Locks
-
అద్దె భారం.. గురుకులాలకు తాళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు తాళాలు పడ్డా యి. ప్రభుత్వం చెల్లించాల్సిన భవనాల అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో యజమానులు వాటి గేట్లకు తాళాలు వేశారు. బకాయిలు చెల్లిస్తేనే గేట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల యజమానులు తాళాలు వేయడమే కాకుండా, ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించలేదంటూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కొన్ని గంటల పాటు హాస్టళ్ల బయటే నిరీక్షించాల్సి వచ్చింది. హాస్టళ్లకు నెలవారీగా చెల్లించాల్సిన అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గత కొంతకాలంగా భవనాల యాజమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా దసరా సెలవుల నేపథ్యంలో మూతపడిన గురుకులాలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బడులు తెరిచేందుకు వచ్చిన గురుకుల పాఠశాలల సిబ్బంది, గేట్లకు వేరే తాళాలు వేసి ఉండడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే సిబ్బందిని, విద్యార్థులను లోనికి అనుమతిస్తామని యజమానులు స్పష్టం చేశారు. కళాశాలల భవనాలకు సంబంధించి కూడా బకాయిలున్నట్లు సమాచారం. పలు గురుకులాలకు తాళాలు యాదాద్రి జిల్లా మోత్కూరులోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలకు యజమాని తాళం వేశారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు 6 గంటల పాటు పాఠశాల ఎదుట నిరీక్షించాల్సి వచ్చి0ది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన తర్వాత అందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక్కడి మైనార్టీ గురుకుల పాఠశాల భవనానికి యజమాని బకాయిలు చెల్లించలేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.హుజూర్‌నగర్‌లో గంటపాటు బయటే వేచిచూసిన తర్వాత ప్రిన్సిపాల్ రెహనాబేగం విజ్ఞప్తి మేరకు యజమాని తాళం తీశారు. తుంగతుర్తిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే ఉండాల్సి వచ్చి09ది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులం, మైనార్టీ బాలికల గురుకులం, నాంచారి మడూరులోని బీసీ బాలుర డిగ్రీ గురుకుల కళాశాల గేట్లకు యజమానులు తాళాలు వేశారు. గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయానికి, ఖానాపురం మండలం ఐనపల్లిలో, దుగ్గొండి మండలం గిరి్నబావిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల గేట్లకు తాళం వేశారు. దుగ్గొండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల హాస్టల్.. చెన్నారావుపేట మండల కేంద్రంలో నిర్వహిస్తుండగా భవనానికి తాళం వేశారు. రేగొండ మండలంలోని లింగాల, వరంగల్ ఉర్సు గుట్ట వద్ద మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనానికి కూడా తాళం వేశారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని మహాత్మా జ్యోతిబా పూలె గురుకుల పాఠశాలకు యజమాని తాళాలు వేశారు. కాగా, మంచిర్యాల జిల్లా తాండూరు బీసీ గురుకుల భవనానికి తాళం వేసిన యజమాని శరత్ కుమార్‌పై వివిధ సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దె భవనాల్లో 625 పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. పాఠశాల విద్యాశాఖ పరిధిలో జనరల్ గురుకుల సొసైటీ కొనసాగుతోంది. వీటి పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,033 విద్యాసంస్థలున్నాయి. ఇందులో 967 పాఠశాలలు కాగా మిగిలినవి డిగ్రీ కాలేజీలు. అయితే 625 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలున్న ప్రాంతాల ఆధారంగా అద్దె నిర్ణయించిన కలెక్టర్లు ఆ మేరకు చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భవనాలకు ఒక విధమైన అద్దె ఖరారు చేయగా, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో మరో విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకో విధంగా చదరపు అడుగు చొప్పున ప్రభుత్వం అద్దె ఖరారు చేసింది. ఆ మేరకు ప్రతి త్రైమాసికంలో యజమానులకు నేరుగా చెల్లింపులు చేçసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే కొంత కాలంగా ఆయా భవనాలకు అద్దె చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. మైనార్టీ స్కూళ్లకు ఏడాదికి పైగా నిలిచిన చెల్లింపులు ఎస్సీ, ఎస్టీ సొసైటీల పరిధిలో నాలుగైదు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. అదేవిధంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 2024–25 వార్షిక సంవత్సరం నుంచి నిధులు విడుదల కాలేదు. ఇక మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో మాత్రం దాదాపు ఏడాదికి పైగా చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. దీంతో బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. గురుకుల అద్దె భవనాలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా దసరా సెలవులకు గురుకులాలు ఖాళీ కావడంతో, ఇదే అదనుగా కొందరు యజమానులు భవనాలకు తాళాలు వేశారు. -
దారుణం: 12 ఏళ్లుగా ఆమెకు ఇల్లే జైలు
బెంగళూరు: శాస్త్రసాంకేతికతతో మనిషి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న కాలం మనదని చెబుతాం. స్త్రీలు సగర్వంగా తిరిగగలిగే సమాజంలో ఉన్నామని అనుకుంటాం. కానీ కర్ణాటకలో జరిగిన ఓ ఘటనను చూస్తే అవన్నీ ప్రసంగాలకే పరిమితమవుతున్నాయా? అని ప్రశ్నించుకోకతప్పదు! కర్ణాటకాలో ఓ మహిళకు పుష్కరకాలంగా ఇల్లే కారాగారంగా మారింది. కర్ణాటకాలోని మైసూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్లుగా ఓ అనుమానపు భర్త తన భార్యను ఇంట్లోనే బంధించాడు. భర్త పనికి వెళ్లే ముందు తనను ఇంట్లో ఉంచి తాళం వేసుకుని వెళతాడని మహిళ(32) పోలీసులకు తెలిపింది. మరుగుదొడ్డి కోసం ఇంట్లో చిన్న బాక్స్‌ను ఉపయోగించానని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు పాఠశాల నుంచి వచ్చినా భర్త ఇంటికి వచ్చేవరకు లోపలికి అనుమతి ఉండదని తెలిపింది. కిటికీ నుంచే పిల్లలకు భోజనం అందిస్తానని కన్నీరు పెట్టుకుంది. ‘‘నాకు పెళ్లయి 12 ఏళ్లైంది.. నన్ను ఎప్పుడూ ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టేవాడు. ఆ ప్రాంతంలో ఆయన్ని ఎవరూ ప్రశ్నించరు. నా పిల్లలు స్కూల్‌కి వెళతారు. కానీ నా భర్త పని నుంచి వచ్చే వరకు బయటే ఉంటారు. నేను వారికి కిటికీలోంచి ఆహారం ఇస్తాను. నా తల్లిదండ్రుల ఇంటికి ఎప్పుడు వెళ్లానో కూడా సరిగా గుర్తులేదు." అని పోలీసులకు మహిళ తెలిపింది. అయితే.. భర్తపై కేసు పెట్టడానికి మాత్రం బాధిత మహిళ ఇష్టపడలేదు. తన తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉంటానని పోలీసులకు తెలిపింది. అక్కడి నుంచే వివాహ సమస్యలను పరిష్కరించుకుంటానని పేర్కొంది. భర్తకు బాధిత మహిళ మూడో భార్య. గత మూడు వారాలుగా ఆమె ఇంట్లోనే ఉండటం గమనించామని పోలీసులు తెలిపారు. ఆమె కదలికలపై పూర్తి నిషేధం ఉంచినట్లు గుర్తించామని వెల్లడించారు. పనికి వెళ్లే ముందు ఆమెను ఇంట్లో ఉంచే తాళం వేయడం తాము గమనించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెను రక్షించామని, తల్లిదండ్రుల వద్దకే మహిళ వెళ్లడానికి ఇష్టపడినట్లు తెలిపారు. భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆరు చోట్ల బాంబులు పెట్టాం.. ముంబైకి బాంబు బెదిరింపు కాల్ -
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఖాతాను లాక్ చేసిన ట్విటర్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..!
మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ - ఏఎన్ఐ (ANI) ఖాతాను లాక్ చేసింది. కనీస వయసు ప్రమాణాలను పాటించనందుకు తమ ఖాతాను ట్విటర్ లాక్ చేసిందని ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ తాజాగా తెలిపారు. ఈ వార్తా సంస్థకు ట్విటర్ హ్యాండిల్‌ను క్లిక్ చేయడానికి ప్రయత్నించగా 'ఈ ఖాతా ఉనికిలో లేదు' అని చూపుతోంది. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. ఏఎన్ఐ ట్విటర్ ఖాతా లాక్ అయిన కొన్ని నిమిషాల తర్వాత స్మితా ప్రకాష్ ఏఎన్ఐ హ్యాండిల్ లాక్ చేసినట్లు తెలియజేస్తూ ట్విటర్ పంపిన ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను తన వ్యక్తిగత ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. మొదట మా ఖాతాకున్న గోల్డ్ టిక్ తీసేసి బ్లూటిక్ ఇచ్చారు. ఇప్పుడు లాక్ చేశారు అంటూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ‘ట్విటర్ ఖాతాను సృష్టించడానికి, మీకు కనీసం 13 సంవత్సరాలు ఉండాలి. మీరు ఈ వయసు నిబంధనకు అనుగుణంగా లేరని ట్విటర్ నిర్ధారించింది. కాబట్టి మీ ఖాతాను లాక్ చేశాం’ అని ఈ-మెయిల్లో ట్విటర్ పేర్కొంది. ఇదీ చదవండి: Google Play Store: గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు.. ఏఎన్ఐ వెబ్సైట్ ప్రకారం.. దక్షిణాసియా ప్రముఖ మల్టీమీడియా వార్తా సంస్థ అయిన ఏఎన్ఐకి భారతదేశం, దక్షిణ ఆసియా సహా ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ బ్యూరో సెంటర్లు ఉన్నాయి. ఇక ఏఎన్ఐ ట్విటర్ ఖాతాకు 7.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎన్డీటీవీ ఖాతా కూడా.. మరోవైపు ఎన్డీటీవీ ఖాతాను కూడా ట్విటర్ లాక్ చేసింది. ఎన్డీటీవీ ట్విటర్ హ్యాండిల్‌ను ఓపెన్ చేయగా అకౌంట్ ఉనికిలో లేనట్లు చూపిస్తోంది. అయితే ఎన్డీటీవీ ట్విటర్ అకౌంట్ ఎందుకు నిలిచిపోయిందన్నది తెలియరాలేదు. -
తాళాలు పగులగొట్టి.. ‘గృహప్రవేశం’.. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు
కోటగిరి (బోధన్): డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అప్పగించలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన ఆ పేదలు డబుల్ బెడ్రూం ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాళాలు పగులగొట్టి ఇళ్లను ఆక్రమించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామంలో సోమవా రం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బస్వాపూర్ గ్రామానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 50 డబుల్ ఇళ్లను మంజూరు చేయించారు. పేదలు తమ స్థలాలను అప్పగించగా, కాంట్రాక్టర్ జీ+1 పద్ధతిలో ఇళ్లు నిర్మించారు. రెండేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తికాగా, అధికారులు వాటికి తాళాలు వేశారు. వాడకంలో లేకపోవడంతో ఇళ్లపై అక్కడక్కడ మొక్కలు కూడా మొలిచాయి. రెండేళ్లు గడుస్తున్నా ఇళ్లు ఇవ్వకపోవడం, ఎన్నిసార్లు అడిగినా చలనం లేకపోవడంతో పేదలు ఆగ్రహానికి గురయ్యారు. తమ కళ్ల ముందే ఇళ్లు పాతబడి పోతుండడంతో జీర్ణించుకోలేని లబ్ధిదారులు వాటి స్వాధీనానికి నడుం బిగించారు. అర్ధరాత్రి తర్వాత మూకుమ్మడిగా వెళ్లి తాళాలను పగులగొట్టి గృహ ప్రవేశాలు జరిపారు. తమ సామగ్రిని తెచ్చి సర్దుకున్నారు. మరోవైపు, లబ్ధిదారుల ఆగ్రహాన్ని గమనించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. -
లాకులకు నీళ్లొదిలేశారు
ఆచంట : ఆచంట మండలం కోడేరు వద్ద బ్యాంక్ కెనాల్‌పై వందేళ్ల క్రితం నిర్మించిన లాకులివి. శిథిలావస్థకు చేరడంతో వీటి దిగువన గల 6 వేల ఎకరాల ఆయకట్టులో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా పంటల్ని నష్టపోతున్న రైతుల పోరాటంతో ఎట్టకేలకు లాకులను ఆధునికీకరించే పనులు మొదలుపెట్టినా పూర్తిచేసే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా బ్యాంక్ కెనాల్‌పై లాకుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 లక్షలు విడుదల చేసింది. పనులు ప్రారంభించినప్పటికీ.. రెండు నెలలుగా ముందుకు సాగడం లేదు. కొత్త లాకులను అమర్చేందుకు అవసరమైన సామగ్రిని తీసుకొచ్చినా.. ఆరుబయటే వదిలేశారు. సార్వా పనులు పూర్తయిన వెంటనే కొత్త లాకులు అమర్చి నీటి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ప్రకటించారు. సార్వా పనులు పూర్తయినా.. దాళ్వా పనులు మొదలవుతున్నా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ముందుకు కదలడం లేదు. నిర్మాణం పూర్తయితే కోడేరు ఎగువ ప్రాంతంలోని 6 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయి. దాళ్వా సీజన్ మొదలైనా పనులు పూర్తికాకపోవడం, సాగునీటి సమస్య తలెత్తనుండటంతో రైతులు కలవరపడుతున్నారు. బ్రిటిష్ కాలం నాటి లాకులు బ్యాంకు కెనాల్‌పై పెనుగొండ మండలం సిద్ధాంతం, ఆచంట మండలం కోడేరు గ్రామాల్లో బ్రిటిష్ హయాంలో లాకులు నిర్మించారు. వీటికి కాలదోషం పట్టడంతో శిథిలావస్థకు చేరాయి. లాకు తలుపులకు పగుళ్లు ఏర్పడి చిల్లులు పడటంతో నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. సార్వా, దాళ్వా సీజన్లలో సుమారు 60 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు వృథాగా పోతోంది. దీంతోఅధికారులు కోడేరు లాకుల వద్ద నీటి మట్టాలను నిలబెట్టలేకపోతున్నారు. ఫలితంగా కోడేరు ఎగువ ప్రాంతంలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది సార్వా సీజన్లోనూ సాగునీటి కొరతతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం విదితమే. దాళ్వాలో పరిస్థితి చెప్పనలవి కాదు. లాకుల నిర్మాణం పూర్తయితే జగ్గరాజు చానల్‌పై ఉన్న పెనుమంచిలి, ఆచంట వేమవరం, కొడమంచిలి చానల్‌పై ఉన్న కరుగోరుమిల్లి, కందరవల్లి గ్రామాలతోపాటు, పోడూరు మండలం వద్దిపర్రు, యలమంచిలి మండలం కాంభొట్లపాలెం గ్రామాల పరిధిలోని సుమారు ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ఇబ్బందులు తొలగుతాయి. ఉన్నతాధికారులు స్పందించి లాకుల నిర్మాణంపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఎన్నాళ్లకు పూర్తి చేస్తారో దెబ్బతిన్న బ్యాంక్ కెనాల్ లాకు తలుపుల్ని మార్చాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. ఇన్నాళ్లకు ప్రభుత్వం స్పందించింది. కొత్త తలుపులు తెచ్చి రెండు నెలలు దాటింది. నేటివరకూ బిగించలేదు. పాత లాకులు దెబ్బతినడంతో సాగునీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది. ఎగువ ప్రాంతాల రైతులకు నీటి ఇబ్బందులు తప్పడం లేదు. దాళ్వాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ ఏడాది సార్వాలోనే సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారులు వెంటనే స్పందించి.. లాకు పనుల్ని పూర్తి చేసి ఇబ్బందుల్ని తొలగించాలి. – కుంపట్ల సత్యనారాయణ, రైతు, కోడేరు త్వరలో పూర్తి చేస్తాం లాకుల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే కొత్త లాకులు కొనుగోలు చేసి పని జరిగే ప్రాంతానికి చేర్చాం. బ్యాంక్ కెనాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పనులు పూర్తికాలేదు. త్వరలో అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించి.. పనులు పూర్తి చేస్తాం. – సీహెచ్ వెంకటనారాయణ, డీఈ, నీటి పారుదల శాఖ -
తాళం పగులగొట్టి చోరీలు
ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు గుంటూరు (పట్నంబజారు): ఎవరూ లేని ఇళ్లకు వెళ్లి చాకచక్యంగా తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని రూరల్ జిల్లా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫెరెన్స్ హాలులో మంగళవారం రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్ వివరాలను మీడియాకు వెల్లడించారు. నెల్లూరు జిల్లా డైకాస్ రోడ్డుకు చెందిన షేక్ ఫయాజ్ దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం సత్తెనపల్లిలో నివాసం ఉంటున్నాడు. 2015 సంవత్సరంలో ములోషాద్‌నగర్‌లో ఓ దొంగతనం కేసులో అరెస్టు అయినప్పుడు రంగారెడ్డిజిల్లా మహరాజ్‌పేట ఏరుకుంట తండాకు చెందిన విస్లావత్ రామునాయక్‌తో పరిచయం ఏర్పడింది. ఈసంవత్సరం జైలులో నుంచి బయటకు వచ్చిన ఫయాజ్, రామునాయక్‌లు గుంటూరు జిల్లాతోపాటు, ప్రకాశం, రాజమండ్రి, తణుకు, బొమ్మూరు, తదితర ప్రాంతాల్లో 15కు పైగా దొంగతనాలు చేశారు. ముందుగా ఇద్దరూ పక్కా రెక్కి నిర్వహించి ఇంటికి తాళాలు వేసే నివాసాలను గమనిస్తారు. రాత్రి సమయాల్లో తాళాలు పగులగొట్టి వస్తువులు దోచుకుపోతారు. వివిధ ప్రాంతాల్లో ఏడు కార్లు సైతం దొంగిలించుకు పోయారు. గుంటూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు, కార్లు చోరీ జరుగుతుండడంతో ప్రత్యేక దృష్టి సారించిన రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పిడుగురాళ్ళలోని కొండమోడు జంక్షన్ వద్ద ఫయాజ్, రామునాయక్‌లు మంగళవారం కారులో వెళుతుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాన్ని బయటపెట్టారు. పూర్తి స్థాయిలో చేసిన దొంగతనాల వివరాలను వివరించి, చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి ఏడు కార్లు, బంగారు ఆభరణాలు, మొత్తం రూ. 30,26,000 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో సైతం ఫయాజ్ ఒక హత్య, యాసిడ్ దాడి కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన క్రైమ్ డీఎస్పీ ఎన్.కృష్ణకిషోర్‌రెడ్డి, పిడుగురాళ్ళ సీఐ హనుమంతరావు, క్రైమ్ సీఐ ఎం.నాగేశ్వరరావు, ఎస్సై పి.కిరణ్, కానిస్టేబుళ్లను అభినందించారు. -
అపోలో చేతికి అర్బన్ హెల్త్ సెంటర్ల తాళాలు
అనంతపురం సిటీ: అపోలో హాస్పిటల్స్ చేతికి అర్బన్ హెల్త్ సెంటర్స్ తాళాలు అప్పగించాలంటూ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సెంటర్ నుంచి గురువారం ఉత్తర్వులు అందాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ తెలిపారు. దీంతో జిల్లాలోని 19 ఆరోగ్య కేంద్రాలు అపోలో హాస్పిటల్స్ చేతిలోకి వెళ్లిపోనున్నాయి. ఆ సంస్థ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజుల్లో పూర్తీ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
ట్రెజరీకి తాళాలు
సాక్షి, విశాఖపట్నం : ట్రెజరీకి మళ్లీ తాళాలు పడ్డాయి. చరిత్రలో తొలిసారిగా ఆన్లైన్లోనే సర్వర్‌ను బంద్ చేశారు. దీంతో ట్రెజరీ ద్వారా జరిపే చెల్లింపులన్నింటికి బ్రేకులు పడ్డాయి. రోజుకు రూ.20కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోగా..చివరకు తొలిసారిగా అంత్యక్రియల ఖర్చుల కోసం జరిపే చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు 13 సబ్ ట్రెజరీ కార్యాలయాలున్నాయి. జిల్లా కార్యాలయంలో రోజుకు 200 నుంచి 500 వరకు బిల్లులు పాస్ చేస్తుంటారు. అదే ఒక్కొ సబ్ ట్రెజరీ కార్యాలయం పరిధిలో రోజుకు 30 నుంచి వంద వరకు ఉంటాయి. జిల్లా ట్రెజరీ కార్యా లయ పరిధిలో రోజుకు ఐదారుకోట్లవరకు చెల్లింపులు జరుగుతుంటాయి.అదే ఒక్కో సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధిలో రోజుకు రూ.50 లక్షల నుంచి కోటిన్నర వరకు ఉంటాయి. జీతభత్యాలు కాకుండా జిల్లాలో రోజువారీ చెల్లింపులు రూ.20కోట్ల వరకు ఉంటాయి.ప్రతిరోజు శాఖల వారీగా వచ్చే బిల్లులకు తొలుత ఆయా ట్రెజరీ కార్యాలయాల్లో టోకన్ ఇస్తారు. మూడు దశల్లో వాటిని ఆడిట్ చేసిన తర్వాత పాస్ చేస్తారు. బ్యాంక్‌లకు లిస్ట్‌లు పంపిస్తారు. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆతర్వాత 25 బిల్లులు ఓ కట్టగా పంపిస్తారు. అలా వచ్చిన బిల్లులు, ఆన్లైన్లో తమ వద్దకు వచ్చిన లిస్టుల్లో ఉన్న బిల్లులను సరి చూసుకుని బ్యాంకులు పేమెంట్స్ చేస్తుంటాయి. సాధార ణంగా ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ప్రతి ఏటా మార్చి నెలాఖరున ట్రెజరీపై ఆంక్షలు విధిస్తుంటారు. ఎవరైనా ఉద్యోగి లేదా రిటైర్డ్ ఉద్యోగి చనిపోతే అంత్యక్రియలకయ్యే ఖర్చుల కోసం ముందస్తుగా జరిపే చెల్లింపులతో పాటు కొన్ని రకాల పేమెంట్స్ వరకు మినహాయింపు నిస్తారు. కానీ ట్రెజరీ చరిత్రలో తొలిసారిగా మొత్తం చెల్లింపులన్నింటిని బంద్ చేసారు. పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ ద్వారా జరిపే చెల్లింపులపై ఆంక్షలు విధించినట్టు ట్రెజరీవర్గాలు చెబుతున్నాయి. పుష్కరాల సాకుతో ట్రెజరీపై ఆంక్షలు విధించడంతో సాధారణ చెల్లింపులకు సైతం బ్రేకులు పడ్డాయి. ట్రెజరీ శాఖకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్లోనే ఓప్రత్యేక సర్వర్ ఉంటుంది. ఈసర్వర్ ఆధారంగానే ఆన్లైన్లో చెల్లింపులు జరుపుతుంటారు. ప్రస్తుతం ఈసర్వర్ను ఆపేశారని ట్రñ జరీ అధికారులు చెబుతు న్నారు. దీంతో రోజువారీ వివిధ శాఖలకు సంబంధించి జరిపే చెల్లింపులతోపాటు ఉద్యోగ వర్గాలకు ఇచ్చే లీవ్ ఎన్‌కేష్‌మెంట్ పేమెంట్స్, రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ వంటి సెటిల్మెంట్స్ను సైతం నిలిపివేశారు. అలాగే ప్యూనరల్ పేమెంట్స్‌తోపాటు రోజువారీ ఖర్చు లకు సంబంధించిన బిల్లులకు సైతం బ్రేకులుపడ్డాయి. ఇలా రోజుకు జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వాదేశాల మేరకే గురువారం నుంచి సర్వర్‌ను ఆపేశారని చెబుతున్నారు.పుష్కరాలయ్యే వరకు ఈ సర్వర్ పనిచేయదని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేదని అధికారులంటున్నారు. -
మార్కెట్ యూర్డు గోదాంకు తాళాలు
లావేరు: ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ గోదాంలో కళాసీ పను ల కోసం టీడీపీ నాయకుల మధ్యనే వివాదం నెలకొంది. బెజ్జిపురం గ్రామస్థులకే గోదాంలో కళాసీ పనులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బె జ్జిపురం టీడీపీ సర్పంచ్, ఎంపీటీసీలు ఇజ్జాడ శ్రీనివాసరావు, దన్నాన అజాద్, మాజీ సర్పంచ్ ఇజ్జాడ అప్పారావులుతో పాటు గ్రామస్థులు పలువురు వచ్చి మార్కెట్ కమిటీ గోదాంకు తాళాలు వేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తోటయ్యదొరపై బెజ్జిపురం సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జిపురం రెవెన్యూ పరిధిలో ఉన్న మార్కెట్ కమిటీ యార్డులో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ గోదాంలో లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాలకు సరఫరా చేయడం కోసం పౌర సరఫరాల బియ్యా న్ని నిల్వ చేస్తున్నారు. అయితే గోదాంకు వచ్చిన బియ్యా న్ని దించడం కోసం కళాసీలుగా లావేరు గ్రామానికి చెందిన వారికి మార్కెట్ కమీటీ చైర్మన్ పనులు అప్పగించారు. అయితే, బెజ్జిపురం రెవెన్యూ పరిధిలో ఉన్న గోదాంలో కళాసీ పనులను బెజ్జిపురం గ్రామానికి చెంది న వారికే ఇవ్వాలని, లావేరుకు చెందిన కళాసీలకు ఎలా ఇస్తారని నాలుగు రోజుల క్రితమే బెజ్జిపురం సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌లు మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ద అభ్యంతరం చెప్పారు. అయినా పట్టించుకోకుండా లావేరుకు చెందిన కళాసీలతోనే గోదాంలో బియ్యం బస్తాలు దించడం చేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన బెజ్జిపురం సర్పంచ్ ఇజ్జాడ శ్రీనివాసరావు, ఎంపీటీసీ దన్నాన అజార్, మాజీ సర్పంచ్ ఇజ్జాడ అప్పారావులతో పాటు గ్రామస్థులు పలువురు ఆదివారం ఉదయం వచ్చి మార్కెట్ కమిటీ గోదాంకు తాళాలు వేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు వచ్చి తాళాలు వేసిన వారు తలుపులకు అడ్డంగా కూర్చోని మధ్యాహ్నం 12 గంటల వర కూ ఉన్నారు. గోదాంలో కళాసీ పనులు బెజ్జిపురం గ్రామస్థులుకే ఇవ్వాలని వారంతా నినాదాలు చేశారు. దీంతో బియ్యం లోడులతో వచ్చిన లారీలు మార్కెట్ యార్డులో బారులు తీరాయి. గోదాంకు తాళాలు వేసి పనులు అడ్డుకున్న వారు చైర్మన్ రావాలని డిమాండ్ చేసినా మధ్యాహ్నం 12 గంటలయినా ఏఎంసీ చైర్మన్ అక్కడకు రాకపోవడంతో సర్పంచ్, ఎంపీటీసీలు వెళ్లిపోయారు. -
ఖాళీ బిందెలతో మహిళల బైఠాయింపు
అట్లూరు: మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయానికి తాళాలు వేశారు. అట్లూరు గ్రామానికి చెందిన సుమారు వందమంది మహిళలు గురువారం ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. నీటి కోసం అల్లాడుతున్నాం. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసి, ఆదుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ ఎంపీడీ వో మధుసూదన్‌రెడ్డి చాంబర్లోకి వెళ్లి నిల దీశారు. ఆయనను బయటికి పంపించి, కా ర్యాలయానికి తాళాలు వేశారు. అనంతర ం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు ఈశ్వరయ్యను కూడా తాగు నీ టి సమస్యపై నిలదీశారు. అనంతరం తహశీల్దారు కార్యాలం ఎదుట బైఠాయించారు. అక్కడకు చేరుకున్న ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి సర్దుభాటు చేసే యత్నం చేశారు. మేము తాగునీటి కోసం అల్లాడుతున్నాం. మా గ్రామంలోకి ఏరోజైనా వచ్చి సమస్య పరిశీలించారా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మండ ల ప్రత్యేకాధికారి రమగోపాల్‌రెడ్డి, ఆర్డ బ్ల్యూఎస్ ఏఈ రవితేజా, పీఆర్ ఏఈ శ్రీనువాసులు అక్కడకు చేరుకుని సమస్య పరి ష్కరిస్తామంటూ నచ్చచెప్పి గ్రామంలోకి తీసుకెళ్లారు. మహిళలు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటసుబ్బయ్య, బద్వేలు ఏరియా కార్యదర్శి వీరశేఖర్, జిల్లా సభ్యు లు జకరయ్య, మండల కార్యధర్శి నిత్యపూజయ్య అక్కడకు చేరుకుని మహిళలకు మద్దతుగా నినాదాలు చేశారు. -
పిజ్జా కోసం..
లండన్: పిల్లలు తమకు కావాల్సింది సాధించుకోవడంకోసం వారి మంకుపట్లు, పేచీలు అందరికీ తెలిసిన విషయమే. కానీ లండన్‌లో 11 ఏళ్ల పిల్లాడు పిజ్జా కోసం తల్లిదండ్రులకు చుక్కలు చూపించాడు. తాను అడిగిన పిజ్జా కొనివ్వలేదనే కోపంతో లోపల గడియ వేసుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా తలుపు తీయలేదు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి పిల్లాడిని బతిమలాడి, బామాలితే తప్ప తలుపు తీయలేదు. వివరాల్లోకి వెడితే లంచ్‌లోకి తనకు పిజ్జా కావాలని అడిగాడో గడుగ్గాయి. అయితే వాళ్లమ్మ పిజ్జాకు బదులుగా పాస్తా చేసి పెట్టింది. దీంతో పిల్లాడు నాకు పిజ్జానే కావాలంటూ పేచీ మొదలుపెట్టాడు. ఎంత బుజ్జగించినా వినిపించుకోలేదు. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు కొద్దిసేపు బయటికి వెళ్లారు. అంతే లోపల్నించి తలుపు తాళం వేసుకున్నాడు. మిమ్మల్ని లోపలికి రానీయంటూ మంకు పట్టు పట్టాడు. పిల్లాడితో తలుపు తీయించేందుకు ప్రయత్నించి విఫలమైన తల్లిదండ్రులు చివరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెల్లిగా బాల్కనీలోకి ప్రవేశించిన పోలీసులు బాలుడిని ఒప్పించి తలుపు తీయించారు. -
ఆ ఇళ్లను తనిఖీ చేయండి
డిప్యూటీ కమిషనర్లకు స్పెషలాఫీసర్ ఆదేశం ఆధార్ అనుసంధానంపై సమీక్ష సిటీబ్యూరో: తాళాలు ఉన్న ఇళ్లను తనిఖీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 17.91 శాతం ఓటర్ల సమాచారం లేదన్నారు. ఆధార్‌తో ఓటరు కార్డుల అనుసంధానంపై శుక్రవారం డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆధార్ అనుసంధానానికి 73.51 లక్షల మంది అర్హులు కాగా... వారిలో 57.75 లక్షల మంది పరిశీలన పూర్తయిందన్నారు. 10.34 లక్షల మందికి సంబంధించి ఇంటికి తాళాలు ఉన్నాయన్నారు. చిరునామా మార్పులు, తాళాలున్న ఇళ్లకు సంబంధించి డిప్యూటీ కమిషనర్లు స్వయంగా తనిఖీలు చేయాలని సూచించారు. అప్పటికీ ఓటర్ల సమాచారం లేనట్లయితే ఆ వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలని సూచించారు. వీరిని జాబితాలోంచి తొలగించేందుకు నోటీసులు జారీ చేయాలన్నారు. పరిశీలన పూర్తయిన వారిలో కేవలం 20.28 లక్షల మందివి మాత్రమే ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం జరిగిందని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై అశ్రద్ధ చూపే బూత్‌లెవెల్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 17 నుంచి స్వచ్ఛ కమిటీల పర్యటన గ్రేటర్‌లోని 400 యూనిట్లకు ప్రభుత్వం నియమించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన స్వచ్ఛ కమిటీలు ఈనెల 17వ తేదీ నుంచి స్థానికంగా పర్యటిస్తాయని సోమేశ్‌కుమార్ తెలిపారు. అంతకుముందే సంబంధిత అధికారులు గుర్తించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను రోజూ ఉదయం పూట తనిఖీ చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిటీలోకి మరిన్ని అంశాలు స్వచ్ఛ హైదరాబాద్‌కు సంబంధించి ప్రభుత్వ విభాగాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీల్లో జీహెచ్ఎంసీ కమిటీని మరింత విస్తరించారు. ఈ కమిటీలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డులకు సంబంధించిన అంశాలున్నాయి. ట్రాఫిక్, ల్యాండ్ రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూడా చేర్చారు. ఈమేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిటీలో ఇప్పటికే ఉన్న ప్రతినిధులతోపాటు అదనంగా ఎమ్మెల్సీ ఎం.డి.సలీం పేరును చేర్చారు. -
ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి తాళాలు
కొత్త ముఖ్య కార్యదర్శిని నియమించిన కేజ్రీవాల్ రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ నేడు రాష్ట్రపతితో సీఎం కేజ్రీవాల్ భేటీ న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఐఏ ఎస్ అధికారులు నలిగిపోతున్నారు. ఢిల్లీ తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా శకుంతలా గామ్లిన్ నియామకం వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం బాగా ముదిరిపోయింది. గామ్లిన్ నియామకపు ఉత్తర్వులిచ్చిన ముఖ్యకార్యదర్శి(సేవలు)అనిందో మజుందార్ ముందు గా బలిపశువయ్యారు. సోమవారం ఉదయం మజుందార్ సచివాలయంలోని ఏడో అంతస్థులోని తన కార్యాలయానికి వచ్చేసరికి కార్యాలయానికి తాళం వేసి ఉంది. ఇదేమని మజుందార్ అక్కడున్న సిబ్బందిని అడిగినప్పుడు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన కార్యాలయానికి తాళం వేసినట్లు సమాచారమిచ్చారు. మజుందార్ శనివారం బదిలీ చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఆయన స్థానంలో తనకు సన్నిహితుడైన మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్‌ను కేజ్రీవాల్ నియమించారు. ఈ నియామకం చెల్లదంటూ జంగ్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ప్రభుత్వంలో ఉన్నతాధికారులను నియమించాలన్నా, బదిలీ చేయాలన్నా తుది అధికారం తనదేనని ఆ లేఖలో జంగ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి గవర్నర్ రాసిన లేఖ మీడియాకు లీక్ కావటం మరింత అగ్గి రాజేసినట్లయింది. గవర్నరే తన లేఖను లీక్ చేయటం ఆశ్చర్యమని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. మరోవైపు తన కార్యాలయానికి తాళం వేయటంపై అనిందో మజుందార్ తాత్కాలిక ప్రధానకార్యదర్శి గామ్లిన్కు ఫిర్యాదు చేశారు. గోయల్‌తో గామ్లిన్ భేటీ మరోపక్క తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శకుంతలా గామ్లిన్ సోమవారం ఉదయం కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్‌తో సమావేశమయ్యారు. ఆమెతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ, హోం శాఖలో జాయింట్ సెక్రటరీ రాకేశ్సింగ్లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తన నియామకంపై నెలకొన్న వివాదంపై గోయల్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేయటానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతితో సమావేశం కానున్నారు. ‘మీరు రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తున్నారు’ మరోవైపు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఘాటైన పదజాలంతో లేఖ రాశారు. కీలకమైన ఉన్నతాధికారుల నియామకంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రధానమంత్రికి కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాస్తారని తెలిపారు. -
ప్రేమ జామ్ అయింది!
ప్యారిస్ నగరం చుట్టుపక్కల ప్రజల్లో ఓ నమ్మకం ఉంది. ఒక తాళంకప్ప మీద తమ పేర్లు రాసి దాన్ని ప్యారిస్‌లోని ప్యాడ్‌లాక్ బ్రిడ్జికి వేసి, తాళం చెవులను పక్కనే ఉన్న నదిలోకి విసిరేస్తే తమ ఆకాంక్షలన్నీ నెరవేరతాయని వారు నమ్ముతారు. ప్యాడ్‌లాక్ బ్రిడ్జ్‌కు ప్రేమికులు ఇలా తాళాలు వేసే సంప్రదాయం 19వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది. అయితే ఇప్పుడా బ్రిడ్జికి అణువంత కూడా ఖాళీ లేకుండా పోయింది. దాంతో ఆ వారధికి పక్కగా ఉన్న స్ట్రీట్లైట్నూ వదలకుండా ప్రేమికులు తాళాలను తగిలించి తమ ముచ్చట తీర్చుకొంటున్నారు. -
బంగారు వాకిలి తాళం మొరాయింపు
శ్రీవారి ఆలయంలో హైరానా - కట్‌చేసి తాళం తొలగింపు - యథావిధిగా సుప్రభాత సేవ సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం అనుకోని సంఘటన ఎదురైంది. వేకువజామున సుప్రభాత వేళకు ముందు బంగారు వాకిలికి అమర్చిన తాళం మొరాయించింది. వెల్డింగ్ యంత్రంతో కట్‌చేసి తాళం తొలగించి యథావిధిగా సుప్రభాత సేవను నిర్వహించారు. గర్భాలయానికి సుమారు 70 అడుగుల ముందు బంగారు వాకిలి ఉంది. ప్రతిరోజూ రాత్రి 12.30 గంటలకు ఏకాంత సేవ ముగిసిన వెంటనే బంగారు వాకిలి ద్వారం మూసివేసి మూడు తాళాలు వేస్తారు. అందులో ఒకదానికి సీలు వేస్తారు. తాళం చెవులు జీయర్, అర్చకులు, ఆలయ పేష్కారు వద్ద ఉంటాయి. మరుసటి రోజు వేకువన 2.20 గంటలకు సుప్రభాత సేవకు ముందు తాళాలు తొలగించి సేవను నిర్వహిస్తారు. బుధవారం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బృందం కూడా సుప్రభాత సేవకు హాజరైంది. దీంతో ఆలయ బంగారు వాకిలిని ఐదు నిమిషాలకు ముందే 2.15 గంటలకు తెరిచేందుకు అర్చకులు ప్రయత్నించారు. రెండు తెరుచుకున్నాయి. సీలు వేసిన తాళంలోని లివర్స్ తెగిపోవడం వల్ల అర్చకులు, అధికారులు ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. అప్పుడే శ్రీలంక బృందంతో ఆలయంలోకి ప్రవేశించిన ఈవో సాంబశివరావుకు సమాచారం ఇచ్చారు. ఆవయన ఆదేశాలతో కట్టర్‌తో తాళాన్ని కోసి తొలగించారు. అప్పటికే 2.48 నిమిషాలైంది. తర్వాత గర్భాలయంలో వైదిక కార్యక్రమాలు జరిగాయి.ఈ సంఘటనలో మానవ తప్పిదం లేకపోయినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై ఈవో ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాప్యంలేదు : డిప్యూటీ ఈవో ‘‘సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారి మీదే ప్రమాణం చేస్తున్నా.. శ్రీవారి సుప్రభాత సేవ 3 గంటలకే ప్రారంభమైంది’’ అని ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. జాప్యం జరిగిందన్నది అవాస్తవమన్నారు. -
తాళాల్లేవు... నమ్మకముంది!
దైవాదీనం: బయట గార్డు ఉంటాడు.. బ్యాంకు తాళాలేసి ఉంటాయి.. లోపల స్ట్రాంగ్ రూంకు ఇంకో తాళమేసి ఉంటుంది.. అందులో హైలెవెల్ సెక్యూరిటీ ఏర్పాట్ల మధ్య డబ్బు, బంగారం దాచి ఉంటాయి.. అయినా ఆ డబ్బు, బంగారం పోదని గ్యారెంటీ లేదు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా బ్యాంకు దొంగతనాలు ఆగని రోజులివి! అలాంటిది అసలు తాళాలే వేయకుండా, తలుపులే మూయకుండా ఓ బ్యాంకు నడపడం సాధ్యమా? లోపలున్న కోట్ల రూపాయల డబ్బు భద్రంగా ఉంటుందా? ఈ ఆలోచన అసలు ఊహకైనా అందుతుందా? కానీ మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లో ఈ అద్భుతమే చోటు చేసుకుంది. అక్కడ తాళాల్లేని, తలుపులే మూయని బ్యాంకు మొదలైంది. ఇదెలా సాధ్యమైంది? ఈ బ్యాంకు కథేంటి? శని శింగనాపూర్.. పేరును బట్టే ఈ ఊరి కథేంటో చెప్పేయచ్చు. శనీశ్వరుడి ఆలయానికి ప్రసిద్ధి ఈ ఊరు. అహ్మద్‌నగర్ జిల్లాలో మూడు వేల జనాభాతో ఉన్న ఈ ఊరిలో ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడి ఆలయముంది. తమ గ్రామాన్ని శనీశ్వరుడే పాలిస్తాడని.. ఆయనే తమకు రక్ష అని ఆ ఊరి ప్రజల నమ్మకం. ఎవరైనా తప్పు చేస్తే శని ఆ వ్యక్తి జీవితంలోకి ప్రవేశించి.. తిష్టవేసుకుని కూర్చుంటాడని.. అతనికి ఎప్పటికీ కష్టాలే అన్నది వారి నమ్మకం. ఈ నమ్మకంతోనే ఆ గ్రామంలో ఏ ఇంటికీ తాళాలు వెయ్యరు. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగతున్న సంప్రదాయం. ఎలాంటి స్థితిలోనైనా గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులు మూయడం, తాళాలు వేయడమన్నది జరగదు. ఐతే శని శింగనాపూర్‌లో ఎప్పుడూ దొంగతనాలు లేకుండా ఏమీ లేదు. 2010లో ఓసారి, తర్వాతి ఏడాది మరోసారి రెండు దొంగతనాలు జరిగాయి. అవి మినహాయిస్తే మరే కేసులూ లేవు. గత మూడేళ్ల కాలంలో చిన్న దొంగతనం కూడా జరగలేదు. శని శింగనాపూర్‌లో తాళాలేయని సంప్రదాయం కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడ దుకాణాలు, కార్యాలయాలు, గుళ్లు, పాఠశాలలు కూడా తాళాల్లేకుండానే పని చేస్తున్నాయి. తాళాలేయమన్న షరతులతోనే ఇక్కడ దుకాణాలు తెరవాల్సి ఉంటుంది. ఐతే వీటి సంగతి బాగానే ఉంది కానీ.. కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే బ్యాంకుల సంగతేంటి మరి! శని శింగనాపూర్ గ్రామ సంప్రదాయం గురించి తెలియక ఇక్కడ బ్రాంచి తెరుద్దామని చూశాయి చాలా బ్యాంకులు. కానీ బ్యాంకుకు తాళాలేస్తే ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నారు గ్రామస్థులు. తాళాల్లేకుండా బ్యాంకు తెరవడానికి ససేమిరా అన్నారు అధికారులు. దీంతో బ్యాంకుల ద్వారా కలిగే ప్రయోజనాలేవీ అందక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డారు శని శింగనాపూర్ గ్రామస్థులు. ఐతే శంకర్ గడఖ్ అనే ఎన్సీపీ నేత ప్రయత్నంతో ఓ ముందడుగు పడింది. ఆయన యూకో బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఊరి సంప్రదాయం గురించి చెప్పి, గ్రామస్థులే బ్యాంకును కాపాడుకుంటారని హామీ ఇచ్చారు. ప్రతి బ్యాంకుకూ హై సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని పక్కనబెట్టి మరీ యూకో బ్యాంకు శని శింగనాపూర్ తన బ్రాంచి ఆరంభించింది. గ్రామస్థుల కోరిక ప్రకారమే తాళాలేయకుండా బ్యాంకు లావాదేవీలు నడపడానికి అంగీకరించింది. ఈ ఏడాది జనవరిలో మొదలైన శని శింగనాపూర్ యూకో బ్యాంకు బ్రాంచి ఏ ఇబ్బందులూ లేకుండా నడిచిపోతోంది. ఐతే ప్రధాన ద్వారానికి తాళాలు వేయనప్పటికీ.. నగదు, బంగారం ఇతరత్రా ముఖ్యమైన వస్తువులన్నింటినీ కొంచెం భద్రమైన చోటులోనే ఉంచి లావాదేవీలు సాగిస్తున్నారు. బ్యాంకు సిబ్బందిలో కొందరు ప్రాంగణంలోనే బస ఏర్పాటు చేసుకోగా.. గ్రామస్థులు సైతం బ్యాంకుపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. స్థానిక పోలీసులు, అధికారులు బ్యాంకు భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఈ సంప్రదాయాన్ని వ్యతిరేకించినప్పటికీ ఏ ఇబ్బందులూ లేకుండా బ్యాంకు కార్యకలాపాలు సాగిపోతున్నాయి. శని శింగనాపూర్‌లోని శనీశ్వరుడి ఆలయానికి రోజూ దాదాపు పది వేల మంది భక్తులు వస్తారు. వారాంతాల్లో ఆ సంఖ్య 50 వేల దాకా ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతుంది కూడా. ఇంతమంది వస్తూ పోతున్నా ఇక్కడి జనాలు ధైర్యంగా తలుపులు, తాళాలు వేయకుండా జీవనం సాగిస్తుండటం విశేషం. అందులోనూ ఓ బ్యాంకు తాళాలే లేకుండా తన కార్యకలాపాలు సాఫీగా సాగిస్తుండటం ఇంకా పెద్ద విశేషం.