మంచి.. అటెండర్ చెప్పినా ఆచరిస్తా!
♦ ప్రజల ప్రాధాన్యతలే నా ప్రాధామ్యాలు
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పునర్విభజన ముసాయిదా గందరగోళంగా, తలాతోక లేకుండా ఉందని వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. అడ్డగోలుగా ఓటర్లను జాబితాల్లోంచి తొలగించారని విమర్శలు... రూ. వేల కోట్లతో భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు... ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్‌గా డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. శనివారం సోమేశ్‌కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు.. ప్రాధాన్యతలు తదితర అంశాలపై జనార్దన్‌రెడ్డి ‘సాక్షి’ కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు..
ప్రశ్న: కొత్త కమిషనర్ వస్తే అప్పటి వరకున్న ప్రణాళికలు, ప్రాజెక్టులు దారి మళ్లి కొత్తవి తెరపైకి రావడం జీహెచ్‌ఎంసీలో ఆనవాయితీ. అదే పునరావృతం కానుందా..!
జవాబు: మంచి అనేది ఎక్కడ నుంచి ప్రారంభమైనా పూర్తి చేస్తాను. ఎవరికి పేరు వస్తుందన్నది పట్టించుకోను. బాగుంటే అటెండర్ అభిప్రాయానికైనా విలువిస్తా. బాగలేకపోతే డెరైక్టర్ స్థాయి వారు చెప్పినా పట్టించుకోను. అవసరమైతే స్వల్ప మార్పులుంటాయేమో కానీ నా పథకం కాదని నిలిపివేయను.
ప్రశ్న: నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలని మీ డ్రీమ్?
జవాబు: పని పెద్దదా.. చిన్నదా అనే ఆలోచనుండదు. చేసే పని ప్రజాబాహుళ్యానికి, ఎక్కువ మందికి ఉపయోగపడేలా ఉండాలని ఆలోచిస్తాను. డ్రీమ్ అంటే స్కైవేలు.. భారీ నిధులతో చేపట్టే పనులే ఉండాలని లేదు. పనులు చిన్నవే కావచ్చు కానీ.. అప్రాధాన్యమైనవి మాత్రం కావు. వాటి వల్ల ఎక్కువ మందికి సమస్యలు తీరతాయి. అలాంటి వాటి గురించి ఆలోచిస్తాను.
ప్రశ్న: మీ తొలి ప్రాధాన్యతలు.. ?
జవాబు: ప్రజల ప్రాధాన్యతలే నా ప్రాధామ్యాలు. మొదటిది పారిశుద్ధ్యం. రెండోది రహదారులు. ఆ తర్వాత సదుపాయవంతమైన జీవనానికి కల్పించాల్సిన మౌలిక వసతులు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఇంటింటికి రెండు చెత్తడబ్బాలు అందుబాటులోకి తేనున్నాం. ఇక రహదారులు మన్నికగా ఉండేందుకు వైట్‌టాపింగ్ ఆలోచనలు చేశారు. వీలైనన్ని మార్గాల్లో వాటిని నిర్మిస్తాం.
ప్రశ్న: పారిశుద్ధ్యం మెరుగుకు ఏం చేయనున్నారు?
జవాబు: గ్రేటర్‌లోని కాలనీ సంఘాలు, ప్రజలతో పారిశుద్ధ్య కార్మికుల పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తాం. కార్మికులవి, సూపర్‌వైజర్లవి ఫోన్ నంబర్లు కూడా ప్రజలకిస్తాం. తద్వారా తమ ఇంటిముందు వీధి ఊడ్చేదెవరో ప్రజలకు తెలుస్తుంది. పనిచేయని రోజుల్లో అడిగేందుకు వీలుంటుంది.
ప్రశ్న: క్షేత్రస్థాయి పర్యటనలు ఏ జోన్, డివిజన్ నుంచి ప్రారంభించనున్నారు ?
జవాబు: గ్రేటర్‌లో 150 డివిజన్లున్నాయి. వాటి పేర్లతో లాటరీ తీస్తాను. ఏరోజు ఏ డివిజన్ వస్తే ఆరోజు అక్కడ తనిఖీలు చేస్తాను. ముందస్తు సమాచారం ఉంటే వాస్తవ పరిస్థితి తెలియకుండా జాగ్రత్త పడతారు.
ప్రశ్న: తొలగించిన 1600 మంది కార్మికుల విషయంలో ఏంచేయనున్నారు ?
జవాబు: ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఈ అంశం ఉంది. తగిన పరిష్కారం చూపుతాం.
ప్రశ్న: డీలిమిటేషన్.. విశ్వనగర ప్రాజెక్టులు.. ఇతరత్రా సవాళ్ల తరుణంలో బాధ్యతలు చేపడుతున్నారు. ఎలా భావిస్తున్నారు ?
జవాబు: సమస్యలున్నప్పుడు.. పరిష్కారమూ ఉంటుంది. స్థానిక సంస్థల్లో పాలకులు ఎంత ముఖ్యమో, పురజనులు అంతే ముఖ్యం. ప్రజలందరి సహకారంతో పనిచేస్తా.
ప్రశ్న: సంక్షేమం.. అభివృద్ధి దేనికి ప్రాధాన్యం ?
జవాబు: దేని దారి దానిదే. రెండూ జరగాల్సిందే. హైటెక్‌సిటీలోనూ స్లమ్స్ ఉన్నాయి. సంపన్న కాలనీలు, పేదల మురికివాడల మధ్య చాలా అంతరాలున్నాయి. పేదలకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఆ దిశగా కృషి చేస్తాను.
ప్రశ్న: ఓట్ల తొలగింపుపై చెలరేగిన దుమారాన్ని ఎలా పరిష్కరిస్తారు.
జవాబు: పోలింగ్‌కు ముందు వారం రోజులు మినహా ఎప్పుడైనా ఓటర్లుగా నమోదుకు అవకాశం ఉంది. జాబితాలో లేనంత మాత్రాన ఓటు పోయిందనే భయం అవసరం లేదు. పేరు లేని వారు దరఖాస్తు చేసుకుంటే నమోదు చేస్తాం.
వనరుల వినియోగం..
అంతకుముందు మీడియాతో మట్లాడుతూ.. లేఔట్లలోని ఖాలీ ప్రదేశాల్లో పార్కులు, ఆటస్థలాల ఏర్పాటుతో అవి ఆక్రమణలకు గురి కాకుండా కాపాడతామని, మహిళలు, నిరుద్యోగులకు అధికమొత్తాల్లో బ్యాంకు రుణాలిప్పిస్తామని తెలిపారు. ఉన్న వనరుల్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకునే చర్యలు చేపడతామన్నారు. అంకితభావంతో పనిచేసేందుకు, సమయపాలన పాటించేందుకు బయోమెట్రిక్ వంటి విధానాల కంటే, కౌన్సిలింగ్ వంటి చర్యలు మంచి ఫలితాన్నిస్తాయన్నారు. బలవంతంగా రుద్దకుండా స్వచ్ఛందంగా స్వీయ సమీక్షతో ఉద్యోగుల పనితీరు మెరుగుపరచే ప్రయత్నం చేస్తామన్నారు. అన్నిశాఖల వారు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.