House arrests
-
వీఆర్ఏలపై కూటమి ప్రభుత్వ నిర్బంధం..ధర్నాను అడ్డుకునేందుకు యత్నం
సాక్షి,విజయవాడ:వీఆర్ఏల ధర్నాను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడికక్కడ వీఆర్ఏల నాయకులను హౌజ్ అరెస్టులు చేయిస్తోంది. ఎలాగైనా వారిని సోమవారం(నవంబర్18) మంగళగిరి సీసీఎల్ఏ వద్ద జరిగే ధర్నాకు హాజరుకాకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది.న్యాయమైన డిమాండ్లతో వీఆర్ఏలు శాంతియుతంగా ధర్నా తలపెట్టారు. వీఆర్ఏలు ధర్నాకు వెళితే కేసులు పెడతామని అధికారులు ఇప్పటికే బెదిరిస్తున్నారు.తమపై నిర్బంధం పెడితే ఉద్యమం మరింత ఉదృతం అవుతుందని వీఆర్ఏల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.4నెలలుగా తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం,రెవెన్యూ మంత్రికి చెప్పిన పట్టించుకోలేదని వీఆర్ఏ సంఘం నేతలు వాపోతున్నారు. -
బీఆర్ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి వర్సెస్ గాంధీ వివాదంలో బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్భంధాలు...హౌస్ అరెస్ట్‌లపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా బీఆర్ఎస్ నేతలకు లేదా ? అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు. బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు? దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా? సిగ్గు...సిగ్గు. సీఎం కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’అని కేటీఆర్ హెచ్చరించారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌజ్ అరెస్టులు -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా గురువారం.. విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
కాంగ్రెస్ జలదీక్ష భగ్నం..
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డిలను అరెస్ట్ చేశారు. భద్రాచలం దుమ్ముగూడెం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను పోలీసులు అడ్డుకోవడంతో వైరాలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దుమ్ముగూడెంలో ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగా వీహెచ్‌ను, దేవాదుల ప్రాజెక్టుకు వెళ్తుండగా ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ తలపెట్టిన జలదీక్షను ఎక్కడికక్కడ పోలీసులు భగ్నం చేస్తున్నారు. సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. -
నాగం జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జలదీక్షకు వెళ్తున్న నాగంను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆయనను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని కోరితే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కాగా మంగళవారం జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. -
ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది?: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ నేతలను గృహ నిర్భంధం చేయడం అప్రజస్వామికమని ఇంతకమటే దారుణం మరొకటి ఉండదన్నారు. మంగళవారం జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కూడా పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (జగదీష్ రెడ్డి మంత్రి హోదాను మరిచిపోయారు) కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ పార్టీ నాయకుల ఇళ్ల ముందు నుంచి పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తాము చేసుకునే కార్యక్రమాలను అడ్డుకోకూడదని ఉత్తమ్ అన్నారు. మాట్లాడితే అరెస్టులు చేయడం పాశవిక పాలనకు పరాకాష్ట అని, ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. ఆవిర్భావ దినోత్సవం రోజు హక్కులు కాలరాస్తే ఎలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఒక నియంత, అసమర్థత పాలన సాగుతోందని విమర్శించారు. (కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ ‘లొల్లి’!) నియంత పోకడలకు నిదర్శనం: కోమటిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్‌లను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) దగ్గర దీక్షా కార్యక్రమం రద్దు చేసుకొని సందర్శనకు మాత్రమే వెళదామని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు ఇళ్ల ముందు నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేసీఆర్ నియంత పోకడలకు ఈ అరెస్ట్‌లు నిదర్శనమన్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీ జలదీక్షకు సిద్దమైన విషయం తెలిసిందే. (జూన్ 2న కాంగ్రెస్ శ్రేణుల దీక్ష) -
రాజీవ్‌గాంధీ ఘటన తరహాలో మోదీ రాజ్ అంతం!
ముంబై: ఈ ఏడాది జూన్‌తోపాటు మూడ్రోజుల క్రితం అరెస్టు అయిన మావోయిస్టుల సానుభూతిపరులు, పౌర హక్కుల నేతలతో మావోయిస్టులకున్న సంబంధాలపై తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తరహా సంఘటనకు వ్యూహరచన చేయాలి’ అని ఈ ఏడాది జూన్‌లో అరెస్టైన హక్కుల కార్యకర్త రోనా విల్సన్.. ఒక మావోయిస్టు నాయకుడికి లేఖ కూడా రాశారని మహారాష్ట్ర అదనపు డీజీ(శాంతి భద్రతలు) పరంబీర్ సింగ్ తెలిపారు. మూడ్రోజుల క్రితం ఐదుగురు పౌరహక్కుల నేతల అరెస్టులపై విమర్శల నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కోరేగావ్–భీమా అల్లర్ల కేసుకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో.. అజ్ఞాతంలో ఉన్న మావోలకు, ఇతర మావోలకు మధ్య నడిచిన వేలాది లేఖల్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. అన్నీ నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశాం: మావో నేత కామ్రేడ్ ప్రకాశ్‌కు రోనా విల్సన్ రాసిన లేఖలో.. ‘ఇక్కడ తాజా పరిస్థితిపై నువ్వు రాసిన చివరి ఉత్తరం మేం అందుకున్నాం. అరుణ్ (ఫెరారీ), వెర్నన్(గొంజాల్వేస్), ఇతరులు అర్బన్ ఫ్రంట్ పోరాటంపై అంతే ఆందోళనతో ఉన్నారు’ అని రాసినట్లు సింగ్ చెప్పారు. రైఫిల్స్, గ్రనేడ్ లాంచర్స్, నాలుగు లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి కోసం రూ.8 కోట్ల అవసరముందని లేఖలో విల్సన్ కోరారని ఆయన పేర్కొన్నారు. ‘కామ్రేడ్ కిషన్, కొందరు ఇతర కామ్రేడ్స్ ‘మోదీ రాజ్’ అంతానికి నిర్మాణాత్మక ప్రణాళికను ప్రతిపాదించారు. మరో రాజీవ్ గాంధీ (హత్య) సంఘటన తరహాలో మేం ఆలోచన చేస్తున్నాం’ అని పేర్కొంటూ ప్రకాశ్‌ను తన నిర్ణయం చెప్పమని విల్సన్ లేఖలో కోరారని పరంబీర్ సింగ్ తెలిపారు. ‘అరెస్టు అయిన వారికి, మావోయిస్టులకు మధ్య స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే పోలీసులు ముందడుగు వేశారు. మా వద్ద ఉన్న ఆధారాలు మావోయిస్టులతో వారికున్న సంబంధాల్ని స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహా ఆధారాలతో 2014లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను సైతం అరెస్టు చేశాం. అందరిని ఆకర్షించేలా ఏదో ఒక భారీ చర్యకు ప్రణాళిక రచిస్తున్నట్లు అరెస్టైన కార్యకర్తల మధ్య నడిచిన లేఖల ద్వారా స్పష్టమైంది. విధ్వంస చర్యలకు మావోలు ప్రణాళిక చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చాం. కొరియర్ ద్వారా పాస్‌వర్డ్‌తో కూడిన సందేశాలతో కేంద్ర కమిటీ మావోలు ఈ హక్కుల కార్యకర్తలతో సంప్రదింపులు జరిపేవారు’ అని డీజీ తెలిపారు. ఆగస్టు 28న పుణే పోలీసులు దేశ వ్యాప్తంగా ప్రముఖ పౌరహక్కుల నేతల ఇళ్లలో దాడులు నిర్వహించి.. హైదరాబాద్‌లో వరవరరావును, ముంబైలో గొంజాల్వేస్, ఫెరీరా, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్‌ను, ఢిల్లీలో నవలఖాను అరెస్టు చేయడం తెల్సిందే. గతేడాది డిసెంబర్ 31న ఎల్గార్ పరిషద్ నిర్వహించిన సదస్సు సందర్భంగా కోరెగావ్–భీమా వద్ద చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. అయితే అరెస్టైన ఐదుగురిని సెప్టెంబర్ 6 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్‌లో పుణే పోలీసులు ముంబైలో సుధీర్ ధావలే, ఢిల్లీలో పౌరహక్కుల కార్యకర్త రోనా విల్సన్, నాగ్‌పూర్‌లో న్యాయవాది గాడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్‌లను అరెస్టు చేశారు. -
సొంతిళ్లకు హక్కుల కార్యకర్తలు
ముంబై: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హక్కుల కార్యకర్తల్లో ముగ్గురిని సొంతిళ్లకు పంపారు. విచారణ జరిగే సెప్టెంబర్ 6 వరకు వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. గురువారం పుణే నుంచి వరవరరావును హైదరాబాద్‌కు విమానంలో, వెర్నన్ గొంజాల్వేస్, అరుణ్ ఫెరీరాను ముంబైకి తరలించారు. ఉదయం ఇంటికి చేరుకున్న గొంజాల్వేస్కు ఆయన భార్య స్వాగతం పలికారు. పుణే సమీపంలో జరిగిన ఘర్షణల్లో అసలు కారకులను కాపాడేందుకే తప్పుడు పత్రాలతో తనను కేసులో ఇరికించారని గొంజాల్వేస్ ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ నాయకురాలు, లాయర్ సుధా భరద్వాజ్‌ను ఫరీదాబాద్‌లో, పౌరహక్కుల కార్యకర్త నవలాఖాను ఢిల్లీలో వారివారి ఇళ్లలోనే నిర్బంధించారు. గృహ నిర్బంధంలోకి తీసుకున్న కార్యకర్తల ఇళ్ల వద్ద మహారాష్ట్ర పోలీసులతో పాటు స్థానిక పోలీసులను మోహరిస్తున్నట్లు పుణే అసిస్టెంట్ కమిషనర్ చెప్పారు. ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో నిందితులపై వచ్చిన కీలక ఆరోపణలు చేర్చనట్లు తెలిసింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారని, భీమా–కోరెగావ్ ఘర్షణల్లోనూ వారి పాత్ర ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన ఆరోపణలు ఈ నివేదికలో కనిపించలేదు. వారిని కస్టడీకి ఎందుకు అప్పగించాలో పోలీసులు 16 కారణాలు పేర్కొన్నా, పైన పేర్కొన్న రెండు ఆరోపణల్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఖండించిన మేధావులు, కార్యకర్తలు.. పౌరహక్కుల కార్యకర్తల అరెస్ట్‌లు, గృహనిర్బంధంపై దేశవ్యాప్తంగా మేధావులు, పౌరసంఘాల కార్యకర్తలు మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసుల తీరును ఖండించారు. రాజకీయ వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని రచయిత అరుంధతి రాయ్, లాయర్ ప్రశాంత్ భూషణ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, జిగ్నేశ్ మేవానీలు సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తారు. అరెస్టుల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అణగారిన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తున్న వారి గొంతుకను కేంద్రం నొక్కేస్తోందని సామాజిక కార్యకర్త స్థన్ స్వామి ఆరోపించారు. మరోవైపు, గౌతమ్ నవలాఖా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో విచారణ జరపడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. -
రాజుకుంటున్న రగడ
తుళ్లూరు రూరల్ : రాజధాని ప్రాంతంలో ఇసుక రగడ రోజురోజుకూ రాజుకుంటోంది. శనివారం రాజధాని నిర్మాణాల పేరుతో లింగాయపాలెం క్వారీ నుంచి కొందరు యంత్రాల ద్వారా ఇసుకను తరలించే ప్రయత్నాలు చేయడంతో క్వారీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తిరగబడడంతో అంతా తారుమారైంది. దీంతో పోలీసు బలగాల మధ్య తరలింపు కొనసాగించారు. యంత్రాలతో తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని, కేవలం మనుషుల ద్వారానే తవ్వకాలు జరపాలని గ్రీన్ ట్రిబ్యున్ గత నెలలో ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్లు యంత్రాలతో తవ్వకాలు నిలిపివేశారు. కూలీలు ఇసుక క్వారీలో పనులు ప్రారంభించిన రోజు నుంచి ఎవరో ఒకరు తాము జిల్లా అధికారులమంటూ క్వారీలలోకి వచ్చి.. పనులు ఆపాలంటూ అజమాయిషీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్థాయి అధికారి క్వారీలోకి రావడం, కూలీలపై విరుచుకుపడడంతో కూలీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కూలీలను భయపెట్టేందుకు రాజధాని ప్రాంతంలో ప్రజా సంఘాల నాయకులను గృహ నిర్బంధాలు, అరెస్ట్‌లు చేశారు. శనివారం క్వారీలో ఇసుకను ఐనవోలులో నిర్మిస్తున్న విట్ విశ్వవిద్యాలయం నిర్మాణం పేరుతో తరలింపునకు సిద్ధం చేశారు. భారీ యంత్రాలను క్వారీలోకి తీసుకువెళ్లడం గమనించిన గ్రామస్తులు, కూలీలు పెద్ద ఎత్తున క్వారీ వద్దకు చేరుకున్నారు. ఇసుక తరలించేందుకు వీలులేదని అడ్డుకోవడంతో నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులు దగ్గరుండి ఇసుక తరలించారు. -
నిర్బంధం నడుమ ప్రజాబంద్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘ప్రత్యేక హోదా మా హక్కు’ అంటూ జిల్లా ప్రజలు గళమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినపిలుపునకు స్పందించి బంద్ విజయవంతానికి స్వచ్ఛందంగా సహకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకుండా.. ప్యాకేజీలకు పరిమితమైన టీడీపీ సర్కార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించినా వైఎస్సార్ సీపీ, ఇతర విపక్షాలు లెక్క చేయలేదు. ఉదయం నాలుగు గంటలకే బస్ డిపోల ముందు బైఠాయించారు. వచ్చిన నాయకులను వచ్చినట్టే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఇంటివద్ద శనివారం వేకువజామున 4గంటల నుంచే పోలీసు బలగాలను మోహరించారు. పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఆళ్ల నానితోపాటు నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర నేతలు వి.ఉమామహేశ్వరరావు, మంతెన సీతారామ్, బి.బలరామ్లను అరెస్ట్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. వేకువజామున 4 గంటలకే ఏలూరు కొత్త బస్టాండ్ వద్దకు చేరుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్దాని శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు మంచెం మైబాబు, నగర మహిళా అధ్యక్షురాలు వేగి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు తదితరులను అరెస్ట్ చేశారు. అమీతుమీ తేల్చుకునేందుకు అంతా ఒక్కటై.. జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. తాడేపల్లిగూడెంలో ఉదయం 6 గంటలకు ఆర్టీసీ డిపో నుంచి బస్సుల్ని బయటకు వెళ్లకుండా అడ్డుకున్న వైఎస్సార్ సీపీ, వామపక్ష నాయకులు 30 మందిని అరెస్ట్ చేశారు. నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వలవల బాబ్జిలను గహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ కొట్టు సత్యనారాయణ ఇంటినుంచి బయటకు వచ్చి అనుచరులతో హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ప్రదర్శనగా తాలూకా ఆఫీస్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. జెడ్పీ హైస్కూల్ వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వైఎస్సార్ సీపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఇదే సమయంలో వామపక్ష నాయకులు, వందలాదిగా ప్రజలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మొత్తం 175 మందిని అరెస్ట్ చేశారు. పోలవరం నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్న 38 మందిని అరెస్టు చేశారు. జీలుగుమిల్లిలో వైఎస్సార్ సీపీ రా్రçష్ట ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, మండల కన్వీనర్ గూడవల్లి శ్రీనివాసరావుతోపాటు 8మందిని, పొలవరంలో మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి, మరో14 మందిని, కొయ్యలగూడెంలో మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, మరో14 మందిని అరెస్ట్ చేశారు. నరసాపురం పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయమే బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని బస్సులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును హౌస్ అరెస్ట్ చేశారు. భీమవరంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్టీసీ బస్‌లు, ఆటోలు తిరగకుండా అడ్డుకున్నారు. ప్రకాశం చౌకలో ఆందోళన చేస్తున్న శ్రీనివాస్‌తోపాటు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల విజయనర్సింహరాజు, సీపీఎం, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో రాష్ట్ర రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తానేటి వనితతోపాటు పలువుర్ని అరెస్ట్ చేశారు. చాగల్లులో రాస్తారోకో చేస్తున్న పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్యతో పాటు 11 మందిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకున్నారు. పాలకొల్లు, భీమవరం రహదారిపై శృంగవృక్షం, విస్సాకోడేరు గ్రామాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, లోక్‌సత్తాకు చెందిన 77 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. జంగారెడ్డిగూడెంలో వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబును అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకష్ణ అరెస్ట్‌కు నిరసనగా చింతలపూడి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. వైఎస్సార్ సీపీ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు, భీమడోలు మండలాలలో బంద్ చేశారు. నారాయణపురం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకా తిరుమల మండలంలో బస్సులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు అడ్డుకున్నారు. నల్లజర్ల మండలంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేస్, జిల్లా అ«ధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్ తదితరులను అరెస్ట్ చేశారు. పెనుగొండలో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కౌరు శ్రీనివాస్, పెనుగొండ మండల సీపీఎం కార్యదర్శి సూర్నీడి వెంకటేశ్వరరావుతో సహా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆచంట కచేరి సెంటర్లో వైఎస్సార్ సీపీ నేతలు ధర్నా చేశారు. పాలకొల్లులో వైఎస్సార్ సీపీ, వామపక్ష నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. యలమంచిలి, పాలకొల్లు పట్టణం, రూరల్ మండలాల్లో 62 మందిని అరెస్ట్ చేశారు. తణుకు ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్సార్ సీపీ, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తణుకులో 23 మందిని, అత్తిలిలో 10 మందిని, ఇరగవరంలో 12 మందిని అరెస్ట్ చేశారు. దెందులూరు నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. నిడదవోలులో ఆర్టీసీ బస్సులను కదలనీయకుండా వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన 19 మందిని, సీపీఎంకు చెందిన 19 మంది, సీపీఐకి చెందిన 40 మందిని అరెస్ట్ చేశారు. -
అంగన్వాడీ ఉద్యమంపై ఉక్కుపాదం
ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద కొనసాగిన నిర్బంధకాండ చలో అసెంబ్లీ ఆందోళన భగ్నానికి పోలీసుల యత్నం అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై ప్రభుత్వ ప్రతాపం సాక్షి, విజయవాడ బ్యూరో: అంగన్వాడీలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం తన ప్రతాపం చూపించింది. తమ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటం చేసినా పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు ఈ నెల 17న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా భయానక పరిస్థితులు సృష్టించారు. సోమవారం తెల్లవారుజామునుంచే పలు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను హౌస్ అరెస్టులు చేశారు. పలు చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు చేసి ఇంటికి తిరిగివెళుతున్న వారినీ ముందస్తు అరెస్టులు చేశారు. కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లబోమని రాతపూర్వక అంగీకార పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. పలు జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్ల నుంచి హైదరాబాద్‌కు పయనమైన అంగన్వాడీ కార్యకర్తలను, సీఐటీయూ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగితే మహిళలని కూడా చూడకుండా చంద్రబాబు సర్కారు నిర్బంధకాండ కొనసాగించడంపై పలు జిల్లాల్లో ఉద్యమాలు సాగాయి. పోలీసుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం 5.30గంటల నుంచే అంగన్వాడీ కార్యకర్తల అరెస్టులు కొనసాగాయి. విజయనగరం జిల్లాలో 547 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 700 మందికిపైగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను పోలీసులు అరెస్టులు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా వారి నుంచి పోలీసులు నిర్బంధంగా అంగీకార పత్రాలను తీసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోను ముందస్తు అరెస్టులు కొనసాగాయి. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన 20 మంది అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పలుచోట్ల అదుపులోకి తీసుకున్న అంగన్వాడీలను సోమవారం పోలీస్‌స్టేషన్‌కు తరలించి మంగళవారం ఉదయం వదిలేందుకు పోలీసులు సన్నాహాలు చేశారు. వైఎస్సార్ జిల్లాలో శని, ఆదివారాల్లో పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. అనంతపురంలో అదే పరిస్థితి నెలకొంది. చలో అసెంబ్లీ జరిపి తీరుతాం.. ప్రభుత్వ నిర్బంధకాండను కొనసాగించి ఉద్యమాలను ఆపలేదని, అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను సాధించేందుకు చలో అసెంబ్లీని జరిపి తీరుతామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.బేబీరాణి, పి.రోజా అన్నారు. సోమవారం రాత్రి వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ అంగన్వాడీలకు మద్దతుగా సాగుతున్న శాంతియుత ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 55 వేలకు పైగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న లక్షా 3 వేల మంది వర్కర్ల న్యాయమైన డిమాండ్స్‌ను సాధించుకునే వరకు ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచితే ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్బంధకాండను కొనసాగిస్తోందని మండిపడ్డారు. దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే క్రిమినల్ కేసులా?: నారాయణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దిష్టిబొమ్మలు తగలబెడితేనే ప్రజలు, ఉద్యమకారులపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు.. ఏకంగా మిమ్మల్నే తగలబెడితే ఏం చేస్తారని సీపీఐ నేత కె. నారాయణ ఘాటుగా ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడి ఏపీ హక్కులు సాధించే సత్తా సీఎం చంద్రబాబుకు లేదన్నారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిరవధిక దీక్షలు సోమవారం ప్రారంభించారు. దీక్ష చేపట్టిన వారికి సీపీఎం, సీపీఐ జాతీయ నాయకులు బీవీ రాఘవులు, నారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రామిక, కార్మిక వర్గంపై శతృత్వం వహిస్తే, ఆ వర్గాలు సైతం మిమ్మల్ని శతృవులుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఎం నాయకుడు రాఘవులు మాట్లాడుతూ.. సోదర రాష్ట్రమైన తెలంగాణతో సమానంగా అంగన్వాడీల వేతనాలు పెంచాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు నిరంకుశత్వంగా వ్యవహరిస్తే.. ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. మాజీ మంత్రి రామచంద్రయ్య మాట్లాడుతూ.. అంగన్వాడీలు లేకుంటే వారి భర్తలను అరెస్టు చేయడం లాంటి పరిస్థితులు ఆఫ్రికా దేశాల్లో కూడా ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. ప్రసాద్, ఆర్ఎస్పీ నాయకులు జానకీరాములు తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలను పోలీసులు సోమవారం రాత్రి భగ్నం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. పుణ్యవతి, ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, ఏఐటీయూసీ నాయకులు రామారావు, హరికృష్ణలతో పాటు ఎనిమిది మందిని పోలీసులు విచక్షణా రహితంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకులు కొంతమంది సొమ్మసిల్లి పోయారు. ఈ సందర్భంగా సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ ఏపీ అంగన్వాడీల చలో అసెంబ్లీకి సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.