర్షియన్, అరబిక్, సంస్కృతం, లాటిన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలను నేర్చారు. సతీసహగమనాన్ని వ్యతిరేకించడంతో రాయ్ తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైనాడు. టిబెట్ వెళ్లి బౌద్ధాన్ని ఆచరించదలిచాడు. కానీ అక్కడ కూడా లామా ను ఆరాధించడం నచ్చలేదు. బెంగాల్ సివిల్ సర్వీస్‌లో దివాన్‌గా 1815లో పదవీ విరమణ చేసిన రాయ్ సతీ సహగమనం నిషేధం, పత్రికా స్వేచ్ఛలే లక్ష్యంగా కృషి చేశారు. ఇందుకోసమే జర్నలిస్ట్ అయ్యారు. మొదట ‘సంబాద్ కౌముది (1821) అనే వార పత్రికను స్థాపించారు. దేశంలో సామాజిక, రాజకీయ అంశాలపై నిర్దిష్ట ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించిన తొలి పత్రిక ఇదే. దీనితో మతపరమైన చర్చలకు శ్రీకారం చుట్టారాయన. క్రైస్తవ మిషనరీలు నిర్వహించే ‘సమాచార దర్పణ్’ హిందూ మతాన్ని విమర్శించేది. వీటిని ఖండించడంలో సంబాద్ కౌముది కీలకంగా ఉండేది. తరువాత సతీ సహగమనం దురాచారం, మత సంస్కరణల ప్రచారానికి రాయ్ ‘మిరాతుల్ అక్బర్’ (పర్షియన్) వారపత్రికను ఆరంభించారు. ఇది సంప్రదాయ హిందూ సమాజాన్ని కలవర పెట్టింది. భారతీయ సమాజాన్ని సంస్కరించేందుకు ఉద్దేశించిన రాతలే అయినా, అవి తమ ఉనికికి భంగం వాటిల్ల చేసేవిగా ఉన్నాయని ఈస్టిండియా కంపెనీ భావించింది. ఫలితమే 1823 నాటి ప్రెస్ లైసెన్సింగ్ చట్టం. దీని ప్రకారం పత్రిక ఏదైనా ప్రచురణకు గవర్నర్ జనరల్ అనుమతి అనివార్యం. అలాగే ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకునే అధికారం కూడా ఉండేది. అంటే సెన్సార్ షిప్. ఇందుకు నిరసనగా రాయ్ ‘మిరాతుల్ అక్బర్’ ప్రచురణను నిలిపివేశారు. ప్రెస్ రెగ్యులేషన్ చట్టం మీద సుప్రీం కోర్టుకు కూడా విన్నవించారాయన. కానీ ఆ కోర్టు ఆ విన్నపాన్ని తోసిపుచ్చింది. రాయ్ లండన్‌లోని కింగ్ ఇన్ కౌన్సిల్‌కు విన్నవించారు. హిందూ వేదాంతం మీద దాడి చేయడమే కాకుండా, దానిని ఖండిస్తూ రాయ్ ఇచ్చిన వివరణలను ప్రచురించడానికి సమాచార దర్పణ్ నిరాకరించేది. దీనితో రాయ్ ‘బ్రాహ్మనికల్ మ్యాగజైన్’ను ఇంగ్లిష్, బెంగాలీ భాషలలో ఆరంభించారు. సతీసహగమనం వంటి దురాచారాన్ని చూసి కదలి పోయిన రాయ్ 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. వదినగారి సహగమనాన్ని చూసి ఆయన చలించి పోయారు. ఒక్క 1818లోనే 544 మంది సజీవ దహనం చేశారు. ఈ అంశం మీద ఆయన పోరాటం విజయవంతమైంది. మొగల్ పాదుషా రెండవ అక్బర్ భరణం గురించి విన్నవించడానికి ఇంగ్లండ్ వెళ్లిన రాయ్ అక్కడే మరణిం చారు. భరతమాత గర్వించే ముద్దుబిడ్డ రాయ్. డాక్టర్ సీవీ నరసింహారెడ్డి మొబైల్ : 92465 48901 -
పంచకుల పరాశక్తి
అల్లరిమూక అల్లరి చేస్తుంది. రాళ్లు రువ్వుతుంది. నిప్పులు చిమ్ముతుంది. ఇటు పౌరుల్ని కాపాడుకోవాలి. అటు అల్లరి చేస్తున్న ఆవేశపరులనూ అదుపు చేయాలి. ఇవి రెండూ పోలీసులు చేయాలి. కానీ పోలీసులే ప్రాణభయంతో పరుగులు తీసే పరిస్థితే వస్తే?! ధీశాలి అయిన ఓ శాంతిశక్తి అవతరించాలి. డేరాబాబా వల్ల జరిగిన అల్లర్లలో పంచకులలో ప్రాణ నష్టం జరగలేదంటే.. అందుకు.. గౌరీ పరాశర జోషీ చూపిన అసమాన ధైర్యసాహసాలే కారణం! ఇంటికెళ్లి చూసుకుంటేనే కానీ ఆమెకు తెలియలేదు.. తన ఒంటిపై గాయాలున్నాయనీ, అవి రక్తం స్రవిస్తున్నాయని! కమిషనర్ గౌరి తన రక్తంతో శాంతిని కాపాడింది. హర్యాణాలోని పంచకుల నగరం.. డేరా బాబా భక్తుల అల్లర్లతో అట్టుడిగిన ప్రాంతం! గుర్మీత్ రామ్ రహీమ్‌ను నేరస్థుడిగా తేల్చగానే.. ఆయన అనుచరులు దాడులు, దహనాలతో పంచకులను అతలాకుతలం చేశారు. నిలువరించడానికి వచ్చిన పోలీసులను కర్రలు, రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. వాళ్ల వెర్రి ఆవేశానికి భీతిల్లిన పోలీసులు అక్కడి నుంచి దాదాపుగా పారిపోయారు. ఆ సమయంలో ధైర్యంగా నిలబడ్డ వ్యక్తి ఒక్కరే. అల్లరిమూకల రాళ్లు తగులుతున్నా.. కర్రలు... వేసుకున్న బట్టలను చించుతున్నా.. వెరువక... కర్తవ్య నిర్వహణలో ముందుకెళ్లి.. పంచకులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆ ఆగడాలను ఆపే ప్రయత్నం చేసిన ఒకే ఒక్క యోధ.. ఓ మహిళ! ఒంటిచేత్తో కాదు కాని తెగువతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇలాగే కొనసాగితే పంచకుల మారణహోమంలా మారే ప్రమాదం ఉందని గ్రహించి సరాసరి తన ఆఫీస్‌కి వెళ్లి సిచ్యుయేషన్‌ను ఆర్మీకి హ్యాండోవర్ చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. ఆ ధీరవనితే గౌరీ పరాషర్ జోషి. ఐఏఎస్. పంచకుల డిప్యూటీ కమిషనర్! ఇది ఆగస్ట్ 25వ తేదీ, శుక్రవారం నాడు జరిగింది. అలా ఆ పగలంతా కూడా పంచకుల ప్రతీ గల్లీ, ప్రతీ మూలకు పహారా కాసి లొల్లి సద్దుమణిగాకే రాత్రి మూడు గంటలకు ఇంటికి వెళ్లారు. గుర్మీత్ రామ్ రహీమ్ బాబా తన నేరనైజంతో దేశం నోట్లో నానుతుంటే అతని ప్రభావం సృష్టించిన గందరగోళాన్ని ఆపిన సాహసిగా పాపులారిటీ తెచ్చుకున్నారు గౌరి. కలహండీ నేర్పింది నిజానికి గౌరి.. ఒడిషా కేడర్ ఐఏఎస్. ఆమె ప్రొబేషనరీ పీరియడ్ అంతా కడుపేదరికం, నిరక్షరాస్యత, మావోయిస్ట్ ప్రాబల్యమూ ఉన్న కలహండీలోనే గడిచింది. ఐఏఎస్‌గా మస్సూరీలో చదువుకున్న థియరీకి ప్రాక్టికల్స్ నేర్చకుంది అక్కడే. క్లిష్టసమయాలను ఎలా డీల్ చేయాలో తెలుసుకుందీ అక్కడే. ప్రజలు మావోయిస్ట్‌లకు ఎందుకు ఆకర్షితులవుతున్నారో.. వాళ్లపట్ల సానుభూతి ఎందుకు చూపిస్తున్నారో.. పాలనాలోపం ఎక్కడుందో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అవగతం చేసుకున్నారు గౌరి. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని అర్థం చేసుకున్నారు. కలహండీలో పనిచేసిన రెండేళ్లు దాని మీదే దృష్టిపెట్టారు. అక్కడున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి పోయేలా చూశారు. ఇటు పాలనాపరంగానూ తన సిబ్బందిలో ఉన్న అలసత్వాన్ని దులిపేసి క్రమశిక్షణను అలవర్చారు. బాధ్యతల బరువు పెట్టారు. దాంతో అడ్మినిస్ట్రేషన్ చురుకైంది. ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం దొరకడం ప్రారంభమైంది. తద్వారా మావోయిస్ట్‌ల పట్ల ప్రజలకున్న సానుభూతి కాస్తా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం పట్ల నమ్మకంగా మారిపోసాగింది. అలా గౌరి కృషి ఫలితాలను అక్కడి ప్రజలు అందుకునేలోపే ఆమె హర్యాణాకు బదిలీ అయిపోయారు. కలహండీలో పనిచేసింది తక్కువ కాలమే అయినా తన పాలనా దక్షత, సామర్థ్యాలతో పెక్కు ప్రభావమే చూపారు. అనతికాలంలోనే మంచి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు గౌరీ పరాçశర్ జోషీ. రాజకీయాల్లో.. ప్రభుత్వంలో.. ఇటు రాజకీయంగా.. అటు ప్రభుత్వ పరంగా మంచి పరపతిగల కుటుంబంలోని అమ్మాయి గౌరి. ఆమె తండ్రి ఆర్ఎన్ పరాశర్ హర్యాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాకు ముఖ్య సలహాదారుడు. అంతేకాదు అన్ని పార్టీల్లోని కీలక వ్యక్తులతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఆ పరిచయాలతో హర్యాణా బీజేపీ ప్రభుత్వంలో కూడా పనులు చేయించుకోగల సమర్థుడు ఆయన. గౌరి విషయానికి వస్తే చిన్నప్పటి నుంచీ చురుకైన పిల్ల. పుట్టిపెరిగిందంతా ఢిల్లీలోనే. చదువులో ఎప్పుడూ ఫస్టే. సీబీఎస్సీ ట్వల్త్ క్లాస్‌లో మంచి మార్కులు వచ్చాయి. ఆ పర్సంటేజే ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మకమైన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌లో ఆమెకు సీట్‌ను ఖరారు చేసింది. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేశారు. పెళ్లి.. ఈలోపే హర్యాణా కేడర్‌కు చెందిన అజిత్ జోషీ అనే ఐఏఎస్, గౌరి.. మూడుముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. ఆయన కోసం ఒడిషా నుంచి హర్యాణాకు డిప్యుటేషన్ మీద రావాల్సి వచ్చింది. ఆమె అలా వెళ్లిపోవడం కలహండీ ప్రజలకు బాధ కలిగించింది. నిజానికి ఏ కొత్త ఐఏఎస్‌కైనా కలహండీ ఒక సవాల్. తమలోని అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్‌ను నిరూపించుకునే అవకాశం. కరెక్ట్‌గా ఆ బాటలోనే ఉన్న గౌరి పెళ్లితో అర్ధంతరంగా గమ్యాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అలా హర్యాణాకు ప్రయాణమైంది. అయినా ఆ 24 నెలల్లో కలహండీ సంక్షేమం కోసం ఆమె పాటుపడ్డ తీరు సీనియర్ ఐఏఎస్‌లకి కూడా కష్టమైందే. కాబట్టే అక్కడి ప్రజలకు గౌరి అంటే అంతటి అభిమానం. గొప్ప గౌరవం. ఇంకా సాగుతూనే ఉంది.. ప్రజాక్షేమం కోసం సివిల్ సర్వెంట్‌గా ఆమె పోరాటం ఇంకా సాగుతూనే ఉందని మొన్నటి పంచకుల సంఘటన కూడా రుజువు చేసింది. గౌరిలోని సమయస్ఫూర్తిని, వేగంగా సరైన నిర్ణయాలు తీసుకోగల దక్షతనూ చూపించింది. పంచకుల ఆకతాయిల హస్తగతం అవుతోందని.. రక్తం పారే ప్రమాదం ఉందని, అగ్ని కీలలు ఎగసే అపాయమూ లేకపోలేదని గ్రహించి.. ఆర్మీ అయితే అదుపులో ఉంచగలదని ఊహించి క్షణాల్లో ఆర్డర్ పాస్ చేశారు. అయినప్పటికీ తన బాధ్యతను మరవలేదు. పంచకుల స్థిమితపడేదాకా తను నిద్రపోలేదు. పంచకుల ప్రశాంతమైందని నిర్ధారించుకున్నాకే ఇంటికి వెళ్లారు. ఆమెను ఆ అవతారంలో చూసిన కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. బట్టలు చిరిగి.. చేతులకు, మొహానికి గాయలతో రక్తమోడుతూ ఉన్నారు. అప్పుడు చూసుకున్నారు తనని తాను గౌరి! అదీ ఆమె నిబద్ధత. ‘నేను ఏది చేసినా.. నా డ్యూటీలో భాగమే. ప్రజల క్షేమం కోసమే. శాంతిభద్రతల పరిరక్షణే నా ధ్యేయం’ అంటారు బ్రేవ్ ఐఏఎస్ గౌరీ పరాశర్ జోషీ. మహిళాశక్తిని గుర్తించి.. ప్రొబెషనరీగా కలహండీలో అడుగు పెట్టారు. ఆగమ్యగోచరంగా తోచాయి అక్కడి స్థితిగతులు ఆమెకు. రాజకీయనాయకుల నుంచి ప్రభుత్వ సిబ్బంది వరకు ఎవరికీ ఏ బాధ్యతా పట్టదు. వెళ్లిన పదిహేను రోజుల్లోనే బాగా ఆకళింపు చేసుకున్నారు గౌరి. కుటుంబాన్ని దానిద్వారా ఊరిని, సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి స్త్రీనే అని గౌరికి బాగా తెలుసు. అందుకే మహిళల మీద గురి పెట్టారు గౌరి. పేదరికం రాజ్యమేలుతున్న కలహండీలో ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తే చాలా విషయాలు దారిలోకి వస్తాయని ఆమె నమ్మకం. పేదరికంతో యుద్ధం చేయడానికి వాళ్లను సమాయాత్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ స్వావలంబన, డ్వాక్రా వంటి సెల్ఫ్‌హెల్ప్ పథకాలలో వాళ్లను భాగస్వాములను చేశారు. కొంచెం ఆర్థిక పరిపుష్టి సాధించాక అప్పుడు ఇంట్లో నిర్ణయాలు తీసుకునేలా వాళ్లను ఆమె ప్రోత్సహించారు. దాంతోపాటే అక్షరాస్యత దిశగా కూడా వాళ్లతో అడుగులు వేయించారు. వీటన్నిటితో కలహండీ లేడీస్ పురుషులకు సలహాలిచ్చే దశకు ఎదిగారు. ఊళ్లో సమస్యల గురించి స్థానిక నాయకులను ప్రశ్నించే ధైర్యం తెచ్చుకున్నారు. ఇవన్నీ ఆటోమెటిగ్గా ఆ జిల్లాలోని గ్రామాల్లో ఇతరుల జోక్యాన్ని తగ్గించసాగాయి. ఇలా పరిస్థితి కొంచెం అదుపులోకి రాగానే మావోయిస్ట్ ఆపరేషన్స్ మీదా దృష్టిపెట్టారు ఆమె. అలా పెద్దగా హింసకు పాల్పడకుండానే కొంత మావోయిస్ట్ ప్రాబల్యాన్ని తగ్గించగలిగారు గౌరీ పరాశర్ జోషీ. జర్నలిజం.. సివిల్ సర్వీసెస్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం ఆమె అభిరుచి. నాలుగు రకాల వార్తాపత్రికలను ఆసాంతం చదివేసేవారు. అదే ఆమెలో జర్నలిస్ట్ కలను రగిలించింది. కాలేజ్‌కి వెళ్లే సరికి ఆ కల ఆశయంగా మారింది. దాంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌కి ఎంట్రెన్స్ రాశారు. అంతటి టఫ్ ఎగ్జామ్‌ని అవలీలగా పాస్ అయ్యారు. అంతే అవలీలగా ఐఐఎమ్‌సీ జర్నలిజం డిప్లొమానూ పూర్తి చేశారు. ఆ సమయంలో చాలా మంది జర్నలిస్ట్‌లూ ఆమెకు పరిచయమయ్యారు. అయితే ఎందుకనో మరి ఐఐఎమ్‌సీ నుంచి బయటకొచ్చేలోపే ఆమె లక్ష్యం మారిపోయింది. ఐఏఎస్ కావాలనుకున్నారు. సివిల్స్‌కి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. 2008 యూపీఎస్సీ ఎగ్జామ్ రాశారు. గౌరి పాస్ కాకపోతే విస్మయం. క్లియర్ అయితే ఎందుకు ఆశ్చర్యం? ఆల్ ఇండియా 60వ ర్యాంక్‌ను సాధించి ఐఏఎస్ సర్వీస్‌ను ఎంచుకున్నారు గౌరీ పరాశర్ జోషీ. ఒడిషా కేడర్ ఐఏఎస్‌గా చార్జ్ తీసుకున్నారు. – శరాది -
గ్లోబల్ జర్నలిజం కోసం రూ.650 కోట్లు
వాషింగ్టన్ : స్వతంత్ర మీడియా, స్వేచ్ఛాయుత జర్నలిజం కోసం రాబోయే మూడేళ్లలో రూ.650 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ఈబే సంస్థ వ్యవస్థాపకుడు పెర్రీ ఒమిడియార్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తప్పుడు సమాచారంతో పాటు, విద్వేష ప్రసంగాలను నిరోధించడానికి వినియోగిస్తామన్నారు. గతంలో పనామా పేపర్ల కుంభకోణాన్ని బయటపెట్టిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) సంస్థకు తన దాతృత్వ సంస్థ ఒమిడియార్ నెట్వర్క్ ఇనిషియేటివ్(ఓఎన్ఐ) ద్వారా పెర్రీ 4.5 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించారు. ప్రస్తుతం ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా స్పందించకపోవడంతో పాటు, మీడియా సంస్థలు నమ్మకాన్ని కోల్పోవడం, తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నాయని ఓఎన్ఐ సభ్యుడు మ్యాట్ బెన్నిక్ తెలిపారు. సమాచార స్వేచ్ఛతో పాటు ప్రజల భాగస్వామ్యం, బాధ్యతాయుత జర్నలిజంకు తాము కట్టుబడి ఉన్నట్లు మాట్ స్పష్టం చేశారు. ఒమిడియార్ తన సొంత వార్తా నెట్వర్క్ ‘ది ఇంటర్సెప్ట్’లో రానున్న కాలంలో 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల యూదులపై విద్వేషాన్ని నిరోధించడానికి పోరాడే యాంటి డిఫమేషన్ లీగ్(ఏడీఎల్), లాటిన్ అమెరికాలో ప్రభుత్వాల జవాబుదారి కోసం పోరాడే లాటిన్ అమెరికన్ అలయెన్స్ ఫర్ సివిక్ టెక్నాలజీ(ఏసీటీ) సంస్థలు లబ్ధి పొందనున్నాయి. ఫ్రాన్స్‌లో జన్మించిన ఒమిడియార్ ఇరానియన్-అమెరికన్ పౌరుడు. -
కరణ్ థాపర్ కు ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ : జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రముఖ పాత్రికేయుడు, టీవీ యాంకర్ కరణ్ థాపర్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు దక్కింది. 2016 సంవత్సరానికి గాను కరణ్ థాపర్‌ను ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు టీఎస్ఆర్ ఫౌండేషన్ అవార్డు కమిటీ తెలిపింది. టీఎస్ఆర్ ఫౌండేషన్ కన్వినర్ టి. సుబ్బరామి రెడ్డి ఈ అవార్డును సుప్రసిద్ధ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం ఏర్పాటుచేశారు. ఏటా పాత్రికేయ రంగానికి చెందిన ఒకరిని ఈ అవార్డుతో టీఎస్ఆర్ ఫౌండేషన్ సత్కరిస్తోంది. చైర్మన్ కరణ్ సింగ్ నేతృత్వంలోని టీఎస్ఆర్ ఫౌండేషన్ అవార్డు కమిటీ సభ్యులు ఆనంద్ శర్మ, కాంత జీకే రెడ్డి, డాక్టర్ సుబ్బరామి రెడ్డి ఏకగ్రీవంగా కరణ్ థాపర్‌ను ఈ అవార్డుకు ఎంపికచేశారు. ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు బహుమతి, బంగారం పతకం, స్పెషల్ ట్రోపి కరణ్ థాపర్‌కు బహుకరించనున్నారు.. న్యూఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్‌ను బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఐటీవీకి కరణ్ థాపర్ అధ్యక్షుడు. బీబీసీ, దూరదర్శన్, ఛానెల్ న్యూస్ ఆసియాలకు ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రొగ్రామ్‌లు రూపొందిస్తోంది. -
మన్నించు ఇర్ఫాన్...
జీవన ప్రవాహం జూన్, 8, 2014. పనికిరాని చదువులకు బైబై చెప్పి జర్నలిజంలో చేరిన తొలి రోజులు. అప్పుడప్పుడే పుస్తకాల విలువ తెలిసింది. ఆదివారం కావడంతో గురువుగారి ఆదేశం గుర్తొచ్చింది. తొలిసారి శ్రీశ్రీ మహాప్రస్థానం, దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి వరస పెట్టి చదివాను. సందర్భం వచ్చింది కాబట్టి ఈ పుస్తకాల గురించి ఒక్క వాక్యంలో చెప్పాలి. 21వ శతాబ్దపు సమాజంలో బతకాలంటే దయచేసి ఈ పుస్తకాలు చదవకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనిషిలో సమాధి అవుతున్న నీతి, నిజాయతీ, ప్రేమ, కరుణ లాంటి ఈ సమాజానికి సరిపడని ఎన్నో ‘అవలక్షణాల’కు ఈ రెండు పుస్తకాలు మళ్లీ ఊపిరి పోస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషిలోని మనిషితనాన్ని మళ్లీ తట్టిలేపుతాయి. అంతే జీవితం నాశనం. సంపాదన అనే ప్రవాహంలో ఈదడం చేతకాక, విలువలు, సమాజం అని ‘పనికిరాని’ వాటి గురించి ఆలోచించడం మొదలు పెట్టేస్తాం. సరే అవన్నీ పక్కనపెడితే.. శ్రీశ్రీ విప్లవ సాహిత్యం తాలూకు ఆవేశమో లేక తిలక్ భావ కవిత్వంలోని ఆవేదనో మనసు భారంగా, మెదడు దూరంగా వెళుతున్నాయి. ఇలా అయితే కష్టమని తలచి, వెంటనే జన జీవన స్రవంతిలో కలవాలని నా వసతి గృహానికి రెండు కిలోమీటర్ల దూరంలో సరూర్ నగర్ చెరువు అంచున ఉన్న ప్రియదర్శిని ఉద్యానవనానికి సాయంకాలపు వ్యాహ్యాళికి బయలు దేరా. మధ్యలో శివ టీ స్టాల్లో ఛాయ్ అదనపు ఖర్చు. అలా చెరువు అంచున ఉన్న ప్రేమ జంటల్ని ఓ కంట కనిపెడుతూ మొత్తానికి పార్కుకు చెరుకున్నా. టికెట్ తీసుకొని అలా లోపలికి వెళ్లి పచ్చని గడ్డిలో కూర్చొని సేద తీరుతున్నా. అన్ని కథల్లోలాగే ఆకాశం కూడా నిర్మలంగానే ఉంది. ఆదివారం, పైగా వేసవి సెలవులు కూడా దగ్గర పడటంతో పార్క్ అంతా పిల్లలు, వారి తల్లిదండ్రులతో నిండిపోయింది. తుప్పల్లో ప్రేమ జంటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో చివర కాస్త ఓపెన్ ప్లేస్‌లో వృద్ధులంతా ఒక చోట చేరి ఆ మధ్యే వచ్చిన ఎన్నికల ఫలితాలతో పాటు రాజకీయాలు, సినిమాలు, అవి చేస్తున్న చేటు, చెడిపోతున్న యువత అంటూ వాళ్ల రొటీన్ కబుర్లలో మునిగిపోయారు. మళ్లీ అదే గోల ఎందుకని వారికి కాస్త దూరంగా వెళ్లి పచ్చని గడ్డిలో పడుకొని, ఏవో కాలేజీ రోజుల జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నా. ఇంతలో ఒక చెయ్యి నా భుజాన్ని తడుతున్నట్లు అనిపించింది. కళ్లు తెరచి చూస్తే ఒక బాలుడు. భుజాల దగ్గర కిందికి చిరిగిన చొక్కా. మూమూలు పాత ప్యాంటు. దరిద్ర నారాయణుడికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. ఏడెనిమిదేళ్లుంటాయి అనుకుంటా. ఏదో చెబుతూ చివర్లో ఏక్ రూప్యా దేదోనా భయ్యా.. అని అన్నాడు. అదొక్కటే స్పష్టంగా అర్థమైంది. సరే ఒక్కణ్నే ఉన్నా కదా. కాసేపు వాడితో సంభాషించాలని డిసైడ్ అయ్యా. అదే నా మొదటి ఇంటర్వ్యూలా భావించి మాటలు కలిపా. నాకు ఉర్దూ రాదు. కానీ వాడికి తెలుగు వచ్చు. హమ్మయ్య అనుకున్నా. అలా మా మధ్య జరిగిన సంభాషణ.. నీ పేరేంటి తమ్ముడు? ... ఇర్ఫాన్ అన్నా. ఎక్కణ్నుంచి వచ్చావు?... భగత్‌సింగ్ నగర్. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు?... మా నాయిన సచ్చిపోయిండు. అయ్యో ఎలా? మాది మహబూబ్‌నగర్ అన్నా. రెండేండ్ల కింద అణ్నే ఉంటుండే. మా నాయిన కిరాయి ఆటో నడుపుతుండే. ఒక రోజు రాత్రి ఆటో కిరాయికి వోయి మళ్ల ఇంటికి వస్తుండు. మందు తాగి నడిపిండంట. లారీ గుద్ది సచ్చిపోయిండు. ఆడ బత్కనీకి ఏం లే. అందుకే ఈడొచ్చి ఉంటున్నాం. మరి ఇక్కడేం చేస్తుంది మీ అమ్మ? మా గల్లీ దగ్గర పెద్ద బిల్డింగ్ ఉంది. దాంట్ల పనిచేస్తది. ఏం చేస్తుంది? పెద్దొళ్లు ఉంటరు కదా. వాళ్ల ఇంట్ల గిన్నెలు కడిగి, బట్టలు ఉతుకుద్ది. మీ ఇంట్ల ఎవరెవరు ఉంటారు? అమ్మ, ఇమ్రాన్, నేను. సరే. మరెందుకు ఇలా డబ్బులు అడుక్కుంటున్నవ్? మా అమ్మ అడుకొచ్చుకోమన్నది. ఇయ్యాల జరమొచ్చి పనికి పోలే. ఎవలు అన్నం పెట్టలే. పైసల్ అడుకొచ్చుకొని ఏమన్న కొనుకోమని చెప్పింది. మరి రోజూ ఎలా తింటారు? పొద్దున మా అమ్మ ఎంట నేను తమ్ముడు పోతం. ఆడ ఆళ్లు కొంచెం అన్నం పెడ్తరు. మధ్యానం మళ్ల ఉస్కూల్ పోత కదా. ఆడ తింట. మళ్ల పొద్దూకంగ మా అమ్మ ఎంట పోతం మళ్ల ఆళ్లు ఏమన్న పెడ్తరు. మరి ఎవరూ డబ్బులు ఇవ్వకపోతే? మా అమ్మ నీళ్లు తాగి పండుకోమంటదన్నా. ఏమన్న పెట్టమంటె పైసల్లేవంటది. మాకు మస్తు ఆకలైతదన్నా. మా తమ్ముడు మస్తేడుస్తడన్నా. అంతే నా నోటి నుంచి మరో ప్రశ్న రాలేదు.. కళ్ల వెంట రెండు చుక్కలు తప్ప. వాడు అలా చెప్పగానే రోజూ నేను వృథా చేస్తున్న వాటిని తలుచుకుంటే సిగ్గేసింది. ఆ క్షణం నేనేం చేయ్యలేకపోయా.. నా జేబులో ఉన్న పది రూపాయల నోటు వాడికి ఇవ్వడం తప్ప. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. అలా ఖాళీ జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్లిపోయా.. ‘అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం.. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో’ అని ఆవేశాన్ని, ఆవేదనను కలిపి దాశరథి రాసిన కవితను గుర్తుతెచ్చుకుంటూ. ఇర్ఫాన్ విషయాన్ని కొద్ది రోజుల తర్వాత కొంతమంది మిత్రులతో కూడా పంచుకున్నా. చాలా మంది హేళనగా మాట్లాడారు. ‘కష్టం చేతగాని వాళ్లు అలా అడుక్కొని తింటారు అని ఏవోవో చెప్పారు. ఏమో నిజమే కావచ్చు. వాళ్లకు తారసపడిన వాళ్లు అలాంటి వాళ్లే అయ్యుండొచ్చు. కానీ, ఇర్ఫాన్ మాత్రం అలా కాదు. తనతో మాట్లాడుతున్నంత సేపు వాడి మాటల్లో నిజాయతీ వినిపించింది. కళ్లల్లో ఆకలి స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత పార్కుకు వెళ్లినప్పుడు వాడు రాలేదు. కానీ, అలాంటి ఇర్ఫాన్‌లు మాత్రం చాలా మంది కనిపించారు. ‘మన్నించు ఇర్ఫాన్ నేను నీకేం చేయలేనా?’ అంటూ ఆ పార్కుకు వెళ్లినప్పుడల్లా గుర్తు చేసుకుంటున్నా. - శివశంకర్ -
జారుడుమెట్లపై జర్నలిజం
జాతిహితం కార్గిల్ యుద్ధ కాలం నుంచి మనం, జర్నలిస్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, మన దేశ బలాన్ని బహుళంగా హెచ్చింపజేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజానికి ఆ రెండూ కూడా కాగలరు. సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ, డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్‌పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్‌గా మార్చేయడం ద్వారానో కాదు. భారతీయ జర్నలిజం స్వీయ వినాశకమైదిగా ఎప్పుడు మారింది? మన జర్నలిజం స్వీయ వినాశం ఎప్పుడు మొదలైంది? లేదా అది స్వీయ వినాశక దిశగా పయనిస్తోందా? మీరు ఎంతగా అందరి దృష్టిని ఆకర్షించాలని కోరు కుంటారనే దాన్ని బట్టి మీరే ఈ ప్రశ్నను ఎలా వేయాలో ఎంచుకోండి. మొదటిది ఊరిస్తున్నా, మూడోదాన్ని నేను ఎంచుకుంటున్నాను. కాబట్టి ఇది రాస్తున్నది స్వీయ (సంస్థాగత) సానుభూతితో కాదు... స్వీయశోధనను, చర్చను ఆహ్వానించడం కోసం. పైన పేర్కొన్న ప్రశ్నలను సున్నితంగా రూపొందించే ఇతర మార్గాలూ ఉన్నాయి. జర్నలిస్టులమైన మనం మన ప్రభుత్వానికి అధికార ప్రతినిధులమని, ఇతరుల నైతికతా పరిరక్షకులమని, మాతృభూమి రక్షణ కోసం పోరాడే సైనికులమని భావించడం ఎప్పడు ప్రారంభమైంది? ఇదేదో బ్రెజ్నెవ్ పాలనలోని సోవియట్ రష్యా ప్రభుత్వం అన్నట్టు జాతీయ భద్రతాపరమైన, విదేశాంగ విధానపరమైన సమస్యలను ప్రశ్నించ డాన్ని నిలిపి వేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాం? చాలామంది పాత్రికేయులు-మన సీనియర్ సహా-మన దేశం గురించి మాట్లాడేటప్పుడు ‘‘మేం,’’ ‘‘మన,’’ ‘‘మనం’’ అనే పదాలను వాడటాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు ఎందుకని? మన విదేశాంగ, భద్రతా విధానాలను ఎందుకు ప్రశ్నిం చడం లేదు? ‘‘మీ అమెరికన్లకు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధం సంక్లిష్టమైన దని, అది మాకు హానికరమని మాకు తెలుసు. అయినా మీ ఆందోళనల పట్ల మేం సున్నితంగా ఉంటామని మీరు ఆశించజాలరు’’ ఇలా మాట్లాడుతు న్నారు. భారత జర్నలిజంలో వచ్చిన ఈ మలుపుతో మనం తప్పును చూడటం మానేసి సమష్టి అధికారిక వ్యవస్థలో భాగంగా మారిపోయాం. నిష్ఠుర నిజాలు చెప్పే వారేరి? విదేశాంగ, సైనిక విధానాలకు సంబంధించి భారత పాత్రికేయులు మరింత ఎక్కువ అధికారపక్షవాదంతో ఉంటారని పాకిస్తాన్ పాత్రికేయులు ఎప్పుడూ అంటుంటారు. అతి తరచుగా పాక్ పాత్రికేయులు ధైర్యంగా అధికారిక విధానాలను ప్రశ్నిస్తుంటారు. కశ్మీర్ విధానం, ఉగ్రవాద గ్రూపులను పెంచి పోషించడం, పౌర-సైనిక సంబంధాలు వంటి సమస్యలు సైతం అలా వారు ప్రశ్నించే వాటిలో ఉన్నాయి. అందుకుగాను కొందరు పాత్రికేయులు ప్రవా సంలో గడపాల్సి వస్తోంది (రజా రూమి, హస్సెన్ హఖాని), లేదా జైలు పాలు కావాల్సి వస్తోంది (నజామ్ సేథి). భారత మీడియా గుడ్డిగా అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సమర్థిస్తుందని ఎవరూ అనరు. ఎల్టీటీ యీకి సైనిక శిక్షణను, ఆయుధాలను ఇచ్చి ప్రోత్సహించడాన్ని మన మీడియా ప్రశ్నించింది. అలాగే ఆ తర్వాతి కాలంలో భారత శాంతి భద్రతా దళాలను (ఐపీకీఎఫ్) పంపి శ్రీలంక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్నీ భారత పాత్రికేయులు ప్రశ్నించారు. ఆపరేషన్ బ్లూస్టార్ నుంచి బస్తర్, కశ్మీర్ లోయల వరకు సైన్యాన్ని ప్రయోగించడంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ ధోరణి మారుతోంది. ఇది కేవలం ఉడీ ఉగ్రదాడి తదుపరి మాత్రమే మొదలైంది కాదు. తేలికపాటి ఆయుధాలు ధరించిన నలుగురు సైనికేతరులు (పాక్ ఉగ్రవాదులు) ఒక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ భద్రతా వలయాలన్నిటినీ ఛేదించుకుని అధీన రేఖ దాటి దాదాపు రెండు కిలోమీటర్లు లోపలికి ఎలా చొచ్చుకు పోగలిగారని ఒకే ఒక్క టీవీ జర్నలిస్టు కరన్ థాపర్ ‘ఇండియా టు డే’లో ప్రశ్నించారు. విస్పష్టమైన ఈ వైఫల్యంపై విమర్శనాత్మకమైన అంచ నాను వేసిన గౌరవనీయులైన రిటైర్డ్ జనరల్ ఒకే ఒక్కరు.. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ థిల్లాన్. ఆయన 1987లో ఇదే అక్టోబర్ రోజుల్లో జాఫ్నాలోకి పోరా డుతూ చొచ్చుకుపోయిన ఐదు బ్రిగేడ్లలో ఒక దానికి నేతృత్వం వహించారు. ఆయన బ్రిగేడ్ అతి వేగంగా, తక్కువ నష్టాలతో జాఫ్నాకు చేరింది. ఆయన వ్యర్థ ప్రలాపాలు చేయని, పాత కాలపు సైనికుడు. నేటి తెల్ల మీసాల ప్రైమ్ టైమ్ కమెడియన్లకు అయన ఒక మినహాయింపు. ఈ మార్పు కార్గిల్‌తో ప్రారంభమైందని నేను అంటున్నాను. కార్గిల్‌తోనే మొదలైన పతనం కార్గిల్ కథనం లేదా యుద్ధం మూడు వారాల సార్వత్రిక ఖండనలతో మొద లైంది. పాకిస్తానీలు తామక్కడ లేమని ఖండించారు, మన సైన్యం వారు అంత లోతుగానూ, అంత విస్తృతంగానూ ఏమీ చొరబడలేదంటూ ఖండిం చింది. రక్షణ శాఖ సహా ప్రభుత్వం ఆ ఘర్షణ పర్యవసానాలను గ్రహించ లేదు. అందువల్లనే సీనియర్ జనరల్స్ కంటే ముందుగా మీడియా ప్రతిని ధులే అక్కడికి వెళ్లారు. ఇది అనుద్దేశపూర్వకంగానే ప్రత్యక్ష సైనిక చర్యల్లో పాలొంటున్న సైనిక బలగాలతో మీడియా ప్రతినిధులు భాగం కావడానికి దారి తీసింది. ఎవరూ పథకం పన్నకుండానే వారి మధ్య వ్యక్తిగతమైన, వృత్తిపరమైన బంధం అభివృద్ధి చెందింది. దాని ఫలితం ఉపయోగకరమై నదే... స్వతంత్ర పాత్రికేయులను, సెన్సార్‌షిప్‌లేని మీడియాను అనుమతి స్తోంది కాబట్టి భారత్ విశ్వసనీయత పెరిగింది. మన సైన్యం ప్రదర్శిం చిన నమ్మశక్యంకాని పరాక్రమం గురించిన కథనాలు దేశానికంతటికీ చేరడం వల్ల సైన్యం లాభపడింది. పాత్రికేయులకు కూడా ఆ ప్రతిష్ట కొంత అంటుకుంది. ఆ క్రమంలో కీలకమైన ఒక కథనానికి హాని జరిగినా ఎవరికీ పట్టలేదు... అంతమంది పాకిస్తానీలు అంత లోలోతులకు ఎలా చొచ్చుకు వచ్చి, పాతు కుపోయి కూర్చున్నారు? అది తెలుసుకోడానికి మనకు అంత ఎక్కువ కాలం ఎందుకు పట్టింది? విచారణ బృందాలను మనం అంత అర్థ మనస్కంగా (కాబట్టే చిన్న గస్తీ బృందాలు) ఎందుకు పంపినట్టు? భుజంపై నుంచి పేల్చే క్షిపణులకు అందే వైమానిక బలాన్ని పంపి రెండు విమానాలను ఎందుకు కోల్పోయాం? గుడ్డిగా నెలల తరబడి పాక్ చొరబాటును నిలువరించడంలో విఫలమైంది ఎవరు? ఈ చొరబాటు తీవ్రతను గ్రహించడంలో విఫలమైన వారంతా ఎవరు? ఇవేవీ పట్టని ఫలితంగానే, ఎవరి స్థానాలకూ ముప్పు రాలేదు. మన యువ సైనికాధికారులు, సైనికుల ప్రతాపాన్ని గురించి చెప్పే హక్కు మనకుంది. అయితే మన సైనిక వ్యవస్థ సైనిక విధులను నిర్లక్ష్యం చేయకపోయినా... అది చూపిన బ్రహ్మాండమైన అసమర్థతకు సంబంధించిన కథనం వెలుగు చూడకుండా పోయేలా చేయడానికి రాజకీయ, సైనిక వ్యవ స్థను మనం అనుమతించడం తప్పు. అర్హులైన పలువురు కార్గిల్ యువ సైనిక యోధులకు గాలంట్రీ అవార్డులు లభించాయి. కానీ ఉన్నత స్థానాలలో ఉండి తప్పు చేసిన వారు చాలా వరకు తప్పించుకున్నారు. ఈలోగా భారత మీడి యాకు చెందిన మనం బలాన్ని ద్విగుణీకృతం చేయగలవారంగా కీర్తించ బడ్డాం. ఆ ఆనందంలో మునిగిపోయాం. అదే సమయంలో మనం, జర్నలి స్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, బలాన్ని హెచ్చింప జేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజా నికి ఆ రెండూ కూడా కాగలరు. సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్‌పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్‌గా మార్చే యడం ద్వారా మాత్రం జరగదు. ఎప్పుడూ కాస్త సంయమనాన్ని చూపే టీవీ చానళ్లు సైతం ‘‘మళ్లీ కాలుదువ్విన పాకిస్తాన్’’ అంటూ కశ్మీర్ హెడ్‌లైన్స్‌ను చూపాల్సిన దుస్థితి. ‘‘శత్రు’’ ప్రతినిధులుగా ఖండిస్తున్నా లెక్కచేయకుండా నిష్టుర నిజాలను చెపే సిరిల్ అల్మెడాలు, ఆయేషా సిద్దీఖాలు (ఇద్దరూ పాక్ పాత్రికేయులే) మనకు లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. మన జర్నలిజం స్వీయ వినాశం... భారత టీవీ స్టార్లు (చాలావరకు) స్వచ్ఛందంగా తమను తామే కమెడియన్లుగా కాకున్నా ప్రచారకర్తలుగా దిగ జార్చేసుకోడానికి సంబంధించిన కథనంలో పెద్ద భాగం. వాణిజ్యపరంగా అది ఫలప్రదమైనదనేది, ప్రతిదాన్ని ప్రశ్నించే సంశయవాదాన్ని తుడిచిపెట్టే యడం వారిని ఊరిస్తుంది. లేదంటే ఊహాత్మకతతో మిఠాయి లాంటి ఫార్ము లాను కనిపెట్టి ఎన్నటికీ మరువలేని పాత గబ్బర్ సింగ్ (షోలే)కు సమాన మైన నేటి టీవీ యుద్ధ యోధుని అవతారమెత్తి ‘‘కిత్నే పాకిస్తానే థే?’’ అనొచ్చు. జర్నలిస్టులను ‘బలాన్ని బహుళంచేసే గుణకం’’గా నిర్వచించడాన్ని కీలక వ్యాపార అంశంగా (కేఆర్ఏ) అంగీకరించడంతో ఇక సందేహానికి లేదా ప్రశ్నించడానికి అవకాశమే ఉండదు. పాత కాలపు అశ్విక యోధునిలా ఇష్ట మొచ్చినట్టు వాగొచ్చు. అయితే అది శత్రువు ఉపగ్రహ కనెక్షన్‌కు అవతల ఉండగా ఇవతల సుఖప్రదంగా స్టుడియోలో కూచుని చేయొచ్చు. రెండుగా చీలిన పాత్రికేయ ప్రపంచం ఉడీ, తదుపరి ఘటనలే ఈ వాదనకు ప్రేరేపణ అనేది స్పష్టమే. అది మీడి యాను అత్యంత అసమానంగా చీలిపోయేట్టు చేసింది. ఒకటి, బాగా ఆధి క్యతను ప్రదర్శించే పక్షం. వారు ఏ ప్రశ్నలూ అడగకపోవడమే కాదు, ప్రభు త్వాన్ని, సైన్యాన్ని దాటేసి వారెన్నడూ చేయని ప్రకటనలను సైతం చేసేస్తారు. కాల్పనికమైన కమాండోల రాత్రి విన్యాసాల ‘‘ప్రాతినిధ్య’’ వీడియోలను వాటికి అండగా చూపిస్తారు, ఏ ఒక్కరికీ, నిజంగానే ఏ ఒక్కరికీ ఎలాంటి సాధికారతతో లేదా స్పష్టతతో మూడు వారాల క్రితం ఏం జరిగిందో తెలియదు. రహస్యాలను కాపాడటంలో ప్రభుత్వం ఆరితేరిపోయిందో లేక పాత్రి కేయులు లీకుల గురించి వెతకడం మానేశారో గానీ ఇది నిజం. ఎందుకో మీరే చూడొచ్చు. మరోవైపున, చిన్నది, కుచించుకుపోతున్న మరో భాగంగా ఉన్న వారు నిత్య సందేహులు. ప్రభుత్వం చెప్పిన దానికి ఆధారాలు లేకపోతే దాన్ని కొట్టిపారేస్తారు. వాస్తవాలు లేనిదే వారు వెల్లడించే కథనాలూ ఉండవు. ప్రభుత్వం, తను చెప్పేదానికి ఆధారాలు చూపాలని వారు కోరుతారు. ప్రభు త్వాలు వాస్తవాలను దాస్తాయని, పాత్రికేయులు వాటిని కనిపెట్టాలని జర్న లిజం స్కూలుకు వెళ్లిన ప్రతివారికీ బోధిస్తారు. అత్యంత ఉదారవాదులు, ఉత్తమ విద్యావంతులు, ప్రతిష్టగల, సుప్రసిద్ధ సెలబ్రిటీ పాత్రికేయులు అంతా ఈ నిత్య సందేహుల జాగాలో ఉన్నారు. ఆధారాలు లేకుండానే గరం గరం వార్తలు తేకుండా, పత్రికా సమావేశాలను కోరుతున్నారు. అవతలి పక్షం మన శత్రువు కాబట్టి మీరు చెప్పేదానికన్నా ఎక్కువ నేను నమ్ముతాను, నాకు ఆధారాలు అవసరం లేదు అంటోంది ఒక పక్షం. మరో పక్షం.. మీరు చెబుతున్న ఆ సైనిక చర్యను బహిర్గతపరచండి లేదా మీరు అబద్ధం ఆడుతు న్నారంటాం అంటోంది. భారతీయ జర్నలిజం స్వీయ వినాశనానికి ఎందుకు పాల్పడింది? అని నేను ఇక అడగాల్సిన పనే లేదు. శేఖర్ గుప్తా twitter@shekargupta -
జర్నలిజంలో హరికృష్ణ పీహెచ్డీ
ఏఎన్‌యూ: యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకుగాను హరికృష్ణ అనే స్కాలర్‌కు యూనివర్సిటీ పీహెచ్‌డీని ప్రదానం చేసిందని రీసెర్చ్ సెల్ కో–ఆర్డినేటర్ ఆచార్య కె.రత్న షీలామణి గురువారం తెలిపారు. జర్నలిజం విభాగం కో–ఆర్డినేటర్, అధ్యాపకురాలు డాక్టర్ అనిత పర్యవేక్షణలో ‘న్యూస్ ఫొటోగ్రాఫర్స్ అండ్ ది న్యూస్ పేపర్స్ : యాన్ ఎక్స్‌ప్లోరేటరీ స్టడీ ఆఫ్ ప్రొఫెషనల్ యాస్పెట్స్’ అనే అంశంపై హరికృష్ణ పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఏఎన్‌యూ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో తొలి పీహెచ్డీ పట్టా అందుకున్న హరికృష్ణను గురువారం వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్ అభినందించారు. కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య ఏవీ దత్తాత్రేయరావు, జర్నలిజం విభాగ కో–ఆర్డినేటర్, పరిశోధన పర్యవేక్షకురాలు డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
పత్రికలకు ఆదరణ భేష్!
ఏయూ జర్నలిజం బీవోఎస్ చైర్మన్ ఆచార్య మూర్తి ఏఎన్‌యూ: ప్రపంచ వ్యాప్తంగా పత్రికలకు ఆదరణ తగ్గుతున్నా భారతదేశంలో పత్రికలకు ఆదరణ నానాటికీ పెరుగుతోందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం బీవోఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) చైర్మన్ ఆచార్య డి.వి.ఆర్.మూర్తి చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో గురువారం ‘ప్రస్తుత సమాజంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పాత్ర’ అంశంపై డాక్టర్ మూర్తి ప్రసంగించారు. సమాజంలోని సామాన్యుల అవసరాలు, సమస్యలను అధ్యయనం చేసి వాటిని పరిష్కరించే విధంగా పాత్రికేయులు కృషిచేయాలన్నారు. విలువలు, నిబద్ధతతో వృత్తిలో ముందుకు సాగితేనే పాత్రికేయ రంగం దీర్ఘకాలం మనగలుగుతుందని చెప్పారు. రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడంతో మీడియా రంగంలో డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. దానికి అనుగుణంగా పాత్రికేయులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ జర్నలిజం విభాగాధిపతి« డాక్టర్ జి.అనిత, అధ్యాపకుడు డాక్టర్ జె.మధుబాబు పాల్గొన్నారు. -
జర్నలిజం విభాగానికి నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం విభాగానికి ‘బి స్కూల్ విత్ ఇండస్ట్రీ రిలేటెడ్ కరికులం ఇన్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్’ అవార్డు లభించింది. మంగళవారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వరరావుకు అవార్డును జర్నలిజం విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్ధన్ అందజేశారు. ఈ సందర్భంగా వీసీ నాగేశ్వరరావు మాట్లాడుతూ వరుసగా మూడవ సంవత్సరం ఈ అవార్డులను ఏయూ జర్నలిజం విభాగం అందుకోవడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విభాగ ఆచార్యులను అభినందించారు. ప్రసార మాధ్యమాల రంగానికి అవసరమైన నిపుణులను ఏయూ అందిస్తోందన్నారు. సమాజానికి దర్పణంగా ప్రసార మాధ్యమాలు నిలుస్తున్నాయన్నారు. ఈ రంగానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగాలన్నారు. విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్ధన్మాట్లాడుతూ ఆనంద్ బజార్ పత్రిక(ఏబిపి) న్యూస్ నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డును 2016 సంవత్సరానికి అందుకుందన్నారు. మౌళిక వసతులు, పాఠ్య ప్రణాళిక, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను మార్పులు చేస్తున్న విధానం, ప్రొఫెషనల్ టీచర్స్‌ను కలిగి ఉండటం వలన ఇది సాధ్యపడిందన్నారు. వరుసగా మూడు సంవత్సరాలు అవార్డును సాధించడం విభాగంపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ స్థానాన్ని నిలుపుకుంటూ, మరింత మెరుగు పరచుకునే విధంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో బిఓఎస్ చైర్మన్ ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, డాక్టర్ చల్లా రామక్రిష్ణ, డాక్టర్ కె.విజయకుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ తదితరులు పాల్గొన్నారు. -
అవతరణ వేడుకల్లో 62 మందికి సన్మానం
- జర్నలిజం విభాగంలో ఎంపికైన సాక్షి కార్టూనిస్ట్ శంకర్ - వివిధ రంగాల ప్రముఖులను సత్కరించనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 62 మందిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ మేరకు గతంలో ఏర్పాటు చేసిన కమిటీ 62 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి సమర్పిం చింది. ఆ జాబితాకు ప్రభుత్వం ఆమోదం తెలి పింది. ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులతోపాటు, ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీ, మండలం, పురపాలక సంఘం, స్వచ్ఛంద సంస్థలకు కూడా జాబితా లో చోటు దక్కింది. పురస్కారగ్రహీతలను జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేదికపై రూ.లక్షా నూట పదహార్ల నగదు పురస్కారంతో పాటు శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సన్మానించనున్నారు. జర్నలిజం విభాగంలో సాక్షి పత్రిక కార్టూనిస్టు శంకర్‌ను కమిటీ ఎంపిక చేసింది. సన్మానానికి ఎంపికైన వారి వివరాలివీ.. సాహిత్యం: కోవెల సుప్రసన్నాచార్య (వరంగల్), కపిలవాయి లింగమూర్తి (మహబూబ్‌నగర్), ముదిగంటి సుజాతారెడ్డి (కరీంనగర్), సంగిశెట్టి శ్రీనివాస్ (నల్లగొండ), కె.వి.నరేందర్ (కరీంనగర్), అబ్దుల్ రెహమాన్ ఖాన్ (హైదరాబాద్), సర్ మీర్ ఇబ్రహీం హమీ (హైదరాబాద్) నృత్యం: దీపికారెడ్డి (హైదరాబాద్), డి.ప్రకాశ్-పేరిణి జానపద నృత్యం: ఎ.నాగరాజు (ఆదిలాబాద్) సంగీతం: మిట్ట జనార్దన్-సితార్ (హైదరాబాద్), కె.రామాచారి-లైట్ మ్యూజిక్(మెదక్) జానపద సంగీతం: ఎస్.ప్రభాకర్ (మెదక్), జంగిరెడ్డి (మహబూబ్‌నగర్), ధర్మానాయక్ (నల్లగొండ), సి.రవి (ఆదిలాబాద్), గంగ (నిజామాబాద్) ఉద్యమ గానం: యశ్పాల్ (ఖమ్మం), పద్మావతి (కరీంనగర్), తేలు విజయ (కరీంనగర్) చిత్రలేఖనం: వై.బాలయ్య-బతిక్ (మెదక్) వైదిక పాండిత్యం: మాడుగుల మాణిక్య సోమయాజులు (రంగారెడ్డి) అర్చకత్వం: ఎన్.నరసింహాచార్యులు-యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధానార్చకులు (నల్లగొండ) ఆధ్యాత్మిక పండితులు: కొడకండ్ల నరసింహరామ సిద్ధాంతి (వరంగల్), ముఫ్తీ అజీమొద్దీన్, రెవరెండ్ నల్లా థామస్-సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ శాస్త్రవేత్త: డాక్టర్ వి.రామ్‌గోపాల్‌రావు-డెరైక్టర్ ఐఐటీ ఢిల్లీ, అంకటి రాజు- అగ్ని ప్రాజెక్టు, డీఆర్డీఎల్ (నల్లగొండ) జర్నలిజం: సి.ఆర్.గౌరీశంకర్ (హైదరాబాద్), నూర శ్రీనివాస్ (వరంగల్), ఆకారపు మల్లేశం(హైదరాబాద్), ఎం.ఎ.మాజీద్, కవిత-ఎలక్ట్రానిక్ మీడియా,శంకర్-కార్టూనిస్టు హస్తకళలు: ది నిర్మల్ టాయ్స్ అండ్ ఆర్ట్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నిర్మల్ క్రీడలు: అనూప్ కుమార్-రోలర్ స్కేటింగ్, ఆనంద్ ఖోఖో ఉద్యోగం: హనుమంతరావు-జీఏడీఏ, డాక్టర్ రావుల ఉమారెడ్డి, సి.ప్రభాకర్-ఎస్ఈ టీఎస్ఎస్పీడీసీఎల్ (నిజామాబాద్), ఎ.శ్రీనివాసు లు-డీఈ టీఎస్ఎస్పీడీసీఎల్ (సూర్యాపేట), పి.రాజామోహన్-ఏడీఈ కేటీపీఎస్, పి.హనుమంతరావు-డిపో మేనేజర్ టీఎస్ఆర్టీసీ (జగిత్యాల), వి.సుభాష్-కండక్టర్ టీఎస్ఆర్టీసీ (ఆదిలాబాద్), ఎండీ తజాముల్ హుస్సేన్-డ్రైవర్ టీఎస్ఆర్టీసీ కామారెడ్డి. వైద్యం: డాక్టర్ ఎ.గోపాలకృష్ణ-నెఫ్రాలజిస్టు స్వచ్ఛంద సంస్థ: ‘గ్రామ్య’ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సామాజిక సేవ: డాక్టర్ విజయభాస్కర్ - బీఎల్ఎన్ చారిటీ (గోదావరిఖని) రైతు: ఎం.అంజిరెడ్డి-వ్యవసాయం(ఇబ్రహీంపట్నం-రంగారెడ్డి), వర్ని శంకర్-ఉద్యానవనం(పోతంగల్, కోటగిరి-నిజామాబాద్) పురపాలక సంఘం: ఖమ్మం గ్రామ పంచాయతీ: మల్కాపూర్ (మెదక్), మాదాపూర్ (బెజ్జంకి-కరీంనగర్) ఔత్సాహిక పారిశ్రామికవేత్త:ఎ.లక్ష్మీనారాయణ (హైదరాబాద్) న్యాయవాది: గుడిమల్ల రవికుమార్ (వరంగల్) మండలం: వనపర్తి (మహబూబ్‌నగర్) బోధన:గోల్డీ బల్బీర్‌సింగ్ కౌర్-ప్రిన్స్‌పల్ టీఎస్ మోడల్ స్కూల్, గంగాధర(కరీంనగర్) వినూత్న సాగు: మధుసూదన్‌రెడ్డి- బోన్సాయ్ మాజీ సైనికోద్యోగి: లెఫ్టినెంట్ కల్నల్ గల్బా శివకిరణ్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ ఎ.బాలకృష్ణ సాహసకృత్యాలు: జి.ఆర్.రాధిక, అదనపు ఎస్పీ (ఆదిలాబాద్) -
ఈ కలం.. జన గళం! 'జర్నలిస్టు'
నేచర్ ఆఫ్ జాబ్ సమాజంతో దగ్గరి సంబంధం ఉన్న ఉద్యోగం జర్నలిస్ట్. మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది ఎంతో వైవిధ్యమైన వృత్తి. రాసే వార్తలో ప్రతి పదం వాస్తవికంగా ఉండాలి. ఎందుకంటే జర్నలిస్టులు రాసే ప్రతి అక్షరం ప్రతి రోజూ ఎన్నో లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో జర్నలిజం యువతకు మంచి కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ఉద్యోగ స్వభావం, అవసరమైన స్కిల్స్ తదితరాలపై కథనం.. రెండు విభాగాలు జర్నలిజంలో ముఖ్యంగా రెండు విభాగాలుంటాయి. ఒకటి బ్యూరో, రెండోది డెస్క్. బ్యూరోలో రిపోర్టర్లుంటారు. సిటీ, స్టేట్, జిల్లాల వారీగా వేర్వేరు బ్యూరోలుంటాయి. రిపోర్టర్లు ఫీల్డ్‌కు వెళ్లి వార్తను సేకరించి డెస్క్‌కు చేరవేస్తారు. బ్యూరో మాదిరిగానే డెస్క్‌లు కూడా సిటీ, స్టేట్, బిజినెస్, స్పోర్ట్స, జిల్లాలు.. ఇలా వేర్వేరుగా ఉంటాయి. డెస్క్‌లో ప్రాథమికంగా సబ్ ఎడిటర్లు ఉంటారు. రిపోర్టర్లు ఇచ్చిన వార్తల్లోని దోషాలను సవరించి, దానికి మంచి శీర్షిక పెట్టి వార్తగా మలుస్తారు. ఒక వార్తకు సంబంధించి తుది నిర్ణయం డెస్క్‌దే. పనివేళలు ఎలక్ట్రానిక్ మీడియాలో షిఫ్ట్‌ల వారీగా పనివేళలు ఉంటాయి. ఇవి ప్రతి వారం మారుతుంటాయి. ప్రింట్ మీడియాలో డెస్క్ విభాగంలో సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు పని వేళలు ఉంటాయి. బ్యూరో విభాగం... ఆ రోజు ఉదయం నుంచి జరిగిన అంశాలను సాయంత్రానికల్లా వార్తల రూపంలో డెస్క్‌కు అందిస్తుంది. రిపోర్టర్లు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, ఎలాంటి నిర్ణయాలు వెలువడినా వెంటనే వార్తలు రాసి డెస్క్‌కు అందించాల్సి ఉంటుంది. కావాల్సిన స్కిల్స్ ⇒ జర్నలిస్టు కావాలనుకునే వారికి ప్రాథమికంగా, తప్పనిసరిగా భాషపై మంచి పట్టు ఉండాలి. ⇒ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలన్నింటిపై కనీస అవగాహన ఉండాలి. ⇒ నిరంతరం నేర్చుకునే తత్వం అత్యవసరం. ⇒ ఏది వార్తో, ఏది కాదో గుర్తించే నైపుణ్యం ఉండాలి. ⇒ పనిలో వేగం, కచ్చితత్వం తప్పనిసరి. ఉద్యోగావకాశాలు.. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో ఉద్యోగావకాశాలకు ఢోకాలేదనే చెప్పుకోవాలి. టీవీ చానళ్లు, న్యూస్ పేపర్లలో అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా డెస్క్, బ్యూరో విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కెరీర్ ప్రారంభంలో రూ.12 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అభ్యర్థి ప్రతిభ ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. ⇒ జర్నలిజం ద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషించొచ్చు. ⇒ జర్నలిజం ద్వారా పేదలు, బాధితులకు సాయం చేయొచ్చు. తద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ⇒ సమాజంలో జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ⇒ అన్ని రంగాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ⇒ జర్నలిజంలో కాలంతో పోటీపడి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ ప్రతి రోజు డెడ్‌లైన్‌కు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి ఎక్కువ. ⇒ సెలవులు తక్కువగా ఉంటాయి. కోర్సులు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ఉద్యోగాలు సాధించొచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కోర్సు: ఎంసీజే అర్హత: కనీసం 40% మార్కులతో ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా విశ్వవిద్యాలయం కోర్సు: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ఏయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.andhrauniversity.edu.in కాకతీయ విశ్వవిద్యాలయం కోర్సు: మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.kakatiya.ac.in శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కోర్సు: ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: కనీసం 45% మార్కులతో ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.spmvv.ac.in యోగి వేమన విశ్వవిద్యాలయం కోర్సు: కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.yogivemanauniversity.ac.in తెలంగాణ విశ్వవిద్యాలయం కోర్సు: కమ్యూనికేషన్లో ఎంఏ అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.telanganauniversity.ac.in ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు) లోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ అందిస్తోంది. అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.anucde.info -
దెయ్యం కెవ్వుమంది!
దెయ్యాలంటే అందరికీ భయమే. కారణం వాటిని ఎవరూ చూడకపోవడమే. చూస్తే ఇక ఏ భయమూ ఉండదు. ఒకప్పుడు పల్లెటూళ్లలోనే దెయ్యాలు ఎక్కువగా ఉండేవి. నగరీకరణకి ఆకర్షితమై అవన్నీ సిటీల్లోకి వచ్చేశాయి. వాటికి బస్సులు, రైళ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. గాల్లోనే వచ్చేస్తాయి. అంతా ఎయిర్ వే. నగరాల్లో ఆల్రెడీ ఉన్న దెయ్యాలు, వలస దయ్యాలు ఏకీకృతమై వాట్సప్గ్రూప్లా జట్టుకట్టాయి. అందులో కొన్ని వీలు చూసుకుని సినిమాల్లో చేరిపోగా, మరికొన్ని సాహిత్యంలో దూరిపోయాయి. వేషభాషలపై అంతగా పట్టులేనివి జర్నలిజంలోకి దూకేశాయి. హాస్య సినిమాలు చూసి భయపడుతూ, పుస్తకం, పేపర్ తెరవడానికి జడుసుకుంటూ మనం జీవించడానికి వీటి కృషే కారణం. దెయ్యమంటే ఏమిటని ఒకసారి ఒక స్వామీజీని అడిగాను. ఆయన మొహానికున్న మాస్క్‌ని తీసి నా వైపు చూశాడు. కెవ్వున కేకేసి పారిపోయి వచ్చేశాను. దెయ్యాలు ఎక్కడైనా ఎలాగైనా ఉండొచ్చు. అనవసరంగా హారర్ సినిమాల్లో వెతుకుతూ ఉంటాం. మనల్ని ఎలాగైనా భయపెట్టాలని రాంగోపాల్‌వర్మ ప్రయత్నించి ప్రయత్నించి విఫలమై తానే భయపడి ఊరుకున్నాడు. తెల్లారి లేచినప్పటి నుంచి బోలెడంతమంది నాయకుల్ని చూసి అలవాటుపడిన ప్రాణాలు మనవి. దెయ్యాలకి మనమా భయపడేది? హారర్ సినిమాల్లో సంగీత దర్శకులు తమదైన శైలిలో కృషి చేస్తారు. కొందరు ఏమీ వాయించకుండా నిశ్శబ్దంతో భయపెట్టాలని చూస్తారు. మరికొందరు డమరుకం దగ్గర్నుంచి డోలు వరకూ ఎడాపెడా ఉతికేసి చెవులు కొరికి తినేస్తారు. వాయిద్యాలతో పాటు మన తలని కూడా బాదేస్తారు. అయినా అన్ని వైపుల నుంచి హారన్లు మోగించే ట్రాఫిక్జాంలకే మనం భయపడం. ఇక ఈ వాయిద్యాలొక లెక్క? బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో దెయ్యాలకి నిర్దిష్టమైన సిలబస్, బాడీలాంగ్వేజి ఉండేది. గడియారం 12 గంటలు కొట్టిన తర్వాతే యాక్టివేట్ కావాలి. అవి రావడానికి ముందు ఒక నక్క, గుడ్లగూబ కొన్ని సౌండ్స్ చేయాలి. కాలికి గజ్జెలు, తెల్లచీర కంపల్సరీ. చక్కటి సంగీతంతో ఒక పాట పాడగలిగితే దెయ్యానికి కాస్త గౌరవం. అయినా దెయ్యాలు ఆడవాళ్లనే ఎందుకు ఆశ్రయిస్తాయనేది చాలామంది సామాజిక వేదాంత తత్వవేత్తల ప్రశ్న. నిజానికి మగవాళ్లు, దెయ్యాలు ఒకే నాణానికి రెండు ముఖాలని ఎప్పట్నుంచో ఫెమినిస్ట్‌లు చెబుతున్నా, కొంతమంది హ్యూమనిస్ట్లు వినడం లేదు. మొగుళ్లని తన్నలేని ఆడవాళ్లకే దెయ్యాలు పడతాయని వెనకటికి మా పెద్దమ్మ ఒక థియరీ కనిపెట్టింది. భరించినంతకాలం భరించి చెలకోలా తీసుకుని మా పెద్దనాయన వీపుమీద రెండు, మూతి మీద మూడు వాయించేసరికి ఒళ్లు వాతలు తేలి దిక్కులు కూడా చూడకుండా పారిపోయాడు. మొగుడు పరారయ్యాడని నిర్థారించుకున్న తర్వాతే ఆమెలోని దెయ్యం వదిలింది. టీవీ సీరియళ్లు వచ్చిన తరువాత దెయ్యాలకి చేతినిండా పని తగ్గిపోయింది. సీరియళ్ల స్థాయిలో భయపెట్టడం ఎవరివల్లా కాదని రుజువు చేసుకుని అవి కూడా సీరియళ్లకి అడిక్ట్ అయిపోయాయి. వాస్తవానికి దెయ్యాలు లేవని నాకు చిన్నప్పుడే తెలుసు. ఆ విషయాన్ని ఒక దెయ్యమే చెప్పింది. - జి.ఆర్. మహర్షి -
భావ ప్రకటన స్వేచ్చ,జర్నలిజం ప్రమాదంలో పడ్డాయి
-
'జర్నలిజాన్నిదిగజార్చిన ఘనత ఆయనదే'
హైదరాబాద్: రాజ్యాంగ ఆమోద దినోత్సవం నాడే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవమానిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మీడియాపై చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. పాకిస్థాన్ లో మాదిరిగా ఒక ఛానల్, పత్రిక చూడొద్దని చంద్రబాబు ఫత్వా జారీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. జర్నలిజాన్ని పెయిడ్ జర్నలిజంగా దిగజార్చింది చంద్రబాబేనని ఆమె విమర్శించారు. టీడీపీ నేతల ఇసుక మాఫియాపై అన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయని, హైకోర్టు కూడా చివాట్లు పెట్టిందని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. మీ అవినీతిని ప్రశ్నించడం సాక్షి చేసిన తప్పా? అని ఆమె చంద్రబాబును నిలదీశారు. -
నెట్‌ఇంట్లో అఁ ఆఁ..!
అ అంటే అద్భుతం, ఆ అంటే ఆశ్చర్యం. ఈవారం మన నెట్ ఇంట్లోఅన్నీ ఇలాంటి విశేషాలే. కుప్పలు కుప్పలుగా కబుర్లు, గంపలకొద్దీ గాసిప్‌లు, వీసెల్లెక్కన వింతలు, విడ్డూరాలు... ఇలా సెల్ఫీల నుంచి సిటిజెన్ జర్నలిజం దాకా అన్నిటికీ పుట్టిల్లు.. మన నెట్టిల్లు. కంప్యూటర్ని కలలోనైనా చూడని ఓ పూలమ్ముకునే అమ్మాయిని ఈ నెట్ ఇల్లు బ్యూటీ అట్లాస్లోకి ఎక్కించగలదు. ఉద్యోగం చేసి బోరుకొట్టిన యువకుడికి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటివ్వగలదు. ఇలా అద్భుతం, ఆశ్చర్యం, అద్వైతం,ఆలోచన, అనూహ్యం, అసాధ్యం అనిపించే గతవారపు నెట్ సంచలనాల సమాహారం... మీకోసం... ఆశ్చర్యం మన మంత్రి ఒకాయన చైనాకి వెళ్లాడట. చైనా మంత్రి ఆస్తి చూసి ఆశ్చర్యపోయాడట. ఇంత ఆస్తి ఎలా వచ్చింది అని అడిగాడట. చైనావాడు దూరంగా ఉన్న ఒక వంతెనను చూపించి ‘బ్రిడ్జి కనిపిస్తుందా?’ అని అడిగాడట. అవునన్నాడు మనవాడు. ‘‘అందులో టెన్ పర్సెంట్ నా వాటా’’ అన్నాడట చైనా మంత్రి. కొన్నాళ్లకి చైనా మంత్రి మన దేశానికి వచ్చాడట! మన మంత్రిగారి సంపద చూసి నోరు వెళ్లబెట్టాడట! ఇదెలా సాధ్యం అని అఢిగాడటు. మనవాడు ‘‘దూరంగా వంతెన కనిపిస్తోందా?’’ అని అడిగాడట! చైనా మంత్రికి ఏమీ కనిపించలేదు. ‘‘ఉహూ’’ అన్నాడు. ‘‘నా వాటా సెంట్ పర్సెంట్’’ అన్నాడట మనవాడు. ఈ వీడియో సరిగ్గా ఆ కథకి అద్దం పడుతుంది. మహారాష్ర్టలోని నాగపూర్‌కి, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాని కలిపే హైవే నిర్మాణం ఎంత ‘పైన పటారం లోన లొటారం’గా జరిగిందో ఓ చిన్నపాటి వరద చెప్పేస్తుంది. కొద్దికొద్దిగా నీరు వచ్చి రోడ్డుపైనుంచి ప్రవహించడం, అడుగునుంచి రోడ్డును క్షణాల్లో కోసేయడం, ఆ తరువాత మొత్తంగా రోడ్డు డొల్లతనం బయటపడడం చూడొచ్చు. ఇది ఈమధ్యే జరిగిన సంఘటన. పదకొండు లక్షలమంది ఈ మూడు నిమిషాల విడియోని చూశారు. మీరూ చూడండి. మేరా భారత్ మహాన్ అనండి. https://www.facebook.com/arvind.shrivastava.773/videos/678813465553732/ ఆలోచన చైనాలో ఇటీవలే రెండో ప్రపంచయుద్ధం విజయోత్సవాలు జరిగాయి. బీజింగ్‌లో భారీగా సైనిక కవాతులు జరిగాయి. దీని కోసం చైనాలో కొన్ని చోట్ల వాహనాల రాకపోకల్ని నిషేధించారు. దీంతో ప్రజలకు ఆకాశం స్పష్టంగా కనిపించసాగింది. భవనాలు, వాటి డిజైన్లు, వాటికి అమర్చిన కిటికీలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. కొత్త బీజింగ్‌ను చూసినట్టు అనిపించింది. ప్రజలందరూ దీన్ని పడీ పడీ చూశారు. ఉత్సవాలు అయిపోయాయి. నిషేధాలు తొలగిపోయాయి. మళ్లీ కార్లు, స్కూటర్లు రోడ్లపై రయ్‌మన్నాయి. కొద్ది గంటల్లోనే ఆకాశం దుమ్ముతో మసకబారింది. భవనాలు అస్పష్టం అయిపోయాయి. బీజింగ్‌పై కాలుష్యం కంబళి కప్పుకుంది. పొల్యూషన్ బీజింగ్‌ను ఎలా కమ్మేసుకుంటుందో చెప్పే ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాహన కాలుష్యం బీజింగ్‌ను ఏం చేస్తోందో ఈ రెండు ఫొటోలు చూస్తే తెలుస్తుంది. http://en.yibada.com/articles/61158/20150907/after-brief-blue-skies-from-parade-beijings-air-pollution-is-back.htm#ixzz3l97Z0A9R అద్భుతం అనగనగా అనగనగా ఒక మునీరా. ఆమెది మధ్య ఆసియాలోని తాజికిస్తాన్. అనగనగా ఒక మిహైలా. ఆమెది యూరప్‌లోని రొమేనియా. మిహైలా ఒక ఫోటోగ్రాఫర్. మునీరా పూలమ్ముకునే పాప. మిహైలా ప్రపంచమంతా తిరుగుతుంది. మునీరాకి సొంత ఊరు తప్ప వేరే ప్రపంచం తెలియదు. అట్లాస్ ఆఫ్ బ్యూటీ ప్రాజెక్టులో భాగంగా మిహైలా నొరోక్ తాజికిస్తాన్ రాజధాని దుషాన్బేలో అతివల అందాలను క్లిక్ చేస్తూ ఉండగా, తోటలో పూలు ఏరుకుంటూ 19 ఏళ్ల మునీరా మీర్జోయేవా కనిపించింది. అంతే మిహైలా ఆమెను క్లిక్‌మనిపించింది. ఆ తరువాత ఏమైంది? ఆ తరువాత కథంతా సోషల్ మీడియా నడిపించింది. మునీరా ఫోటోని చూడగానే సోషల్ మీడియాకి వైరల్ ఫీవర్ వచ్చింది. వందలు వేలుగా, వేలు లక్షలుగా షేర్లు అయ్యాయి. మునీరా ఉన్నట్టుండి సెలబ్రిటీ అయింది. ఆమె గురించి చెప్పుకుని ఇప్పుడు తాజికిస్తాన్ తలకిందులైపోతోంది. కటిక పేదరికంలో మగ్గుతున్న మునీరాకోసం ఇప్పుడు తాజిక్ ఫేస్బుక్లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధిని సేకరించడం మొదలైంది. సోషల్ మీడియా పవరేంటో చూపించిన సక్సెస్ స్టోరీలో తమాషాగా హీరోయిన్లే తప్ప హీరోలు లేరు. అసహ్యం మనిషి రెండు కాళ్ల పశువు. మిగతా పశువులు గడ్డం గీసుకోవు. ద్విపాద పశువు గీసుకుంటాడు. అంతే తేడా! మనిషి పశువేనన్న విషయంలో ఎవరికీ సందేహం రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పశువులాగా వ్యవహరిస్తూనే ఉంటాడు. ఓ సూపర్ మార్కెట్లో తల్లిదండ్రులు పిల్లాడిని ఆడుకొమ్మని వదిలి, సామాన్లు కొనుక్కోవడంలో మునిగిపోయారు. ఓ రెండు కాళ్ల పశువు ఇదే అదనుగా ఆ పాలుగారే పసివాడిని బలవంతంగా పెదాలపై ముద్దులు కురిపించి, తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఆకలిగొన్న తోడేళ్లు మేకపిల్లలను ఎలా వేటాడేస్తాయో చూడాలంటే అడవుల్లోకి వెళ్లక్కర్లేదని నిరూపిస్తాడు. ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎక్కడ జరిగింది. ఎవరు చేశారు అన్నది ఇక్కడ అప్రస్తుతం. బాల్యాన్ని ఎలా చిదిమేస్తున్నారన్నది తెలుసుకోవడం ముఖ్యం. పీడోఫీలియా అన్న ముద్దు పేరుతో చెలామణి అయ్యే ఈ పైశాచికాన్ని చూసైనా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నదే ఈ వీడియో సందేశం. తండ్రులూ తల్లులూ... తస్మాత్ జాగ్రత్త! http://www.indiatimes.com/videocafe/this-video-of-a-mall-toy-car-operator-forcibly-kissing-a-child-will-scare-you-even-if-you-are-not-a-parent-244963.html అద్వైతం యుద్ధం చేసేవాడెలా ఉండాలి? బుల్లెట్ల భాష మాట్లాడాలి. బాంబులతో దోస్తీ చేయాలి. బంకర్లలో నుంచి ఎప్పటికప్పుడు ఇదే ఆఖరి శ్వాస అన్నట్టు బతకాలి. తుపాకీ తోడుండాలి. కొండకోనల్లో కలాష్నికోవ్ లే దోస్తులు. గండశిలల్లో గ్రేనేడ్లే ప్రియురాళ్లు. చెట్టు చాటునో, గుట్ట మాటునో పొంచి ఉన్న చావు కోసం ప్రతి క్షణం ఇదే ఆఖరి క్షణం అన్నట్టు బతకాలి. అనునిత్యం చావుతో సహవాసం చేసే సైనికుడికి ఆకలేసినప్పుడు ఓ రెండు ఎండు రొట్టెలు, కాసింత కూర కడుపు నింపుతుంది. బండరాయే డైనింగ్ టేబుల్‌గా మారుతుంది. ఆ క్షణంలో భార్యా పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఓ సిక్ఖు సైనికుడు తాను తినే రొట్టె ముక్కలనే లాలనగా, ప్రేమగా ఓ ఉడుతతో పంచుకుంటున్న ఒకటిన్నర నిమిషాల వీడియో మన గుండె లోపలి పొరల్ని గీరుతుంది. తుపాను మధ్య ప్రశాంతతో ఉన్న ఆ జవాను, ఆయనతో దోస్తీ చేసిన ఉడుత ఉరుకులను చూస్తూంటే యుద్ధం అమరత్వ లబ్ధ్ది మాత్రమే కాదు అద్వైత సిద్ధినీ ఇస్తుందనిపిస్తుంది. https://www.facebook.com/PunjabSpectrumCom/videos/1038045736212019/ అనూహ్యం దుబాయి షేకులు ఏదైనా చేయగలరు. అప్పట్లో ఆకాశాన్ని ముద్దాడే వెయ్యడుగుల ఎత్తై బూర్జ్ ఖలీఫా భవనంపై టెన్నిస్ స్టేడియం కట్టారు. ఇప్పుడు తాజాగా సముద్రం లోతుల్లో టెన్నిస్ స్టేడియం కట్టబోతున్నారు. ఈ స్టేడియం పూర్తయితే నీలి రంగు నీరు, అందులో ఈదుకుంటూ పోయే చేపలు, సొర చేపలు, నలువైపులా ముసురుకుంటుంటే మధ్యలో ‘లవ్ వన్ లవ్ ఆల్’ నడుస్తూ ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు టెన్నిస్ కోర్టులు కట్టబోతున్నారు. క్రిస్తాఫ్ కొటాలా అనే పోలండ్ ఆర్కిటెక్ట్ ఈ అద్భుత అంతఃస్సాగర విశ్వామిత్ర సృష్టి చేయబోతున్నాడు. దీనికోసం పగులలేని, పగలలేని గాజు షీట్లు తయారు చేయబోతున్నారు. త్వరలో మారియా షరపోవా, రఫేల్ నాదల్, సెరీనా, మన సానియా మీర్జాలు జలక్రీడలు, టెన్నిస్ క్రీడల్ కలిసి ఆడేస్తారేమో! దీనార్లు, రియాల్స్ దండిగా ఉన్న దుబాయి బాబులు సృష్టించబోతున్న వాటర్ వరల్డ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా గుప్పుమంటోంది. http://www.pursuitist.in/an-underwater-tennis-court-in-dubai-to-host-grand-slam-tournaments/?utm _ source=taboola&utm_medium=cpc&utm_campaign=pursuitist_traffic&utm_term=greatandhra -
భారతీయ సంతతి మహిళా జర్నలిస్టుకు అవార్డు
టోరంటో: భారతీయ సంతతికి చెందిన ఓ కెనడా మహిళా జర్నలిస్టుకు ఉత్తమ జర్నలిస్టు అవార్డు దక్కింది. ఒట్టోవాలోని భారతీయులు ఆమెకు ఈ సత్కారం అవార్డు అందించి ఘనంగా సత్కరించారు. 41 ఏళ్ల అడ్రిన్నే బాట్రా టోరంటో సన్ అనే పత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జర్నలిజం విభాగంలో ఆమె గత కొంతకాలంగా చేస్తున్న అవిరళ కృషిని గుర్తించి పర్వాసీ మీడియా గ్రూప్ ఈ ఏడాది పర్వాసీ అవార్డుల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు ఎంపికచేశారు. ఈ అవార్డు అందజేత కార్యక్రమానికి ప్రముఖ క్రీడా లెజెండ్ మికాసింగ్ హాజరయ్యారు. -
రాజకీయ చతురుడు.. సాహతీ కోవిదుడు
సబ్ ఎడిటర్ నుంచి సీఎం దాకా.. భువనేశ్వర్: నలభైయేళ్లపాటు ఒడిశా రాజకీయాలను శాసించిన జేబీ పట్నాయక్ బహుముఖ ప్రజ్ఞాశాలి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన.. సాహిత్యం, జర్నలిజం, సాంస్కృతిక రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయ వారసత్వం లేకున్నా.. రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగారు. 1980లో సీఎంగా పగ్గాలు చేపట్టి 1989 వరకు ఆ పదవిలో ఉన్నారు. తర్వాత 1995లో మళ్లీ సీఎంగా ఎన్నికై 1999 వరకు కొనసాగారు. 2004 నుంచి ఐదేళ్ల వరకు ఒడిశాలో విపక్ష నేతగా ఉన్నారు. 2009లో అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన 14 ఏళ్ల పాలనలో ఒడిశా అభివృద్ధి పథాన దూసుకుపోయింది. అస్సాం గవర్నర్‌గా ఉన్నప్పుడు పట్బౌసీ సత్రా ఆలయంలోని గర్భగుడిలోకి మహిళల ప్రవేశం కోసం కృషి చేశారు. ‘బంకిన్చంద్ర ఉపన్యాసమాల’ అనువాదానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1927లో ఖుర్దాకు దగ్గర్లోని రామేశ్వర్ వద్ద జన్మించిన పట్నాయక్ సంస్కృతంలో డిగ్రీ, రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు. ‘ఈస్టర్న్ టైమ్స్’ ఆంగ్ల పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. తర్వాత ఎడిటర్ అయ్యారు. 1971లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1973-1975 మధ్య ఇందిర హయాంలో రక్షణశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. 1980 వరకు రక్షణశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. 1980లో మళ్లీ లోక్‌సభకు ఎన్నికై.. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. -
జర్నలిజంలో పీజీ డిప్లొమా
అర్హతలు: తెలుగు మీద పట్టు ఆంగ్లంపై అవగాహన డిగ్రీ ఉత్తీర్ణత (గతేడాదికి డిగ్రీ పూర్తిచేసి, సర్టిఫికెట్లు ఉన్నవారే అర్హులు) 01-08-2015 నాటికి 30 ఏళ్లకు మించని వయసు. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 2 రాతపరీక్షలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. నమూనా ప్రశ్నపత్రాలు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో ఉంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి బృందచర్చ, మౌఖిక పరీక్ష ఉంటాయి. నియమావళి: అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు శిక్షణ కాలంతోపాటు సాక్షిలో నాలుగేళ్లు పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం (బాండ్ అగ్రిమెంట్) ఇవ్వాలి. శిక్షణ భృతి: జర్నలిజం స్కూలులో చేరిన విద్యార్థులకు మొదటి ఆరు నెలలు రూ.8,000, తరవాతి ఆరునెలలు రూ.10,000 నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం సంస్థలో ఏడాదిపాటు ట్రెయినీగా పనిచేయాలి. అప్పుడు సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. దరఖాస్తు విధానం: www.sakshieducation.com, www.sakshischoolofjournalism.com వెబ్సైట్లలో దరఖాస్తులు ఉంటాయి. అందులోని సూచనలు క్షుణ్నంగా చదివి, దరఖాస్తును ఆన్‌ైలైన్‌లోనే పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని సాక్షి జర్నలిజం స్కూలు చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలోనే రూ. 200 ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డుల్లో దేంతోనైనా చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక యునిక్ నంబర్ వస్తుంది. దాన్ని వేసి, దరఖాస్తు నింపే ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఆ నంబరు సాయంతో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు: దరఖాస్తు చేయడానికి గడువు:10-04-2015 రాతపరీక్ష: 19-04-2015 ఇంటర్వ్యూలు: 18-05-2015 నుంచి చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సితారా గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నంబర్- 12, బంజారాహిల్స్, హైదరాబాద్- 500034 ఫోన్: 040 23386945 సమయం: ఉ.10 గం.నుంచి సా. 5 గం. వరకు (సెలవులు, ఆదివారాలు మినహా) -
జర్నలిజంలో పీజీ డిప్లొమా
జర్నలిజంలో ఉజ్వల భవిత కోసం ఎదురు చూస్తున్న ఔత్సాహిక యువతకు ‘సాక్షి’ స్వాగతం పలుకుతోంది. పాత్రికేయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి సదవకాశం కల్పిస్తోంది. జర్నలిజంలో పీజీ డిప్లొమా ప్రవేశాలకు తాజాగా సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్ఎస్జే) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు.. అర్హతలు: తెలుగు మీద పట్టు ఆంగ్లంపై అవగాహన డిగ్రీ ఉత్తీర్ణత 01-08-2015 నాటికి 30 ఏళ్లకు మించని వయసు. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 2 రాతపరీక్షలు ఉంటాయి. మొదటి పేపర్లో తెలుగు, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్‌సపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు; రెండో పేపర్లో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, కరెంట్ అఫైర్‌సపై వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. నమూనా ప్రశ్నపత్రాలు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లలో ఉంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి బృందచర్చ, మౌఖిక పరీక్ష ఉంటాయి. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారిని శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. నియమావళి: అభ్యర్థులు శిక్షణ కాలంతోపాటు సాక్షిలో నాలుగేళ్లు పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం (బాండ్ అగ్రిమెంట్) ఇవ్వాలి. శిక్షణ: అర్హత సాధించిన అభ్యర్థులు ఏడాది పాటు శిక్షణ ఇస్తా రు. ఇందులో పత్రికలో పనిచేయడానికి అవసరమైన తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, ఎడిటింగ్, రిపోర్టింగ్, అనువాదం, వర్తమాన వ్యవహారాలు నేర్పిస్తారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం మొదలైన వాటిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. శిక్షణ భృతి: జర్నలిజం స్కూలులో చేరిన విద్యార్థులకు మొదటి ఆరు నెలలు రూ.8,000, తరవాతి ఆరునెలలు రూ.10,000 నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం సంస్థలో ఏడాదిపాటు ట్రెయినీగా పనిచేయాలి. అప్పుడు సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు : www.sakshieducation.com, www.sakshischoolofjournalism.com వెబ్సైట్లలో దరఖాస్తులు ఉంటాయి. అందులోని సూచనలు క్షుణ్నంగా చదివి, దరఖాస్తును ఆన్‌ైలైన్‌లోనే పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని సాక్షి జర్నలిజం స్కూలు చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. ఆన్లైన్లో దరఖాస్తు నింపే సమయంలోనే రూ. 200 ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డుల్లో దేంతోనైనా చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక యునిక్ నంబర్ వస్తుంది. దాన్ని వేసి, దరఖాస్తు నింపే ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఆ నంబరు సాయంతో హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు: దరఖాస్తు చేయడానికి గడువు: 10-04-2015 రాతపరీక్ష: 19-04-2015 ఫలితాలు: 11-05-2015 ఇంటర్వ్యూలు: 18-05-2015 నుంచి తరగతులు ప్రారంభం: 01-06-2015 చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సితారా గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నంబర్- 12, బంజారాహిల్స్, హైదరాబాద్- 500034 ఫోన్: 040 23386945 సమయం: ఉ.10 గం. నుంచి సా. 5 గం. వరకు (సెలవులు, ఆదివారాలు మినహా) ఏప్రిల్ 12న సాక్షి మాక్ ఎంసెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో.. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ టాప్ -10 ర్యాంకర్స్‌కు నగదు బహుమతులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ ఎంసెట్ జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12న ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సాక్షి మాక్ ఎంసెట్ నిర్వహించనుంది. శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) - చిత్తూరు.. ఈ మాక్ ఎంసెట్‌కు ప్రధాన స్పాన్సర్ కాగా, సెంట్రల్ ఆంధ్రా రీజినల్ స్పాన్సర్‌గా నలందా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గుంటూరు) వ్యవహరిస్తోంది. మే నెలలో జరుగనున్న ఎంసెట్‌కు సరిగ్గా నెల రోజుల ముందు సాక్షి నిర్వహించనున్న ఈ మాక్ ఎంసెట్ ద్వారా విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా.. తమ ప్రతిభను పెంపొందించుకోవచ్చు. ప్రశ్నపత్రాలను విశేష అనుభవం కలిగిన నిపుణుల బృందం రూపొందిస్తున్నందున విద్యార్థులు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలవుతుంది. దీంతోపాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్స్‌కు నగదు బహుమతులుంటాయి. దరఖాస్తులను మార్చి 12 నుంచి అన్ని సాక్షి ఆఫీసుల్లో స్వీకరిస్తున్నారు. దరఖాస్తు వెల రూ.75తోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని వస్తే వెంటనే హాల్ టికెట్ పొందొచ్చు. సాక్షి మాక్ ఎంసెట్‌కు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 7 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మాక్ ఎంసెట్ గురించి ఏవైనా సందేహాలుంటే.. 040 -23256138కు ఫోన్ చేయొచ్చు. -
అక్షరాలలో అక్షరంగా...
అవిశ్రాంతం అరవై తర్వాత ‘జర్నలిజంలో సృజనరాగాలు’ సృష్టించిన కథకులు. ‘సాహితీ మంత్ర నగరిలో సుస్వరాలు’ పలికించిన అవిశ్రాంత సిరాధార. ‘అస్తిత్వవాదం- ఆవలితీరం’తో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. సద్గ్రంధపఠనం... సజ్జన సాంగత్యంతో జీవించడమే ఆనందకరమైన జీవనం... అంటున్న మునిపల్లె రాజు... నేటి అనుభవాలు... ఆయన మాటల్లో... నేను నలభై ఏళ్లపాటు రక్షణరంగంలో ఉద్యోగం చేసి 1983లో రిటైరయ్యాను. అది ఆ రంగం నుంచి విరమణ మాత్రమే. అప్పటినుంచి నేను సాహిత్యరంగంలో మథనం చేస్తున్నాను. డిఫెన్స్‌లో ఉన్నప్పుడు రాసిన కథలను సంకలనం వేశాను. అలా మొదలైన పుస్తకాల పరంపరలో నాలుగు కథల సంకలనాలు, రెండు కవితా సంకలనాలు, రెండు సాహిత్య వ్యాసాలు ప్రచురించాను. ప్రొఫెసర్ నిడదవోలు మాలతి నా రచనలను ఇంగ్లిష్‌లో ముద్రిస్తున్నారు. ప్రణాళికతో కాదు... రక్షణరంగం నుంచి ఉద్యోగవిరమణ తర్వాత జీవితాన్ని ఫలానా విధంగా గడపాలనే ముందస్తు ప్రణాళికలేవీ వేసుకోలేదు. స్వీయక్రమశిక్షణ వల్లనే నా జీవితం ప్రణాళికాబద్ధంగా నడుస్తోంది. నేను ఉద్యోగంలో అస్సాం తదితర ప్రదేశాల్లో ఉన్నప్పుడు అక్కడికి కుటుంబాన్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు. పిల్లల చదువుకు ఇబ్బంది కలగకుండా నా భార్య సులోచన హెదరాబాద్ లో కుటుంబాన్ని చక్క దిద్దుకునేది. నేను రిటైర్ అయ్యే నాటికి కుటుంబపరంగా నా బాధ్యతలను తను ఓ ప్రణాళిక ప్రకారం నిర్వహించింది. పిల్లల బాధ్యత లేకపోవడంతో ఉద్యోగానంతర జీవితాన్ని సాహిత్యానికే అంకితం చేశాను. రోజూ చదువుతూ... రాస్తూ... ఉదయం ఆరింటికి నిద్రలేచిన తర్వాత ఓ అరగంట సేపు కాలనీలోనే నడుస్తాను. ఇంటికి వచ్చిసేదదీరిన తర్వాత ఉత్తరాలకు జవాబులు రాస్తాను. సాహిత్యాభిలాషుల ఉత్తరాలలో క్షేమసమాచారాలు రెండు వాక్యాల్లో ఉంటే విషయచర్చ నాలుగు పేజీలు ఉంటుంది. గత రెండు నెలలుగా పెద్ద ఉత్తరాలు రాయడానికి శక్తి చాలక క్లుప్తంగా ముగిస్తున్నాను. ఈ మధ్య ఢిల్లీ నుంచి ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఎక్కువ ఉత్తరాలు వస్తున్నాయి. సాహిత్య అకాడమీ ప్రస్తుతం అవార్డుకి ఎంపికైన రచయితల కథలను 22 భాషల్లోకి అనువదించి ప్రచురించే పనిలో ఉంది. ఆ పనులకు సంబంధించిన సలహా, సంప్రదింపులు ఉత్తరాల రూపంలో నడుస్తుంటాయి. ఉత్తరం ఒక అద్భుతమైన మాధ్యమం. సామాన్యంగా క్షేమసమాచారాలు తెలియచేసే సాధనంగా కనిపిస్తుంది. కానీ అక్షర లక్షలు విలువ చేసే విషయాలను చేరవేయడానికి ఇంతకంటే మరో మంచిమార్గం ఉండదని నా నమ్మకం. ఇందిరా గాంధీకి నెహ్రూ అనేక విషయాలను ఉత్తరాల్లోనే తెలియచేశారు. అలాగే చలం గారి ఉత్తరాల్లోనూ అనేక సాంఘిక, సామాజిక అంశాల చర్చ ఉండేది. ఆయన మా పినతండ్రికి స్నేహితులు, సహోద్యోగి కూడా కావడంతో ఆయన ఉత్తరాలు రాసే విధానాన్ని దగ్గరగా గమనించగలిగాను. తొలి పాఠకురాలు... ఆంగ్లంలో పాతకాలపు కాల్పనిక సాహిత్యం అంతా చదివాను. భారతీయ సాహిత్యం చాలా వరకు చదివాను. నా పదకొండవ యేట తొలిసారిగా రాశాను. ఉద్యోగంలో చేరిన తర్వాత రచనల్లో వేగం కొంత తగ్గింది. అయితే 1950-60 మధ్య కాలంలో చాలా కథలు రాశాను. ఏ కథ రాసినా మొదటగా చదివేది సులోచన మాత్రమే. ఆమె మంచి క్రిటిక్ కూడా. రాయలసీమ కరువు నేపథ్యంలో రాసిన ‘వీర కుంకుమ, ‘బిచ్చగాళ్ల జెండా’ కథలు ఆమెకి చాలా ఇష్టం. నా లైబ్రరీలో రెండు-మూడు లక్షల రూపాయల విలువ చేసే పుస్తకాలున్నాయి. మా పెద్దబ్బాయి తన ఇంటిని నా అవసరానికి తగినట్లు కట్టించాడు. ఇటీవల తొంభయ్లో అడుగుపెట్టాను. ఇప్పటికీ వార్తాపత్రికలు కాక వార, పక్ష, మాసపత్రికలు పది వరకు వస్తాయి. వాటన్నింటినీ చదువుతాను. తేడా అంతా అప్పట్లో కూర్చుని చదివేవాడిని. ఇప్పుడు పడుకుని చదువుతున్నాను. డాక్టర్ సూచన మేరకు ఇప్పుడు పుస్తకావిష్కరణలు, సమీక్ష సమావేశాలకు ఒంటరిగా వెళ్లడం లేదు. నేను వెళ్లడం లేదనడం కంటే డాక్టరు జాగ్రత్తలన్నీ మా ఆవిడతో చెప్పడంతో ఆవిడే నన్ను వెళ్లనివ్వడం లేదనడమే కరెక్ట్. ఫొటోలు: జి. రాజేశ్ ‘బీట్ పోలీస్’ పేరుతో 40 నిమిషాల నిడివి షార్ట్ ఫిల్మ్ తీశాను. నా మనుమరాలు యూ ట్యూబ్‌లో పెట్టింది. నా రచన సినిమాగా రావడం ఇది తొలిసారి కాదు. నేను రాసిన ‘పూజారి’ నవలను బిఎన్‌రెడ్డిగారు ‘పూజాఫలం’ పేరుతో సినిమా తీశారు. - మునిపల్లె రాజు -
శీతాకాలంలో కాశ్మీరయానం
జాన్‌బాబు కొయ్యే ప్రకృతి అందాలకు చక్కని చిరునామా కాశ్మీరు. పర్వతాలు, లోయలు, సెలయేరుల సవ్వడులు, విశాల సరస్సులు, పచ్చని మైదానాలు, సహజవనాలు, ఎత్తై దేవదారు వృక్షాలు, గొర్రెల మందలు... ఇవన్నీ పర్యాటకులను పరవసింపజేస్తాయి. వీక్షకులకు కనువిందు చేస్తాయి. ప్రపంచంలో తప్పక సందర్శించవలసిన స్థలాల్లో కాశ్మీరు ఒకటి. పీర్‌పంజాల్ పర్వత పంక్తి నుండి గ్రేటర్ హిమాలయాల మధ్యలో ఏర్పడిన విశాలమైన లోయ ప్రాంతమే కాశ్మీరు. సముద్రమట్టం నుండి సుమారు 5-6 వేల మీటర్ల ఎత్తులో, అధిక తేమ కలిగి ఉండుట వల్ల వేసవిలో చల్లగా, శీతాకాలంలో మరింత చల్లగా మంచు కప్పబడి ఉంటుంది. కాశ్మీరు కేంద్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగంలో సహ ఆచార్యులుగా ఉద్యోగం చేస్తూ నాలుగు ఋతువులను చూశాను. చాలా ప్రాంతాలను స్వయంగా సందర్శించాను. ఎటు చూసినా కొత్త అనుభూతినిచ్చే ఈ ప్రాంతం పురాతన సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉంటుంది. సంవత్సరాన్ని ప్రధానంగా వేసవి శీతాకాలాలు చెరోసగం పంచుకుంటాయి. వేసవిలో కాశ్మీరును సందర్శించడానికి పర్యాటకులు ఇష్టపడతారు కానీ శీతాకాలంలో హిమగిరులతో కనిపించే కాశ్మీరు అనుభూతులను పొందలేరు. అసలైన కాశ్మీరు అందాలను చూడాలనుకునేవారు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు కొనసాగే శీతాకాలంలో సందర్శించక తప్పదు. కాశ్మీరు అందాలను చిత్రీకరించిన రోజా, హైదర్ సినిమాల్లో చివరి ఘట్టాలు ఇక్కడి శీతాకాల అందాలకు నిలువుటద్దాలు. కాశ్మీరులో కాలుష్యం ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త తక్కువే. కారణం ఇక్కడ పంటలు తప్ప పరిశ్రమలు లేవు. అక్టోబర్ నెలలో కాశ్మీరు ఆపిల్, నవంబర్‌లో కాశ్మీరు కుంకుమ పంట మొదలువుతాయి. ప్రపంచంలో ఉత్తమ శ్రేణి కుంకుమ ఇరాన్, స్పెయిన్ కాశ్మీరు నుండి లభిస్తున్నాయి. స్థానిక స్త్రీ, పురుషులు వేరుగా ప్రత్యేకంగా తయారు చేసిన ఉలెన్ నిలువుటంగీ ‘ఫెరన్’ ధరిస్తారు. ఇది కాశ్మీర్ సంప్రదాయానికి ప్రతీక. డిసెంబర్ 8న కాశ్మీరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడి కాశ్మీర్ శీతాకాల సంప్రదాయ దుస్తులైన ‘ఫెరన్’ ధరించి ప్రసంగించారు. ‘కాంగ్రీ’ అని పిలిచే నిప్పుల కుండను చిన్న బుట్టలో పెట్టి కూడా తీసుకెళతారు. వెచ్చదనాన్ని పొందుతారు. సందర్శనీయ స్థలాలు శ్రీనగర్‌లో ఎత్తై హరిపర్వతం, గోపాధారి (శంకరాచార్యుని కొండ) ఎక్కి చూస్తే నగరాన్ని డాల్ సరస్సును చూడవచ్చు. ఇక్కడ పురాతన దేవాలయాలు, మధ్య యుగం నాటి మసీదులు, కోట బురుజులు అలనాటి వైభవాన్ని జ్ఞాపకం చేస్తాయి. హజ్రత్బాల్ దర్గాలో మహ్మద్ ప్రవక్త యొక్క తల వెంట్రుక భద్రం చేయబడిందని ఇక్కడ ప్రజల నమ్మకం. కోర్ భవాణి దేవాలయం పురాతనమైన చారిత్రక పూజా స్థలం. కల్హణుడు తన గ్రంథం ‘రాజతరంగిణి’లో ఈ దేవాలయాన్ని గూర్చి ప్రస్తావించాడు. శ్రీనగర్ ప్రధాన కూడలిలో ఒక చర్చి కూడా ఉంది. ఇక షాలిమర్ గార్డెన్, నిషార్ గార్డెన్, పీర్మహల్ గార్డెన్లు రమణీయమైన సహజ వనాలు. పీర్మహల్ను దారాషికో తన సూఫీ గురువు కొరకు నిర్మించాడు. ప్రపంచ ఖ్యాతి పొందిన ‘డాల్ లేక్’లో తేలియాడే ఇళ్లు దర్శనమిస్తాయి. ఈ బోట్ హౌసుల్లో పర్యాటకులు బస చేయవచ్చు. కాస్త ఖరీదు ఎక్కువైనా వసతులు, రాచమర్యాదలు, కాశ్మీర్ వంటలు, చలిని తట్టుకోవడానికి తగిన వెచ్చని ఏర్పాట్లు చేయుట వల్ల మంచి అనుభూతిని పొందవచ్చు. ఇక సరస్సులో రొమాంటిక్ షికారా (బోట్ విహారం)కు వెళ్లి చిన్న చిన్న దోవులను చూసి రావచ్చు. తేలియాడే కూరగాయల బజారును సందర్శించవచ్చు. ఇది 8 కి.మీ. పొడవు, 4. కి.మీ. వెడల్పుతో సుమారు 26 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. చుట్టూ కొండలు ఒక పక్క మొగల్ గార్డెన్తో మధ్యలో ఫౌన్టెన్లతో పర్యాటకులకు ఆహ్లాదంగా ఉంటుంది. దీనికి దగ్గర్లో నిగోన్ లేక్, శ్రీనగర్‌కి కొంత దూరంలో ఊలార్లేక్, మానసబల్ లేక్‌లు చెప్పుకోదగ్గ సందర్శనా స్థలాలు. జీలమ్ నది కాశ్మీరుకు జీవనధార. అనంతనాగ్ జిల్లాలో ‘వెరినాగ్’ దగ్గర ఒకే నీటి ఊట నుండి జలధార ప్రవహించినందున దీనిని ‘జీలమ్’ అని అంటారు. కొంచెం దూరంలో కొక్రనాగ్ దగ్గర ఐదు పాయలుగా వీడి సహజమైన వనాన్ని సృష్టించి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ చిన్న సెలయేరులు కోడి పాదం వలే వీడి ప్రవహించుట వల్ల కోక్రనాగ్ అని పిలుస్తారు. తేటగా కనిపించే స్వచ్ఛమైన జలధారల దగ్గర విద్యార్థులతో ఒక రోజంతా గడిపాను. శ్రీనగర్ నుండి ఉదయమే బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చేసే సందర్శనా స్థలాలు చాలా ఉన్నాయి. ఇలాంటి స్థలాల్లో గుల్మార్గ్ ముఖ్యమైనది. నగరానికి వంద కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాంతం 30 కి.మీ.ఘాట్ రోడ్డు పైకి ఎక్కాలి. ఇది ఎత్తై ప్రాంతమే కాదు, దేవదారు వృక్షాలతో తెల్లని మంచుతో కప్పబడి ఉంటుంది. వాహనాలు పైకి ఎక్కడం ఒక సాహసోపేతమైన చర్యే. టంగ్మార్గ్ బిగించి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ అద్దెకు చైన్లు బిగిస్తారు. మంచు బూట్లు చలి దుస్తులు కూడా అద్దెకు ఇస్తారు. శీతాకాలమంతా దట్టమైన మంచు ఆవరించి ఉంటుంది. గుల్మార్గ్ పైకి వెళ్లగానే విశాలమైన మంచు మైదానం ప్రత్యక్షమవుతుంది. ధృవ ప్రాంతాలలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. నడవలేనివారి కొరకు గుర్రాలతో గుజ్జార్లు, స్లెడ్జ్ బండ్లతో కుర్రాళ్లు వచ్చి సేవలందిస్తామంటారు. భాష లోపాలను అనువుగా తీసుకుని ఎక్కువ డబ్బులు కూడా గుంజుతారు. ఇక్కడ బస చేయుటకు హోటల్ నివాసాలు ఉంటాయి. మంచుపై స్కేటింగ్ (స్కీయింగ్) చేయుటకు శిక్షణా శిబిరాలున్నాయి. తగిన ఐడి కార్డు చూపిస్తే కావలసిన పరికరాలు అద్దెకు ఇస్తారు. మంచుపై స్కీయింగ్ చక్కని అనుభూతి కలుగుతుంది. ఇక్కడ నుండి మరింత ఎత్తై పర్వతాలపైకి వెళ్లడానికి ‘రోప్ వే’ ఉంది. రెండు దశలుగా పైకి వెళ్లాలి. పర్యాటక విభాగం వారు రక్షణాదళం సహాయంతో ఈ ‘రోప్ వే’ నిర్వహిస్తున్నారు. టిక్కెట్లు ఆన్లైన్లో కూడా లభిస్తాయి. ఇంకా సొనా మార్గ్, పెహుల్ గామ్, బేతాజ్ వేలీ, దోద్పత్రి పర్యాటకులను ఆకర్షించే స్థలాలు. సందర్శకులు కాశ్మీరులో ఎదుర్కొనే చిన్న సమస్య ఒకటుంది. రాష్ట్రంలోకి ప్రవేశించగానే వారి మొబైల్ ఫోన్లు, పోస్టు పెయిడ్ అయితేనే పని చేస్తాయి. కాశ్మీర్‌లోని పర్యాటక స్థలాలలో సందర్శకులు ఏమైనా ఇబ్బందులు పడినా లేక చిక్కుబడినా నిత్యం పహారా కాస్తున్న భాతర సైనికులు తక్షణమే ప్రత్యక్షమవుతారు. షాపింగ్ చేయడానికి... కాశ్మీర్లో షాపింగ్ చేయుటకు శ్రీనగర్‌లోని లాల్ చౌక్, రోగల్ చౌక్, అనువైన స్థలాలు. శీతాకాల దుస్తులు, శాలువాలు, కాశ్మీర్ క్రాఫ్ట్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఢిల్లీలోని పాలికా బజార్, కరోల్ బాగ్ వలె ఇక్కడ వ్యపారస్థులు మోసం చేయరు. కానీ, పష్మీనా శాలువాలు రెండు నుండి డెబ్భై వేల వరకూ ఉంటాయి. ఎందుకంటే పష్ మీనా జాతి గొర్రెల నుండి తీసి నేసిన ఈ ఊలు మృదువుగా తేలికగా ఉంటుంది. ఆ నాణ్యత, ఖరీదు తెలియకుండా కొనాలని ప్రయత్నిస్తే నష్టపోయే ప్రమాదముంది. చేనేత కార్పెట్లు, మెరిసే రాగి, నగిషీ వెండి వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. దూర విదేశాలకు పర్యాటనకు వెళ్లేవారు ముందు మన కాశ్మీరులోని శీతాకాల అందాలను వీక్షించండి. -
తెలుగువాణి ‘మాణిక్యవీణ’
ప్రాచ్య విద్యలు చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులలో విద్వాన్ విశ్వం గొప్ప సమన్వయ వాది. మృదువుగా మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్పడంలో తనది అందెవేసిన చేయి. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఔచిత్యాన్ని వివరించడం తనకు చాలా సులువు. ఉద్యమం, సాహిత్యం, జర్నలిజం ముప్పేటగా సాగిన విలక్షణ వ్యక్తి విద్వాన్ విశ్వం! ఛాందసమెరుగని సంప్రదాయ వాది, ఆవేశం లేని ఆధునికవాది! భారతీయ లోచ నాన్ని, వామపక్ష ఆలోచనలను కలిపి చూసిన సమ న్వయవాది! ప్రాకృతం, సంస్కృతం, తెలుగు, ఇం గ్లిష్ భాషలను ఆకళింపు చేసుకొని కృషి చేసిన సాహితీవేత్త! అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో 1915 అక్టోబర్ 21న లక్షమ్మ, మునిరామాచార్యులకు జన్మించారు విశ్వరూపాచారి. తండ్రి జాతీయ భావా లతో మద్యపాన నిషేధం, రైతు మహాసభ వంటి కార్యక్రమాలను సన్మార్గ బోధిని సంఘం ద్వారా నిర్వహించిన వ్యక్తి. తండ్రి మూడవ ఏట గతించ డంతో విశ్వం తల్లి లాలనలో పెరిగాడు. తాత నుంచి సంస్కృత పాండిత్యం గడించాడు. తరిమెల నాగి రెడ్డి అనుంగు, ఆత్మీయ మిత్రుడు. కావ్యనాటకాల నూ, ఛందో అలంకారాలను, తర్కశాస్త్రాన్ని అధ్య యనం చేసి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి విద్వాన్ పట్టా పొందాడు. సంస్కృత అధ్యయనానికి తోడు వామపక్ష భావజాలం అదనంగా అమిరింది. ఏదీ దేన్నీ కప్పివేయలేదు, లేదా అతిక్రమించలేదు. అందుకే వామపక్ష భావజాలాన్ని వివరించే వ్యాసం గొప్ప శ్లోక పాదంతో ముగుస్తుంది. తెలుగు నాట దత్తమండలపు స్వాతంత్య్రోద్య మ రోజుల్లో కల్లూరి సుబ్బారావు, గాడిచర్ల హరిస ర్వోత్తమరావు, చిలుకూరి నారాయణరావు, పప్పూ రు రామాచార్యులు వంటి వారి మార్గదర్శకత్వంలో విశ్వం నడిచారు. ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా రాజకీయాలు శాస్త్రీయ పద్ధతిలో వివరిం చాలని పాత్రికేయ జీవితాన్ని ఎన్నుకున్నాడు. జర్నలిజంలో చేరకముందు నవ్య సాహిత్యమాల ద్వారా పుస్తకాలు వెలువరించారు. రామాచార్యుల ‘శ్రీసాధన’ పత్రికతో పాటు ‘భారతి’ వంటి వాటిల్లో రచనలు చేశారు. 1945లో అడవి బాపిరాజుగారి ‘మీజాన్’ పత్రికలో చేరారు. తర్వాత ‘ప్రజాశక్తి’ పత్రికలో మూడేళ్లు పనిచేసి మదరాసుకెళ్లాడు. అక్క డ ‘కిన్నెర’ వంటి పత్రికలకూ, బాలభారత్ విద్యాల యానికి పని చేశారు. 1952లో ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రికలో చేరారు. తొలి నుంచి కార్యనిర్వా హక సంపాదకులుగా పనిచేసి తెలుగు వారపత్రికల తీరులో గొప్ప మలుపులు తెచ్చాడు. అప్పట్లో ఉన్న ఏకైక వారపత్రిక ‘ఆంధ్రపత్రిక’ పురుష పాఠకులు ప్రధానంగా సాగేదని నండూరి రామమోహనరావు పేర్కొంటూ ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక సకుటుంబ వారపత్రికగా విజయవంతమైందంటారు. విద్వాన్ విశ్వం అనగానే ఎక్కువ మందికి మాణిక్యవీణ గుర్తుకు వస్తుంది. తెలుగు పత్రికల్లో ఎక్కువ కాలం నడిచిన శీర్షికలలో మాణిక్యవీణ ఒకటి. అది ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలోనే రెం డు దశాబ్దాల పాటు నడిచింది. అంతకుముందు కొంత కాలం దినపత్రికలో కొనసాగింది. మాణిక్య వీణకు ముందు ఆంధ్రప్రభ వారపత్రికలోనే సుమా రు ఏడు సంవత్సరాల పాటు ‘తెలుపు-నలుపు’ శీర్షిక ప్రధానంగా భాషాంశాలతో నడిచింది. మాణి క్యవీణ వ్యాసాల వస్తువుకు కాలదోషం ఉండవచ్చు కానీ, తెలుపు-నలుపునకు ఆ సమస్య లేదు. ఆంధ్ర పత్రిక దినపత్రికలో ‘అవీ.. ఇవీ’, ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ‘ఇవ్వాళ’ శీర్షికలు కూడా విశ్వం రాశారు. కవిగా విద్వాన్ విశ్వం కీర్తిని గొప్పగా చాటింది పెన్నేటి పాట. ఒక ప్రాంతీయమైన సమాజాన్ని కవి తా వస్తువుగా తీసుకుని విశ్వం రాసిన ‘పెన్నేటి పాట’ అజరామరమైనది. విశ్వం పెన్నేటి పాటను దాశరథి తెలంగాణ రచయితల సంఘం ద్వారా ప్రచురింపచేశాడు. అయితే కేవలం గత వైభవాన్ని కీర్తిస్తూ విశ్వం ఆగిపోలేదు. వల్లంపాటి వెంకటసు బ్బయ్య అన్నట్టు గత కీర్తి పట్ల విశ్వంకు పలవరింత గానీ, వెర్రి వ్యామోహంగానీ లేవు. బ్రిటిష్ జవాన్లతో పోరాడి అమరుడైన హం పన్న కథను ‘ఒకనాడు’ కావ్యంగా విశ్వం రాశాడు. విశ్వం అనువాద కృషిని ప్రత్యేకంగా చెప్పాలి. మేఘ సందేశం, కాదంబరి, కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర గ్రంథాలు సంస్కృత సాహిత్యంలో ఒక్కోటి విలక్షణమైనవీ, గొప్పవీ! ఈ నాలుగు గొప్ప గ్రంథా లను గొప్పగా తెలుగు చేశాడు. కల్హణుని రాజ తరం గిణి, నీతి చంద్రికను చక్కగా అనువదించారు. ప్రాచ్య విద్యలు చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులలో విద్వాన్ విశ్వం ప్రముఖు లే కాదు, గొప్ప సమన్వయవాది కూడా. మృదు వుగా మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్ప డంలో విశ్వం అందెవేసిన చేయి. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఔచిత్యాన్ని విడ మరచి చెప్పడం అతనికి చాలా సులువు. అయితే విశ్వం వ్యక్తిగత జీవితం బాధాకరంగా పరిణమించింది. కూతురు అకాల మరణం, కుమా రుడు ఇల్లు విడిచిపోవడం ఆయనను బాగా దెబ్బ తీశాయి. 1987 అక్టోబర్ 20వ తేదీన విశ్వం తిరు పతిలో కన్నుమూశారు. ఆయన పాండితీ సమన్వ య ధోరణి, విశాల దృక్పథం తెలుగు సమాజానికి చక్కని సందేశాన్ని ఇస్తున్నాయి. (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త) డా॥నాగసూరి వేణుగోపాల్ -
ప్రజా ప్రయోజనాలకు పట్టంకట్టే.. డెవలప్మెంట్ జర్నలిజం
పత్రికలో ప్రచురితమైన వార్త ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. టీవీలో ప్రసారమైన కథనం అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రేడియోలో వచ్చిన కార్యక్రమం ప్రజలను చైతన్యపరుస్తుంది. పాత్రికేయానికి ఉన్న శక్తి ఇది. సామాజిక బాధ్యత ఉన్న వృత్తి జర్నలిజం. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, సమాజానికి మేలు చేయాలనుకునే సేవాతత్పరులకు సరైన కెరీర్.. డెవలప్మెంట్ జర్నలిజం. వృత్తిపరమైన సంతృప్తి సాధారణంగా జర్నలిజం పరిధిలోకి రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, సినిమా.. ఇలా అన్ని రంగాలూ వస్తాయి. కానీ, డెవలప్మెంట్ జర్నలిజంలో మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశుభ్రత, లింగ వివక్ష, మౌలిక సదుపాయాలు, రహదారుల భద్రత, విద్య, మానవ హక్కులు.. ఇలా మానవాభివృద్ధికి సంబంధించిన రంగాలు ఉంటాయి. ఆయా రంగాల్లో సమస్యలను తెరపైకి తీసుకురావడం డెవలప్మెంట్ జర్నలిస్టుల బాధ్యత. అన్ని భాషల్లో మీడియా సంస్థలు విస్తరిస్తుండడంతో పాత్రికేయులకు అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. జర్నలిస్టులకు ప్రస్తుతం పత్రికలు, వార్తా చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్సైట్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. డెవలప్మెంట్ జర్నలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. మీడియా సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరగడంతో పాత్రికేయులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. వృత్తిలో ప్రతిభాపాటవాలు చూపితే సమాజంలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు. ఫ్రీలాన్స్‌గా కూడా పనిచేసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులకు వృత్తిపరమైన సంతృప్తి లభిస్తుంది. కావాల్సిన నైపుణ్యాలు జర్నలిస్టులకు సామాజిక బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించాలి. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగని మనస్తత్వం అవసరం. మంచి కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఉండాలి. వార్తలు, వార్తల్లోని జీవరేఖను గుర్తించే నేర్పు ముఖ్యం. పాత్రికేయులు నిత్య విద్యార్థిగా మారాలి. ఎప్పటికప్పుడు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈ వృత్తిలో డెడ్లైన్లు ఉంటాయి కాబట్టి పొరపాట్లకు తావులేకుండా వేగంగా పనిచేయగలగాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యాన్ని నూటికి నూరు శాతం కాపాడుకోవాలి. అర్హతలు ఇంటర్మీయెట్, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో ఏ కోర్సులు చదివినా పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టొచ్చు. అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా జర్నలిస్ట్‌గా పనిచేయొచ్చు. అయితే, సోషల్ సైన్స్ కోర్సులు చదివితే ఇందులో రాణించడానికి అవకాశం ఉంటుంది. మనదేశంలో జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా, పీజీ డిప్లొమా తదితర కోర్సులున్నాయి. ఆసక్తిని బట్టి ఇంటర్/గ్రాడ్యుయేషన్ తర్వాత వీటిలో చేరొచ్చు. మొదట మీడియా సంస్థలో ట్రైనీగా చేరి, అనుభవం, నైపుణ్యాలను పెంచుకొని పూర్తిస్థాయి జర్నలిస్టుగా కెరీర్లో నిలదొక్కుకోవచ్చు. వేతనాలు పని చేస్తున్న మీడియా సంస్థ(న్యూస్ చానల్, వార్తాపత్రిక, మేగజైన్)ను బట్టి వేతనం అందుతుంది. ప్రారంభంలో ఏడాదికి రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వేతన ప్యాకేజీ పొందొచ్చు. అనుభవం, పనితీరు ఆధారంగా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తిలో ప్రతిభ చూపితే తక్కువ సమయంలో ఉన్నత హోదాలు, అధిక వేతనాలు అందుకోవచ్చు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తే రాసిన కథనాలను బట్టి ఆదాయం లభిస్తుంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు 1. ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in/ 2. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.efluniversity.ac.in 3. ఎ.పి. కాలేజీ ఆఫ్ జర్నలిజం వెబ్సైట్: http://apcj.in/ 4. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్: www.braou.ac.in 5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.iimc.nic.in 6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం అండ్ న్యూ మీడియా వెబ్సైట్: www.iijnm.org 7. ఆసియన్ కాలేజీ ఆఫ్ జర్నలిజం వెబ్సైట్: www.asianmedia.org -
పట్టణాలకు పల్లె కళ...
మహిళా స్వావలంబన ‘అక్కా! మేం చేసిన ఈ వస్తువులను పట్టణంలోని వారు వాడతారా?!’ ఓ చెల్లెలి సందేహం. ‘అక్కా, మిగతా వాటిలాగానే వీటినీ కొన్ని రోజులు వాడి, పడేస్తారా?’ ఇంకొకరి అనుమానం... ‘అసలు ఈ వస్తువులు కొంటారంటావా అక్కా!’ మరొకరి సంశయం.. ముప్ఫై ఐదేళ్ల వీణా ప్రకాష్ సింగ్ వారడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపికగా సమాధానమిస్తారు. అంతే ఓపికగా వారి చేత పట్టణాలలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయించి, వారు చేసిన కళాకృతుల విలువను నలుగురికి తెలియజేస్తారు. వారి చేతుల్లో రూపుదిద్దుకుంటున్న కళాకృతులు ఏ నమూనాలో ఉండాలో వివరిస్తారు. వారి కళను పట్టణ ప్రజల ఇళ్లలో పరిమళాలు వెదజల్లేలా చేయడమే కాదు, వారికి ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు వీణా ప్రకాష్ సింగ్. వీణా ప్రకాష్ సింగ్‌కి ప్రయాణాలంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే డిగ్రీ చేసిన ఆమె జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. వీణ పూర్వీకులది పశ్చిమ బెంగాల్ అయినా ఆమె పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! తండ్రి సూర్యప్రకాష్, తల్లి సూర్యకాంతం. ఇద్దరూ స్వచ్ఛంద సంస్థలలో పనిచేస్తూ, పేదలకు సాయపడుతుంటారు. తల్లితండ్రుల నుంచి స్ఫూర్తి పొందిన వీణ తనూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపారు. అందులో భాగంగా దేశమంతా తిరిగారు. ముఖ్యంగా తన పూర్వీకుల స్వస్థలమైన పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లోని గ్రామాలన్నీ తిరిగారు. అక్కడి మహిళల అమాయకత్వాన్ని, వారు పడుతున్న ఇబ్బందులనూ దగ్గరగా గమనించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్, రాజస్థాన్‌లోని సిరోహీ గ్రామాల స్త్రీలను కలిసినప్పుడు మాత్రం వారికి ఉన్న కళా నైపుణ్యం పేదరికం మాటున ఎలా మరుగున పడుతోందో గమనించారు. ఇప్పటికీ అక్కడి ఆడపిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్ళు జరిపించడం, చిన్న వయసులోనే వారు పిల్లలతో కుటుంబం నడపలేక పడుతున్న స్థితిని కళ్లారా చూశారు. అప్పుడే వారికి సహాయ పడాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించుకున్నారు వీణ. తన ఆలోచనలకు భర్త కార్తీక్ సింగ్ ఊతమిచ్చారు. వి.కె.శరణ్య పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేసి, పాతికమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు కదిలారు. ఆ విధంగా మట్టి కళాకృతులు, నారతో చేసిన బొమ్మలు, సంచులు, పేపర్‌తో చేసిన బొమ్మలు.. స్త్రీల చేతుల్లో కొత్తగా ప్రాణం పోసుకోవడం మొదలుపెట్టాయి. ఆలోచనే పెట్టుబడి... వీణలాగే ఆమె భర్త కార్తీక్ సింగ్ కూడా కళాప్రియుడే! అంతేకాదు నలుగురికీ చేయూతనివ్వాలని తపించే వ్యక్తి. తనకు వచ్చిన చిత్రకళను పేద పిల్లలకు పరిచయం చేయాలని మురికివాడలను సందర్శించి, అక్కడి పిల్లలకు పెయింటింగ్‌లో శిక్షణ ఇస్తుంటారు. ‘ఈ పెయింటింగ్ మోడల్స్‌ని నేను గ్రామీణ మహిళల దగ్గరకు తీసుకెళతాను. రకరకాల చేతివృత్తులలో వాటిని మేళవించేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఆ విధంగా మహిళల చేతుల్లో తయారయ్యే బొమ్మల్లో వైవిధ్యం కనిపిస్తుంది. అంతే కాదు, వారి ఆత్మ ఆ కళాకృతుల్లో కనిపిస్తుంది. అందుకే ఇవి ఆధునికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీరి కళాకృతులతోనే కలకత్తా, ముంబయ్‌లలో ఎగ్జిబిషన్లు నిర్వహించాను.హైదరాబాద్‌లో ‘ఆల్పోనా’ పేరుతో హస్తకళాకృతుల విక్రయదుకాణాన్ని ఏర్పాటు చేశాను. దీంట్లో వచ్చిన ఆదాయాన్ని కళాకృతుల తయారీ మహిళలకు అందజేస్తున్నాను’ అంటూ రెండున్నరేళ్లుగా తాను చేస్తున్న కృషి గురించి వివరించారు వీణ. స్వచ్ఛంద సంస్థలతో కలిసి...: ఉపాధి అవకాశాలు పెంచేందుకుగాను క్రాఫ్ట్స్‌తో పాటు హ్యాండ్లూమ్ ప్రింట్స్ కూడా నేర్పిస్తున్నారు వీణ. ఉన్న కళలతో పాటు, కొత్త కళలను నేర్పుతూ అవకాశాలు పెరిగేందుకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి రాజస్థాన్ బాంద్రా మురికివాడల్లో హెల్త్ క్యాంపులు, హైదరాబాద్‌లో స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్, బ్యాగులు, ముంబయ్‌లోని మురికివాడల పిల్లల కోసం రంగస్థల తరగతుల నిర్వహణ, పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో వృద్ధాశ్రమం, హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలో పాలు పంచుకుంటున్నారు. గ్రామీణ ప్రజలకు ఆదాయ వనరుల మార్గాలు, పొదుపు పథకాల గురించి వివరిస్తూ సామాజిక బాధ్యతగా తన వంతు కృషి చేస్తున్నారు. గ్రామీణ మహిళకు ఉపాధి... ‘గ్రామీణ కళాకృతులకు పట్టం కట్టాలనేది నా ఉద్దేశ్యం. అందుకే ఇదే తరహా కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలలోనూ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇందుకు కొన్ని గ్రామాలను ఇప్పటికే ఎంచుకున్నాను. ఆ గ్రామాలకు వెళ్లి, అక్కడి పరిస్థితులను, చేతివృత్తుల ప్రత్యేకత.. వివరాలు తెలుసుకొని వందలాది మంది నిరుపేద గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాను’ అని చెబుతున్న వీణకు గ్రామీణ మహిళలు స్వావలంబన సాధించేలా చేయడమే లక్ష్యం. ఆమె ఆశయం నెరవేరాలని ఆకాంక్షిద్దాం. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివ మల్లాల -
బ్యాట్ పట్టిన ‘బాపూ బొమ్మ’....
బొంగరాళ్లాంటి కళ్లు తిప్పడమే కాదు సుతిమెత్తని చేతులతో బ్యాట్ పట్టగలనంటోంది ఈ బాపూ బొమ్మ. తన అందచందాలతో టాలీవుడ్, శాండల్‌వుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న అందాల నటి ప్రణీత సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. జర్నలిస్ట్‌లు, ట్రాఫిక్ పోలీసుల నడుమ ఏర్పాటు చేసిన ఎస్.సుబ్బరాయలు నాయుడు మెమోరియల్ క్రికెట్ మ్యాచ్‌ను ఆదివారమిక్కడి కాక్స్‌టౌన్‌లోని మైదానంలో నటి ప్రణీత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీత కాసేపు క్రికెట్ ఆడి అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమంలో నటి తార, సమాజ సేవకులు ఎన్.ఎస్.రవి పాల్గొన్నారు. - సాక్షి, బెంగళూరు -
మదిని దోచే చిత్రాన్నిచ్చే.. ఫొటోగ్రాఫర్
గత స్మృతుల్లోకి తీసుకెళ్లి, మనసును పులకరింపజేసే శక్తి అందమైన ఛాయాచిత్రానికి ఉంది. వంద మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో సులువుగా తెలియజేస్తుంది. మదిని దోచే అపురూపమైన ఫొటోలను తన కెమెరాలో బంధించి, భద్రంగా మన చేతికందించే కళాకారుడు.. ఫొటోగ్రాఫర్. సృజనాత్మకతతో అద్భుతాలే మనదేశంలో ఆదరణ పొందుతున్న కెరీర్.. ఫొటోగ్రఫీ. వృత్తిపరమైన సంతృప్తి, సమాజంలో పేరు, పనికి తగ్గ వేతనం అందించే కెరీర్ ఇది. సృజనాత్మకత, కష్టపడే తత్వం ఉంటే ఫొటోగ్రఫీలో అద్భుతాలే సృష్టించొచ్చు. ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో అందరూ ఫొటోగ్రాఫర్ల అవతారం ఎత్తుతున్నారు. ఆకట్టుకొనే దృశ్యం కనిపిస్తే చాలు.. ఫోన్లో బంధించి, వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. స్నేహితుల నుంచి ‘లైక్’లు కొల్లగొడుతున్నారు. మనం తీసిన ఫొటోను నలుగురు మెచ్చుకుంటే.. కలిగే సంతృప్తికి వెలకట్టలేం. ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీపై అడుగులేస్తున్న వారెందరో ఉన్నారు. ఆసక్తి, అభిరుచితో తీసిన మంచి ఫొటోలను కళాభిమానులు వేలాది రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. వివాహాలు, శుభకార్యాల్లో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల అవసరం తప్పనిసరిగా మారింది. ఇక మీడియాలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఒక్క ఫొటోతో సంచలనం సృష్టించినవారు ఉన్నారు. అవకాశాలు, సవాళ్లు మనదేశంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. నిపుణులైన ఫొటోగ్రాఫర్లకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలకు కొదవ లేదు. ఫ్యాషన్, వైల్డ్‌లైఫ్, జ్యుయెలరీ, సినిమా, జర్నలిజం వంటి విభాగాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్న వృత్తి. ఫొటోగ్రాఫర్లకు ఓపిక, సహనం తప్పనిసరిగా అవసరం. హాబీతోపాటు సంపాదన ‘‘అందమైన జ్ఞాపకంగానే కాకుండా అద్భుతమైన కెరీర్‌గా రాణించే అవకాశం ఉన్న రంగం ఫొటోగ్రఫీ. గ్లోబలైజేషన్ వల్ల కంపెనీల ప్రచారానికి విపరీతమైన గిరాకీ పెరిగింది. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు క్రియేటివిటీ, నాలెడ్జ్ ఉన్న ఫొటోగ్రఫీ నిపుణులకు మంచి వేతనాలను అందిస్తున్నాయి. ప్రకృతి ఆరాధకులు దీన్ని హాబీగా స్వీకరించి ఎంజాయ్ చేస్తూనే డబ్బు సంపాదించుకునేందుకు వీలుంది. గతానికి భిన్నంగా ఫొటోగ్రఫీ కొత్త టెక్నాలజీతో అప్డేట్ అవుతోంది. దీన్ని కెరీర్‌గా స్వీకరించిన వారికి మంచి వేతనం లభిస్తుంది. ప్రారంభంలో నెలకు కనీసం రూ. 25 వేలకు పైగా సంపాదించవచ్చు. నాలుగేళ్ల ఫొటోగ్రఫీ కోర్సులో పలు అంశాలపై శిక్షణ ఇస్తారు. మరో నాలుగు నెలలు ఇంటర్న్‌షిప్. అనంతరం ప్రొఫెషనల్‌గా స్థిరపడే అవకాశం ఉంటుంది.’’ - సనకా లక్ష్మీ పవన్, ఫొటోగ్రాఫర్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి -
కొత్త పుస్తకం: ఉన్నతాధికారి అనుభవాలు
మోహన మకరందం (అనుభవాలూ-జ్ఞాపకాలూ) రచన: మోహన్ కందా పేజీలు: 252; వెల: 200; ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్-27. ఫోన్: 24652387 మాకు జర్నలిజంలో పాలిటీ బోధించిన కృపాదానం సర్ సరదాగా ఒక మాట అన్నారు: ఈ రాజకీయనాయకులు ఎవరూ లేకపోయినా, జరిగే పని జరుగుతూనే ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ వ్యవస్థా పడకేయకుండా చూసే బాధ్యత అధికారయంత్రాంగం మీద ఉంటుంది మరి! జాన్సన్ చోరగుడి అన్నట్టు, ‘ప్రభుత్వం’ లేకపోయినా ‘రాజ్యం’ తన పని తాను చేసుకుపోయే సందర్భాలు వస్తుంటాయి. రాష్ట్రపతి పాలన విధించినప్పుడో, ‘మంత్రివర్గం’ ఇంకా ప్రమాణ స్వీకారం చేయనప్పుడో ఇది మనకు బాగా తెలిసొస్తుంది. అలాంటి రాజ్యానికి చోదకశక్తి ‘తెరచాటునుండే’ ఐఏఎస్ ఆఫీసర్లు. ‘ఐఏఎస్‌లో ఎన్నో రకాల ఉద్యోగాలుంటాయి.... (అందులో) జిల్లా కలెక్టర్, రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి, కేంద్రస్థాయిలో కార్యదర్శి- యివి ప్రత్యేకమైనవి’. ఈ మూడు కీలకస్థానాల్లోనే కాక, చేనేత, ఫిషరీష్, సివిల్ సప్లయిస్, ఎక్సయిజ్, కమర్షియల్ టాక్స్, ఎగ్రికల్చర్, ప్లానింగ్, కో-ఆపరేషన్‌లోనూ పనిచేసిన ఉన్నతాధికారి మోహన్ కందా! ఆయన ఆత్మకథాత్మక, సంఘటన కేంద్రక జ్ఞాపకాలివన్నీ! ఉన్నతాధికారి అన్న పదంతో ఉండే ఇమేజ్ వల్లనేమో, ఇందులోని అక్షరాలకు కూడా సూటూబూటూ తొడిగివుంటారా, అన్న అనుమానం కలుగుతుంది. కానీ చెప్పుల్లేకుండా కాలేజీకి, బూట్లు లేకుండా ఆఫీసుకీ(అలవాటుగానే సుమా! పేదరికంతో కాదు. జడ్జిగారబ్బాయి కదా!) కూడా వెళ్లిన ‘మోహన్’... ఆ గాంభీర్యాన్ని తగ్గించి, ‘బెటర్ దన్ ద ఆల్టర్నేటివ్’ అయిన జీవితానికి సెన్సాఫ్ హ్యూమర్‌ను కచ్చితమైన టెన్షన్ బస్టర్‌గా నమ్మినవాడు కాబట్టి, సరదాగా రాసుకువెళ్లారు. ఉంటాడో ఊడతాడో అనుకున్న తన పుట్టుక, గాంధీజీ మీదుగా తన నామకరణం, సినిమాల్లో బాలనటుడి వేషాలు, ప్రకాశం సబ్‌కలెక్టర్‌గా జై ఆంధ్ర ఉద్యమాన్ని ‘ఎదుర్కోవాల్సి రావడం’, ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, నేదురుమల్లిల పనితీరుకు అడ్జస్ట్ కావడం, ఎన్టీయార్‌తో ఉదయం ఐదుగంటలకు భోంచేయాల్సి రావడం, తన కుక్కపిల్లల ప్రేమ గొడవ, రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ టైముకు రాకూడదని మొక్కుకున్న సందర్భం, మూడురోజుల్లో ఇవ్వాలనుకున్న ‘జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ’ నివేదికకు మూడేళ్లు పట్టడం, ప్రశ్నోత్తరాలకు మంత్రిని ఎంత సిద్ధం చేసినా మాట పడాల్సిరావడం, కృష్ణా పుష్కరాల అనర్థానికి ‘ఎంచుకున్న తలకాయలను’ శిక్షించడం, చంద్రబాబునాయుడుకీ, రాజశేఖరరెడ్డికీ ఇద్దరికీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం... ఇట్లాంటివెన్నో అనుభవాలు! ఇవే విషయాల్ని గంభీరంగా చెబితే, ‘చూశారా, నా గొప్పతనం,’ అన్నట్టుగా ధ్వనించే ప్రమాదం ఉంది. కానీ ‘టోన్’లో తీసుకున్న జాగ్రత్త వల్ల ‘ఔచిత్య భంగం’ కాలేదు. ‘అత్యున్నత స్థాయిలో ఉన్నవాడు దిశానిర్దేశం చేయాలి. ప్రాథమికస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలి’. ‘అవినీతి అంటే ఏమిటో మనం సులభంగా కనుక్కోవచ్చు. కానీ నిజాయితీని నిర్వచించడం కష్టమని నా వ్యక్తిగత అభిప్రాయం’. ‘కేంద్రప్రభుత్వంలో వ్యవస్థను ఆఫీసర్ డ్రివెన్ సిస్టమ్ అంటారు, రాష్ట్రాలలో ఉన్నది ఆఫీస్ డ్రివెన్ సిస్టమ్’ లాంటి ‘ముక్తావళి’ కూడా సంఘటనల్లో భాగంగా కలిసిపోయింది. అందుకే ఈ పుస్తకం చదవడంలోని మజా ఇస్తూనే, వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికీ పనికొస్తుంది. అయితే, కాలమ్గా రాసినవి కాబట్టి, కొన్నిసార్లు నేపథ్యాల పునరుక్తులున్నాయి. ‘ఫీల్ గుడ్’ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుంది! - ఆర్.ఆర్. కొత్త పుస్తకాలు: తెగిపడ్డ ఆ చెయ్యి (కారుమంచి దళితుల ధిక్కార చరిత్ర) రచన: సి.ఎస్.సాగర్ పేజీలు: 126; వెల: 100; ప్రతులకు: ఇం. 2-1-716(బి-6, ఎఫ్-4), ఎస్వీఎస్ స్కూలు ఎదురుగా, ఓయూ మెయిన్ రోడ్, విద్యానగర్, హైదరాబాద్-44. ఫోన్: 040-27668471 స్వాభిమాన ప్రతీక, విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ జీవితం, కొన్ని రచనలు సంపాదకుడు: మోదుగుల రవికృష్ణ పేజీలు: 134; వెల: 100; ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, హైదరాబాద్‌తో పాటు, సంపాదకుడు, 26-19-10, ‘0’ లేన్, మెయిన్ రోడ్, ఎ.టి.అగ్రహారం, గుంటూర్- 522004. ఫోన్: 09440320580 కాకతీయుల వంశ రహస్యం రచన: డా.బాలరాజు తక్కెళ్ల పేజీలు: 120; వెల: 100; ప్రతులకు: టి.కళావతి రాజ్, 3-14-609, కొత్తూరు, కె.యు.రోడ్, హన్మకొండ, వరంగల్ జిల్లా-506001 తెల్లారితే... (అపాయింటెడ్ డే) (కవిత్వం) రచన: కె.విల్సన్‌రావు, కె.ఆంజనేయకుమార్ పేజీలు: 120; వెల: 75 ప్రతులకు: సాహితీస్రవంతి, విజయవాడతోపాటు ప్రజాశక్తి అన్ని శాఖలూ. భాస్వరాలు (కవిత్వం) రచన: ఆచార్య కడారు వీరారెడ్డి పేజీలు: 116; వెల: 100 ప్రతులకు: కవి, 8-12-20, బృందావన్ నగర్, రోడ్ నం.8, హబ్సిగూడ, హైదరాబాద్-7. ఫోన్: 9392447007 ప్రేమాంజలి (దీర్ఘకవిత) రచన: బిక్కి కృష్ణ పేజీలు: 122; వెల: అమూల్యం ప్రతులకు: బిక్కి చందన, 7-1-309/11/12, రేణుకానగర్, బి.కె.గూడ, ఎస్.ఆర్.నగర్, హైదరాబాద్-38. ఫోన్: 9912738815 -
జర్నలిజం కెరీర్ వయా.. ఐఐఎంసీ
జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చక్కటి వారధిగా నిలుస్తోంది.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ). మాస్ కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి బోధన, శిక్షణ, పరిశోధన రంగాల్లో దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఇన్స్టిట్యూట్.. ఐఐఎంసీ. న్యూఢిల్లీ ప్రధాన క్యాంపస్‌గా పనిచేసే ఐఐఎంసీకు ఐజ్వాల్ (మిజోరం), అమరావతి (మహరాష్ట్ర), దెన్కనల్ (ఒడిషా), జమ్మూ (జమ్మూ-కాశ్మీర్), కొట్టాయం (కేరళ)లలో రీజనల్ సెంటర్లు ఉన్నాయి. ఐఐఎంసీ 2014-15 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సుల వివరాలు.. - పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ ఇంగ్లిష్ జర్నలిజం (న్యూఢిల్లీ, ఐజ్వాల్, దెన్కల్, అమరావతి, జమ్మూ, కొట్టాయం క్యాంపస్‌లు) - పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ హిందీ జర్నలిజం (న్యూఢిల్లీ క్యాంపస్) - పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్ జర్నలిజం (న్యూఢిల్లీ క్యాంపస్) - పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (న్యూఢిల్లీ క్యాంపస్) - పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజం- ఒడియా (దెన్కల్ క్యాంపస్) ప్రవేశం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/గ్రూప్‌డిస్కషన్ అనే రెండు దశల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఈ క్రమంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ దశలకు 85:15 నిష్పత్తిలో మార్కులు కేటాయిస్తారు. రాత పరీక్ష ఇలా: రాత పరీక్ష కోసం నిర్దిష్ట విధానం అంటూ ఏమీ ఉండదు. ఎంచుకున్న కోర్సును బట్టి పరీక్షలో అడిగే అంశాల్లో మార్పు ఉంటుంది. జర్నలిజం కోర్సులకు నిర్వహించే రాత పరీక్షలో జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్, మెంటల్ మెకప్, లాంగ్వేజ్ కెపాబిలిటీ, అనలిటికల్ అండ్ కాంప్రెహెన్షనల్ స్కిల్స్ వంటి అంశాలు ఉంటాయి. అడ్వర్టైజింగ్ కోర్సుకు సంబంధించి జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్, మెంటల్ మెకప్, లాంగ్వేజ్ కెపాబిలిటీ, అనలిటికల్ అండ్ కాంప్రెహెన్షన్ స్కిల్స్, బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీకాల్, సోషల్ కాన్సియెస్, లేటరల్ థింకింగ్ కెపాబిలిటీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్: ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. పరీక్షను డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. నిర్దేశించిన విధంగా పద పరిమితి/స్థల పరిమితిలో మాత్రమే సమాధానాలను రాయాలి. డిస్క్రిప్టివ్‌కు సంబంధించి సమకాలీనంగా ప్రాధాన్యం ఉన్న అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఉదాహరణకు-ఫారెన్ డెరైక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రిటైల్ ట్రేడ్, డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్, పార్లమెంటరీ ఎలక్షన్స్-ఫ్యూచర్ ఆఫ్ ఇండియా వంటివి. వీటికి నిర్దేశించిన మేరకు 150, 100 పదాల్లో సమాధానాలను రాయాలి. వార్తల్లోని వ్యక్తులు/సంఘటనలపై అడిగే ప్రశ్నలకు నాలుగు/మూడు/రెండు వాక్యాల్లో సంక్షిప్త సమాధానాలు ఇవ్వాలి. ఆబ్జెక్టివ్ విధానంలో భాషా సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. అడ్వర్టైజింగ్ కోర్సులకు నిర్వహించే రాత పరీక్షలో ఏదైనా సన్నివేశం ఇచ్చి దాని ఆధారంగా జంగిల్ రాయమనడం వంటి ప్రశ్నలు ఇస్తారు. ఎంచుకున్న కోర్సును బట్టి పరీక్ష విధానంలో మార్పు ఉంటుంది. ప్రోత్సాహకాలు: ప్రవేశం పొందిన విద్యార్థులకు ‘హాఫ్ ఫ్రీషిప్స్’, ‘రతి అగర్వాల్ స్కాలర్షిప్’ వంటి ఆర్థిక ప్రోత్సహకాలు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా సెలవుల నిమిత్తం సొంత పట్టణాలకు వెళ్లే విద్యార్థులు రైలు, విమాన చార్జీల్లో రాయితీని కూడా పొందొచ్చు. నోటిఫికేషన్ సమాచారం: - అర్హత: ఏదైనా డిగ్రీ. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే. - దరఖాస్తు: ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా నిర్దేశిత చిరునామాతో పోస్ట్ ద్వారా కూడా పొందొచ్చు. - దరఖాస్తు ఫీజు: రూ. 1,200 (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్ అభ్యర్థులకు రూ. 1,100) - దరఖాస్తుకు చివరి తేదీ: మే 5, 2014. - రాత పరీక్ష తేదీలు: మే 31, జూన్ 1. ఇంటర్వ్యూలు: జూన్ చివరి వారం/జూలై మొదటి వారం వివరాలకు: www.iimc.nic.in -
పొరపాటుకు ‘చెక్’
చెక్కుల రూపంలోనూ ఆస్తి పన్ను చెల్లించవచ్చు : బీబీఎంపీ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తప్పు చేసిన వారికి, చేయని వారికీ ఒకే రకమైన ‘శిక్ష’ను విధించడం ద్వారా చేసిన పొరపాటును బీబీఎంపీ ఎట్టకేలకు సరిదిద్దుకుంది. ఇకమీదట ఆస్తి పన్ను చెల్లింపునకు చెక్కులను కూడా స్వీకరిస్తామని బుధవారం ప్రకటించింది. నగరంలో ఆస్తి పన్ను చెల్లింపు ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెలాఖరులోగా చెల్లించిన వారికి మొత్తం పన్ను మొత్తంలో ఐదు శాతం రాయితీ కూడా లభిస్తుంది. దీంతో పెద్ద మొత్తంలో పన్ను వసూలయ్యేది. గతంలో చెక్కుల రూపంలో పన్నులను స్వీకరించే వారు. అయితే కొన్ని చెక్కులు నిరాదరణకు గురవడం, బీబీఎంపీ సిబ్బందే అవకతవకలకు పాల్పడడం వల్ల ఎన్నడూ లేని విధంగా ఈఏడాది డీడీలు లేదా పే ఆర్డర్ల రూపంలో మాత్రమే పన్ను చెల్లించాలని బీబీఎంపీ షరతు విధించింది. రూ వెయ్యి లోపు అయితే నగదు రూపంలోనే చెల్లించవచ్చని ఆదేశించింది. వీటి కోసం బ్యాంకుల వద్ద క్యూలో నిలుచుకోలేక చాలా మంది పన్ను చెల్లింపు పట్ల ఉత్సాహం చూపించలేదు. సాధారణంగా ఈ ఒక్క నెలలోనే రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వసూలయ్యేది. ప్రస్తుతం ఇప్పటి వరకు రూ. 84 కోట్లు మాత్రమే వసూలైంది. మరో వారం రోజుల్లో రూ.150 కోట్ల వరకు వసూలు కావడం గగనమే. డీడీలు, పే ఆర్డర్ నిబంధన వల్లే పన్ను చెల్లింపు పట్ల నగర పౌరులు పెద్దగా ఉత్సాహం చూపడం లేదని తేలడంతో బీబీఎంపీ నాలుక్కరచుకుని, నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దీనికి తోడు బీబీఎంపీ సిబ్బంది ఈ నెల 17 వరకు లోక్‌సభ ఎన్నికల్లో నిమగ్నం కావడం, తర్వాత వరుసగా మూడు రోజులు సెలవు రావడం వల్ల కూడా పన్ను వసూలులో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గడువు పెంపు అనుమానమే సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఐదు శాతం రాయితీ పొందడానికి గడువు తేదీని పొడిగించే అవకాశాలుంటాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, గడువు పెంపు అనుమానమేనని బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. అసలే ఆదాయం లేక నానా అగచాట్లు పడుతున్న బీబీఎంపీకి ప్రస్తుత పన్ను వసూలు వైనం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన తయారైంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో వచ్చే నెలాఖరు వరకు ఐదు శాతం రాయితీ గడువును పొడిగించినట్లయితే పన్ను వసూళ్లు ఊపందుకుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెల్ల అర్జీ తప్పనిసరి ఈ ఏడాది పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేనందున, నిర్ణీత దరఖాస్తు పూర్తి చేసి సమర్పించాలనే నిబంధనపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పన్ను మొత్తంలో మార్పు లేనప్పుడు దరఖాస్తు ఎందుకని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. అయితే కేఎంసీ చట్టం ప్రకారం పన్ను మొత్తంతో పాటు నిర్ణీత దరఖాస్తును భర్తీ చేసి సమర్పించడం తప్పనిసరని బీబీఎంపీ తెలిపింది. కాగా బీబీఎంపీ సహాయ రెవెన్యూ అధికారి కార్యాలయాలతో పాటు ఐడీబీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఐఎన్జీ వైశ్యా బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, బెంగళూరు వన్ కేంద్రాల్లో డీడీలు లేదా పే ఆర్డర్ల రూపంలో ఆస్తి పన్ను చెల్లించే అవకాశం కల్పించినట్లు వివరించింది. రూ.వెయ్యి లోపైతే నగదు రూపంలో చెల్లించవచ్చని తెలిపింది. -
బ్యాక్లాగ్ పోస్టులకు భారీగా దరఖాస్తులు
ఏఎన్‌యూ, యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టుల నియామకాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, రోజువారీ వేతన సిబ్బందిలో అర్హులైన వారితో పాటు బయటనుంచి కూడా అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. మొత్తం 24 పోస్టులకు ఇప్పటివరకు 3వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. మార్చి 3వ తేదీ చివరితేదీ కావటంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. 3న జాతీయసదస్సు.. యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘ద చేంజింగ్ డెమైన్షన్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని సదస్సు డెరైక్టర్, విభాగాధిపతి డాక్టర్ జి.అనిత ఓ ప్రకటనలో తెలిపారు. రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సు ఈనెల 3వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. గౌరవ అతిథులుగా భోపాల్ ఉపక్రమ్ ఎడిటర్ ఆచార్య సీకే సారధి, ఆంధ్రప్రదేశ్ ఐ అండ్ పీఆర్ మాజీ డెరైక్టర్ డాక్టర్ సీవీ నరసింహారెడ్డి పాల్గొంటారన్నారు. ఐ అండ్ పీఆర్ రీజినల్ జేడీ జో న్సన్ చోరగుడి కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. పరీక్షలు నిర్వహణ తేదీలు ఖరారు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఫిబ్రవరిలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన వివిధ కోర్సుల పరీక్షల ను వర్సిటీ వాయిదా వేసింది. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను ఖరారు చేశామని సీఈ డి.సత్యన్నారాయణ శుక్రవారం తెలిపారు. సంబంధిత ఉత్తర్వు లు అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు పంపామన్నారు. -
ఆజన్మం: పదేళ్ల నాటి జాబితా
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 6115 నుంచి ఐదురెట్లు పెరిగింది (30,550). వెండీ అంతే! కిలో 9000 ఉండేది 45,460 నడుస్తోంది. ఈ ఆలోచనకు బీజం ఏమిటో ఇప్పుడు గుర్తులేదు; అప్పటికి ఇంకా జర్నలిజంలోకి కూడా రాలేదు; కానీ, కాలంలో వీటి పరుగును చూడాలనే కోరిక ఏదో ఉండివుంటుంది. అందుకే సరిగ్గా దశాబ్దం కింద, నవంబర్ 23, 2003న కొన్ని వస్తువులు, సేవల ధరలను డైరీలో రాసిపెట్టాను. అప్పుడు పటాన్చెరులో ఉన్నాను కాబట్టి, ఆ స్థానీయత అనివార్యం. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నాను కాబట్టి ఇదీ దృష్టిలో ఉంచుకోవాలి. పరిధి అవరోధం కాని ఇతర అంకెలు కూడా ఉన్నాయి. పదేళ్ల కింద కిలో టమోటా 8 రూపాయలు. నిన్నా మొన్న నలభై ఉంది; ‘ఇవ్వాళ’ పాతిక్కి దిగింది(!). అప్పటి 9 రూపాయల ఉల్లిగడ్డ నిన్న 34! తడిచినవైతే 15; జిట్టిగడ్డలు 10; నెలరోజుల క్రితం 60 కూడా అమ్మారు. మూడ్రూపాయల ఇరానీ చాయ్ పదైంది! 1.60 కోడిగుడ్డును కిరాణాలో ఐద్రూపాయలకు కొన్నాను; రైతుబజార్లో డజన్ 48. డజన్ అరటిపళ్లు 35. పదేళ్లకింద 10. పటాన్చెరు ‘ఆనంద్’లో మీల్స్ 25 ఉన్నప్పుడు, హైదరాబాద్‌లో భోజనం 40 ఉండేది. ‘కాకతీయ మెస్’లో ఇప్పుడు 70! ఇంకొన్ని ధరలు: బ్రాకెట్లో ఇస్తున్నవి ఇప్పటివి. అన్నీ కిలోకు. ఆలుగడ్డ 12 (24); క్యారట్ 12 (20); చక్కెర 16 (32); అన్నపూర్ణ ఉప్పు 6.50 (16); గోధుమరవ్వ 14 (32); మసూరి బియ్యం 16 (40); చికెన్ 64 (148); మటన్ 120 (400). మొక్కజొన్న క్వింటాల్ 505 (1274). ఇంకా- పాలు 200 ఎంఎల్ 3.50 (‘విజయా’ లీటర్ 34); సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 47 (80); 200 ఎంఎల్ కూల్‌డ్రింక్ 5 (10); మీడియం సైజు కుండ 15 (50); మైసూర్ శాండల్ సబ్బు 18 (30); అజయ్ టూత్ బ్రష్ 15 (21); లేజర్ బ్లేడ్ 1.50 (2); రెనాల్డ్స్ జెట్టర్ పెన్ 15 (20), రీఫిల్ 6.50 (8); కాల్గేట్ టూత్‌పేస్ట్-100గ్రా. 30 (37); 1.5వోల్ట్స్ బ్యాటరీ 7 (10); ఆల్ ఔట్ 42 (59); జెమిని టీ పొడి-25గ్రా 4.50 (100గ్రా. 34); రిన్ సుప్రీమ్-125గ్రా 8.50 (సర్ఫ్ ఎక్సెల్ అయింది; 100గ్రా. 10). పదేళ్ల కింద- ఫోన్ కాల్ లోకల్ 90 సెకన్లకు 1.50. అదే 180 సెకన్లకు 2. ఇప్పుడు మొబైల్స్ వచ్చేశాయి. పాటలు నింపిద్దామని 10 బ్లాంక్ క్యాసెట్స్ సెట్ కోఠిలో 135కు కొన్నానప్పుడు. ఇప్పుడు క్యాసెట్స్ ఎక్కడ? సినిమా బాల్కనీ పటాన్చెరు ‘రుక్మిణి’లో 25, హైదరాబాద్‌లో 35-40 ఉండేది; ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో 200. హెయిర్ కట్ 12 ఉండేది; గుడిమల్కాపూర్‌లో(కాలనీలో) 30 తీసుకుంటున్నారు. మెయిన్‌రోడ్డులో 60. ఆర్రూపాయల షేవింగ్ కూడా 30 అయింది. కేబుల్ బిల్ రెట్టింపై 200 అయింది. బీర్ కూడా డబులై 90 అయింది. కింగ్సైజ్ గోల్డ్‌ఫ్లేక్ డైలీ పేపర్‌తో సమానంగా 2.80 ఉండేది. పేపర్ 5 ఐతే, సిగరెట్‌కు పాన్‌షాపులో 8 ఇవ్వాలిప్పుడు. ఇంకా కొన్ని: ఇండియాటుడే వీక్లీ 8 (20); ఎంప్లాయ్మెంట్ న్యూస్ 5 (8); టైలర్ చార్జ్- చొక్కా 50 (200); టైలర్ చార్జ్- ప్యాంటు 90 (250); రూపా చేతుల బనీన్ 40 (75); యూరో అండర్వేర్ 45 (100); లాండ్రీలో ఐరన్- సింగిల్ క్లాత్ 1.50 (4); జిరాక్స్ కాపీ 1 (2); పటాన్చెరు-కోటి బస్ టికెట్ 13 (20); హైదరాబాద్-వేములవాడ ఎక్స్‌ప్రెస్ టికెట్ 58 (116); పెట్రోల్ లీటర్ 37 (83); డాక్టర్ కన్సల్టేషన్ ఫీ 30 (‘కేర్’లో 1+1 విజిట్=500). డైలీ బస్ పాస్-ఆర్డినరీ సబర్బన్ 28 ఉండేది. ఇప్పుడు అర్బన్, సబర్బన్, ఆర్డినరీ, మెట్రో అంతా ఒకటే టికెట్. 70! ఎల్పీజీ సిలిండర్ 270 ఉండేది. ఇప్పుడు ఆధార్, బ్యాంకు, జమ, గొడవ! సబ్సిడీతో 412; లేకుండా 1060 దాకా! ‘మోటార్ బైక్’ 40000 నుంచి 64000 అందుకుంది. 24 క్యారెట్ల 10గ్రా. బంగారం 6115 నుంచి ఐదురెట్లు పెరిగింది(30,550). వెండీ అంతే! కిలో 9000 ఉండేది 45,460 నడుస్తోంది. ఇక, రూపాయి విలువ ఇలా మారింది: డాలర్ 45.53 (62.72); యూరో 56.14 (85); పౌండ్ 79.70 (101.66). రిజర్వు బ్యాంకు వడ్డీరేటు 6 శాతం (9); బ్యాంకుల్లో వ్యక్తిగత వడ్డీరేటు 13 శాతం (18-25); పల్లెటూళ్లలో వ్యక్తిగత వడ్డీ అప్పుడూ ఇప్పుడూ 24 శాతమే! దేశ ఆర్థికాభివృద్ధి రేటు అప్పుడు 4.5 శాతం. ఇప్పుడు 5 అంటున్నారు. బీఎస్ఇ సెన్సెక్స్ పాయింట్ల సూచి 5263 నుంచి 20217కు ఎగబాకింది(!). చివరగా- ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.57,141 కోట్లు ఉండేది. ఇప్పుడు ‘సమైక్యాంధ్రప్రదేశ్’ రుణం 1,60,000 కోట్లు! సాధారణంగా అంకెలు కనబడే ఐటెమ్స్ చదవడానికి హాయిగా ఉండవు. అందుకే ఫీచర్ రైటర్స్ 10 అని వేయాల్సిన చోట పది అనే రాస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈ అంకెలు నాకు తమాషాగా కనబడుతున్నాయి. కాకపోతే, ఈ అంకెలు వేస్తూ కూర్చోవడానికి కారణమైన నిరుద్యోగపు ఖాళీదనంలో మాత్రం ఏ తమాషా లేదు! - పూడూరి రాజిరెడ్డి -
కలాన్ని కదిలిస్తూ.. జనానికి గళమవుతూ..
జర్నలిస్టు పాత్రికేయం.. ప్రజా సమస్యలపై పోరాడే పాశుపతాస్త్రం. కలం కదిలించి, అక్షర అస్త్రాలను సంధించి.. ప్రజలకు తోడుగా, పచ్చని కెరీర్‌కు నీడగా నిలిచే ప్రొఫెషన్. చేపట్టిన వృత్తి.. వ్యక్తిగత వికాసానికే కాకుండా, పది మంది పురోగతికీ ఉపయోగపడాలన్న కోరిక ఉన్న వారికి సరైన కెరీర్ ఆప్షన్ జర్నలిజం. సామాజిక స్పృహ, సృజనాత్మకతకు భాషా సామర్థ్యం, కష్టపడి పనిచేసే తత్వం తోడైతే ఉన్నత అవకాశాలకు కొదవలేని జర్నలిజం కెరీర్‌పై స్పెషల్ ఫోకస్.. దేశంలో మీడియా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రారంభమవుతున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ వెలుస్తున్నాయి. ముఖ్యంగా 24 గంటల వార్తా చానళ్ల సంఖ్య అధికమవుతోంది. వీటికి తోడు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పీసీల వాడకం ఎక్కువ కావడంతో టైర్-2, టైర్-3 నగరాల్లో డిజిటల్ కంటెంట్ వినియోగం అధికమైంది. దీంతో ఆన్లైన్ జర్నలిజం సరికొత్త ఉద్యోగాలకు ద్వారాలు తెరుస్తోంది. జర్నలిజం ప్రొఫెషనల్స్‌కు తీవ్ర డిమాండ్ ఉండటంతో విశ్వవిద్యాలయాలు జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. నిత్యనూతనం.. కెరీర్లో అడుగుపెట్టింది మొదలు... ఎప్పుడూ నవ్యతకు అవకాశం ఉండటం, ఆకర్షణీయ పే ప్యాకేజీలతోపాటు సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుండటంతో జర్నలిజం కెరీర్ దిశగా అడుగులు వేసే వారి సంఖ్య అధికమవుతోంది. పరిశోధన వరకు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పరిశోధన స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. జర్నలిజం కోర్సునకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో జర్నలిజంను ఒక సబ్జెక్టుగా చేర్చి వివిధ కోర్సులను అందించే కళాశాలలూ ఉన్నాయి. అధిక శాతం మంది బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎంసీజే) కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటివి డిస్టెన్స్ విధానంలో జర్నలిజం కోర్సులను యువతకు అందుబాటులో ఉంచాయి. ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతలతో కోర్సుల్లో చేరొచ్చు. రాష్ట్రానికి బయట జర్నలిజం కోర్సులు అందిస్తున్న వాటిలో యూనివర్సిటీ ఆఫ్ లక్నో, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ వంటివి ఉన్నాయి. ఇంగ్లిష్, ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జర్నలిజం- కరిక్యులం జర్నలిజం కోర్సు కరిక్యులంను తరగతి గది పాఠాలు, క్షేత్రస్థాయి ప్రాక్టికల్ వర్క్, గెస్ట్ లెక్చర్స్, ఇంటర్న్‌షిప్‌ల సమ్మేళనంగా రూపొందిస్తున్నారు. కరిక్యులంలోని కొన్ని అంశాలు: జర్నలిజం ప్రాథమిక భావనలు. ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ మీడియా. అడ్వర్టైజింగ్, మ్యాగజైన్ అండ్ ఫొటో జర్నలిజం. రిపోర్టింగ్ అండ్ ఎడిటింగ్. క్రియేటివ్ థింకింగ్ అండ్ రైటింగ్. కార్పొరేట్ అండ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్. ట్రెండ్స్ ఇన్ కమ్యూనికేషన్. డెవలప్మెంట్ జర్నలిజం. మీడియా లాస్ అండ్ ఎథిక్స్. సొంతంగా జర్నలిజం కోర్సులు ప్రస్తుత సాంకేతిక ప్రపంచం ఒక గ్లోబల్ గ్రామంగా మారిన పరిస్థితుల్లో కచ్చితత్వంతో పాటు వేగం కూడా అత్యవసరమైంది. దీంతో మీడియా రంగంలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. సమర్థవంతమైన, సుశిక్షితులైన మానవ వనరుల కోసం పత్రికలు, చానళ్ల యాజమాన్యాలు సొంతంగా జర్నలిజం స్కూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నీ ఈ తరహా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతూ తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. జాతీయస్థాయి సంస్థలైన ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ సొంతంగా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతున్నాయి. ఈ సంస్థలు తరచూ జర్నలిజం స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన వారికి జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. జర్నలిజం స్కూళ్లలో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో భాషా నైపుణ్యాలు, వర్తమాన వ్యవహారాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి అంశాలపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాలో విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో పత్రికలు, చానళ్లలో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్/కాపీ ఎడిటర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. రిపోర్టర్.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనిచేసే ప్రాంతంలో ప్రతిరోజూ జరిగే కీలక పరిణామాలను గమనిస్తూ కథనాలు, వార్తలను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సబ్ఎడిటర్ లేదా కాపీ ఎడిటర్.. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను సమగ్రంగా తీర్చిదిద్దుతారు. వార్తా సంస్థలు అందించే ఇంగ్లిష్ వార్తలను స్థానిక భాషలోకి అనువదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరుగుతుంది. ప్రైవేటు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారిని అధిక వేతనాలతో పీఆర్వోలుగా నియమించుకుంటున్నాయి. బీసీజే అర్హత ఉన్నవారు ఎంసీజే, ఎంఫిల్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి రీసెర్చ్ సంస్థల్లో చేరొచ్చు. యూజీసీ-నెట్లో అర్హత సాధించి విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో జర్నలిజం ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేయొచ్చు. సొంతంగా కన్సల్టెన్సీ సంస్థలను నెలకొల్పవచ్చు. అవసరమైన స్కిల్స్ సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, చొరవ, కష్టపడే తత్వం. రోజువారీ లక్ష్యాలు, వాటి సాధనకు వ్యూహ రచన సామర్థ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్ (లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్..). ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం. భాష, స్వేచ్ఛానువాద నైపుణ్యం. వేగం (Speed) స్పష్టత (Clarity) కచ్చితత్వం (Accuracy). ఇవి జర్నలిజం కెరీర్లో రాణించేందుకు ముఖ్యమైనవి. రేపటి జర్నలిస్టులకు ఆహ్వానం జనజీవనానికి అద్దం పడుతూ.. జనం కోసం పనిచేసే కెరీర్‌ను కోరుకునే వారికి ‘సాక్షి’ సాదర స్వాగతం పలుకుతోంది. ప్రింట్, టీవీ, వెబ్ జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు, తదనంతరం ఉద్యోగానికి ఆహ్వానిస్తోంది. అర్హతలు: తెలుగు, ఇంగ్లిష్ భాషల మీద పట్టు. వర్తమాన అంశాల మీద అవగాహన. డిగ్రీ ఉత్తీర్ణత. 01.01.2014 నాటికి 30 ఏళ్లకు మించని వయసు. రెండు దశల్లో ఎంపిక: తొలిదశ: ఈ దశలో అభ్యర్థులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, వర్తమాన అంశాలపై ఆబ్జెక్టివ్, వ్యాసరూప ప్రశ్నలుంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్ష జరుగుతుంది. నమూనా ప్రశ్నపత్రాలు www.sakshischoolofjournalism.com వెబ్సైట్లో ఉంటాయి. రెండో దశ: మొదటి దశలో ఉత్తీర్ణులైన వారికి మౌఖిక పరీక్షలు ఉంటాయి. వర్తమాన అంశాలపై లోతైన అవగాహన, భాషా నైపుణ్యాలను పరీక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పరీక్షలో నెగ్గిన అభ్యర్థులను సంస్థ నియమావళికి అనుగుణంగా శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. శిక్షణ భృతి: శిక్షణ దశలో తొలి ఆరునెలలు రూ.8 వేల చొప్పున, తర్వాతి ఆరు నెలలు రూ.10 వేల నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం ఏడాది పాటు ట్రైనీగా పనిచేయాలి. ఆ సమయంలో నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది. ఆపై సబ్ఎడిటర్/ రిపోర్టర్, కాపీ ఎడిటర్, కంటెంట్ డెవలపర్‌గా నియమితులవుతారు. అప్పుడు ఆయా విభాగాల నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలుంటాయి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నియమావళి: అభ్యర్థులు శిక్షణ కాలంతో పాటు సాక్షిలో కనీసం నాలుగేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం సమర్పించాలి. దరఖాస్తు విధానం: www.sakshieducation.com లేదా www.sakshischoolofjournalism.com వెబ్సైట్లో దరఖాస్తులుంటాయి. అందులోని సూచనలను క్షుణ్ణంగా చదివి దరఖాస్తులను ఆన్లైన్లోనే పూర్తిచేసి సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు ఫొటోను అప్లోడ్ చేయాలి. దరఖాస్తుకు గడువు:10.12.2013 రాత పరీక్ష: 22.12.2013 ఇంటర్వ్యూలు: 18.01.2014 నుంచి ప్రారంభం కోర్సు ప్రారంభం: 01.02.2014 చిరునామా: ప్రిన్సిపల్, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034. -
పరిశోధనాత్మక జర్నలిజం పదును పెరగాలి
సాక్షి, హైదరాబాద్: పరిశోధనాత్మక జర్నలిజం మరింత పదును పెరగాల్సిన ఆవశ్యకత ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. భూ కబ్జాలు, ఆర్థిక నేరాల గుట్టును రట్టుచేసేందుకు కృషిచేయాలని, అప్పుడే దేశ సంపదను కాపాడగలుగుతామని చెప్పారు. క్రైం రిపోర్టర్స్ కమిటీ, ప్రెస్ అకాడమీ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఏదైనా నేరం జరిగిన సమయంలో పోలీసుల కథనాలను రాయడంతోపాటు నేర స్థలాన్ని స్వయంగా పరిశీలించి వాస్తవాలను బయటకు తీయాలని సూచించారు. డిటెక్టివ్ కన్నా నిశితంగా పరిశీలించే సామర్థ్యం క్రైం రిపోర్టర్‌కు ఉండాలన్నారు. నేర నిర్ధారణ విషయంలో ఫోరెన్సిక్ విభాగం సేకరించే సాక్ష్యాధారాలు చాలా కీలకమైనవన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత బాధిత మహిళలు స్నానం చేయకూడదనే విషయం తెలియకపోవడం వల్ల కూడా సాక్ష్యాధారాలు దొరకడంలేదని అభిప్రాయపడ్డారు. హైస్కూలు, కాలేజీ విద్యార్థులకు కూడా ఫోరెన్సిక్ విభాగం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తే మంచిదని చంద్రకుమార్ సూచించారు. ఫోరెన్సిక్ విభాగం రాష్ర్ట పోలీసుశాఖ పరిధిలో ఉండటం వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయని రాష్ర్ట ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ డెరైక్టర్ ఎ.శారద అభిప్రాయపడ్డారు. సమాజానికి ప్రయోజనం కలిగించే వార్తలకే మీడియా ప్రాధాన్యమివ్వాలని, ప్రజల వ్యక్తిగత విషయాల్లోకి తొంగిచూడటం తగదని రాష్ట్ర పోలీసు అకాడమీ డెరైక్టర్ ఎం.మాలకొండయ్య అన్నారు. నేరాలను మీడియాలో యథాతథంగా చూపడం వల్ల కొందరు స్ఫూర్తిపొంది నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్, రిటైర్డ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ ఎం.నారాయణరెడ్డి, క్రైం రిపోర్టర్స్ కమిటీ కన్వీనర్ ఉడుముల సుధాకర్‌రెడ్డి, కో కన్వీనర్ వలసాల వీరభద్రం సెమినార్లో మాట్లాడారు. -
తెహెల్కా ఎడిటర్ వికృత చేష్ట!
సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి తరుణ్ తేజ్పాల్పై యాజమాన్యానికి బాధితురాలి ఫిర్యాదు ప్రాథమిక దర్యాప్తునకు గోవా సర్కారు ఆదేశం పణజి/న్యూఢిల్లీ: పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా సంచలన కథనాలను వెలుగులోకి తెచ్చిన తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ చిక్కు ల్లో పడ్డారు. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో పది రోజుల కిందట తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని ఓ మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపాయి. హోటల్లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్‌పాల్ బుధవారం షోమాకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. అయితే తన చర్యపట్ల విచారం వ్యక్తం చేస్తూ బాధితురాలికి తేజ్‌పాల్ బేషరతు క్షమాపణ చెప్పారని, దీనిపై బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేసిందంటూ షోమా గురువారం మీడియాకు చెప్పారు. బాధితురాలు కోరుకున్న న్యాయంకన్నా ఆయన ఎక్కువే చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని సంస్థ అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. షోమా వ్యాఖ్యలపై ఎడిటర్స్ గిల్డ్ సహా జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తేజ్పాల్ను పోలీసులు అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2001లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ రూ. లక్ష ముడుపులు తీసుకోవడాన్ని తేజ్‌పాల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై గోవాలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు తేజ్పాల్ను మంగళవారం ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా ఎంపిక చేసిన కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. -
మీరూ జర్నలిస్టు కావచ్చు!
సామాజిక అవగాహన, భాషపై పట్టుంటే... ప్రసార మాధ్యమాలు.. జాతి హృదయ స్పందనను కళ్లకు కట్టే అత్యుత్తమ సాధనాలు. సమాజానికి నిలువుటద్దంగా ఉంటూ సామాన్య ప్రజల రోజు వారీ సమస్యలకు పరిష్కారాన్ని చూపే నిజమైన వేదికలు.. కేవలం సమాచారాన్ని అందించడమే కాదు.. లక్షణమైన అక్షరాలే అస్త్రాలుగా, మేలిమి మాటలే తూటాలుగా చేసుకొని ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ, చైతన్యవంతుల్ని చేయడంలోనూ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత ముందు ఉత్తమ కెరీర్ ఆప్షన్‌గా ఉన్న జర్నలిజంపై స్పెషల్ ఫోకస్.. దేశంలోని మీడియా రంగంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రవేశిస్తున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్ పోర్టల్స్ ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 24 గంటల న్యూస్ చానళ్ల సంఖ్య అధికమవుతోంది. దీంతో సుశిక్షితులైన మానవ వనరుల కోసం తీవ్ర డిమాండ్ ఏర్పడుతోంది. అందువల్ల విశ్వవిద్యాలయాలు జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉండటంతోపాటు ఆకర్షణీయ ఆదా యం, సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుండటంతో యువత జర్నలిజం వైపు అడుగులు వేస్తోంది. ఇంగ్లిష్, కామర్స్, ఎకనామిక్స్ కోర్సులతో సమానంగా జర్నలిజం కోర్సులకు క్రేజ్ పెరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఢిల్లీ యూనివర్సిటీలో జర్నలిజం కోర్సుకు 59 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే జర్నలిజం కెరీర్‌పై యువతకు ఎంతటి మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. డిప్లొమా నుంచి డాక్టోరల్ వరకు: మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ, డాక్టోరల్ స్థాయి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జర్నలిజానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో జర్నలిజం ఒక సబ్జెక్టుగా ఆఫర్‌చేసే కళాశాలలూ ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎంసీజే) కోర్సులను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. ఇగ్నో, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటివి దూరవిద్యలో జర్నలిజం కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో కోర్సుల్లో చేరొచ్చు. రాష్ట్రం బయట కోర్సులు అందించే వాటిలో యూనివర్సిటీ ఆఫ్ లక్నో, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ వంటివి ఉన్నాయి. ఇంగ్లిష్, ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. కోర్సుల్లో బోధించే అంశాలు: జర్నలిజం కోర్సు కరిక్యులంను తరగతి గది పాఠాలు, క్షేత్రస్థాయి ప్రాక్టికల్ వర్క్, గెస్ట్ లెక్చర్స్, ఇంటర్న్‌షిప్ మేళవింపుగా రూపొందిస్తున్నారు. ఇందులోని కొన్ని అంశాలు.. కమ్యూనికేషన్ అండ్ మాస్ మీడియా ప్రాథమిక భావనలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. అడ్వర్టైజింగ్, మ్యాగజైన్ అండ్ ఫొటో జర్నలిజం. రిపోర్టింగ్ అండ్ ఎడిటింగ్. క్రియేటివ్ థింకింగ్ అండ్ రైటింగ్. కార్పొరేట్ అండ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్. ట్రెండ్స్ ఇన్ కమ్యూనికేషన్. డెవలప్మెంట్ అండ్ రూరల్ కమ్యూనికేషన్. మీడియా లాస్ అండ్ ఎథిక్స్. సొంతంగా శిక్షణ కేంద్రాలు: ప్రస్తుతం మీడియా రంగంలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. అందువల్ల సమర్థులైన మానవ వనరుల కోసం మీడియా సంస్థలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో అనేక పత్రికలు, చానళ్లు సొంతంగా జర్నలిజం శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసి, తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. మరికొన్ని మీడియా సంస్థలు నేరుగా విశ్వవిద్యాలయాల్లో కోర్సులు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రధాన దినపత్రికలన్నింటికీ సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి వీటిలో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. జాతీయస్థాయి సంస్థలైన ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ సొంతంగా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు: జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో పత్రికలు, చానళ్లలో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్/కాపీ ఎడిటర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. రిపోర్టర్.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనిచేసే ప్రాంతంలో ప్రతిరోజూ జరిగే కీలక పరిణామాలను గమనిస్తూ కథనాలు, వార్తలు రాయాల్సి ఉంటుంది. సబ్ఎడిటర్ లేదా కాపీ ఎడిటర్.. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను సమగ్రంగా తీర్చిదిద్దుతారు. న్యూస్ ఏజెన్సీలు అందించే ఇంగ్లిష్ వార్తలను స్థానిక భాషలోకి అనువదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో) నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత కొలువులను సొంతం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎస్ఎస్సీ, రాష్ట్ర ఉద్యోగ నియామక సంస్థలు ప్రకటనలు జారీచేస్తుంటాయి. ప్రైవేటు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారిని అధిక వేతనాలతో పీఆర్వోలుగా నియమించుకుంటున్నాయి. బీసీజే అర్హత ఉన్నవారు ఎంసీజే, ఎంఫిల్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి రీసెర్చ్ సంస్థల్లో చేరొచ్చు. యూజీసీ-నెట్లో అర్హత సాధించి విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో జర్నలిజం ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. యూజీసీ-నెట్ జేఆర్ఎఫ్కు అర్హత సాధిస్తే పరిశోధన చేసేందుకు అయిదేళ్లపాటు నెలకు రూ. 22 వేల స్టైపెండ్ కూడా లభిస్తుంది. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేయొచ్చు. సొంతంగా కన్సల్టెన్సీ సంస్థలను నెలకొల్పవచ్చు. అవసరమైన నైపుణ్యాలు: సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, చొరవ, కష్టపడే తత్వం. రోజువారీ లక్ష్యాలు, వాటి సాధనకు వ్యూహ రచన సామర్థ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్ (లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్..). ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం. భాష, స్వేచ్ఛానువాద నైపుణ్యం. సృజనాత్మకంగా ఆలోచించడం. సామాజిక అంశాలపై పట్టు. వేగం (Speed), స్పష్టత (Clarity), కచ్చితత్వం (Accuracy). ఇవి జర్నలిజం కెరీర్‌కు మూలస్తంభాలు. టాప్ రిక్రూటర్స్: ఎన్డీటీవీ నెట్వర్క్ జీ టీవీ నెట్వర్క్. బీబీసీ. 18 నెట్వర్క్. ఇండియా టుడే గ్రూప్. కెరీర్ అవకాశాలు ప్రింట్ మీడియా న్యూస్ పేపర్స్, మ్యాగజైన్లు, బుక్స్, జర్నల్స్.. ఉద్యోగాలు: రైటర్, ఫీచర్ రైటర్, రిపోర్టర్, సబ్ఎడిటర్, ఫొటో జర్నలిస్టు, కార్టూనిస్టు, ఆర్ట్ డెరైక్టర్ వంటివి. ఎలక్ట్రానిక్ మీడియా టీవీ చానళ్లు, వెబ్ పోర్టల్స్, రేడియో.. ఉద్యోగాలు: కరస్పాండెంట్, స్పెషల్ కరస్పాండెంట్, ప్రెజెంటర్, న్యూస్ రీడర్, ప్రోగ్రాం ప్రొడ్యూసర్, సౌండ్ టెక్నీషియన్, స్క్రీన్ రైటర్, కెమెరామెన్, వీడియో ఎడిటర్, రేడియో జాకీ, కంటెంట్ డెవలపర్ వంటివి. వెబ్ మీడియా ఇప్పుడు ఎమర్జింగ్ మీడియాగా వెలుగొందుతోంది. ఫ్యాషన్, హెల్త్, పాలిటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్.. ఇలా వివిధ అంశాలకు సంబంధించి వెబ్సైట్లు ఏర్పాటు చేస్తుండటంతో అవకాశాలు పెరిగాయి. జర్నలిస్టుగా సేవలందించే విభాగాలు: పాలిటిక్స్, బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, ఫీచర్స్ అండ్ లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, ఫిల్మ్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, అగ్రికల్చర్, లిటరరీ, డెవలప్మెంట్. వేతనాలు: ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వరకు వేతనం ఉంటుంది. తర్వాత విద్యార్హతలు, ప్రతిభ, పనితీరు ఆధారంగా నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పే ప్యాకేజీని అందుకోవచ్చు. జర్నలిజం.. అపార అవకాశాలకు వేదిక! మీడియా శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగిన నైపుణ్యాలున్న మానవ వనరులకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇప్పుడు ఎంసీజే కోర్సుపై ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. రెగ్యులర్ లేదా డిస్టెన్స్ విధానంలో జర్నలిజం కోర్సు పూర్తిచేసిన వారికి విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహికులు తమ అభిరుచికి అనుగుణంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాను ఎంపిక చేసుకోవచ్చు. రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, ఫీచర్ ఎడిటర్లు వంటి ఉద్యోగాలు పొందొచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వివిధ సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అవకాశాలను అందిపుచ్చుకోచ్చు. జర్నలిజం వృత్తిలో రాణించాలంటే ఒక ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లిష్, హిందీ పరిజ్ఞానం అవసరం. భావ వ్యక్తీకరణ సామర్థ్యం, సామాజిక అంశాలపై అవగాహన, సమయస్ఫూర్తి, వార్తలను పసిగట్టే స్వభావం వంటి నైపుణ్యాలు ఓ వ్యక్తిని జర్నలిజంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జర్నలిజం కెరీర్లోకి అడుగుపెట్టిన వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానం. మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. - డాక్టర్ బాలస్వామి, హెచ్.ఓ.డి, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఓయూ. జర్నలిజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే ఔత్సాహికులు డిప్లొమా కోర్సులకు బదులు యూజీసీ గుర్తింపు ఉన్న ఎంసీజే కోర్సును ఎంపిక చేసుకొని, పూర్తిచేయడం ఉత్తమ మార్గం. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి పత్రికలు, చానళ్లతో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రసార భారతి, అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో అవకాశాలుంటాయి. భాషా పరిజ్ఞానం, వర్తమాన వ్యవహారాలను విశ్లేషించే సామర్థ్యం, సామాజిక స్పృహ, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే జర్నలిజంలో రాణించవచ్చు. నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సీటీలో ఎంసీజే చేశాను. పీఐబీ-ప్రెస్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పరీక్షలో విజయం సాధించాను. ఇంటర్వ్యూలో భాష సామర్థ్యం, సామాజిక అనుసంధానం, జర్నలిజం తదితరాలపై ప్రశ్నలు అడిగారు. - శ్రీరాముల శ్రీకాంత్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, పీఐబీ. రూ. 83 వేల కోట్ల విలువైన భారతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ (క-ఉ) మార్కెట్ శరవేగంగా విస్తరిస్త్తోంది. ఏటా అధిక వృద్ధిని నమోదు చేసుకుంటూ దూసుకెళ్తోంది. భారతీయ టెలివిజన్ మార్కెట్ రెవెన్యూ 2011లో రూ. 34 వేల కోట్లుంటే, అది 2012 నాటికి రూ. 38 వేల కోట్లకు చేరింది. 2012లో రూ. 21 వేల కోట్ల మేర ఉన్న ప్రింట్ సెక్టార్ రెవెన్యూ 2017 నాటికి రూ. 33 వేల కోట్లకు చేరుతుందని అంచనా. -
పత్రికా స్వేచ్ఛకు ‘లెసైన్స్’!
ఈమధ్య మీడియాకు పాఠాలు చెప్పేవారు ఎక్కువయ్యారు. అందులో చిత్తశుద్ధితో, అమాయకత్వంతో మాట్లాడే వారు లేకపోలేదు గానీ... ఆ మాటున మీడియాకు హితబోధలు చేయడానికి, అలా చేసే క్రమంలో దాన్ని దోషిగా చూపడానికి ప్రయత్నిస్తున్నవారున్నారు. మీడియాను నియంత్రించడమే ఇలా దోషిగా చూపడానికి ప్రయత్నిస్తున్నవారి ఆంతర్యమని వేరే చెప్పనవసరం లేదు. మీడియా లోపరహితమైనదని, విమర్శలకు అతీతమైనదని ఎవరూ అనరు. అన్నిటా మంచీ చెడూ ఉన్నట్టే ఇందులోనూ ఉంటుంది. అవాంఛనీయ పోకడలకు పోతూ, వక్రమార్గంలో వెళ్లే ప్రసార మాధ్యమాలు లేకపోలేదు. అయితే, అత్యధిక మీడియా సంస్థలు ప్రజలకు గల తెలుసుకునే హక్కును గుర్తించి, గౌరవించి అందుకు అనుగుణంగా తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే... అస్తిత్వం కోసం వ్యాపార ధర్మాలను ఆచరిస్తున్నాయి. మీడియా తనను తాను సరిదిద్దుకోకపోతే, విశ్వసనీయత పెంచుకోవడానికి నిరంతరమూ ప్రయత్నించకపోతే కాలగర్భంలో కలిసిపోతుంది. మీడియా స్వేచ్ఛ అంటే మీడియా సంస్థలు తమకు ఏది తోస్తే అది రాసే స్వేచ్ఛ కాదు. ఘటనలను వక్రీకరించే స్వేచ్ఛ అంతకన్నా కాదు. అది వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రజలకున్న హక్కు. భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తున్న రాజ్యాంగంలోని 19(1) (ఏ) ద్వారా ప్రజలకు సమకూరిన హక్కు. శనివారం న్యూఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రసంగిస్తూ పరిశోధనాత్మక జర్నలిజం అంటే కక్ష సాధింపు కాదని హితవు చెప్పారు. మీడియాకు స్వేచ్ఛతోపాటు బాధ్యతలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. అంతకు నాలుగురోజులముందు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి మనీష్ తివారీ జర్నలిస్టులకు లెసైన్స్‌లు మంజూరుచేసే వ్యవస్థ ఉండాలని సూచించారు. కొన్నాళ్లక్రితం ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ కూడా జర్నలిస్టులకు కనీస అర్హతలుండాలని అభిప్రాయపడ్డారు. అందుకోసమని ఆయన ఒక కమిటీ కూడా వేశారు. తన అభిప్రాయాలను నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెప్పడం అలవాటున్న కట్జూ నుంచి ఇలాంటి సూచన వచ్చినప్పుడు ఆయనతో గట్టిగా విభేదించినవారు సైతం అందులో దురుద్దేశాలున్నాయని విమర్శించలేదు. అయితే, అలాంటి ప్రతిపాదనలు ఆచరణలోకి వచ్చినప్పుడు రాగల ముప్పును తెలియజేశారు. ఇప్పుడు పత్రికలు, చానెళ్లకు మారుమూల ప్రాంతాల్లో సైతం విలేకరులు ఉంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వాటి పరిష్కారంలో పాలకులు చూపే నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తేవడమే కాదు... ప్రభుత్వపరంగా జరుగుతున్న అనేక అవకతవకలను వారు బట్టబయలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఎన్నెన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒక పరీక్ష రాయడం ద్వారా, అందులో ఉత్తీర్ణులై, లెసైన్స్ పొందడంద్వారా ఇదంతా సాధ్యమవుతుందనుకుంటే పొరపాటు. ఆచరణ నుంచి మొదలై ఆ క్రమంలోనే దాన్ని మరింత పదునుదేర్చే సృజనాత్మక కళ పాత్రికేయ వృత్తి. విస్తృతాధ్యయనం, సమస్యలపై లోతైన అవగాహన, నిరంతర పరిశ్రమ జర్నలిస్టులకు వన్నెతెస్తాయి. వైద్య వృత్తిలా, న్యాయవాద వృత్తిలా అది ఒక చట్రంలో ఇమిడేది కాదు. పైగా, ఆ రెండు రంగాల్లోనూ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనవారే ఉన్నా సమస్యలెందుకు తలెత్తుతున్నాయో, ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయో తివారీ చెప్పాలి. పాత్రికేయ వృత్తి కేవలం సమాచారాన్ని చేరవేయడమే కాదు... ఒక అంశంపై అభిప్రాయాన్ని కూడగట్టేది, ఏర్పరిచేదీ కూడా. దానితో విభేదించేవారు ఆ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేయగలిగితే అది నిలబడదు. ఒకపక్క ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న కుంభకోణాల కథనాల గురించి సహజంగానే పాలకులకు ఆందోళన ఉంటుంది. ఏదోరకంగా మీడియాను నియంత్రించకపోతే ఈ ధోరణికి అడ్డుకట్టవేయడం సాధ్యంకాదన్న భావమూ వారిలో ఉంటుంది. సరిగ్గా అలాంటి ఆలోచనల నుంచే లెసైన్స్ ప్రతిపాదనలు పుట్టుకొస్తాయి. ప్రపంచీకరణ తర్వాత టెక్నాలజీ విస్తృతమై ఇంటర్నెట్ వంటివి రావడం... అనేకానేక వెబ్సైట్ల ద్వారా, బ్లాగుల ద్వారా లక్షలాది మంది వివిధ అంశాలపై అభిప్రాయాలను వ్యక్తీకరించడం పెరిగింది. సామాజిక, ఆర్ధిక అంశాలపై ఇంతక్రితం వెలుగుచూడని కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాజకీయ నాయకుడో, మరో పెత్తందారో, ఉన్నతాధికారో విపరీత పోకడలకు పోతున్నప్పుడు, వారిని బట్టబయలు చేయడం ఇప్పుడు సులభమైంది. ఒక ఎస్ఎంఎస్, ఒక ట్వీట్, ఒక యూట్యూబ్ దృశ్యం వారిని నడిబజారులో నిలబెడుతోంది. నోరు జారిన నేతలు కొన్ని గంటల్లో క్షమాపణ చెప్పుకునే పరిస్థితి ఎదురవుతోంది. న్యాయం కోసం మొర పెట్టుకున్నప్పుడు తనను కానిస్టేబుళ్లు చితకబాదారని ఒక మహిళ ఫిర్యాదు చేస్తే ఇదివరకు అది అరణ్యరోదనగా మిగిలిపోయేది. ఇప్పుడది ఒక సామాన్యుడి ద్వారా సెల్ఫోన్లో రికార్డయి, చానెళ్లలో ప్రసారమై సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకూ వెళ్తోంది. సారాంశంలో... సమాచారాన్ని విస్తృత ప్రజానీకానికి చేర వేయడమనే పని ఇప్పుడు మీడియా సంస్థలకో, పాత్రికేయులకో పరిమితమై లేదు. అది బాధ్యత గుర్తెరిగే ప్రతి ఒక్కరి చేతుల్లోకీ వెళ్లిపోయింది. అత్యాధునిక టెక్నాలజీ వారికి ఆ వెసులుబాటు కల్పించింది. దీన్నంతటినీ నియంత్రిద్దామనీ, నిత్యం సంజాయిషీ ఇచ్చే దుస్థితినుంచి తప్పించుకుందామని పాలకులు ప్రయత్ని స్తున్నారు. అందులో భాగంగానే కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. మీడియా సంస్థలు కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తిస్తే, విలువలను తాకట్టుపెట్టి విశృంఖలతకు గేట్లు తెరిస్తే ఆ సంస్థలే విశ్వసనీయత కోల్పోతాయి. సోదిలోకి లేకుండా పోతాయి. ఆ విషయంలో ప్రభుత్వానికి ఆదుర్దా అనవసరం.