Sand policy -2016
-
నాపై కేసు కోర్టులో ఉంది..స్పందించను
హైదరాబాద్ : కాంగ్రెస్ వ్యక్తిగా కాదు భారతీయునిగా మాత్రమే మాట్లాడుతున్నానని, తనపై ఉన్న కేసు కోర్టులో ఉందని,దానిపై స్పందించదలచుకోలేదని పంజాబ్ మంత్రి , మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా తాను దేశానికి ఎంతో సేవ చేశానని చెప్పారు. పాలిటిక్స్ అంటేనే తనకు అత్యంత ఇష్టమని, రాజకీయాలను ఒక ప్రొఫెషనల్‌గా కాకుండా ఒక మిషన్‌గా భావిస్తానని అన్నారు. ప్రజల జీవితాలను మార్చే విధంగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటానని వెల్లడించారు. తెలంగాణలో ఇసుక పాలసీ అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. అక్రమాలు అరికట్టడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఆదాయం ఎన్నో రెట్లు పెరిగిందని తెలంగాణ ఇసుక పాలసీ నిరూపించిందని చెప్పారు. రెండు నదులు ఉన్న తెలంగాణలో ఇసుక రాబడి రూ.1300 కోట్లు ఉంటే 4 నదులు ఉన్న పంజాబ్ రాబడి ఎంత ఉండవచ్చునో అర్థం అవుతుందని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ మాఫియాను అరికట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇసుక అక్రమాలకు అడ్డుకట్టవేయగలిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రేటు నిర్ణయించడం వల్ల సామాన్యులకు లబ్ది చేకూరుతుందని వ్యాఖ్యానించారు. పాలసీ అమలులో చిన్న చిన్న సమస్యలు ఉన్నా విధానం మాత్రం సూపర్ అని కితాబిచ్చారు. ఇదే విధానాన్ని పంజాబ్‌లో అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. -
అయోమయం.. అస్తవ్యస్తం!
సాక్షి, హైదరాబాద్: కొత్త ఇసుక పాలసీ-2016లో ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన అంశాలను పొందుపర్చింది. ఈ పాలసీ అయోమయంగా, అస్తవ్యస్తంగా, వాస్తవాలకు భిన్నంగా ఉందని చెప్పడానికి అందులో పేర్కొన్న అంశాలే నిదర్శనం. కొత్త రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అవసరమని, ఇందుకోసం ఇసుక రీచ్‌లను వేలం వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ ఆర్జన ప్రధానాంశం కాదని మరోచోట వక్కాణించింది. ఈ రెండు అంశాలు పరస్పరం భిన్నంగా ఉండటం గమనార్హం. నిర్మాణ రంగం అభివృద్ధికి, ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను అందుబాటులోకి తేవడానికి కొత్త విధానానికి రూపకల్పన చేసినట్లు సర్కారు వెల్లడించింది. నిజంగా ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను అందుబాటులోకి తేవాలంటే రీచ్‌లను వేలం వేయరాదు. సీనరేజి మాత్రమే వసూలు చేసి ఇసుకను అందించేందుకు వీలుగా గనుల శాఖ ద్వారానే రీచ్‌లను నిర్వహించాలి. లేదా డ్వాక్రా సంఘాలకే బాధ్యత అప్పగించాలి. సీనరేజి మాత్రమే వసూలు చేసి ఇసుక సరఫరా చేస్తే అక్రమ తవ్వకాలకు అవకాశమే ఉండదు. సహజ సంపదను గంపగుత్తగా వేలం వేసి గరిష్ట ధర నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల ఇసుక ప్రజలకు తక్కువ ధరకు ఎలా లభిస్తుందని ప్రశ్నిస్తున్నాయి. ఎండ్లబండ్లు ఎక్కడున్నాయో! గ్రామాలకు సమీపంలో ఉన్న వాగులు, వంకల్లోని(థర్డ్ ఆర్డర్ రీచ్‌లు) ఇసుకను స్థానికులు సొంత అవసరాలకు పంచాయతీ కార్యదర్శి అనుమతితో ఉచితంగా తీసుకెళ్లే విధానం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎత్తివేసింది. ఈ రీచ్‌లలోని ఇసుకను స్థానికులు సొంత అవసరాలకు సీనరేజి, డీఎంఎఫ్ చెల్లించి తీసుకెళ్లే వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీలో పేర్కొంది. అయితే ఇసుకను ట్రాక్టర్లు, లారీల్లో కాకుండా ఎడ్లబండ్లలోనే తీసుకెళ్లాల్సి ఉంటుందని నిబంధన పెట్టింది. ప్రస్తుతం గ్రామాల్లో ఎడ్లబండ్లు లేవు. దుక్కి దున్నడం సహా అన్నింటికీ ట్రాక్టర్లనే ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక కోసం ఎడ్లబండ్లను ప్రజలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో ప్రభుత్వానికే ఎరుక! అని పంచాయతీరాజ్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇసుక రేవులకు ఈ-వేలం
కొత్త ఇసుక విధానం-2016 జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇసుక రేవులను ఈ-వేలం కమ్ ఈ-టెండర్ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలం-టెండర్ ద్వారా రేవులను కైవసం చేసుకున్న వారు క్యూబిక్ మీటర్ ఇసుకను గరిష్టంగా రూ.550కి (రవాణా వ్యయం అదనం) విక్రయించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం-2016ను ప్రకటిస్తూ శుక్రవారం జీఓ ఎంఎస్ 19, 20 జారీ చేసింది. ఇసుక రేవుల కేటాయింపులో పారదర్శకత కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఈ-పర్మిట్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. నదుల ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుక తయారీ, వినియోగాన్ని పోత్సహించడం కొత్త ఇసుక విధానంలో ప్రధాన అంశమని తెలిపింది. ఇసుక వినియోగం తగ్గింపు లక్ష్యంగా ఫ్లైయాస్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తామంది.విధానాన్ని సమీక్షించేందుకు సీఎస్ అధ్యక్షతన గనుల శాఖ సంచాలకుడు సభ్య కార్యదర్శిగా పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి భేటీ కావాల్సి ఉంటుంది. కొత్త ఇసుక విధానం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. జేసీ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి శాండ్ కమిటీ(డీఎల్ఎస్సీ) ఏర్పాటు చేస్తారు. ఇందులో జిల్లా పరిషత్ సీఈఓ, గనుల శాఖ సహాయ సంచాలకులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, డ్వామా పీడీ, నీటిపారుదల శాఖ ఈఈ, గ్రామీణ నీటి సరఫరా ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, భూగర్భ జలశాఖ ఉప సంచాలకులు, రెవెన్యూ డివిజనల్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇసుక తవ్వకాలకు అనుకూలంగా ఉన్న రీచ్‌లను గుర్తించి, వాటిలో ఏ మేరకు ఇసుక తవ్వవచ్చో నిర్ధారిస్తుంది. కనీస వేలం ధర నిర్ణయించి టెండర్లను ఆహ్వానిస్తుంది. ఈ-వేలం కమ్ ఈ-టెండర్లను మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎంఎస్టీసీ) నిర్వహిస్తుంది. ఆన్లైన్లోనే టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. కనీస వేలం ధర రూ.110 క్యూబిక్ మీటర్ ఇసుకను గరిష్టంగా రూ.550కి సరఫరా చేయాలన్నది పాలసీ. ఇందులో 15 నుంచి 20 శాతం కనీస వేలం ధరగా నిర్ణయిస్తారు. అంటే కనీస వేలం ధర రూ.110 అవుతుంది. దీనిని ప్రభుత్వ ధరగా నిర్ణయిస్తారు. టెండర్ ఖరారు చేసిన మరుసటి పనిదినమే సంబంధిత రీచ్‌లోని మొత్తం ఇసుక ఆధారంగా 25 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తదుపరి 75 శాతాన్ని 45 రోజుల్లో చెల్లించాలి. టెండర్ నిబంధనలివీ.. ఇసుక రీచ్‌ల కేటాయింపు కోసం మొదట టెక్నికల్ బిడ్డింగ్ ఉంటుంది. రెండేళ్లు ఆదాయపు పన్ను చెల్లించడంతోపాటు ప్రభుత్వానికి సీనరేజి, ఇతర బకాయిలు ఉండని వారే టెక్నికల్ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అర్హులు. ఇందులో అర్హత సాధించిన వారే ప్రైస్ బిడ్‌లో పాల్గొనేందుకు అర్హులు. టెక్నికల్ బిడ్డింగ్‌లో మూడు సంస్థలే అర్హత సాధిస్తే.. దాన్ని నిలిపివేసి మళ్లీ నోటిఫిషన్తో దరఖాస్తులను ఆహ్వానించాల్సి ఉంటుంది.ఇదే పరిస్థితి పునరావృతమైతే డీఎల్ఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది. టెక్నికల్ బిడ్డింగ్‌లో పాల్గొనేవారు రీచ్‌లోని ఇసుక విలువలో ఒక శాతం లేదా రూ.లక్ష ఎర్నెస్ట్ మనీ డిపాజిట్(ఈఎండీ)గా చెల్లించాలి. ఒక్కో కాంట్రాక్టర్ రెండు రీచ్‌లకు మించి టెండర్లు వేయరాదు.టెక్నికల్ బిడ్డింగ్‌లో అర్హత సాధిం చినవారు ప్రైస్ బిడ్‌లో పాల్గొనకపోతే వారు చెల్లించిన ఈఎండీని వదులుకోవాల్సిందే.