బొంపల్లి అంగన్ వాడీ కార్యాలయం
దోమ: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఒక్కో కేంద్రంలో టీచర్‌తో పాటు ఆయాలను ప్రభుత్వం నియమించింది. కానీ ఏళ్ల తరబడి కొన్ని సెంటర్లలో టీచర్లు, ఆయాలు లేని కారణంగా లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందడం లేదు. ఇటీవల ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసినప్పటికీ రాజకీయ నేతల ఒత్తిడితో అధికారులు వాటిని భర్తీ చేయలేకపోయారు.
నోటిఫికేషన్ వచ్చినా..
దోమ మండలంలో 42 అంగన్‌వాడీ కేంద్రాలు, 21 మినీ అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో బొంపల్లి అంగన్‌వాడీలో టీచర్ పోస్టుతో పాటు దిర్సంపల్లి, బ్రాహ్మణపల్లిలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వం అంగన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా బొంపల్లి టీచర్ పోస్టుతో పాటు దిర్సంపల్లి, బ్రాహ్మణపల్లి ఆయాల పోస్టును భర్తీ చేయడంలో అధికారులు విఫలం అయ్యారు. బొంపల్లిలో ఏళ్ల తరబడి టీచర్ పోస్టు ఖాళీగా ఉండడంతో బాస్‌పల్లి సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచరే ఇక్కడ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.
రాజకీయ ఒత్తిడే కారణం?
బొంపల్లి అంగన్ వాడీ టీచర్ పోస్టు భర్తీ విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య అంతర్గత వార్ వలనే పోస్టు భర్తీ కావడం లేదని చర్చ జరుగుతోంది. తమకు సంబంధించిన వ్యక్తికే పోస్టు కావాలంటూ ఇద్దరు నేతలు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. దీంతో సంబంధిత అధికారులు ఇద్దరు నేతలకు సంబంధించిన అభ్యర్థులు అర్హులు కాగా.. పోస్టు భర్తీని నిలుపుదల చేయాలంటూ జిల్లా అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయ నాయకుల మనుగడ కొసం అంగన్వాడీ పోస్టు భర్తీ కాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
కొత్త నోటిఫికేషన్ వేస్తాం
బొంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ప్రస్తుతం ఇన్‌చార్జి టీచర్ కొనసాగుతోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో వేసిన నోటిఫికేషన్‌కు ఇద్దరు అభ్యర్థులు సెలక్ట్ కాగా.. నేతల జోక్యంతో అది ఆగిపోయింది. టీచర్ పోస్టు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వేస్తాం.
– ప్రియదర్శిని, సీడీపీఓ, పరిగి
Comments
Please login to add a commentAdd a comment