న్యూయార్క్: ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో ముందుకెళ్లినపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న సమయానికి చేరుకోవచ్చని.. భారత పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పనిచేద్దామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం (HLPF) వేదికగా జరిగిన సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశంలో భారతదేశం తరపున పాల్గొనడం గర్వంగా ఉందన్న కిషన్ రెడ్డి.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో గత దశాబ్ద కాలంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ స్థిరత్వమే ప్రధాన ఎజెండాగా చేపట్టిన పాలసీలు, ప్రాధాన్యతలతో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. గత పదేళ్లుగా పర్యావరణ సుస్థిరత కోసం మోదీ సర్కారు చేస్తున్న కృషి కారణంగా.. నేడు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించడంతోపాటు ముందుండి విజయవంతంగా నడిపామని కేంద్ర పర్యాటక మంత్రి వివరించారు.
జీ-20 ప్రెసిడెన్సీ ద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూపు సమావేశాల నిర్వహణతోపాటుగా గోవాలో గత నెలలో జరిగిన జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో ఏకగ్రీవంగా ‘గోవా రోడ్ మ్యాప్’కు ఆమోదం తెలిపిన విషయాన్నీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు.
ఈ గోవా రోడ్ మ్యాప్‌లో.. గ్రీన్ టూరిజం (సుస్థిర, బాధ్యతాయుతమైన, హరిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా సరైన ఫలితాలను సాధించడం), డిజిటలైజేషన్ (పర్యాటక రంగంలో సుస్థిరత, సమగ్రతను సాధించేందుకు డిజిటలైజేషన్ ద్వారా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకోవడం), స్కిల్స్ (యువత నైపుణ్యాలకు పదునుపెడుతూ పర్యాటక రంగంలో ఉపాధి, వ్యాపారసామర్థ్యాన్ని పెంచేలా చర్యలు), టూరిజం MSMEs (పర్యాటక రంగంలోని MSME లకు, స్టార్టప్‌లకు, ప్రైవేటు రంగానికి సరైన ప్రోత్సాహాన్ని అందిస్తూ.. సృజనాత్మకతకు పెద్దపీట వేయడం), డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ (గమ్యస్థానాల్లో అవసరమైన నిర్వహణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంపై పునరాలోచన తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సమగ్రమైన విధానంతో ముందుకెళ్లడం) అనే ఐదు కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు.
గోవా రోడ్ మ్యాప్ ద్వారా.. ప్రత్యక్షంగా, సానుకూలంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా అడుగులు పడ్డాయన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి ఆలోచనల మేరకు.. ఘనమైన భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలికవసతుల కల్పనతో ముందుకెళ్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. వివిధ దేశాలతో కలిపి థీమ్ బేస్డ్.. బుద్దిస్ట్ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్ మొదలైన వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ పర్యాటక విధానం ముసాయిదాలో ఇలాంటి వాటికి సరైన ప్రాధాన్యత కల్పించామన్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌తోపాటు ప్రపంచ పర్యాటకానికి కూడా ఎంతో సానుకూల ఫలితాలను అందిస్తుందన్నారు.
ప్రకృతితో అనుసంధానమైన జీవన విధానం వంటివి భారతదేశంలో పర్యాటకాభివృద్దికి సానుకూలమైన అంశాలన్నారు. భారతదేశ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద, యోగ, నేచురోపతి వంటివన్నీ.. ప్రకృతితో మమేకమైన జీవించాలన్న ఆలోచనను ప్రతిబింబిస్తాయని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే భారతీయ జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని.. రానున్న రోజుల్లో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ దిశగా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా జీవనవిధానాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసే ఉద్దేశంతో.. మిషన్ లైఫ్ (LiFE లైఫ్‌స్టయిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసిన భారత పర్యాటక మంత్రి.. ప్రజలతోపాటు పర్యాటకులు కూడా చిన్న ఆలోచనలు, చిన్న మార్పుల ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావొచ్చన్నారు.
పర్యావరణ స్పృహతోపాటు పర్యాటకానికి సరైన గుర్తింపును తీసుకొచ్చే లక్ష్యంతో పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో.. ‘యువ టూరిజం క్లబ్’లను ఏర్పాటుచేశామన్నారు. తర్వాతి తర్వాతమైన భారతపౌరుల్లో పర్యాటక, పర్యావరణ స్పృహను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ క్లబ్స్ ద్వారా సానుకూల ఫలితాలు కనబడుతున్నాయన్నారు.
2030 నాటికి పూర్తిచేసేలా నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.
పర్యాటక రంగ సుస్థిరత, సమగ్రత లక్ష్యాల ప్రాధాన్యతతో భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసేందుకు ‘మీరంతా భారత్ కు రండి’ అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్రీ సాబా కొరోశీ, ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (UNECOSOC) అధ్యక్షురాలు శ్రీమతి లాషెజరా స్టోయేవాతోపాటుగా.. వివిధ దేశాల పర్యాటక మంత్రులు, UNWTO ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, ప్రపంచ పర్యాటక రంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment