కొత్త ఇసుక పాలసీ-2016లో ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన అంశాలను పొందుపర్చింది.
సాక్షి, హైదరాబాద్: కొత్త ఇసుక పాలసీ-2016లో ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన అంశాలను పొందుపర్చింది. ఈ పాలసీ అయోమయంగా, అస్తవ్యస్తంగా, వాస్తవాలకు భిన్నంగా ఉందని చెప్పడానికి అందులో పేర్కొన్న అంశాలే నిదర్శనం. కొత్త రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అవసరమని, ఇందుకోసం ఇసుక రీచ్‌లను వేలం వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ ఆర్జన ప్రధానాంశం కాదని మరోచోట వక్కాణించింది. ఈ రెండు అంశాలు పరస్పరం భిన్నంగా ఉండటం గమనార్హం. నిర్మాణ రంగం అభివృద్ధికి, ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను అందుబాటులోకి తేవడానికి కొత్త విధానానికి రూపకల్పన చేసినట్లు సర్కారు వెల్లడించింది. నిజంగా ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను అందుబాటులోకి తేవాలంటే రీచ్‌లను వేలం వేయరాదు.
సీనరేజి మాత్రమే వసూలు చేసి ఇసుకను అందించేందుకు వీలుగా గనుల శాఖ ద్వారానే రీచ్‌లను నిర్వహించాలి. లేదా డ్వాక్రా సంఘాలకే బాధ్యత అప్పగించాలి. సీనరేజి మాత్రమే వసూలు చేసి ఇసుక సరఫరా చేస్తే అక్రమ తవ్వకాలకు అవకాశమే ఉండదు. సహజ సంపదను గంపగుత్తగా వేలం వేసి గరిష్ట ధర నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల ఇసుక ప్రజలకు తక్కువ ధరకు ఎలా లభిస్తుందని ప్రశ్నిస్తున్నాయి.
ఎండ్లబండ్లు ఎక్కడున్నాయో!
గ్రామాలకు సమీపంలో ఉన్న వాగులు, వంకల్లోని(థర్డ్ ఆర్డర్ రీచ్‌లు) ఇసుకను స్థానికులు సొంత అవసరాలకు పంచాయతీ కార్యదర్శి అనుమతితో ఉచితంగా తీసుకెళ్లే విధానం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎత్తివేసింది. ఈ రీచ్‌లలోని ఇసుకను స్థానికులు సొంత అవసరాలకు సీనరేజి, డీఎంఎఫ్ చెల్లించి తీసుకెళ్లే వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీలో పేర్కొంది.
అయితే ఇసుకను ట్రాక్టర్లు, లారీల్లో కాకుండా ఎడ్లబండ్లలోనే తీసుకెళ్లాల్సి ఉంటుందని నిబంధన పెట్టింది. ప్రస్తుతం గ్రామాల్లో ఎడ్లబండ్లు లేవు. దుక్కి దున్నడం సహా అన్నింటికీ ట్రాక్టర్లనే ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక కోసం ఎడ్లబండ్లను ప్రజలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో ప్రభుత్వానికే ఎరుక! అని పంచాయతీరాజ్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.