బంగారు వాకిలి తాళం మొరాయింపు
శ్రీవారి ఆలయంలో హైరానా
- కట్‌చేసి తాళం తొలగింపు
- యథావిధిగా సుప్రభాత సేవ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం అనుకోని సంఘటన ఎదురైంది. వేకువజామున సుప్రభాత వేళకు ముందు బంగారు వాకిలికి అమర్చిన తాళం మొరాయించింది. వెల్డింగ్ యంత్రంతో కట్‌చేసి తాళం తొలగించి యథావిధిగా సుప్రభాత సేవను నిర్వహించారు. గర్భాలయానికి సుమారు 70 అడుగుల ముందు బంగారు వాకిలి ఉంది. ప్రతిరోజూ రాత్రి 12.30 గంటలకు ఏకాంత సేవ ముగిసిన వెంటనే బంగారు వాకిలి ద్వారం మూసివేసి మూడు తాళాలు వేస్తారు. అందులో ఒకదానికి సీలు వేస్తారు. తాళం చెవులు జీయర్, అర్చకులు, ఆలయ పేష్కారు వద్ద ఉంటాయి. మరుసటి రోజు వేకువన 2.20 గంటలకు సుప్రభాత సేవకు ముందు తాళాలు తొలగించి సేవను నిర్వహిస్తారు.
బుధవారం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బృందం కూడా సుప్రభాత సేవకు హాజరైంది. దీంతో ఆలయ బంగారు వాకిలిని ఐదు నిమిషాలకు ముందే 2.15 గంటలకు తెరిచేందుకు అర్చకులు ప్రయత్నించారు. రెండు తెరుచుకున్నాయి. సీలు వేసిన తాళంలోని లివర్స్ తెగిపోవడం వల్ల అర్చకులు, అధికారులు ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. అప్పుడే శ్రీలంక బృందంతో ఆలయంలోకి ప్రవేశించిన ఈవో సాంబశివరావుకు సమాచారం ఇచ్చారు. ఆవయన ఆదేశాలతో కట్టర్‌తో తాళాన్ని కోసి తొలగించారు. అప్పటికే 2.48 నిమిషాలైంది. తర్వాత గర్భాలయంలో వైదిక కార్యక్రమాలు జరిగాయి.ఈ సంఘటనలో మానవ తప్పిదం లేకపోయినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై ఈవో ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
జాప్యంలేదు : డిప్యూటీ ఈవో
‘‘సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారి మీదే ప్రమాణం చేస్తున్నా.. శ్రీవారి సుప్రభాత సేవ 3 గంటలకే ప్రారంభమైంది’’ అని ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. జాప్యం జరిగిందన్నది అవాస్తవమన్నారు.