పాలమూరుపై పౌర ఉద్యమం | civil rights activists for palamuru development | Sakshi
Sakshi News home page

పాలమూరుపై పౌర ఉద్యమం

Published Mon, Feb 2 2015 12:56 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

పాలమూరుపై పౌర ఉద్యమం - Sakshi

పాలమూరుపై పౌర ఉద్యమం

జిల్లా అభివృద్ధికి పౌరసమాజం ఏకం కావాలి
వెనుకబాటుతనాన్ని తరిమేందుకు సర్కారు దృష్టిపెట్టాలి
గత ప్రభుత్వాలు, నేతల వివక్ష వల్లే జిల్లాకు దుస్థితి
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, అభివృద్ధికి ప్రణాళికలు రచించాలి..  పాలమూరు అధ్యయన వేదిక సదస్సు పిలుపు
పాల్గొన్న పౌర హక్కుల నేతలు, పత్రికా సంపాదకులు, ప్రముఖులు


సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వెనుకబాటు, పాలకుల వివక్షాపూరిత వైఖరి కారణంగా వలసలకు మారుపేరుగా మారిన పాలమూరు జిల్లాపై రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరముందని మేధావి వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటివరకు పాలకులు ఎవరున్నా జిల్లాలో ఆకలి మరణాలు ఆగలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా కృషిచేసి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబాటుతనంపై, తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ జిల్లా భవిష్యత్తుపై పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడి మాసబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం ప్రత్యేక సదస్సు జరిగింది. పాలమూరు దుస్థితిని వివరిస్తూ జిల్లా అభివృద్ధికి సర్కారు పాటుపడాల్సిన ఆవశ్యకతను పౌర హక్కుల నేతలు, పలు రంగాల ప్రముఖులు నొక్కిచెప్పారు. రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు పాలకుల వైఖరి వల్లే 60 ఏళ్లుగా జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

పాలమూరును కేంద్రం ఇప్పటికీ వెనుకబడిన జిల్లాగానే గుర్తిస్తోందని, ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుపై ఉందని అన్నారు. జిల్లాలో 30 ఏళ్ల క్రితం మొదలైన పలు సాగునీటి ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదని, మరికొన్ని పురిట్లోనే నిలిచిపోయాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది నెలలవుతున్నా ప్రభుత్వ విధానాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీల అధిపతులు, బడా గుత్తేదారులు, ఆకాశ హర్మ్యాల నిర్మాణం, సినీరంగం తదితర అంశాలపైనే పాలకులు చర్చలు సాగిస్తున్నారని, వ్యవసాయం, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణ వంటి అంశాలపై ఏమాత్రం చర్చ జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కూలీలు, నిర్వాసితులు, ఆత్మహత్యలు, అసహజ మరణాలపై ఎవరూ మాట్లాడడం లేదని మరికొందరు వక్తలు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పాలన సాగించడం వల్లే పాలమూరు పేదరికంలో మగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

వివక్షాపూరిత ధోరణికి, ఉద్వేగపూరిత ప్రకటనలతో వాస్తవాలను మరుగునపెట్టే విధానాలకు పాలకులు స్వస్తి చెప్పాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి దశాబ్దాలుగా జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

కృష్ణా జలాలను దోచుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని సూచించారు. వేదిక అధ్యక్షుడు, హక్కుల నేత ప్రొఫెసర్ జి.హరగోపాల్, సెమినార్ కన్వీనర్ ఎం.రాఘవాచారి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, నమస్తే తెలంగాణ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, వార్త ఎడిటర్ టంకశాల అశోక్, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, అధ్యయన వేదిక నాయకుడు ఎం.మురళీధర్ గుప్తా తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు.

పౌర సమాజం సంఘటితం కావాలి    
- ప్రొఫెసర్ హరగోపాల్, పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు
మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి కోసం జరుగుతున్న పోరాటంలో ఇప్పటివరకు పౌరసమాజం పోషించిన పాత్ర వెలకట్టలేనిది. పౌరసమాజం మరింత సంఘటితమై జిల్లా వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా జిల్లా అభివృద్ధి చెందేందుకు వేదికపరంగా జరుగుతున్న కృషికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. సర్కారు రికార్డుల ప్రకారం జిల్లాలో 5 లక్షల ఎకరాలకుపైగా ఉన్న వ్యవసాయ భూముల్లో సగం కూడా సేద్యం కావడం లేదు. జిల్లాలోని దాదాపు 5600 చెరువులను ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా పునరుద్ధరించి రిజర్వాయర్లకు అనుసంధానించాలి.

ప్రకటనలు కాదు, కార్యాచరణ కావాలి    
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తుపై జరుగుతున్న ఈ పోరాటం రాజకీయాలకు అతీతం. పాలకుల స్వలాభం, గత ముఖ్యమంత్రుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొంది. జిల్లాలో దశాబ్దాలుగా నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. 1976లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం జిల్లాకు 62 టీఎంసీల నీళ్లు రావాలి. అది అమలు కాలేదు. జూరాల-పాకాల ప్రాజెక్టు వల్ల పాలమూరుకు ఎలాంటి లాభం లేదు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పులనూ పాలకులు గాలికి వదిలేశారు. సుంకేషుల ద్వారా కొత్తగా ఒక లిఫ్ట్ వేసి పాలమూరుకు నీటిని తెస్తే 50 వేల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంటుంది. పాలమూరు ఎత్తిపోతలను వెంటనే ప్రారంభించాలి.
- ఎం.రాఘవాచారి, సెమినార్ కన్వీనర్

అన్యాయాన్ని సరిదిద్దాలి    
పాలమూరు వెనకబాటుతనం పాలకుల నిర్వాకం వల్లే జరిగింది. జిల్లా నుంచి ఎన్నికైన నాయకులు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ కనబర చలేదు. దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తేవడం ఒక ఉద్యమంలాంటిది. పౌర పోరాటాల ద్వారానే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జిల్లా అభివృద్ధికి మళ్లీ పౌర పోరాటాలు సాగించాల్సిందేనా? పాలకులు వెంటనే స్పందించి పాలమూరు మేధావులతో సంప్రదింపులు జరిపి జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రచించాలి.
-  చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త

ముఖ్యమంత్రి చొరవ చూపాలి     
పార్లమెంట్‌లో పాలమూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు జిల్లా అభివృద్ధికి చొరవ చూపాలి. ఆయన పాలమూరు ఎంపీగా ఉండగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లా ఆయన హయాంలోనే అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.
-  ఎం.మురళీధర్ గుప్తా, అధ్యయన వేదిక నాయకుడు

ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెట్టాలి     
కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయినంత మాత్రాన జిల్లా అభివృద్ధి చెందుతుందనడంలో వాస్తవం లేదు. ఆచరణ సాధ్యమైన ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఒత్తిడి తేవాలి. సోలార్ విద్యుత్‌పైనా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలి. పరిశ్రమల స్థాపన, ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరగాలి.
- పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్

పాలమూరుపై ప్రత్యేక దృష్టి      
పాలమూరు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. భౌగోళికంగా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న పాలమూరు.. గత ప్రభుత్వాల వివక్షాపూరిత పాలనకు నిలువెత్తు నిదర్శనం.
  - కట్టా శేఖర్‌రెడ్డి, నమస్తే తెలంగాణ ఎడిటర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement