అంగన్‌వాడీ ఉద్యమంపై ఉక్కుపాదం | TDP govt try to fail their Aganwadi movement at Vijayawada | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ ఉద్యమంపై ఉక్కుపాదం

Published Tue, Mar 17 2015 4:53 AM | Last Updated on Fri, Aug 17 2018 5:18 PM

అంగన్‌వాడీ ఉద్యమంపై ఉక్కుపాదం - Sakshi

అంగన్‌వాడీ ఉద్యమంపై ఉక్కుపాదం

ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు
 రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద కొనసాగిన నిర్బంధకాండ
 చలో అసెంబ్లీ ఆందోళన భగ్నానికి పోలీసుల యత్నం
 అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలపై ప్రభుత్వ ప్రతాపం
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: అంగన్‌వాడీలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం తన ప్రతాపం చూపించింది. తమ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటం చేసినా పట్టించుకోకపోవడంతో అంగన్‌వాడీలు ఈ నెల 17న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా భయానక పరిస్థితులు సృష్టించారు. సోమవారం తెల్లవారుజామునుంచే పలు జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను హౌస్ అరెస్టులు చేశారు. పలు చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలు చేసి ఇంటికి తిరిగివెళుతున్న వారినీ ముందస్తు అరెస్టులు చేశారు. కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లబోమని రాతపూర్వక అంగీకార పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. పలు జిల్లాల్లో రైల్వే స్టేషన్‌లు, బస్‌స్టాండ్‌ల నుంచి హైదరాబాద్‌కు పయనమైన అంగన్‌వాడీ కార్యకర్తలను, సీఐటీయూ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగితే మహిళలని కూడా చూడకుండా చంద్రబాబు సర్కారు నిర్బంధకాండ కొనసాగించడంపై పలు జిల్లాల్లో  ఉద్యమాలు సాగాయి.
 
 పోలీసుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సీఐటీయూ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం 5.30గంటల నుంచే అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్టులు కొనసాగాయి. విజయనగరం జిల్లాలో 547 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 700 మందికిపైగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను పోలీసులు అరెస్టులు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా వారి నుంచి పోలీసులు నిర్బంధంగా అంగీకార పత్రాలను తీసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోను ముందస్తు అరెస్టులు కొనసాగాయి. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన 20 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పలుచోట్ల అదుపులోకి తీసుకున్న అంగన్‌వాడీలను సోమవారం పోలీస్‌స్టేషన్‌కు తరలించి మంగళవారం ఉదయం వదిలేందుకు పోలీసులు సన్నాహాలు చేశారు. వైఎస్సార్ జిల్లాలో శని, ఆదివారాల్లో పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. అనంతపురంలో అదే పరిస్థితి నెలకొంది.
 
 చలో అసెంబ్లీ జరిపి తీరుతాం..
 ప్రభుత్వ నిర్బంధకాండను కొనసాగించి ఉద్యమాలను ఆపలేదని, అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలను సాధించేందుకు చలో అసెంబ్లీని జరిపి తీరుతామని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.బేబీరాణి, పి.రోజా అన్నారు. సోమవారం రాత్రి వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ అంగన్‌వాడీలకు మద్దతుగా సాగుతున్న శాంతియుత ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 55 వేలకు పైగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న లక్షా 3 వేల మంది వర్కర్ల న్యాయమైన డిమాండ్స్‌ను సాధించుకునే వరకు ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు పెంచితే ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్బంధకాండను కొనసాగిస్తోందని మండిపడ్డారు.
 
 దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే క్రిమినల్ కేసులా?: నారాయణ
 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దిష్టిబొమ్మలు తగలబెడితేనే ప్రజలు, ఉద్యమకారులపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు.. ఏకంగా మిమ్మల్నే తగలబెడితే ఏం చేస్తారని సీపీఐ నేత కె. నారాయణ ఘాటుగా ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడి ఏపీ హక్కులు సాధించే సత్తా సీఎం చంద్రబాబుకు లేదన్నారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిరవధిక దీక్షలు సోమవారం ప్రారంభించారు. దీక్ష చేపట్టిన వారికి సీపీఎం, సీపీఐ జాతీయ నాయకులు బీవీ రాఘవులు, నారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రామిక, కార్మిక వర్గంపై శతృత్వం వహిస్తే, ఆ వర్గాలు సైతం మిమ్మల్ని శతృవులుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఎం నాయకుడు రాఘవులు మాట్లాడుతూ.. సోదర రాష్ట్రమైన తెలంగాణతో సమానంగా అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు నిరంకుశత్వంగా వ్యవహరిస్తే.. ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. మాజీ మంత్రి రామచంద్రయ్య మాట్లాడుతూ.. అంగన్‌వాడీలు లేకుంటే వారి భర్తలను అరెస్టు చేయడం లాంటి పరిస్థితులు ఆఫ్రికా దేశాల్లో కూడా ఉండవన్నారు.
 
 ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. ప్రసాద్, ఆర్‌ఎస్‌పీ నాయకులు జానకీరాములు తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలను పోలీసులు సోమవారం రాత్రి భగ్నం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. పుణ్యవతి, ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, ఏఐటీయూసీ నాయకులు రామారావు, హరికృష్ణలతో పాటు ఎనిమిది మందిని పోలీసులు విచక్షణా రహితంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్ నాయకులు కొంతమంది సొమ్మసిల్లి పోయారు. ఈ సందర్భంగా సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ అంగన్‌వాడీ కార్యకర్తల యూనియన్ ఏపీ అంగన్‌వాడీల చలో అసెంబ్లీకి సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement