డిప్యూటీ కమిషనర్లకు స్పెషలాఫీసర్ ఆదేశం
ఆధార్ అనుసంధానంపై సమీక్ష
సిటీబ్యూరో: తాళాలు ఉన్న ఇళ్లను తనిఖీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 17.91 శాతం ఓటర్ల సమాచారం లేదన్నారు. ఆధార్‌తో ఓటరు కార్డుల అనుసంధానంపై శుక్రవారం డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆధార్ అనుసంధానానికి 73.51 లక్షల మంది అర్హులు కాగా...
వారిలో 57.75 లక్షల మంది పరిశీలన పూర్తయిందన్నారు. 10.34 లక్షల మందికి సంబంధించి ఇంటికి తాళాలు ఉన్నాయన్నారు. చిరునామా మార్పులు, తాళాలున్న ఇళ్లకు సంబంధించి డిప్యూటీ కమిషనర్లు స్వయంగా తనిఖీలు చేయాలని సూచించారు. అప్పటికీ ఓటర్ల సమాచారం లేనట్లయితే ఆ వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలని సూచించారు. వీరిని జాబితాలోంచి తొలగించేందుకు నోటీసులు జారీ చేయాలన్నారు. పరిశీలన పూర్తయిన వారిలో కేవలం 20.28 లక్షల మందివి మాత్రమే ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం జరిగిందని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై అశ్రద్ధ చూపే బూత్‌లెవెల్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
17 నుంచి స్వచ్ఛ కమిటీల పర్యటన
గ్రేటర్‌లోని 400 యూనిట్లకు ప్రభుత్వం నియమించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన స్వచ్ఛ కమిటీలు ఈనెల 17వ తేదీ నుంచి స్థానికంగా పర్యటిస్తాయని సోమేశ్‌కుమార్ తెలిపారు. అంతకుముందే సంబంధిత అధికారులు గుర్తించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను రోజూ ఉదయం పూట తనిఖీ చేయాలని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ కమిటీలోకి మరిన్ని అంశాలు
స్వచ్ఛ హైదరాబాద్‌కు సంబంధించి ప్రభుత్వ విభాగాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీల్లో జీహెచ్‌ఎంసీ కమిటీని మరింత విస్తరించారు. ఈ కమిటీలో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డులకు సంబంధించిన అంశాలున్నాయి. ట్రాఫిక్, ల్యాండ్ రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూడా చేర్చారు. ఈమేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిటీలో ఇప్పటికే ఉన్న ప్రతినిధులతోపాటు అదనంగా ఎమ్మెల్సీ ఎం.డి.సలీం పేరును చేర్చారు.
ఆ ఇళ్లను తనిఖీ చేయండి
Published Fri, Jun 12 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement