పిజ్జా కోసం..
లండన్: పిల్లలు తమకు కావాల్సింది సాధించుకోవడంకోసం వారి మంకుపట్లు, పేచీలు అందరికీ తెలిసిన విషయమే. కానీ లండన్లో 11 ఏళ్ల పిల్లాడు పిజ్జా కోసం తల్లిదండ్రులకు చుక్కలు చూపించాడు. తాను అడిగిన పిజ్జా కొనివ్వలేదనే కోపంతో లోపల గడియ వేసుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా తలుపు తీయలేదు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి పిల్లాడిని బతిమలాడి, బామాలితే తప్ప తలుపు తీయలేదు.
వివరాల్లోకి వెడితే లంచ్లోకి తనకు పిజ్జా కావాలని అడిగాడో గడుగ్గాయి. అయితే వాళ్లమ్మ పిజ్జాకు బదులుగా పాస్తా చేసి పెట్టింది. దీంతో పిల్లాడు నాకు పిజ్జానే కావాలంటూ పేచీ మొదలుపెట్టాడు. ఎంత బుజ్జగించినా వినిపించుకోలేదు. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు కొద్దిసేపు బయటికి వెళ్లారు. అంతే లోపల్నించి తలుపు తాళం వేసుకున్నాడు. మిమ్మల్ని లోపలికి రానీయంటూ మంకు పట్టు పట్టాడు. పిల్లాడితో తలుపు తీయించేందుకు ప్రయత్నించి విఫలమైన తల్లిదండ్రులు చివరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెల్లిగా బాల్కనీలోకి ప్రవేశించిన పోలీసులు బాలుడిని ఒప్పించి తలుపు తీయించారు.