ఎకరాకు రూ.10 వేలు చెల్లించాలి
Published Wed, Aug 24 2016 12:38 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కోడేరు (ఆచంట) :
సాగు నీరు అందించకపోతే ఆయా రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. మంగళవారం ఆచంట మండలం కోడేరు బ్యాంకు కెనాల్‌తో పాటు ఎ.వేమవరంలో పంట చేలను ఆయన పరిశీలించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ప్రధానంగా బ్యాంకు కెనాల్, జగ్గరాజు, దేవ కాలువల శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక నారుమడులు ఎండిపోతున్నాయని, బ్యాంకు కెనాల్ ప్రక్షాళన చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి దాపురించిందని వెంటనే బ్యాంకు కెనాల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులు రైతులకు ఎటువంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యాంకు కెనాల్‌పై ప్రొక్లైనర్లతో మట్టితీత, చెత్తా, తూడు తొలగింపు పనులు నిరంతరం కొనసాగుతూ ఉండాలని ఆదేశించారు. బ్యాంక్ కెనాల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే రైతులు ఒక పంటను వదులుకోవాల్సి ఉంటుందని, ఇందుకు రైతులు సిద్ధపడితే పూర్తిగా ప్రక్షాళన చేస్తానని రైతులకు, రైతు సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. సిద్ధాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తమ్మినీడి ప్రసాదు, కోడేరు సర్పంచ్ పెచ్చెట్టి సత్యనారాయణ, సాగునీటి సంఘ నాయకులు సలాది రంగారావు, బొక్కా వెంకట నారాయణ, వైట్ల విద్యాధరరావు పాల్గొన్నారు.
Advertisement