రాజీవ్‌గాంధీ ఘటన తరహాలో మోదీ రాజ్‌ అంతం! | We have evidence establishing links between arrested activists | Sakshi
Sakshi News home page

పక్కా ఆధారాలున్నాయి

Published Sat, Sep 1 2018 3:12 AM | Last Updated on Sat, Sep 1 2018 9:47 AM

We have evidence establishing links between arrested activists - Sakshi

ముంబైలో మీడియాతో మాట్లాడుతున్న మహారాష్ట్ర డీజీపీ పరమ్‌వీర్‌ సింగ్‌

ముంబై: ఈ ఏడాది జూన్‌తోపాటు మూడ్రోజుల క్రితం అరెస్టు అయిన మావోయిస్టుల సానుభూతిపరులు, పౌర హక్కుల నేతలతో మావోయిస్టులకున్న సంబంధాలపై తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ తరహా సంఘటనకు వ్యూహరచన చేయాలి’ అని ఈ ఏడాది జూన్‌లో అరెస్టైన హక్కుల కార్యకర్త రోనా విల్సన్‌.. ఒక మావోయిస్టు నాయకుడికి లేఖ కూడా రాశారని మహారాష్ట్ర అదనపు డీజీ(శాంతి భద్రతలు) పరంబీర్‌ సింగ్‌ తెలిపారు. మూడ్రోజుల క్రితం ఐదుగురు పౌరహక్కుల నేతల అరెస్టులపై విమర్శల నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కోరేగావ్‌–భీమా అల్లర్ల కేసుకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో.. అజ్ఞాతంలో ఉన్న మావోలకు, ఇతర మావోలకు మధ్య నడిచిన వేలాది లేఖల్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.

అన్నీ నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశాం: మావో నేత కామ్రేడ్‌ ప్రకాశ్‌కు రోనా విల్సన్‌ రాసిన లేఖలో.. ‘ఇక్కడ తాజా పరిస్థితిపై నువ్వు రాసిన చివరి ఉత్తరం మేం అందుకున్నాం. అరుణ్‌ (ఫెరారీ), వెర్నన్‌(గొంజాల్వేస్‌), ఇతరులు అర్బన్‌ ఫ్రంట్‌ పోరాటంపై అంతే ఆందోళనతో ఉన్నారు’ అని రాసినట్లు సింగ్‌ చెప్పారు. రైఫిల్స్, గ్రనేడ్‌ లాంచర్స్, నాలుగు లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి కోసం రూ.8 కోట్ల అవసరముందని లేఖలో విల్సన్‌ కోరారని ఆయన పేర్కొన్నారు. ‘కామ్రేడ్‌ కిషన్, కొందరు ఇతర కామ్రేడ్స్‌ ‘మోదీ రాజ్‌’ అంతానికి నిర్మాణాత్మక ప్రణాళికను ప్రతిపాదించారు.

మరో రాజీవ్‌ గాంధీ (హత్య) సంఘటన తరహాలో మేం ఆలోచన చేస్తున్నాం’ అని పేర్కొంటూ ప్రకాశ్‌ను తన నిర్ణయం చెప్పమని విల్సన్‌ లేఖలో కోరారని పరంబీర్‌ సింగ్‌ తెలిపారు. ‘అరెస్టు అయిన వారికి, మావోయిస్టులకు మధ్య స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే పోలీసులు ముందడుగు వేశారు. మా వద్ద ఉన్న ఆధారాలు మావోయిస్టులతో వారికున్న సంబంధాల్ని స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహా ఆధారాలతో 2014లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను సైతం  అరెస్టు చేశాం. అందరిని ఆకర్షించేలా ఏదో ఒక  భారీ చర్యకు ప్రణాళిక రచిస్తున్నట్లు అరెస్టైన కార్యకర్తల మధ్య నడిచిన లేఖల ద్వారా స్పష్టమైంది.

విధ్వంస చర్యలకు మావోలు ప్రణాళిక చేస్తున్నట్లు  నిర్ధారణకు వచ్చాం. కొరియర్‌ ద్వారా పాస్‌వర్డ్‌తో కూడిన సందేశాలతో కేంద్ర కమిటీ మావోలు ఈ హక్కుల కార్యకర్తలతో సంప్రదింపులు జరిపేవారు’ అని డీజీ తెలిపారు. ఆగస్టు 28న పుణే పోలీసులు దేశ వ్యాప్తంగా ప్రముఖ పౌరహక్కుల నేతల ఇళ్లలో దాడులు నిర్వహించి.. హైదరాబాద్‌లో వరవరరావును, ముంబైలో గొంజాల్వేస్, ఫెరీరా, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్‌ను, ఢిల్లీలో నవలఖాను అరెస్టు చేయడం తెల్సిందే. గతేడాది డిసెంబర్‌ 31న ఎల్గార్‌ పరిషద్‌ నిర్వహించిన సదస్సు సందర్భంగా కోరెగావ్‌–భీమా వద్ద చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. అయితే అరెస్టైన ఐదుగురిని సెప్టెంబర్‌ 6 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్‌లో పుణే పోలీసులు ముంబైలో సుధీర్‌ ధావలే, ఢిల్లీలో పౌరహక్కుల కార్యకర్త రోనా విల్సన్, నాగ్‌పూర్‌లో న్యాయవాది గాడ్లింగ్, ప్రొఫెసర్‌ షోమా సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్‌ రౌత్‌లను అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement