
గ్రేటర్‌లో ప్లాస్టిక్ భూతం కోరలు చాస్తోంది. పేరుకు నిషేధం అమల్లో ఉన్నా బహిరంగ ప్రదేశాలు, నివాస సముదాయాలు, మార్కెట్లు..మాల్స్..ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. నిత్యం మన నగరంలో రెండు కోట్లకు పైగా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నారు. ఇవి క్రమంగా మహానగరంలోని ప్రధాన నాలాలు, వరద, మురుగునీటి పైపులైన్లలోకి చేరుతుండడంతో మురుగు నీటి ప్రవాహానికి తరచు ఆటంకాలు తలెత్తుతున్నాయి. వేసవి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు ఇటీవల పలు ప్రాంతాల్లో డీసిల్టింగ్ ప్రక్రియ చేపట్టగా...పలు పైపులైన్లు, వరదనీటి కాల్వల్లో వెలికితీసిన వ్యర్థాల్లో 30 శాతం ప్లాస్టిక్ కవర్లే ఉన్నాయి. ఇవి నీటి ప్రవాహాన్ని నిరోధిస్తూ వరదలకు కారణమవుతున్నాయి. నిషేధం అమలుపై జీహెచ్‌ఎంసీ, పరిశ్రమలు, పీసీబీ తదితర విభాగాలు సీరియస్‌గా దృష్టి సారించకపోవడం..ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన లేమి నగరవాసుల పాలిట శాపంగా మారుతోంది.
సాక్షి, సిటీబ్యూరో:నగరంలో ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న కారణంగా అవి వరద, మురుగు నీటి కాలువలు, పైపులైన్లలోకి చేరుతున్నాయి. వీటి వల్ల మురుగు ప్రవాహానికి పలు చోట్ల ఆటంకాలు ఎదురై ప్రధాన రహదారులు, వీధులు మురుగుకూపంగా మారుతున్నాయి.
నిత్యం రెండు కోట్ల ప్లాస్టిక్ కవర్ల వినియోగం..?
గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. ప్రతీ వ్యక్తి దైనందిన జీవితంలో కూరగాయలు, పండ్లు ఇతర నిత్యావసర సరుకులు, షాపింగ్ అవసరాలకు సరాసరిన రెండుచొప్పున వివిధ మందాలు కలిగిన ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నట్లు పర్యావరణ వేత్తలు అంచనావేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రోజుకు సుమారు రెండుకోట్ల ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్లక్రితం వీటి వినియోగం రోజుకు 1.40 కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. వినియోగిస్తున్న కవర్లలోనూ 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల కవర్లే సింహభాగం ఉంటున్నాయి. వీటిపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కడా తగ్గుముఖం పట్టకపోగా క్రమంగా పెరగడం గమనార్హం. ఈ కవర్లు గాలి, నీరు, నేల, భూగర్భజల కాలుష్యానికి ప్రధానంగా కారణమౌతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రక్షాళనలో 30 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే..!
గ్రేటర్ పరిధిలో సుమారు 6 వేల కిలోమీటర్ల మేర మురుగునీటి పైపులైన్లు, మరో 1500 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించి ఉన్నాయి. వేసవి కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాలు ఆయా పైపులైన్లు, నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టాయి. ఈ పనుల్లో భాగంగా తొలగిస్తున్న ఘన వ్యర్థాల్లో సుమారు 30 శాతం ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నట్లు సంబంధిత అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, మాల్స్, రెస్టారెంట్ల నుంచి పెద్దమొత్తంలో ప్లాస్టిక్ కవర్లు తొలుత చెత్తలో అటు నుంచి క్రమంగా మురుగునీటి పైపులైన్లు, నాలాల్లోకి చేరుతుండడంతో మురుగు ప్రవాహానికి తరచూ ఆటంకాలు తలెత్తి మురుగునీరు ఉప్పొంగి సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయి.
తూతూమంత్రంగానే నిషేధం..
గ్రేటర్ పరిధిలో 50 మైక్రాన్లలోపున్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినప్పటికీ పూర్తిస్థాయిలో అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. బల్దియా అధికారులు దాడులు చేసి అక్రమార్కులపై తరచూ జరిమానాలు విధిస్తున్నప్పటికీ వారిలో మార్పు కనిపించడంలేదు. ఇక మహానగరం పరిధిలో సుమారు వెయ్యి వరకు ప్లాస్టిక్ కవర్ల తయారీ సంస్థలుండగా..వీటిలో నిబంధనల ప్రకారం అనుమతి పొందిన కంపెనీలు సగమైనా లేవన్నది పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. అంటే ప్లాస్టిక్ కవర్ల తయారీ మొదలు వినియోగం వరకు ఎక్కడా పటిష్ట నిఘా, నియంత్రణ, కఠిన శిక్షలు, అవగాహన లేకపోవడంతో ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టడంలో ఆయా విభాగాలు చతికిలపడుతున్నట్లు సుస్పష్టమౌతోంది.
జనచేతనే కీలకం..
ప్లాస్టిక్ వినియోగం విషయంలో చట్టాలెన్ని ఉన్నా ప్రజల్లో అవగాహన, చైతన్యమే కీలకమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇంటి నుంచి మార్కెట్లు, షాపింగ్‌కు వెళ్లే సమయంలో పేపర్‌బ్యాగులు, గోనెసంచులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయాలు, మాంసం సహా ఇతర నిత్యావసరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కవర్లలో ఇంటికి తీసుకురావద్దని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాటి మందాన్ని బట్టి విఛ్చిన్నమై పర్యావరణంలో కలిసేందుకు 200–1000 సవత్సరాలు పడుతుండడంతో ఈ పరిణామం పర్యావరణానికేకాదు మానవ ఆరోగ్యంపైనా దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు భూగర్భజలాలను సైతం విషతుల్యంగా మార్చేస్తున్నాయంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment