ట్రెజరీకి తాళాలు
Published Fri, Aug 12 2016 11:01 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
సాక్షి, విశాఖపట్నం : ట్రెజరీకి మళ్లీ తాళాలు పడ్డాయి. చరిత్రలో తొలిసారిగా ఆన్‌లైన్‌లోనే సర్వర్‌ను బంద్ చేశారు. దీంతో ట్రెజరీ ద్వారా జరిపే చెల్లింపులన్నింటికి బ్రేకులు పడ్డాయి. రోజుకు రూ.20కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోగా..చివరకు తొలిసారిగా అంత్యక్రియల ఖర్చుల కోసం జరిపే చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు 13 సబ్ ట్రెజరీ కార్యాలయాలున్నాయి. జిల్లా కార్యాలయంలో రోజుకు 200 నుంచి 500 వరకు బిల్లులు పాస్ చేస్తుంటారు. అదే ఒక్కొ సబ్ ట్రెజరీ కార్యాలయం పరిధిలో రోజుకు 30 నుంచి వంద వరకు ఉంటాయి. జిల్లా ట్రెజరీ కార్యా లయ పరిధిలో రోజుకు ఐదారుకోట్లవరకు చెల్లింపులు జరుగుతుంటాయి.అదే ఒక్కో సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధిలో రోజుకు రూ.50 లక్షల నుంచి కోటిన్నర వరకు ఉంటాయి. జీతభత్యాలు కాకుండా జిల్లాలో రోజువారీ చెల్లింపులు రూ.20కోట్ల వరకు ఉంటాయి.ప్రతిరోజు శాఖల వారీగా వచ్చే బిల్లులకు తొలుత ఆయా ట్రెజరీ కార్యాలయాల్లో టోకన్ ఇస్తారు. మూడు దశల్లో వాటిని ఆడిట్ చేసిన తర్వాత పాస్ చేస్తారు. బ్యాంక్‌లకు లిస్ట్‌లు పంపిస్తారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆతర్వాత 25 బిల్లులు ఓ కట్టగా పంపిస్తారు. అలా వచ్చిన బిల్లులు, ఆన్‌లైన్‌లో తమ వద్దకు వచ్చిన లిస్టుల్లో ఉన్న బిల్లులను సరి చూసుకుని బ్యాంకులు పేమెంట్స్ చేస్తుంటాయి.
సాధార ణంగా ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ప్రతి ఏటా మార్చి నెలాఖరున ట్రెజరీపై ఆంక్షలు విధిస్తుంటారు. ఎవరైనా ఉద్యోగి లేదా రిటైర్డ్ ఉద్యోగి చనిపోతే అంత్యక్రియలకయ్యే ఖర్చుల కోసం ముందస్తుగా జరిపే చెల్లింపులతో పాటు కొన్ని రకాల పేమెంట్స్ వరకు మినహాయింపు నిస్తారు. కానీ ట్రెజరీ చరిత్రలో తొలిసారిగా మొత్తం చెల్లింపులన్నింటిని బంద్ చేసారు. పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ ద్వారా జరిపే చెల్లింపులపై ఆంక్షలు విధించినట్టు ట్రెజరీవర్గాలు చెబుతున్నాయి. పుష్కరాల సాకుతో ట్రెజరీపై ఆంక్షలు విధించడంతో సాధారణ చెల్లింపులకు సైతం బ్రేకులు పడ్డాయి. ట్రెజరీ శాఖకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్‌లోనే ఓప్రత్యేక సర్వర్ ఉంటుంది. ఈసర్వర్ ఆధారంగానే ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరుపుతుంటారు. ప్రస్తుతం ఈసర్వర్‌ను ఆపేశారని ట్రñ జరీ అధికారులు చెబుతు న్నారు. దీంతో రోజువారీ వివిధ శాఖలకు సంబంధించి జరిపే చెల్లింపులతోపాటు ఉద్యోగ వర్గాలకు ఇచ్చే లీవ్ ఎన్‌కేష్‌మెంట్ పేమెంట్స్, రిటైర్డ్ ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ వంటి సెటిల్‌మెంట్స్‌ను సైతం నిలిపివేశారు. అలాగే ప్యూనరల్ పేమెంట్స్‌తోపాటు రోజువారీ ఖర్చు లకు సంబంధించిన బిల్లులకు సైతం బ్రేకులుపడ్డాయి. ఇలా రోజుకు జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వాదేశాల మేరకే గురువారం నుంచి సర్వర్‌ను ఆపేశారని చెబుతున్నారు.పుష్కరాలయ్యే వరకు ఈ సర్వర్ పనిచేయదని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేదని అధికారులంటున్నారు.
Advertisement
Advertisement