రాజుకుంటున్న రగడ
తుళ్లూరు రూరల్ : రాజధాని ప్రాంతంలో ఇసుక రగడ రోజురోజుకూ రాజుకుంటోంది. శనివారం రాజధాని నిర్మాణాల పేరుతో లింగాయపాలెం క్వారీ నుంచి కొందరు యంత్రాల ద్వారా ఇసుకను తరలించే ప్రయత్నాలు చేయడంతో క్వారీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తిరగబడడంతో అంతా తారుమారైంది. దీంతో పోలీసు బలగాల మధ్య తరలింపు కొనసాగించారు. యంత్రాలతో తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని, కేవలం మనుషుల ద్వారానే తవ్వకాలు జరపాలని గ్రీన్ ట్రిబ్యున్ గత నెలలో ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్లు యంత్రాలతో తవ్వకాలు నిలిపివేశారు. కూలీలు ఇసుక క్వారీలో పనులు ప్రారంభించిన రోజు నుంచి ఎవరో ఒకరు తాము జిల్లా అధికారులమంటూ క్వారీలలోకి వచ్చి.. పనులు ఆపాలంటూ అజమాయిషీ చేస్తున్నారు.
ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్థాయి అధికారి క్వారీలోకి రావడం, కూలీలపై విరుచుకుపడడంతో కూలీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కూలీలను భయపెట్టేందుకు రాజధాని ప్రాంతంలో ప్రజా సంఘాల నాయకులను గృహ నిర్బంధాలు, అరెస్ట్‌లు చేశారు. శనివారం క్వారీలో ఇసుకను ఐనవోలులో నిర్మిస్తున్న విట్ విశ్వవిద్యాలయం నిర్మాణం పేరుతో తరలింపునకు సిద్ధం చేశారు. భారీ యంత్రాలను క్వారీలోకి తీసుకువెళ్లడం గమనించిన గ్రామస్తులు, కూలీలు పెద్ద ఎత్తున క్వారీ వద్దకు చేరుకున్నారు. ఇసుక తరలించేందుకు వీలులేదని అడ్డుకోవడంతో నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులు దగ్గరుండి ఇసుక తరలించారు.