లాకులకు నీళ్లొదిలేశారు
లాకులకు నీళ్లొదిలేశారు
Published Tue, Dec 27 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
ఆచంట : ఆచంట మండలం కోడేరు వద్ద బ్యాంక్ కెనాల్‌పై వందేళ్ల క్రితం నిర్మించిన లాకులివి. శిథిలావస్థకు చేరడంతో వీటి దిగువన గల 6 వేల ఎకరాల ఆయకట్టులో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా పంటల్ని నష్టపోతున్న రైతుల పోరాటంతో ఎట్టకేలకు లాకులను ఆధునికీకరించే పనులు మొదలుపెట్టినా పూర్తిచేసే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా బ్యాంక్ కెనాల్‌పై లాకుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 లక్షలు విడుదల చేసింది. పనులు ప్రారంభించినప్పటికీ.. రెండు నెలలుగా ముందుకు సాగడం లేదు. కొత్త లాకులను అమర్చేందుకు అవసరమైన సామగ్రిని తీసుకొచ్చినా.. ఆరుబయటే వదిలేశారు. సార్వా పనులు పూర్తయిన వెంటనే కొత్త లాకులు అమర్చి నీటి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ప్రకటించారు. సార్వా పనులు పూర్తయినా.. దాళ్వా పనులు మొదలవుతున్నా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ముందుకు కదలడం లేదు. నిర్మాణం పూర్తయితే కోడేరు ఎగువ ప్రాంతంలోని 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయి. దాళ్వా సీజన్ మొదలైనా పనులు పూర్తికాకపోవడం, సాగునీటి సమస్య తలెత్తనుండటంతో రైతులు కలవరపడుతున్నారు.
బ్రిటిష్ కాలం నాటి లాకులు
బ్యాంకు కెనాల్‌పై పెనుగొండ మండలం సిద్ధాంతం, ఆచంట మండలం కోడేరు గ్రామాల్లో బ్రిటిష్ హయాంలో లాకులు నిర్మించారు. వీటికి కాలదోషం పట్టడంతో శిథిలావస్థకు చేరాయి. లాకు తలుపులకు పగుళ్లు ఏర్పడి చిల్లులు పడటంతో నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. సార్వా, దాళ్వా సీజన్లలో సుమారు 60 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు వృథాగా పోతోంది. దీంతోఅధికారులు కోడేరు లాకుల వద్ద నీటి మట్టాలను నిలబెట్టలేకపోతున్నారు. ఫలితంగా కోడేరు ఎగువ ప్రాంతంలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది సార్వా సీజన్‌లోనూ సాగునీటి కొరతతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం విదితమే. దాళ్వాలో పరిస్థితి చెప్పనలవి కాదు. లాకుల నిర్మాణం పూర్తయితే జగ్గరాజు చానల్‌పై ఉన్న పెనుమంచిలి, ఆచంట వేమవరం, కొడమంచిలి చానల్‌పై ఉన్న కరుగోరుమిల్లి, కందరవల్లి గ్రామాలతోపాటు, పోడూరు మండలం వద్దిపర్రు, యలమంచిలి మండలం కాంభొట్లపాలెం గ్రామాల పరిధిలోని సుమారు ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు తొలగుతాయి. ఉన్నతాధికారులు స్పందించి లాకుల నిర్మాణంపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
ఎన్నాళ్లకు పూర్తి చేస్తారో
దెబ్బతిన్న బ్యాంక్ కెనాల్ లాకు తలుపుల్ని మార్చాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. ఇన్నాళ్లకు ప్రభుత్వం స్పందించింది. కొత్త తలుపులు తెచ్చి రెండు నెలలు దాటింది. నేటివరకూ బిగించలేదు. పాత లాకులు దెబ్బతినడంతో సాగునీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. ఎగువ ప్రాంతాల రైతులకు నీటి ఇబ్బందులు తప్పడం లేదు. దాళ్వాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ ఏడాది సార్వాలోనే సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారులు వెంటనే స్పందించి.. లాకు పనుల్ని పూర్తి చేసి ఇబ్బందుల్ని తొలగించాలి. – కుంపట్ల సత్యనారాయణ, రైతు, కోడేరు
త్వరలో పూర్తి చేస్తాం
లాకుల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే కొత్త లాకులు కొనుగోలు చేసి పని జరిగే ప్రాంతానికి చేర్చాం. బ్యాంక్ కెనాల్‌లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పనులు పూర్తికాలేదు. త్వరలో అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించి.. పనులు పూర్తి చేస్తాం. – సీహెచ్ వెంకటనారాయణ, డీఈ, నీటి పారుదల శాఖ
Advertisement
Advertisement