హోడ ఖామోష్
టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితా (100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2022)లో చోటు సంపాదించిన వారిలో అఫ్గానిస్థాన్ అగ్నితేజం హోడ ఖామోష్ ఒకరు. ‘ఖామోష్’ అనేది
పేరు కాదు. లక్షల గొంతుల రణనినాదం...
ఇరాన్‌లో జన్మించింది హోడ ఖామోష్. తాను చిన్న వయసులో ఉన్నప్పుడే కుటుంబంతో పాటు అఫ్గానిస్థాన్‌కు వచ్చింది. ఆరోజుల్లో తనకు నిద్ర పట్టాలంటే అమ్మ తప్పనిసరిగా ఏదో ఒక కథ చెప్పాల్సిందే. అలా ఖామోష్ కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆ ప్రపంచంలో ఎన్నో కథలు చదివింది. ఎన్నో కవిత్వాలు విన్నది. తొలిరోజుల్లో తన కాల్పనిక ప్రపంచంలో వాస్తవాలతో సంబంధం లేని ఊహాకల్పిత సాహిత్యం మాత్రమే ఉండేది. ఆ తరువాత కాలంలో మాత్రం...తన ప్రపంచంలోకి వాస్తవికత నడిచి వచ్చింది. రాజులు, రాణులు, అందమైన కోటలు, అద్భుత దీపాల స్థానంలో... నిజమైన సమాజం దర్శనమిచ్చింది. మనుషులు ఎదుర్కొనే రకరకాల సమస్యలను గురించి లోతుగా తెలుసుకోగలిగింది.
తన మనసులోని వేడివేడి భావాలను కవిత్వంగా రాసేది.
‘సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజం తరఫున పనిచేయడానికి ఇది మాత్రమే చాలదు’ అనుకొని జర్నలిస్ట్ కావాలనుకుంది.
ఖామోష్ ఆలోచనను హర్షించిన వారు తక్కువ. భయపెట్టిన వారు ఎక్కువ. అయితే అవేమీ తన కలను అడ్డుకోలేకపోయాయి. జర్నలిజంలో శిక్షణ పొందిన ఖామోష్ ఆ తరువాత స్థానిక పత్రికలలో పనిచేసింది. స్త్రీల హక్కులు, ఉద్యమాలపై ప్రత్యేకకథనాలు రాసింది. లోకల్ రేడియో ఛానల్స్ ప్రెజెంటర్‌గా తన గొంతు వినిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే పౌరహక్కుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం మరో ఎత్తు. ఉద్యమంలో భాగంగా ఎందరో మహిళలకు అండగా నిలిచింది. దాడులను ఎదుర్కొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మడమ తిప్పలేదు.
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ల పాలన మళ్లీ మొదలైన తరువాత చాలామంది కలాలు అటకెక్కాయి. గొంతులు మాట మార్చుకున్నాయి. కానీ ఖామోష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అవే అక్షరాలు...అదే గొంతు!
తాలిబన్‌ల పాలన మొదలై అప్పటికే అయిదు నెలల దాటింది. ఆ సమయంలో ‘స్త్రీలపై జరుగుతున్న అణచివేత’ అనే అంశంపై నార్వేలో మాట్లాడే అవకాశం లభించింది.
‘ఈ సమయంలో మాట్లాడితే ప్రాణాలకే ముప్పు’ అని చాలామంది హెచ్చరించినా ఆమె భయపడలేదు.
‘నేను తప్పు చేయడం లేదు. తప్పుల గురించి మాట్లాడబోతున్నాను’ అంటూ నార్వేకి వెళ్లింది ఖామోష్. నీళ్లు నమలకుండా నిజాలు మాట్లాడింది. ఆనాటి ఆమె ప్రసంగంలో కొన్ని మాటలు...
‘నా పేరు హోడ ఖామోష్. అఫ్గానిస్థాన్‌లోని వేలాది మంది మహిళలలో నేను ఒకరిని. నేను ఏ రాజకీయపార్టీకి సానుభూతిపరురాలిని కాదు. సభ్యురాలిని కాదు. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నాను. తాలిబన్‌ల పాలనలో ఉన్నాను. భయంతో గుండె వేగంగా కొట్టుకునే చోట, బుల్లెట్ల చప్పుడు నిరంతరాయంగా వినిపించే చోట ఉన్నాను’
‘కాబుల్ తాలిబన్‌ల వశం అయిన తరువాత రాజ్యం పోలీసు రాజ్యం అయింది. స్త్రీలపై వివక్షత పెరిగింది. మీరు ఉండాల్సింది విద్యాలయాల్లో కాదు ఇంట్లో...అంటూ అణచివేత మొదలైంది. ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పాపానికి ముర్తాజ సమది అనే ఫొటోగ్రాఫర్‌ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. కాబుల్‌లో స్త్రీల నిరసన ప్రదర్శనకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తమ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న 70 మంది పౌరులను అరెస్ట్ చేశారు. వారిలో 40 మంది మహిళలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురిచేశారు’
నార్వే సదస్సులో అఫ్గాన్ కన్నీటి చిత్రాన్ని కళ్లకు కట్టిన ఖామోష్ ‘ఇక అంతా అయిపోయింది’ అని నిరాశ పడడం లేదు. ‘స్త్రీలను గౌరవించే రోజులు, స్త్రీల హక్కులు రక్షించబడే రోజులు తప్పకుండా వస్తాయి’ అంటున్న ఖామోష్‌లో ‘ఆశ’ అనే జ్వాల ఉజ్వలంగా వెలుగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment