ఇసుక రేవులకు ఈ-వేలం
కొత్త ఇసుక విధానం-2016 జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇసుక రేవులను ఈ-వేలం కమ్ ఈ-టెండర్ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలం-టెండర్ ద్వారా రేవులను కైవసం చేసుకున్న వారు క్యూబిక్ మీటర్ ఇసుకను గరిష్టంగా రూ.550కి (రవాణా వ్యయం అదనం) విక్రయించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం-2016ను ప్రకటిస్తూ శుక్రవారం జీఓ ఎంఎస్ 19, 20 జారీ చేసింది. ఇసుక రేవుల కేటాయింపులో పారదర్శకత కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఈ-పర్మిట్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది.
నదుల ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుక తయారీ, వినియోగాన్ని పోత్సహించడం కొత్త ఇసుక విధానంలో ప్రధాన అంశమని తెలిపింది. ఇసుక వినియోగం తగ్గింపు లక్ష్యంగా ఫ్లైయాస్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తామంది.విధానాన్ని సమీక్షించేందుకు సీఎస్ అధ్యక్షతన గనుల శాఖ సంచాలకుడు సభ్య కార్యదర్శిగా పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి భేటీ కావాల్సి ఉంటుంది. కొత్త ఇసుక విధానం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
జేసీ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ
జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి శాండ్ కమిటీ(డీఎల్‌ఎస్సీ) ఏర్పాటు చేస్తారు. ఇందులో జిల్లా పరిషత్ సీఈఓ, గనుల శాఖ సహాయ సంచాలకులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, డ్వామా పీడీ, నీటిపారుదల శాఖ ఈఈ, గ్రామీణ నీటి సరఫరా ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, భూగర్భ జలశాఖ ఉప సంచాలకులు, రెవెన్యూ డివిజనల్ అధికారి సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ఇసుక తవ్వకాలకు అనుకూలంగా ఉన్న రీచ్‌లను గుర్తించి, వాటిలో ఏ మేరకు ఇసుక తవ్వవచ్చో నిర్ధారిస్తుంది. కనీస వేలం ధర నిర్ణయించి టెండర్లను ఆహ్వానిస్తుంది. ఈ-వేలం కమ్ ఈ-టెండర్లను మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎంఎస్‌టీసీ) నిర్వహిస్తుంది. ఆన్‌లైన్‌లోనే టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
కనీస వేలం ధర రూ.110
క్యూబిక్ మీటర్ ఇసుకను గరిష్టంగా రూ.550కి సరఫరా చేయాలన్నది పాలసీ. ఇందులో 15 నుంచి 20 శాతం కనీస వేలం ధరగా నిర్ణయిస్తారు. అంటే కనీస వేలం ధర రూ.110 అవుతుంది. దీనిని ప్రభుత్వ ధరగా నిర్ణయిస్తారు. టెండర్ ఖరారు చేసిన మరుసటి పనిదినమే సంబంధిత రీచ్‌లోని మొత్తం ఇసుక ఆధారంగా 25 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తదుపరి 75 శాతాన్ని 45 రోజుల్లో చెల్లించాలి.
టెండర్ నిబంధనలివీ..
ఇసుక రీచ్‌ల కేటాయింపు కోసం మొదట టెక్నికల్ బిడ్డింగ్ ఉంటుంది. రెండేళ్లు ఆదాయపు పన్ను చెల్లించడంతోపాటు ప్రభుత్వానికి సీనరేజి, ఇతర బకాయిలు ఉండని వారే టెక్నికల్ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అర్హులు. ఇందులో అర్హత సాధించిన వారే ప్రైస్ బిడ్‌లో పాల్గొనేందుకు అర్హులు. టెక్నికల్ బిడ్డింగ్‌లో మూడు సంస్థలే అర్హత సాధిస్తే.. దాన్ని నిలిపివేసి మళ్లీ నోటిఫిషన్‌తో దరఖాస్తులను ఆహ్వానించాల్సి ఉంటుంది.ఇదే పరిస్థితి పునరావృతమైతే డీఎల్‌ఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది.
టెక్నికల్ బిడ్డింగ్‌లో పాల్గొనేవారు రీచ్‌లోని ఇసుక విలువలో ఒక శాతం లేదా రూ.లక్ష ఎర్నెస్ట్ మనీ డిపాజిట్(ఈఎండీ)గా చెల్లించాలి. ఒక్కో కాంట్రాక్టర్ రెండు రీచ్‌లకు మించి టెండర్లు వేయరాదు.టెక్నికల్ బిడ్డింగ్‌లో అర్హత సాధిం చినవారు ప్రైస్ బిడ్‌లో పాల్గొనకపోతే వారు చెల్లించిన ఈఎండీని వదులుకోవాల్సిందే.