ఇది తొలిపోరు
ప్లాస్టిక్ నిషేధంపై మలి పోరాటం
రేపటి నుంచే ‘స్వచ్ఛ హైదరాబాద్’
‘సాక్షి’తో జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్
సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా చెత్త తొలగింపు తొలి దశ కార్యక్రమమని... మలి దశలో ప్లాస్టిక్ నిషేధంపై శ్రద్ధ చూపుతామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. తొలుత అన్నివర్గాల్లో అవగాహన క ల్పిస్తామని... పట్టించుకోకపోతే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షల కంటే ప్రజల్లో అవగాహన, చైతన్యం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ‘స్వచ్ఛ హైదరాబాద్’కు పూనుకున్నారని చెప్పారు. ప్రజల చైతన్యంతో ‘మన ఇల్లు- మన సరిసరాలు- మన సిటీ’ అనే తలంపు కలుగుతుందన్నారు. అప్పుడే ‘స్వచ్ఛ హైదరాబాద్’ సాధ్యమవుతుందని... విశ్వనగరంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారంనుంచి ఐదు రోజుల పాటు ‘స్వచ్ఛ హైదరాబాద్’ మహా క్రతువు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.ఆ విశేషాలు...
సాక్షి : వీధుల్లో చెత్త తొలగింపు సరే.. ఇళ్లు, కార్యాలయాల్లో చెత్త లేకుండా చేసేందుకు ఏం చేస్తున్నారు?
కమిషనర్: వీధుల్లోనే కాకుండా విధులు నిర్వహించే కార్యాలయాలు, ఇళ్లు, పరిసరాల్లోనూ చెత్త లేకుండా చేయాలనేది లక్ష్యం. కార్యాలయాల్లో చెత్తను సిబ్బంది, కార్మికులు తొలగిస్తారు. ఇళ్లకు సంబంధించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాల్సిందిగా గృహిణులకు అవగాహన కల్పించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంటే సగం సమస్య సమసిపోయినట్లే. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం.
సాక్షి : నగరంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ. ప్లాస్టిక్ క్యారీబ్యాగులతో ఎన్నో అనర్థాలు పొంచి ఉన్నాయి. ఈ-వేస్ట్, బయో మెడికల్ వేస్ట్, ఇతర వ్యర్ధాలను నిరోధించ కుండా.. వాటిపై అవగాహన కల్పించకుండా... చెత్త ఎంత తొలగించినా ప్రయోజనం ఉంటుందా?
కమిషనర్: అన్నీ ఒకేసారి సాధ్యం కావు. మలిదశలో వీటిపై దృష్టి సారిస్తాం. 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వాడరాదని కోర్టు ఆదేశాలు, నిబంధనలు ఉన్నాయి. గ్రేటర్ వ్యర్థాల్లో చెత్త తొలి శత్రువు. ప్రస్తుతం దీనిపైనే పోరాటం. దీన్ని అంతం చేస్తూనే మిగతా వ్యర్థాలపైనా అవగాహన కల్పిస్తాం. తర్వాత ప్లాస్టిక్ తొలగింపు చర్యలు చేపడతాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలకు వెనుకాడం. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా తమ వద్దకు వచ్చే వీవీఐపీలకు ప్రజలు సూచనలు, సలహాలు తెలియజేస్తారు. రోజువారీ నివేదికలొస్తాయి. మంచి సలహాలు, సూచనలు కార్యరూపంలో పెడతాం.
సాక్షి : ఈ నెల 16 నుంచి 20 వరకు వీవీఐపీలందరూ పాల్గొంటున్నందున ‘స్వచ్ఛ హైదరాబాద్’ బాగానే సాగుతుంది. ఆ తర్వాత మాటేమిటి?
కమిషనర్: ఇంతటితోనే ఈ కార్యక్రమం ఆగిపోదు. ఇది అవగాహనకు బాగా ఉపకరిస్తుంది. చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాల్లో అందుకు కారణాలేమిటో తెలుస్తుంది. దానిపై దృష్టి సారిస్తాం. పరిష్కారాలు ఆలోచించి అమలు చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాం. ప్రజల్లో అవగాహన వస్తే సమస్య ఉండదు. దానిని సాధించాలి. ఇల్లు లాగే బస్తీ, కాలనీ అన్నీ ‘మనవి’ అనుకునే స్థితికి ప్రజలంతా రావాలి. అవగాహనతో పాటు.. ఆచరణలో దానిని చూపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఈ దిశగా ఆలోచిస్తున్నాం. పరిశుభ్ర, స్వచ్ఛ కాలనీలకూ ప్రోత్సాహకాలిస్తాం.
సాక్షి : ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’లో పాల్గొనే సైనికులెందరు?
కమిషనర్: అధికారులు, సిబ్బంది నేరుగా 36 వేల మంది ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. వీరితో పాటు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల వారు దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భాగస్వాములు కానున్నారు.
సాక్షి : తడి,పొడి చెత్తను వేరుగా వేసేందుకు గృహస్థులందరికీ రెండు రకాలైన డబ్బాలను అందిస్తున్నారా?
కమిషనర్: ఇప్పుడే కాదు. అందుకు సమయం పడుతుంది. ఇప్పుడు వాటిని అందజేయలేం. ఆ దిశగా ఆలోచిస్తాం. కానీ ప్రజలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన ఇంటిని మనమే శుభ్రపరచుకోవాలనేస్పృహ రావాలి. దీనికి ‘స్వచ్ఛ హైదరాబాద్’ వేదిక అవుతుందనే విశ్వాసం ఉంది. అందుకే ఇప్పుడీ కార్యక్రమం చేపట్టాం.
సాక్షి : ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడైనా జరిగిందా?
కమిషనర్: ఇంతవరకు లేదు. ఇదే ప్రథమం. 400 మందికి పైగా రాజకీయ ప్రముఖులు, అఖిల భారత స్థాయి అధికారులు, ఇతరులు ప్రజలతో మమేకమై, వారితో కలిసి పనిచేసే అద్భుత దృశ్యం ఇంతకు ముందెప్పుడూ లేదు. ఇదే ప్రథమం. ఈ కార్యక్రమం ఇతరులకూ ఆదర్శప్రాయంగా మారనుంది.