నిర్బంధం నడుమ ప్రజాబంద్‌ | nirbhandam naduma prjabandh | Sakshi
Sakshi News home page

నిర్బంధం నడుమ ప్రజాబంద్‌

Published Sat, Sep 10 2016 11:06 PM | Last Updated on Tue, Aug 21 2018 8:00 PM

నిర్బంధం నడుమ ప్రజాబంద్‌ - Sakshi

నిర్బంధం నడుమ ప్రజాబంద్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘ప్రత్యేక హోదా మా హక్కు’ అంటూ జిల్లా ప్రజలు గళమెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చినపిలుపునకు స్పందించి బంద్‌ విజయవంతానికి స్వచ్ఛందంగా సహకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకుండా.. ప్యాకేజీలకు పరిమితమైన టీడీపీ సర్కార్‌ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించినా వైఎస్సార్‌ సీపీ, ఇతర విపక్షాలు లెక్క చేయలేదు. ఉదయం నాలుగు గంటలకే బస్‌ డిపోల ముందు బైఠాయించారు. వచ్చిన నాయకులను వచ్చినట్టే పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలించారు. ఏలూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఇంటివద్ద శనివారం వేకువజామున 4గంటల నుంచే పోలీసు బలగాలను మోహరించారు. పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌ చేసి తీసుకువెళ్లారు. ఆళ్ల నానితోపాటు నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తదితరులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
 సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర నేతలు వి.ఉమామహేశ్వరరావు, మంతెన సీతారామ్, బి.బలరామ్‌లను అరెస్ట్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో స్థానిక ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.  వేకువజామున 4 గంటలకే ఏలూరు కొత్త బస్టాండ్‌ వద్దకు చేరుకున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్దాని శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు మంచెం మైబాబు, నగర మహిళా అధ్యక్షురాలు వేగి లక్ష్మి, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు తదితరులను అరెస్ట్‌ చేశారు. 
అమీతుమీ తేల్చుకునేందుకు అంతా ఒక్కటై..
జిల్లా వ్యాప్తంగా బంద్‌ విజయవంతమైంది. తాడేపల్లిగూడెంలో ఉదయం 6 గంటలకు ఆర్టీసీ డిపో నుంచి బస్సుల్ని బయటకు వెళ్లకుండా అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ, వామపక్ష నాయకులు 30 మందిని అరెస్ట్‌ చేశారు.  నియోజకవర్గ కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వలవల బాబ్జిలను గహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ కొట్టు సత్యనారాయణ  ఇంటినుంచి బయటకు వచ్చి అనుచరులతో హౌసింగ్‌ బోర్డు కాలనీ నుంచి ప్రదర్శనగా తాలూకా ఆఫీస్‌ సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. జెడ్పీ హైస్కూల్‌ వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వైఎస్సార్‌ సీపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఇదే సమయంలో వామపక్ష నాయకులు, వందలాదిగా ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మొత్తం 175 మందిని అరెస్ట్‌ చేశారు.  పోలవరం నియోజకవర్గంలో బంద్‌ నిర్వహిస్తున్న 38 మందిని అరెస్టు చేశారు. జీలుగుమిల్లిలో వైఎస్సార్‌ సీపీ రా్రçష్ట ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, మండల కన్వీనర్‌ గూడవల్లి శ్రీనివాసరావుతోపాటు 8మందిని, పొలవరంలో మండల కన్వీనర్‌ సుంకర వెంకటరెడ్డి, మరో14 మందిని, కొయ్యలగూడెంలో మండల కన్వీనర్‌ గొడ్డటి నాగేశ్వరరావు, మరో14 మందిని అరెస్ట్‌ చేశారు. నరసాపురం పట్టణంలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయమే బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని బస్సులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. భీమవరంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ నేతృత్వంలో ఆర్టీసీ బస్‌లు, ఆటోలు తిరగకుండా అడ్డుకున్నారు. ప్రకాశం చౌకలో ఆందోళన చేస్తున్న శ్రీనివాస్‌తోపాటు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల విజయనర్సింహరాజు, సీపీఎం, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో రాష్ట్ర రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తానేటి వనితతోపాటు పలువుర్ని అరెస్ట్‌ చేశారు.  చాగల్లులో రాస్తారోకో చేస్తున్న పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్యతో పాటు 11 మందిని అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకున్నారు.
 పాలకొల్లు, భీమవరం రహదారిపై శృంగవృక్షం, విస్సాకోడేరు గ్రామాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గంలో బంద్‌ విజయవంతమైంది. నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, లోక్‌సత్తాకు చెందిన 77 మందిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. జంగారెడ్డిగూడెంలో వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబును అరెస్ట్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకష్ణ అరెస్ట్‌కు నిరసనగా చింతలపూడి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు. వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు, భీమడోలు మండలాలలో బంద్‌ చేశారు. నారాయణపురం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పలువుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ద్వారకా తిరుమల మండలంలో బస్సులను వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు అడ్డుకున్నారు. నల్లజర్ల మండలంలో బంద్‌ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేస్, జిల్లా అ«ధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్‌ తదితరులను అరెస్ట్‌ చేశారు. పెనుగొండలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కౌరు శ్రీనివాస్, పెనుగొండ మండల సీపీఎం కార్యదర్శి సూర్నీడి వెంకటేశ్వరరావుతో సహా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆచంట కచేరి సెంటర్‌లో వైఎస్సార్‌ సీపీ నేతలు ధర్నా చేశారు. పాలకొల్లులో వైఎస్సార్‌ సీపీ, వామపక్ష నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. యలమంచిలి, పాలకొల్లు పట్టణం, రూరల్‌ మండలాల్లో  62 మందిని అరెస్ట్‌ చేశారు. 
తణుకు ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్సార్‌ సీపీ, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తణుకులో 23 మందిని, అత్తిలిలో 10 మందిని, ఇరగవరంలో 12 మందిని అరెస్ట్‌ చేశారు. దెందులూరు నియోజకవర్గంలో బంద్‌ విజయవంతమైంది. నిడదవోలులో ఆర్టీసీ బస్సులను కదలనీయకుండా వైఎస్సార్‌ సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన 19 మందిని, సీపీఎంకు చెందిన 19 మంది, సీపీఐకి చెందిన 40 మందిని అరెస్ట్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement