కొత్త ముఖ్య కార్యదర్శిని నియమించిన కేజ్రీవాల్
రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్
నేడు రాష్ట్రపతితో సీఎం కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఐఏ ఎస్ అధికారులు నలిగిపోతున్నారు. ఢిల్లీ తాత్కాలిక ప్రధానకార్యదర్శిగా శకుంతలా గామ్లిన్ నియామకం వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం బాగా ముదిరిపోయింది. గామ్లిన్ నియామకపు ఉత్తర్వులిచ్చిన ముఖ్యకార్యదర్శి(సేవలు)అనిందో మజుందార్ ముందు గా బలిపశువయ్యారు. సోమవారం ఉదయం మజుందార్ సచివాలయంలోని ఏడో అంతస్థులోని తన కార్యాలయానికి వచ్చేసరికి కార్యాలయానికి తాళం వేసి ఉంది. ఇదేమని మజుందార్ అక్కడున్న సిబ్బందిని అడిగినప్పుడు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన కార్యాలయానికి తాళం వేసినట్లు సమాచారమిచ్చారు.
మజుందార్ శనివారం బదిలీ చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఆయన స్థానంలో తనకు సన్నిహితుడైన మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్‌ను కేజ్రీవాల్ నియమించారు. ఈ నియామకం చెల్లదంటూ జంగ్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ప్రభుత్వంలో ఉన్నతాధికారులను నియమించాలన్నా, బదిలీ చేయాలన్నా తుది అధికారం తనదేనని ఆ లేఖలో జంగ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి గవర్నర్ రాసిన లేఖ మీడియాకు లీక్ కావటం మరింత అగ్గి రాజేసినట్లయింది. గవర్నరే తన లేఖను లీక్ చేయటం ఆశ్చర్యమని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. మరోవైపు తన కార్యాలయానికి తాళం వేయటంపై అనిందో మజుందార్ తాత్కాలిక ప్రధానకార్యదర్శి గామ్లిన్‌కు ఫిర్యాదు చేశారు.
గోయల్‌తో గామ్లిన్ భేటీ
మరోపక్క తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శకుంతలా గామ్లిన్ సోమవారం ఉదయం కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్‌తో సమావేశమయ్యారు. ఆమెతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ, హోం శాఖలో జాయింట్ సెక్రటరీ రాకేశ్‌సింగ్‌లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తన నియామకంపై నెలకొన్న వివాదంపై గోయల్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేయటానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.
‘మీరు రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తున్నారు’
మరోవైపు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు ఘాటైన పదజాలంతో లేఖ రాశారు. కీలకమైన ఉన్నతాధికారుల నియామకంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రధానమంత్రికి కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాస్తారని తెలిపారు.
ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి తాళాలు
Published Tue, May 19 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement
Advertisement