KODERU
-
కోడేరు: భారీగా ఓట్ల గల్లంతు
సాక్షి, కోడేరు: మండలంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం 30,743 ఓటర్లకు గాను దాదాపు వెయ్యికి పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే అధికారులు స్పందించి నూతన ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోడేరులో 300, రాజాపూర్‌లో 225, ఎత్తంలో 330, సింగాయిపల్లిలో 105, రాజాçపూర్లో 225, మరికొన్ని గ్రామాల్లో ఓట్లు గల్లంతు కావడంతో తహసీల్దార్, సిబ్బందిపై మండిపడ్డారు. తాము ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ పోచయ్య తెలిపారు. -
ఇసుక ర్యాంప్‌లో సబ్ కలెక్టర్ తనిఖీలు
కోడేరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు ఇసుక రాంప్లో నర్సాపురం సబ్ కలెక్టర్ సుమిత్ గాంధీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు ఆయన గుర్తించారు. కూలీలు బదులు యంత్రాలతో ఇసుక లోడింగ్ చేస్తుండటంతో ఆయన 28 లారీలు, 6 పొక్లెయినర్లను సీజ్ చేశారు. మంత్రి పితాని సత్యనారాయణ సొంత నియోజక వర్గంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు సంచలనం రేపుతున్నాయి. -
దర్జాగా దోపిడీ
ఆచంట :కోడేరు ఇసుక ర్యాంపునకు లారీలు క్యూ కట్టాయి. సుదీర్ఘకాలం పాటు మూతపడిన ఇసుక ర్యాంపు గురువారం తెరుచుకోవడంతో ర్యాంపునకు వాహనాల తాకిడి పెరిగింది. సందట్లో సడేమియాగా నిర్వాహకులు వాహనాల నుంచి అధిక మొత్తంలో ఎగుమతి చార్జీల కింద సొమ్ములు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలో ఇసుక ర్యాంపులన్నీ మూత పడడంతో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాత్రమే ఇసుక లభ్యమవుతోంది. ఈ నేపథ్యంలో ర్యాంపు తెరుచుకున్న గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున లారీలు తరలివచ్చాయి. యంత్రాలను వినియోగించి యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇసుక డిమాండ్ నేపథ్యంలో సిండికేట్లు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు అడిగినంత చెల్లించి ఇసుకను తీసుకువెళ్లవలసి వస్తోంది. ఆవేదనలో వినియోగదారులు ప్రభుత్వం ఇసుక ఉచిత విధానం ప్రవేశపెట్టడంతో నియోజకవర్గంలోని కోడేరు ఇసుక ర్యాంపు కొద్ది రోజుల పాటు నడిచింది. అధిక ధరలు వసూలు చేస్తుండడంతో అప్పట్లో పోలీసుల సమక్షంలో అమ్మకాలు సాగించారు. గత అగస్టులో గోదావరికి వరదలు రావడంతో ర్యాంపు మూతపడింది. అప్పట్లో గ్రామస్తులు సిండికేట్‌గా ఏర్పడి ర్యాంపు ఏర్పాటు వేసుకున్నారు. ర్యాంపు ఎక్కువ రోజులు నడవకపోవడంతో గ్రామస్తులు నిరుత్సాహపడ్డారు. ఆశించన మేరకు పెట్టుబడికి తగ్గ సొమ్ములు రాలేదు. దీంతో మరోసారి వారంతా ఏకమై ర్యాంపును పునరుద్ధరించారు. అయితే ర్యాంపు ఏర్పాటులో గ్రామస్తులతో పాటు అధికారపార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులతో పాటు, నాయకులు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. వీరిలో అవినీత పరులంతా ఏకమై ఎగుమతి రేట్లు అమాంతంగా పెంచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇసుక ఎగుమతికి రూ.350 దాటి వసూలు చేయరాదు. అయితే ప్రస్తుతం యూనిట్ ధర రూ.600 వరకూ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అక్రమ నిల్వలు ర్యాంపు నుంచి తరలిపోతున్న ఇసుకను కొందరు సిండికేట్లు, కాంట్రాక్టర్లు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించి పెద్ద ఎత్తున గుట్టులు గుట్టలుగా పెడుతున్నట్టు సమాచారం. ర్యాంపు ఎన్నిరోజుల పాటు నడుస్తుందోనన్న ఆందోళనతో ర్యాంపునకు వాహనాలు క్యూ కడుతున్నాయి. అధిక వసూళ్లపై అటు పోలీసులు గాని, ఇటు సంబంధిత అధికారులు గాని కన్నెత్తి చూడడం లేదు. ఇందుకుగాను పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ప్రచారం జరగుతోంది. ఇప్పటికే పెరిగిన ఇంటి సామగ్రితో పాటు ఇసుక ధర కూడా చుక్కలనంటడంతో వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే పభుత్వం ప్రకటించిన ప్రకారం ఇసుక ఎగుమతులు చేయాలని కోరుతున్నారు. -
లాకులకు నీళ్లొదిలేశారు
ఆచంట : ఆచంట మండలం కోడేరు వద్ద బ్యాంక్ కెనాల్‌పై వందేళ్ల క్రితం నిర్మించిన లాకులివి. శిథిలావస్థకు చేరడంతో వీటి దిగువన గల 6 వేల ఎకరాల ఆయకట్టులో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా పంటల్ని నష్టపోతున్న రైతుల పోరాటంతో ఎట్టకేలకు లాకులను ఆధునికీకరించే పనులు మొదలుపెట్టినా పూర్తిచేసే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా బ్యాంక్ కెనాల్‌పై లాకుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 లక్షలు విడుదల చేసింది. పనులు ప్రారంభించినప్పటికీ.. రెండు నెలలుగా ముందుకు సాగడం లేదు. కొత్త లాకులను అమర్చేందుకు అవసరమైన సామగ్రిని తీసుకొచ్చినా.. ఆరుబయటే వదిలేశారు. సార్వా పనులు పూర్తయిన వెంటనే కొత్త లాకులు అమర్చి నీటి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ప్రకటించారు. సార్వా పనులు పూర్తయినా.. దాళ్వా పనులు మొదలవుతున్నా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ముందుకు కదలడం లేదు. నిర్మాణం పూర్తయితే కోడేరు ఎగువ ప్రాంతంలోని 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయి. దాళ్వా సీజన్ మొదలైనా పనులు పూర్తికాకపోవడం, సాగునీటి సమస్య తలెత్తనుండటంతో రైతులు కలవరపడుతున్నారు. బ్రిటిష్ కాలం నాటి లాకులు బ్యాంకు కెనాల్‌పై పెనుగొండ మండలం సిద్ధాంతం, ఆచంట మండలం కోడేరు గ్రామాల్లో బ్రిటిష్ హయాంలో లాకులు నిర్మించారు. వీటికి కాలదోషం పట్టడంతో శిథిలావస్థకు చేరాయి. లాకు తలుపులకు పగుళ్లు ఏర్పడి చిల్లులు పడటంతో నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. సార్వా, దాళ్వా సీజన్లలో సుమారు 60 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు వృథాగా పోతోంది. దీంతోఅధికారులు కోడేరు లాకుల వద్ద నీటి మట్టాలను నిలబెట్టలేకపోతున్నారు. ఫలితంగా కోడేరు ఎగువ ప్రాంతంలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది సార్వా సీజన్లోనూ సాగునీటి కొరతతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం విదితమే. దాళ్వాలో పరిస్థితి చెప్పనలవి కాదు. లాకుల నిర్మాణం పూర్తయితే జగ్గరాజు చానల్‌పై ఉన్న పెనుమంచిలి, ఆచంట వేమవరం, కొడమంచిలి చానల్‌పై ఉన్న కరుగోరుమిల్లి, కందరవల్లి గ్రామాలతోపాటు, పోడూరు మండలం వద్దిపర్రు, యలమంచిలి మండలం కాంభొట్లపాలెం గ్రామాల పరిధిలోని సుమారు ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు తొలగుతాయి. ఉన్నతాధికారులు స్పందించి లాకుల నిర్మాణంపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఎన్నాళ్లకు పూర్తి చేస్తారో దెబ్బతిన్న బ్యాంక్ కెనాల్ లాకు తలుపుల్ని మార్చాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. ఇన్నాళ్లకు ప్రభుత్వం స్పందించింది. కొత్త తలుపులు తెచ్చి రెండు నెలలు దాటింది. నేటివరకూ బిగించలేదు. పాత లాకులు దెబ్బతినడంతో సాగునీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. ఎగువ ప్రాంతాల రైతులకు నీటి ఇబ్బందులు తప్పడం లేదు. దాళ్వాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ ఏడాది సార్వాలోనే సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారులు వెంటనే స్పందించి.. లాకు పనుల్ని పూర్తి చేసి ఇబ్బందుల్ని తొలగించాలి. – కుంపట్ల సత్యనారాయణ, రైతు, కోడేరు త్వరలో పూర్తి చేస్తాం లాకుల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే కొత్త లాకులు కొనుగోలు చేసి పని జరిగే ప్రాంతానికి చేర్చాం. బ్యాంక్ కెనాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పనులు పూర్తికాలేదు. త్వరలో అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించి.. పనులు పూర్తి చేస్తాం. – సీహెచ్ వెంకటనారాయణ, డీఈ, నీటి పారుదల శాఖ -
ఎకరాకు రూ.10 వేలు చెల్లించాలి
కోడేరు (ఆచంట) : సాగు నీరు అందించకపోతే ఆయా రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. మంగళవారం ఆచంట మండలం కోడేరు బ్యాంకు కెనాల్‌తో పాటు ఎ.వేమవరంలో పంట చేలను ఆయన పరిశీలించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ప్రధానంగా బ్యాంకు కెనాల్, జగ్గరాజు, దేవ కాలువల శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక నారుమడులు ఎండిపోతున్నాయని, బ్యాంకు కెనాల్ ప్రక్షాళన చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి దాపురించిందని వెంటనే బ్యాంకు కెనాల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు రైతులకు ఎటువంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యాంకు కెనాల్‌పై ప్రొక్లైనర్లతో మట్టితీత, చెత్తా, తూడు తొలగింపు పనులు నిరంతరం కొనసాగుతూ ఉండాలని ఆదేశించారు. బ్యాంక్ కెనాల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే రైతులు ఒక పంటను వదులుకోవాల్సి ఉంటుందని, ఇందుకు రైతులు సిద్ధపడితే పూర్తిగా ప్రక్షాళన చేస్తానని రైతులకు, రైతు సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. సిద్ధాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తమ్మినీడి ప్రసాదు, కోడేరు సర్పంచ్ పెచ్చెట్టి సత్యనారాయణ, సాగునీటి సంఘ నాయకులు సలాది రంగారావు, బొక్కా వెంకట నారాయణ, వైట్ల విద్యాధరరావు పాల్గొన్నారు. -
పాముకాటుకు చిన్నారి బలి
కోడేరు (మహబూబ్‌నగర్) : ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పాము కాటు వేసిన ఘటనలో ఒక చిన్నారి మృతిచెందగా.. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం గన్యానాయక్ తండాలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నిహారిక(4), చరణ్(7)లు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వారిని పాము కాటు వేసింది. దీంతో నిహారిక అక్కడికక్కడే మృతిచెందగా.. చరణ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
మతిస్థిమితం తప్పి భార్యను నరికేశాడు..
కోడేరు (మహబూబ్‌నగర్) : మతిస్థిమితం కోల్పోయి ఓ వ్యక్తి భార్యను నరికి చంపాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఎత్తం గ్రామానికి చెందిన బాలస్వామి (50) కొన్నాళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. శుక్రవారం ఉదయం భార్య చంద్రమ్మతోపాటు సింగవట్నం సంగమేశ్వర గ్రామీణ బ్యాంకుకు వెళ్లి రూ.40వేలు పంట రుణం తీసుకొచ్చాడు. రాత్రి పడుకునే సమయంలో కూడా బాగానే ఉన్నాడు. అయితే అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య చంద్రమ్మ(46)ను గొడ్డలితో తలనరికి చంపాడు. తలలో మెదడు తీసుకుని శనివారం ఉదయమే ఇంటి ముందు కూర్చుని తాను పొట్టేలును కోసి కుప్పలు వేశానని చుట్టుపక్కల వారికి చూపించాడు. దీంతో గ్రామస్తులు ఇంట్లోకి వెళ్లి చూడగా దారుణం వెలుగుచూసింది. దీనిపై గ్రామస్తులు కోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలస్వామిని అదుపులోకి తీసుకున్నారు.