పుణే: ఐదుగురు వామపక్ష కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని పుణే పోలీసులు సమర్థించుకున్నారు. రాజకీయ ప్రముఖులను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారికి మావోయిస్టులతోపాటు కశ్మీర్ వేర్పాటువాదులతోనూ సంబంధాలున్నట్లు వెల్లడించారు. ఎల్గార్ పరిషత్‌కు మావోయిస్టులే నిధులు సమకూరుస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇచ్చిన డబ్బులతోనే డిసెంబర్ 31న ఎల్గార్ పరిషత్ సదస్సును నిర్వహించినట్లు తమ విచారణలో తేలిందని పుణే పోలీసు జాయింట్ కమిషనర్ శివాజీ రావ్ బోడ్ఖే వెల్లడించారు. అరెస్టయిన వారు రాజకీయ ప్రముఖులను అంతమొందించే కార్యాచరణపైనా మాట్లాడుకున్నారని సేకరించిన ఆధారాల ద్వారా తేలిందన్నారు.
‘ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వీరికి బలమైన అసహనం ఉంది. అందుకే ప్రభుత్వ సంస్థలు, అధికారులు, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారు’ అని పుణే పోలీస్ డిప్యూటీ కమిషనర్ శిరీశ్ సర్‌దేశ్‌పాండే తెలిపారు. దాడులకు వ్యూహరచన చేసిన వారు, వీటిని అమలు పరిచే వారికి సంబంధించి బలమైన ఆధారాలున్నాయన్నారు. ఇందుకోసం పలు చట్టవ్యతిరేక సంస్థలతోనూ చేతులు కలిపేందుకు సిద్దమైనట్లు తమ విచారణలో స్పష్టమైందని శిరీశ్ వెల్లడించారు. నిధుల సమీకరణ, యువత, విద్యార్థులను రెచ్చగొట్టడం, ఆయుధాలను సమకూర్చుకోవడం, సీపీఐ (మావోయిస్టు) సీనియర్ కామ్రేడ్లకు శిక్షణ ఇవ్వడం తదితర అంశాలపై ఆధారాలున్నాయన్నారు. భద్రతా బలగాలు, అమాయక ప్రజలను చంపిన పలు ఇతర సంస్థలతోనూ చేతులు కలిపేందుకు సిద్దమయ్యారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment