civil rights activists
-
హోడ ఖామోష్..: అఫ్గాన్ అగ్నితేజం
టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితా (100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2022)లో చోటు సంపాదించిన వారిలో అఫ్గానిస్థాన్ అగ్నితేజం హోడ ఖామోష్ ఒకరు. ‘ఖామోష్’ అనేది పేరు కాదు. లక్షల గొంతుల రణనినాదం... ఇరాన్లో జన్మించింది హోడ ఖామోష్. తాను చిన్న వయసులో ఉన్నప్పుడే కుటుంబంతో పాటు అఫ్గానిస్థాన్‌కు వచ్చింది. ఆరోజుల్లో తనకు నిద్ర పట్టాలంటే అమ్మ తప్పనిసరిగా ఏదో ఒక కథ చెప్పాల్సిందే. అలా ఖామోష్ కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆ ప్రపంచంలో ఎన్నో కథలు చదివింది. ఎన్నో కవిత్వాలు విన్నది. తొలిరోజుల్లో తన కాల్పనిక ప్రపంచంలో వాస్తవాలతో సంబంధం లేని ఊహాకల్పిత సాహిత్యం మాత్రమే ఉండేది. ఆ తరువాత కాలంలో మాత్రం...తన ప్రపంచంలోకి వాస్తవికత నడిచి వచ్చింది. రాజులు, రాణులు, అందమైన కోటలు, అద్భుత దీపాల స్థానంలో... నిజమైన సమాజం దర్శనమిచ్చింది. మనుషులు ఎదుర్కొనే రకరకాల సమస్యలను గురించి లోతుగా తెలుసుకోగలిగింది. తన మనసులోని వేడివేడి భావాలను కవిత్వంగా రాసేది. ‘సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజం తరఫున పనిచేయడానికి ఇది మాత్రమే చాలదు’ అనుకొని జర్నలిస్ట్ కావాలనుకుంది. ఖామోష్ ఆలోచనను హర్షించిన వారు తక్కువ. భయపెట్టిన వారు ఎక్కువ. అయితే అవేమీ తన కలను అడ్డుకోలేకపోయాయి. జర్నలిజంలో శిక్షణ పొందిన ఖామోష్ ఆ తరువాత స్థానిక పత్రికలలో పనిచేసింది. స్త్రీల హక్కులు, ఉద్యమాలపై ప్రత్యేకకథనాలు రాసింది. లోకల్ రేడియో ఛానల్స్ ప్రెజెంటర్‌గా తన గొంతు వినిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే పౌరహక్కుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం మరో ఎత్తు. ఉద్యమంలో భాగంగా ఎందరో మహిళలకు అండగా నిలిచింది. దాడులను ఎదుర్కొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మడమ తిప్పలేదు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన మళ్లీ మొదలైన తరువాత చాలామంది కలాలు అటకెక్కాయి. గొంతులు మాట మార్చుకున్నాయి. కానీ ఖామోష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అవే అక్షరాలు...అదే గొంతు! తాలిబన్ల పాలన మొదలై అప్పటికే అయిదు నెలల దాటింది. ఆ సమయంలో ‘స్త్రీలపై జరుగుతున్న అణచివేత’ అనే అంశంపై నార్వేలో మాట్లాడే అవకాశం లభించింది. ‘ఈ సమయంలో మాట్లాడితే ప్రాణాలకే ముప్పు’ అని చాలామంది హెచ్చరించినా ఆమె భయపడలేదు. ‘నేను తప్పు చేయడం లేదు. తప్పుల గురించి మాట్లాడబోతున్నాను’ అంటూ నార్వేకి వెళ్లింది ఖామోష్. నీళ్లు నమలకుండా నిజాలు మాట్లాడింది. ఆనాటి ఆమె ప్రసంగంలో కొన్ని మాటలు... ‘నా పేరు హోడ ఖామోష్. అఫ్గానిస్థాన్‌లోని వేలాది మంది మహిళలలో నేను ఒకరిని. నేను ఏ రాజకీయపార్టీకి సానుభూతిపరురాలిని కాదు. సభ్యురాలిని కాదు. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నాను. తాలిబన్ల పాలనలో ఉన్నాను. భయంతో గుండె వేగంగా కొట్టుకునే చోట, బుల్లెట్ల చప్పుడు నిరంతరాయంగా వినిపించే చోట ఉన్నాను’ ‘కాబుల్ తాలిబన్ల వశం అయిన తరువాత రాజ్యం పోలీసు రాజ్యం అయింది. స్త్రీలపై వివక్షత పెరిగింది. మీరు ఉండాల్సింది విద్యాలయాల్లో కాదు ఇంట్లో...అంటూ అణచివేత మొదలైంది. ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పాపానికి ముర్తాజ సమది అనే ఫొటోగ్రాఫర్‌ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. కాబుల్‌లో స్త్రీల నిరసన ప్రదర్శనకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తమ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న 70 మంది పౌరులను అరెస్ట్ చేశారు. వారిలో 40 మంది మహిళలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురిచేశారు’ నార్వే సదస్సులో అఫ్గాన్ కన్నీటి చిత్రాన్ని కళ్లకు కట్టిన ఖామోష్ ‘ఇక అంతా అయిపోయింది’ అని నిరాశ పడడం లేదు. ‘స్త్రీలను గౌరవించే రోజులు, స్త్రీల హక్కులు రక్షించబడే రోజులు తప్పకుండా వస్తాయి’ అంటున్న ఖామోష్లో ‘ఆశ’ అనే జ్వాల ఉజ్వలంగా వెలుగుతూనే ఉంది. -
రాజీవ్‌గాంధీ ఘటన తరహాలో మోదీ రాజ్ అంతం!
ముంబై: ఈ ఏడాది జూన్‌తోపాటు మూడ్రోజుల క్రితం అరెస్టు అయిన మావోయిస్టుల సానుభూతిపరులు, పౌర హక్కుల నేతలతో మావోయిస్టులకున్న సంబంధాలపై తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తరహా సంఘటనకు వ్యూహరచన చేయాలి’ అని ఈ ఏడాది జూన్‌లో అరెస్టైన హక్కుల కార్యకర్త రోనా విల్సన్.. ఒక మావోయిస్టు నాయకుడికి లేఖ కూడా రాశారని మహారాష్ట్ర అదనపు డీజీ(శాంతి భద్రతలు) పరంబీర్ సింగ్ తెలిపారు. మూడ్రోజుల క్రితం ఐదుగురు పౌరహక్కుల నేతల అరెస్టులపై విమర్శల నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కోరేగావ్–భీమా అల్లర్ల కేసుకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో.. అజ్ఞాతంలో ఉన్న మావోలకు, ఇతర మావోలకు మధ్య నడిచిన వేలాది లేఖల్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. అన్నీ నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశాం: మావో నేత కామ్రేడ్ ప్రకాశ్‌కు రోనా విల్సన్ రాసిన లేఖలో.. ‘ఇక్కడ తాజా పరిస్థితిపై నువ్వు రాసిన చివరి ఉత్తరం మేం అందుకున్నాం. అరుణ్ (ఫెరారీ), వెర్నన్(గొంజాల్వేస్), ఇతరులు అర్బన్ ఫ్రంట్ పోరాటంపై అంతే ఆందోళనతో ఉన్నారు’ అని రాసినట్లు సింగ్ చెప్పారు. రైఫిల్స్, గ్రనేడ్ లాంచర్స్, నాలుగు లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి కోసం రూ.8 కోట్ల అవసరముందని లేఖలో విల్సన్ కోరారని ఆయన పేర్కొన్నారు. ‘కామ్రేడ్ కిషన్, కొందరు ఇతర కామ్రేడ్స్ ‘మోదీ రాజ్’ అంతానికి నిర్మాణాత్మక ప్రణాళికను ప్రతిపాదించారు. మరో రాజీవ్ గాంధీ (హత్య) సంఘటన తరహాలో మేం ఆలోచన చేస్తున్నాం’ అని పేర్కొంటూ ప్రకాశ్‌ను తన నిర్ణయం చెప్పమని విల్సన్ లేఖలో కోరారని పరంబీర్ సింగ్ తెలిపారు. ‘అరెస్టు అయిన వారికి, మావోయిస్టులకు మధ్య స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే పోలీసులు ముందడుగు వేశారు. మా వద్ద ఉన్న ఆధారాలు మావోయిస్టులతో వారికున్న సంబంధాల్ని స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహా ఆధారాలతో 2014లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను సైతం అరెస్టు చేశాం. అందరిని ఆకర్షించేలా ఏదో ఒక భారీ చర్యకు ప్రణాళిక రచిస్తున్నట్లు అరెస్టైన కార్యకర్తల మధ్య నడిచిన లేఖల ద్వారా స్పష్టమైంది. విధ్వంస చర్యలకు మావోలు ప్రణాళిక చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చాం. కొరియర్ ద్వారా పాస్‌వర్డ్‌తో కూడిన సందేశాలతో కేంద్ర కమిటీ మావోలు ఈ హక్కుల కార్యకర్తలతో సంప్రదింపులు జరిపేవారు’ అని డీజీ తెలిపారు. ఆగస్టు 28న పుణే పోలీసులు దేశ వ్యాప్తంగా ప్రముఖ పౌరహక్కుల నేతల ఇళ్లలో దాడులు నిర్వహించి.. హైదరాబాద్‌లో వరవరరావును, ముంబైలో గొంజాల్వేస్, ఫెరీరా, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్‌ను, ఢిల్లీలో నవలఖాను అరెస్టు చేయడం తెల్సిందే. గతేడాది డిసెంబర్ 31న ఎల్గార్ పరిషద్ నిర్వహించిన సదస్సు సందర్భంగా కోరెగావ్–భీమా వద్ద చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. అయితే అరెస్టైన ఐదుగురిని సెప్టెంబర్ 6 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్‌లో పుణే పోలీసులు ముంబైలో సుధీర్ ధావలే, ఢిల్లీలో పౌరహక్కుల కార్యకర్త రోనా విల్సన్, నాగ్‌పూర్‌లో న్యాయవాది గాడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్‌లను అరెస్టు చేశారు. -
సొంతిళ్లకు హక్కుల కార్యకర్తలు
ముంబై: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హక్కుల కార్యకర్తల్లో ముగ్గురిని సొంతిళ్లకు పంపారు. విచారణ జరిగే సెప్టెంబర్ 6 వరకు వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. గురువారం పుణే నుంచి వరవరరావును హైదరాబాద్‌కు విమానంలో, వెర్నన్ గొంజాల్వేస్, అరుణ్ ఫెరీరాను ముంబైకి తరలించారు. ఉదయం ఇంటికి చేరుకున్న గొంజాల్వేస్కు ఆయన భార్య స్వాగతం పలికారు. పుణే సమీపంలో జరిగిన ఘర్షణల్లో అసలు కారకులను కాపాడేందుకే తప్పుడు పత్రాలతో తనను కేసులో ఇరికించారని గొంజాల్వేస్ ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ నాయకురాలు, లాయర్ సుధా భరద్వాజ్‌ను ఫరీదాబాద్‌లో, పౌరహక్కుల కార్యకర్త నవలాఖాను ఢిల్లీలో వారివారి ఇళ్లలోనే నిర్బంధించారు. గృహ నిర్బంధంలోకి తీసుకున్న కార్యకర్తల ఇళ్ల వద్ద మహారాష్ట్ర పోలీసులతో పాటు స్థానిక పోలీసులను మోహరిస్తున్నట్లు పుణే అసిస్టెంట్ కమిషనర్ చెప్పారు. ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో నిందితులపై వచ్చిన కీలక ఆరోపణలు చేర్చనట్లు తెలిసింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారని, భీమా–కోరెగావ్ ఘర్షణల్లోనూ వారి పాత్ర ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన ఆరోపణలు ఈ నివేదికలో కనిపించలేదు. వారిని కస్టడీకి ఎందుకు అప్పగించాలో పోలీసులు 16 కారణాలు పేర్కొన్నా, పైన పేర్కొన్న రెండు ఆరోపణల్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఖండించిన మేధావులు, కార్యకర్తలు.. పౌరహక్కుల కార్యకర్తల అరెస్ట్‌లు, గృహనిర్బంధంపై దేశవ్యాప్తంగా మేధావులు, పౌరసంఘాల కార్యకర్తలు మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసుల తీరును ఖండించారు. రాజకీయ వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని రచయిత అరుంధతి రాయ్, లాయర్ ప్రశాంత్ భూషణ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, జిగ్నేశ్ మేవానీలు సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తారు. అరెస్టుల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అణగారిన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తున్న వారి గొంతుకను కేంద్రం నొక్కేస్తోందని సామాజిక కార్యకర్త స్థన్ స్వామి ఆరోపించారు. మరోవైపు, గౌతమ్ నవలాఖా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో విచారణ జరపడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. -
రాజకీయ ప్రముఖులే టార్గెట్
పుణే: ఐదుగురు వామపక్ష కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని పుణే పోలీసులు సమర్థించుకున్నారు. రాజకీయ ప్రముఖులను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారికి మావోయిస్టులతోపాటు కశ్మీర్ వేర్పాటువాదులతోనూ సంబంధాలున్నట్లు వెల్లడించారు. ఎల్గార్ పరిషత్‌కు మావోయిస్టులే నిధులు సమకూరుస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇచ్చిన డబ్బులతోనే డిసెంబర్ 31న ఎల్గార్ పరిషత్ సదస్సును నిర్వహించినట్లు తమ విచారణలో తేలిందని పుణే పోలీసు జాయింట్ కమిషనర్ శివాజీ రావ్ బోడ్ఖే వెల్లడించారు. అరెస్టయిన వారు రాజకీయ ప్రముఖులను అంతమొందించే కార్యాచరణపైనా మాట్లాడుకున్నారని సేకరించిన ఆధారాల ద్వారా తేలిందన్నారు. ‘ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వీరికి బలమైన అసహనం ఉంది. అందుకే ప్రభుత్వ సంస్థలు, అధికారులు, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారు’ అని పుణే పోలీస్ డిప్యూటీ కమిషనర్ శిరీశ్ సర్దేశ్పాండే తెలిపారు. దాడులకు వ్యూహరచన చేసిన వారు, వీటిని అమలు పరిచే వారికి సంబంధించి బలమైన ఆధారాలున్నాయన్నారు. ఇందుకోసం పలు చట్టవ్యతిరేక సంస్థలతోనూ చేతులు కలిపేందుకు సిద్దమైనట్లు తమ విచారణలో స్పష్టమైందని శిరీశ్ వెల్లడించారు. నిధుల సమీకరణ, యువత, విద్యార్థులను రెచ్చగొట్టడం, ఆయుధాలను సమకూర్చుకోవడం, సీపీఐ (మావోయిస్టు) సీనియర్ కామ్రేడ్లకు శిక్షణ ఇవ్వడం తదితర అంశాలపై ఆధారాలున్నాయన్నారు. భద్రతా బలగాలు, అమాయక ప్రజలను చంపిన పలు ఇతర సంస్థలతోనూ చేతులు కలిపేందుకు సిద్దమయ్యారన్నారు. -
భావ ప్రకటనాస్వేచ్ఛ పరిరక్షణలో విఫలం
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్లో భావ ప్రకటనాస్వేచ్ఛ పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తి వైఫల్యం చెందారని ప్రముఖ పాత్రికేయులు, డీఎన్ఏ పత్రిక న్యూఢిల్లీ సంపాదకులు ఇఫ్తెఖార్ గిలానీ అన్నారు. ఈ పరిస్థితులపై ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల ఉద్యమకారులు స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కశ్మీర్లో మీడియా పరిస్థితి భయంకరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో సీనియర్ పాత్రికేయులు షుజాత్ బుఖారీని ఉగ్రవాదులు హత్య చేసినానంతరం కశ్మీర్లో నెలకొన్న మీడియా పరిస్థితులపై శనివారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మెఫీ) ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. ఆర్మీ, తీవ్రవాదులు, ప్రభు త్వ అనుకూల ముఠాలు, పోలీసులు మీడియాను శత్రువుగా పరిగణిస్తున్నాయని తెలిపారు. షుజాత్ బుఖారీ హత్యపై భారత ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హత్య అనంతరం మీడియాపై బెదిరింపులు తీవ్రస్థాయికి చేరాయన్నారు. పాత్రికేయులు ధైర్యంగా, నిర్భయంగా వార్తలు రాస్తూ తమ కర్తవ్యాల్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా లేని పత్రికలకు భారత ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వటం లేదని, ఈ ప్రస్తుత పరిణామాలకు జాతీయ మీడియా కూడా బాధ్యత వహించాలన్నారు. జాతీయ మీడియా నెగటివ్ వార్తలు ప్రచారం చేస్తోందని తెలిపారు. కశ్మీర్ అందాలు, భక్తి భావాల గురించి చెప్పడం మరచి హింస గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కేంద్రం తమ విధానం మార్చుకొని ప్రేమపూర్వకంగా నడవాలన్నారు. కశ్మీర్లో జరుగు తున్న మీడియాపై దాడుల విషయం ప్రభుత్వానికి, గవర్నర్‌కు చెప్పిన ప్రయోజనం లేదన్నారు. వార్తలు రాసే పరిస్థితులు కశ్మీర్లో లేవన్నారు. ఇక నార్త్ కశ్మీర్లో వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి అసలే లేదన్నారు. కశ్మీర్లో 13 మంది జర్నలిస్టులు చనిపోతే విచారణలో పురోగతి లేదన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జర్నలిస్టులు చేపట్టే కార్యక్రమాలకు అన్ని జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు అండగా నిలబడాలని తెలిపారు. జర్నలిస్టులపై అక్కడ జరిగే దాడుల గురించి మానవ హక్కుల సంఘాలు కానీ ఎన్నికల సంఘం కానీ దృష్టి సారించటంలేదన్నారు. ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హా మాట్లాడుతూ కశ్మీర్లో జరిగే పాత్రికేయుల హత్యలపై జాతీయ మీడియా దృష్టి సారించాలని, కశ్మీర్ పరిణామాలను వాస్తవిక దృక్పథంతో చూడటం లేదని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వ్యతిరేక ప్రచారం చేయడం దారుణమన్నారు. సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్టులు కలసి పోరాడినప్పుడే ఇలాంటి ఘటనలను నివారించడం సాధ్యపడుతుందన్నారు. టీయూడబ్ల్యూజే సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల గొంతు నొక్కడమం టే, ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని అన్నారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం కశ్మీర్‌ను సందర్శించి నివేదికను తయారు చేస్తే దానిని కేంద్రానికి అందజేస్తామన్నారు. -
పాలమూరుపై పౌర ఉద్యమం
జిల్లా అభివృద్ధికి పౌరసమాజం ఏకం కావాలి వెనుకబాటుతనాన్ని తరిమేందుకు సర్కారు దృష్టిపెట్టాలి గత ప్రభుత్వాలు, నేతల వివక్ష వల్లే జిల్లాకు దుస్థితి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, అభివృద్ధికి ప్రణాళికలు రచించాలి.. పాలమూరు అధ్యయన వేదిక సదస్సు పిలుపు పాల్గొన్న పౌర హక్కుల నేతలు, పత్రికా సంపాదకులు, ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వెనుకబాటు, పాలకుల వివక్షాపూరిత వైఖరి కారణంగా వలసలకు మారుపేరుగా మారిన పాలమూరు జిల్లాపై రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరముందని మేధావి వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటివరకు పాలకులు ఎవరున్నా జిల్లాలో ఆకలి మరణాలు ఆగలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా కృషిచేసి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబాటుతనంపై, తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ జిల్లా భవిష్యత్తుపై పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడి మాసబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం ప్రత్యేక సదస్సు జరిగింది. పాలమూరు దుస్థితిని వివరిస్తూ జిల్లా అభివృద్ధికి సర్కారు పాటుపడాల్సిన ఆవశ్యకతను పౌర హక్కుల నేతలు, పలు రంగాల ప్రముఖులు నొక్కిచెప్పారు. రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు పాలకుల వైఖరి వల్లే 60 ఏళ్లుగా జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పాలమూరును కేంద్రం ఇప్పటికీ వెనుకబడిన జిల్లాగానే గుర్తిస్తోందని, ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుపై ఉందని అన్నారు. జిల్లాలో 30 ఏళ్ల క్రితం మొదలైన పలు సాగునీటి ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదని, మరికొన్ని పురిట్లోనే నిలిచిపోయాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది నెలలవుతున్నా ప్రభుత్వ విధానాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీల అధిపతులు, బడా గుత్తేదారులు, ఆకాశ హర్మ్యాల నిర్మాణం, సినీరంగం తదితర అంశాలపైనే పాలకులు చర్చలు సాగిస్తున్నారని, వ్యవసాయం, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణ వంటి అంశాలపై ఏమాత్రం చర్చ జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కూలీలు, నిర్వాసితులు, ఆత్మహత్యలు, అసహజ మరణాలపై ఎవరూ మాట్లాడడం లేదని మరికొందరు వక్తలు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పాలన సాగించడం వల్లే పాలమూరు పేదరికంలో మగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వివక్షాపూరిత ధోరణికి, ఉద్వేగపూరిత ప్రకటనలతో వాస్తవాలను మరుగునపెట్టే విధానాలకు పాలకులు స్వస్తి చెప్పాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి దశాబ్దాలుగా జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కృష్ణా జలాలను దోచుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని సూచించారు. వేదిక అధ్యక్షుడు, హక్కుల నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్, సెమినార్ కన్వీనర్ ఎం.రాఘవాచారి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, వార్త ఎడిటర్ టంకశాల అశోక్, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్రావు, అధ్యయన వేదిక నాయకుడు ఎం.మురళీధర్ గుప్తా తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు. పౌర సమాజం సంఘటితం కావాలి - ప్రొఫెసర్ హరగోపాల్, పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి కోసం జరుగుతున్న పోరాటంలో ఇప్పటివరకు పౌరసమాజం పోషించిన పాత్ర వెలకట్టలేనిది. పౌరసమాజం మరింత సంఘటితమై జిల్లా వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా జిల్లా అభివృద్ధి చెందేందుకు వేదికపరంగా జరుగుతున్న కృషికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. సర్కారు రికార్డుల ప్రకారం జిల్లాలో 5 లక్షల ఎకరాలకుపైగా ఉన్న వ్యవసాయ భూముల్లో సగం కూడా సేద్యం కావడం లేదు. జిల్లాలోని దాదాపు 5600 చెరువులను ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా పునరుద్ధరించి రిజర్వాయర్లకు అనుసంధానించాలి. ప్రకటనలు కాదు, కార్యాచరణ కావాలి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తుపై జరుగుతున్న ఈ పోరాటం రాజకీయాలకు అతీతం. పాలకుల స్వలాభం, గత ముఖ్యమంత్రుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొంది. జిల్లాలో దశాబ్దాలుగా నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. 1976లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం జిల్లాకు 62 టీఎంసీల నీళ్లు రావాలి. అది అమలు కాలేదు. జూరాల-పాకాల ప్రాజెక్టు వల్ల పాలమూరుకు ఎలాంటి లాభం లేదు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పులనూ పాలకులు గాలికి వదిలేశారు. సుంకేషుల ద్వారా కొత్తగా ఒక లిఫ్ట్ వేసి పాలమూరుకు నీటిని తెస్తే 50 వేల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంటుంది. పాలమూరు ఎత్తిపోతలను వెంటనే ప్రారంభించాలి. - ఎం.రాఘవాచారి, సెమినార్ కన్వీనర్ అన్యాయాన్ని సరిదిద్దాలి పాలమూరు వెనకబాటుతనం పాలకుల నిర్వాకం వల్లే జరిగింది. జిల్లా నుంచి ఎన్నికైన నాయకులు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ కనబర చలేదు. దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తేవడం ఒక ఉద్యమంలాంటిది. పౌర పోరాటాల ద్వారానే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జిల్లా అభివృద్ధికి మళ్లీ పౌర పోరాటాలు సాగించాల్సిందేనా? పాలకులు వెంటనే స్పందించి పాలమూరు మేధావులతో సంప్రదింపులు జరిపి జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రచించాలి. - చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త ముఖ్యమంత్రి చొరవ చూపాలి పార్లమెంట్లో పాలమూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు జిల్లా అభివృద్ధికి చొరవ చూపాలి. ఆయన పాలమూరు ఎంపీగా ఉండగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లా ఆయన హయాంలోనే అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. - ఎం.మురళీధర్ గుప్తా, అధ్యయన వేదిక నాయకుడు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెట్టాలి కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయినంత మాత్రాన జిల్లా అభివృద్ధి చెందుతుందనడంలో వాస్తవం లేదు. ఆచరణ సాధ్యమైన ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఒత్తిడి తేవాలి. సోలార్ విద్యుత్‌పైనా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలి. పరిశ్రమల స్థాపన, ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరగాలి. - పొత్తూరి వెంకటేశ్వర్రావు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పాలమూరుపై ప్రత్యేక దృష్టి పాలమూరు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. భౌగోళికంగా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న పాలమూరు.. గత ప్రభుత్వాల వివక్షాపూరిత పాలనకు నిలువెత్తు నిదర్శనం. - కట్టా శేఖర్‌రెడ్డి, నమస్తే తెలంగాణ ఎడిటర్