ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణరంగం ప్రస్తుతం తీవ్ర ఇసుక కొరతను ఎదుర్కొంటోంది. భవిష్యత్‌లో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇసుక నిల్వల్లో పనికొచ్చేది మాత్రం కొంతే ఉంటుందని, ఆ ఇసుక నిల్వలు వేగంగా అడుగంటి పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరుల్లో నీరు తర్వాత స్థానం ఇసుకదే. షాపింగ్ మాల్స్, ఆఫీస్‌లు, అపార్ట్‌మెంట్లు.. ఇలా ఒకటేమిటి ఏది నిర్మించాలన్నా ఇసుక ప్రధాన ముడిసరుకు. అంతేకాదు స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ల నుంచి కిటీకీల గ్లాస్‌ల తయారీ వరకూ.. కంప్యూటర్లలో చిప్స్ నుంచి ఇంట్లో వినియోగించే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులోనూ ఇసుక మరో అవతారం సిలికా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సరాసరి 50 బిలియన్ టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని లెక్కతేల్చారు.
పట్టణీకరణతోనే ముప్పు..
మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పట్టణీకరణ జరుగుతుండటమే ఇసుక కొరతకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి ఏటా లక్షలాది మంది పట్టణాల బాట పడుతున్నారు. 1950 నుంచి ఇప్పటి వరకూ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల్లో నాలుగురెట్ల జనాభా పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న 4.2 బిలియన్ల జనాభాకు వచ్చే మూడు దశాబ్దాల్లో మరో 2.5 బిలియన్ల జనాభా తోడవుతుందని ఐరాస అంచనా వేసింది. వీళ్లందరికి మౌలిక సదుపాయాలు కల్పించే నిర్మాణాల్లో భారీ ఎత్తున ఇసుక వినియోగించాల్సి ఉంటుంది. భారతదేశంలో అయితే 2000 సంవత్సరం నుంచి ఏటా ఇసుక వినియోగం మూడు రెట్లు పెరుగుతూ వస్తోంది. 20వ శతాబ్దం మొత్తంలో అమెరికా వినియోగించినంత ఇసుక ఈ ఒక్క దశాబ్దంలోనే చైనా వాడేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఆకాశ హార్మ్యాలను నిర్మించే దుబాయ్ ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది.
తీరంలో పర్యావరణానికి ముప్పు..
సముద్రంలో ఇసుక తవ్వకంతో కెన్యా, పర్షియన్ గల్ఫ్, ఫ్లోరిడా తీరంలోని అత్యంత విలువైన కోరల్ రీఫ్స్‌కు ముప్పు ముంచుకొచ్చింది. ఇసుక తవ్వకంతో ఏర్పడ్డ బురద వల్ల సముద్రంలో సహజ వాతావరణంలో బతికే జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అలాగే నదుల్లో ఇసుక మైనింగ్‌తో నీటి జీవులు ఊపిరాడక చనిపోతున్నాయి. క్వాలిటీ సిలికా మైనింగ్ కోసం ఏటా వేలాది ఎకరాల అడవులను నరికేస్తున్నారు. ఇసుక మైనింగ్ వల్ల వియత్నాంలోని మెకాంగ్ డెల్టా మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. కంబోడియా, లావోస్‌లో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల నదుల గట్లు దెబ్బతిని పొలాలు, ఇళ్లు ఆ నదుల్లో కలసిపోతున్నాయి. అయెయార్‌వాడీ నదిలో ఇసుక తవ్వకం వల్ల తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని మయన్మార్ రైతులు వాపోతున్నారు. శాండ్ మైనింగ్‌తో 2000వ సంవత్సరంలో తైవాన్‌లో ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఆ తర్వాత ఏడాది కూడా ఇలాంటి తవ్వకాలతో పోర్చుగల్‌లో బ్రిడ్జి కూలడం వల్ల బస్సులో వెళ్తున్న 70 మంది మృత్యువాత పడ్డారు.
కృత్రిమ ఇసుక దీవులు
ఉన్న స్థలం చాలకపోవడంతో సింగపూర్ గడిచిన 40 ఏళ్లలో 130 చదరపు మైళ్ల మేర సముద్రాన్ని ఇసుకతో నింపి ఇళ్లు నిర్మించింది. దీని కోసం ఇతర దేశాల నుంచి భారీగా ఇసుకను దిగుమతి చేసుకుంది. ఇలాగే దుబాయ్‌తో పాటు ఇతర దేశాలు కూడా సముద్రంలో నయా నగరాలను ఇసుకతో నిర్మిస్తున్నాయి. ఓ డచ్ పరిశోధన బృందం లెక్కల ప్రకారం 1985 నుంచి ఇప్పటి వరకూ వివిధ దేశాలు ఇసుక వినియోగించి తీరంలో 13,563 చదరపు కిలోమీటర్ల మేర కృతిమ భూమిని సృష్టించాయి.
ప్రత్యామ్నాయమే దారి..
ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక వినియోగాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. కాంక్రీట్‌లో ఇతర ముడిసరుకులను వినియోగించడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఫ్లైయాష్, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బూడిద, ఆయిల్ పామ్ పొట్టు, ఊక తదితరాలను ఇసుకకు ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు. రీసైకిల్ కాంక్రీట్‌ను మరింత సమర్థంగా ఉపయోగించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే నదుల్లో మైనింగ్‌కు స్వస్తిపలికారు. ఇతర దేశాలు దీనిని అనుసరించడం కష్టమైనా.. నదులకు జరిగే నష్టాన్ని నివారించడానికి నిర్మాణ రంగం ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇటీవల తన నివేదికలో పేర్కొంది.
– ఏపీ సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment