దర్జాగా దోపిడీ
దర్జాగా దోపిడీ
Published Fri, Mar 3 2017 1:59 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
ఆచంట :కోడేరు ఇసుక ర్యాంపునకు లారీలు క్యూ కట్టాయి. సుదీర్ఘకాలం పాటు మూతపడిన ఇసుక ర్యాంపు గురువారం తెరుచుకోవడంతో ర్యాంపునకు వాహనాల తాకిడి పెరిగింది. సందట్లో సడేమియాగా నిర్వాహకులు వాహనాల నుంచి అధిక మొత్తంలో ఎగుమతి చార్జీల కింద సొమ్ములు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలో ఇసుక ర్యాంపులన్నీ మూత పడడంతో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాత్రమే ఇసుక లభ్యమవుతోంది. ఈ నేపథ్యంలో ర్యాంపు తెరుచుకున్న గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున లారీలు తరలివచ్చాయి. యంత్రాలను వినియోగించి యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇసుక డిమాండ్ నేపథ్యంలో సిండికేట్లు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు అడిగినంత చెల్లించి ఇసుకను తీసుకువెళ్లవలసి వస్తోంది.
ఆవేదనలో వినియోగదారులు
ప్రభుత్వం ఇసుక ఉచిత విధానం ప్రవేశపెట్టడంతో నియోజకవర్గంలోని కోడేరు ఇసుక ర్యాంపు కొద్ది రోజుల పాటు నడిచింది. అధిక ధరలు వసూలు చేస్తుండడంతో అప్పట్లో పోలీసుల సమక్షంలో అమ్మకాలు సాగించారు. గత అగస్టులో గోదావరికి వరదలు రావడంతో ర్యాంపు మూతపడింది. అప్పట్లో గ్రామస్తులు సిండికేట్‌గా ఏర్పడి ర్యాంపు ఏర్పాటు వేసుకున్నారు. ర్యాంపు ఎక్కువ రోజులు నడవకపోవడంతో గ్రామస్తులు నిరుత్సాహపడ్డారు. ఆశించన మేరకు పెట్టుబడికి తగ్గ సొమ్ములు రాలేదు. దీంతో మరోసారి వారంతా ఏకమై ర్యాంపును పునరుద్ధరించారు. అయితే ర్యాంపు ఏర్పాటులో గ్రామస్తులతో పాటు అధికారపార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులతో పాటు, నాయకులు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. వీరిలో అవినీత పరులంతా ఏకమై ఎగుమతి రేట్లు అమాంతంగా పెంచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇసుక ఎగుమతికి రూ.350 దాటి వసూలు చేయరాదు. అయితే ప్రస్తుతం యూనిట్ ధర రూ.600 వరకూ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
అక్రమ నిల్వలు
ర్యాంపు నుంచి తరలిపోతున్న ఇసుకను కొందరు సిండికేట్లు, కాంట్రాక్టర్లు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించి పెద్ద ఎత్తున గుట్టులు గుట్టలుగా పెడుతున్నట్టు సమాచారం. ర్యాంపు ఎన్నిరోజుల పాటు నడుస్తుందోనన్న ఆందోళనతో ర్యాంపునకు వాహనాలు క్యూ కడుతున్నాయి. అధిక వసూళ్లపై అటు పోలీసులు గాని, ఇటు సంబంధిత అధికారులు గాని కన్నెత్తి చూడడం లేదు. ఇందుకుగాను పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ప్రచారం జరగుతోంది. ఇప్పటికే పెరిగిన ఇంటి సామగ్రితో పాటు ఇసుక ధర కూడా చుక్కలనంటడంతో వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే పభుత్వం ప్రకటించిన ప్రకారం ఇసుక ఎగుమతులు చేయాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement