సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో జూలై 13, 14 తేదీల్లో న్యూయార్క్‌లో జరగనున్న ప్రపంచ ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్’లో ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఈ అవకాశం లభించిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కావడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాల్లో ఆయన వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
భారతదేశం జీ–20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ‘జీ–20 దేశాల టూరిజం చైర్’హోదాలో కిషన్ రెడ్డి ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఇటీవలే గోవాలో జీ–20 దేశాల పర్యాటక మంత్రులు, 9 ప్రత్యేక ఆహా్వనిత దేశాల మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, ఈ సందర్భంగా భారతదేశం చేసిన ప్రతిపాదనలను సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలు, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు) ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ఇతివృత్తం (థీమ్)తో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి వేదికగా ఈ సమావేశాలు జరగనున్నాయి. పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో సాధించిన ప్రగతిని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ఈ హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ వేదికగా సమీక్షించనున్నారు. ఈ ఏడాది ‘కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటక రంగాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఉద్దేశించిన 2030 ఎజెండా అన్ని స్థాయిల్లో అమలు’పై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment