గాలి, నీరు తర్వాత మనిషి అత్యధికంగా ఉపయోగించే, అత్యధికంగా దుర్వినియోగం చేసే ప్రకృతి వనరు ఇసుక! భూమిపై మానవుడు అత్యధికంగా తవ్వితీసుకునేది కూడా ఇసుకే! అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న మనిషి అక్రమ తవ్వకాల ప్రభావంతో ఇసుక కొరత పొంచి ఉందంటోంది ఐరాస నివేదిక.
ఎడారుల్లో ఇసుక తుఫానులు ముంచెత్తుకొస్తాయి. అవి వచ్చినప్పుడు ప్రజా జీవనం అతలాకుతలం అవుతుంది. అయితే ప్రపంచమంతటినీ ఇబ్బంది పెట్టే తుఫాను ఇసుక కొరత రూపంలో రాబోతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇసుక కొరత పెరిగిపోతోందని, తక్షణమే దీనిపై స్పందించకుంటే సమస్యలు తప్పవని, అందుకే తస్మాత్ జాగ్రత్త అని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇసుక సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే బీచ్‌ల తవ్వకంపై నిషేధం సహా పలు చర్యలు తీసుకోవాలని కోరింది. పలు దేశాల్లో ఇసుక వాడకంపై ప్రభుత్వ ఆజమాయిషీ లేదని, ఈ పద్ధతి సరికాదని తెలిపింది.
ప్రపంచంలో అతిగా తవ్వితీసే ఉత్పత్తుల్లో ఇసుక ప్రథమస్థానంలో నిలుస్తోంది. చాలా దేశాల్లో ఇసుక అక్రమ మైనింగ్ సాధారణంగా మారింది. భౌగోళిక ప్రక్రియల కారణంగా ఇçసుక ఏర్పడుతుంది. ఇందుకు వందల సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇలా ఉత్పత్తయ్యే ఇసుక కన్నా మనిషి తవ్వేస్తున్న ఇసుక పరిమాణం ఎక్కువని ఐరాస అనుబంధ సంస్థ యూఎన్‌ఈపీ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఇసుకపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకుంటే భవిష్యత్ తరాల అవసరాలకు తగిన లభ్యత ఉండదని హెచ్చరించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందిస్తే సంక్షోభం రాకముందే అరికట్టవచ్చని యూఎన్‌ఈపీ ఎకానమీ డివిజన్ డైరెక్టర్ షెహీలా అగర్వాల్ ఖాన్ చెప్పారు.
మనిషికి 17 కిలోలు
రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గ్లాసు, కాంక్రీట్, నిర్మాణ పదార్ధాల వాడకం మూడురెట్లు పెరిగింది. దీనివల్ల వీటి ముడిపదార్ధమైన ఇసుక వాడకం ఏడాదికి 5వేల కోట్ల టన్లుకు చేరింది. అంటే సరాసరిన ప్రతి మనిషి రోజుకు 17 కిలోల ఇసుక వాడుతున్నట్లవుతోంది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో నదులు, సముద్రతీరాలు ధ్వంసమవడమే కాకుండా చిన్నద్వీపాలు కనుమరుగవుతున్నాయని ఐరాస నివేదిక తెలిపింది. పర్యావరణ పరిరక్షణలో ఇసుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వరదల నుంచి రక్షణగా నిలుస్తుంది. భూముల క్రమక్షయాన్ని తగ్గిస్తుంది. ఇసుక అక్రమ వాడకం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసి జీవవైవిధ్యతను కనుమరుగు చేస్తుంది.
ఇప్పటికే భూమిపై కొన్ని చోట్ల ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఉదాహరణకు దక్షిణాసియాలో పొడవైన మీకాంగ్ నదిలో ఇసుక అక్రమమైనింగ్ కారణంగా డెల్టా ప్రాంతమంతా మునిగిపోయింది. పలు సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారాయి. శ్రీలంకలోని నదిలో ఇసుక తవ్వకాలు నీటి ప్రవాహ దిశనే మార్చివేశాయి. దీంతో నదిలోనించి సముద్రంలోకి వెళ్లకుండా సముద్రపు నీరు నదిలోకి రావడం మొదలైంది. ప్రపంచమంతా ఈ పరిస్థితులు రాకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదిక చర్చించింది. బీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను నిషేధించాలని సూచించింది.
ఇలా ఏర్పడుతుంది..
శిలల క్రమక్షయంతో ఇసుక ఏర్పడుతుంది. ఇందుకు వందల, వేల సంవత్సరాల సమయం పడుతుంది. క్వార్ట్›్జశిలలు శిధిలమయ్యేందుకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. నదులు, ప్రవాహాల్లో నీటివేగం రాళ్లను కదిలిస్తుంది. దీనివల్ల అవి ప్రవాహం వెంట దొర్లుకుంటూ రాపిడి, క్రమక్షయం చెందుతూ వస్తాయి. వీటివల్ల ఇసుక మేటలు ఏర్పడతాయి. సముద్ర తీరాల్లో అలల ప్రభావం వల్ల ఇసుక ఉత్పత్తి అవుతుంది. బీచ్‌లో ఇసుక రంగు ఎర్రగా ఉండేందుకు ఐరన్ ఆక్సైడ్ కారణమని నిపుణులు తెలిపారు. సాధారణ ఇసుక రేణువు వ్యాసం 0.3 నుండి 2 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. ఎడారి ఇసుక సమృద్ధిగా ఉన్నప్పటికీ, అది కాంక్రీటు తయారీకి సరిపోదు. అందుకే నదులు, బీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుపుతారు.
Sand Crisis: ముంచుకొస్తున్న ఇసుక కొరత
Published Wed, May 4 2022 5:19 AM | Last Updated on Wed, May 4 2022 9:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment